Wednesday, August 31, 2011

సాహితీ కృషీవలుడు

గరుత్మంతుళ్లు తెచ్చిన అమృతం 
దక్కిందనుకోవడం అనృతం !

దర్భలు నాకేరు మన ఏలికలు 
అందుకే ఈ నాలికల చీలికలు !

కరి మింగింది వెలగపండు 
కాదు కాదంటే పోనిండు !

మన స్వతంత్ర్యం మేడిపండు 
మన దారిద్ర్యం రాచపుండు !

1949 లో ' ఆనందవాణి ' పత్రికలో ' ఆగష్టు పదిహేను ' పేరుతో ఆరుద్ర రాసిన కవిత అది. ఇందులో అప్పటి పరిస్థితులపై నిప్పులు చెరిగిన ఆరుద్రలో భవిష్యత్తు దృష్టి కూడా వుండి వుండాలి.

1927 ఆగష్టు 31 న భాగవతుల వారింట పుట్టిన సదాశివశంకర శాస్త్రి 1942 నుంచీ ఆరుద్ర గా మారిపోయారు. అప్పటినుంచి అందరూ అసలు పేరు మర్చిపోయారు.

 ఆరుద్రగా మారాక ఆయన స్పృశించని రంగం లేదు.
కవితాఖండికలు రాసారు... వ్యాసాలు రాసారు....
పాటలు రాసారు.... పదాలు అల్లారు.....
పరిశోధనలు చేసారు..... చదరంగం ఆడారు...
నాట్యశాస్త్రాన్ని ఔపోసన పట్టారు..... మేజిక్ నేర్చుకున్నారు
.... ఇలా ఆయన చాలా చేసారు. ఏది చేసినా అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు.

అంతేకాదు.... 
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు....
స్వాతంత్ర్యోద్యమంలోను పాల్గొన్నారు......
ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేసారు.....
ఆధునిక సాహిత్యాన్ని దోసిట పట్టారు....

అనంతమైన సాహితీ సాగరాన్ని మథించారు
సమగ్రాంధ్ర సాహిత్యామృతాన్ని వెలికి తీసారు
ఆ అమృతాన్ని తెలుగువారందరికీ పంచారు  
భావితరాలకు అరుదైన కానుకను అందించారు

తెలుగు భాషామతల్లికి ఎనలేని సేవ చేసిన ఆరుద్రగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.... 


 ఆరుద్ర గారిపై గతంలో రాసిన టపా, ఆయన పాటల కదంబం ఈ క్రింది లింకులో .....

అక్షర చదరంగ నిపుణుడు

Vol. No. 03 Pub. No. 020

సర్వమానవ సమానత్వం - రంజాన్

బీద ధనిక భేదాలు లేవు
లింగ భేదాలు లేవు
వయో భేదాలు లేవు
... అందరూ ఉపవాస దీక్ష విధిగా పాటించే మాసం రంజాన్.

సూర్యోదయానికి ముందు ప్రారంభమయ్యే ఉపవాస దీక్ష సుమారు పన్నెండు గంటల పాటు సాగి సూర్యాస్తమయం తర్వాత పూర్తవుతుంది. అల్లాపై భక్తి విశ్వాసాలతో ముస్లింలు సుమారు నెలరోజులపాటు చేసే ఈ దీక్ష ఈ రోజుతో ముగుస్తుంది. 

ఆకలి అనేది ఎలా వుంటుందో పేదవారికి అనుభవమే ! ధనికులకు కూడా ఆకలిని అనుభవంలోకి తెచ్చి వారిలో దాతృత్వాన్ని పెంపొందించే సదాశయంతో ఈ ఉపవాస దీక్షలను పవిత్ర ఖురాన్ నిర్దేశించిందని మత పెద్దలు చెబుతారు. ఈ నెలరోజులు తమకి కలిగిన దానిలో కొంతభాగం బీదబిక్కికి దానం చేస్తారు ధనవంతులు. 

సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా నిలిచే ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందట.  
            
            రంజాన్ శుభాకాంక్షలతో........                      

రేపటినుంచి గణేశుని ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఊరూ వాడా కోలాహలంగా జరుపుకునే ఈ ఉత్సవాల సంబరాన్ని అంతర్జాలంలో పంచుకుందాం ! దానికి వేదికగా శిరాకదంబం పత్రికను ఉపయోగించుకుందాం. మిత్రులందరూ తమ సంబరాలను అందరితో అందులో పంచుకోండి........


Vol. No. 03 Pub. No. 019

Tuesday, August 30, 2011

పూలరంగడు

 కొంతమంది తమకోసం బ్రతుకుతారు. ఇంకొంతమంది తమవాళ్ళ కోసం బ్రతుకుతారు. కానీ చాలా తక్కువమంది మాత్రం సమాజంకోసం బ్రతుకుతారు. 

అతను రాజకీయనాయకుడు కాదు.... సమాజ సేవ చేస్తున్నానని ఫోటోలు దిగి మీడియాలో ప్రచారం చేసుకోవడానికి. 

అతను పేరు పడ్డ సంఘ సేవకుడు కాదు...... అతనికేమీ ఎన్జీవో లు లేవు. 

పూలు అమ్ముకునే సామాన్యమైన వ్యక్తి. కానీ అతనూ సంఘసేవ చేస్తున్నాడు. ఉద్దేశ్యముండాలి గానీ ఎవరి స్థాయిలో వారికి వీలైన సంఘసేవ చెయ్యొచ్చు అని నిరూపించిన వ్యక్తి పూలరంగడు. 

 అంతకు ముందు ఏమేం చేసినా మేము కాలేజీలో చదువుకునేటప్పటికి పూవుల రంగడుగా మారి మా ఊరికి ప్రధానమైన నాలుగురోడ్ల కూడలి అయిన గడియారస్తంభం సెంటర్లో చిన్న బడ్డీ పెట్టుకున్నాడు. నేను హైస్కూల్లో చదివేటపుడు అప్పటి స్నేహితుడు ఒకని ద్వారా పరిచయమయ్యాడు. అప్పట్లో కాలేజీలో గానీ, బయిటగానీ మేము నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన పూలదండలు గానీ, బొకేలు గానీ రంగడి దగ్గర కొనాల్సిందే ! జేబులో డబ్బులు వున్నాయో లేదో చూసుకోకుండా వెళ్ళినా ' డబ్బులదేముంది గురూ ! ముందు నీక్కావల్సినవి తీసుకెళ్ళు ' అని సంతోషంగా ఇచ్చి పంపేవాడు. బోకేలైతే ఎలాంటి బోకే అయినా ఒకే ధర. ' అదేమిటి రంగా ! దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ! ' అంటే ' ఫర్వాలేదు గురూ ! నీకే కదా ! ' అనేవాడు. 

మేము త్యాగరాయ గానసభలోనో, మరో సందర్భంలోనో  ప్రముఖులెవరికైనా సన్మానం తలపెట్టి దండలు తీసుకుంటుంటే చివర్లో ఒక దండ ఉచితంగా ఇచ్చేవాడు. ఎందుకంటే ' ఇది పూలరంగడి దండ. నా పేరు చెప్పి వెయ్యండి ' అనేవాడు. నువ్వే వచ్చి వెయ్యి అంటే సిగ్గు పడేవాడు. కొన్ని సందర్భాల్లో బలవంతం చేసి తీసుకొచ్చి అతని చేతనే వేయించేవాళ్ళం. ఊరు వదలి దేశం మీద పడినప్పుడు తరచుగా ఊరికి వెళ్లకపోయినా వెళ్ళినపుడు సెంటర్ కి వెడితే అదే బడ్డీ, అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు. వయసు పెరిగి మనిషి ఆకారంలో మార్పు వచ్చిందేమో గానీ, అప్యాయతలో మాత్రం మార్పు లేదు. 

మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాను. కలిసినపుడు నా ప్రక్కన వున్న స్నేహితుడు చెప్పాడు... రంగడి సేవా కార్యక్రమం గురించి. అదే మొహమాటంతో ' ఇందులో ఏముంది గురూ ! నాకు చేతనైంది చేస్తున్నాను. అంతే ! పోయేటప్పుడు కట్టుకుపోతామా ! ' అని తేల్చేసాడు. సంస్కారం అనేది మనిషి హోదాలోనో, వేసుకునే బట్టల్లోనో, డబ్బులోనో ఉండదనడానికి మా పూలరంగడే సజీవ ఉదాహరణ. 

చాలా రోజుల తర్వాత నా జ్ఞాపకాల పందిరిని కదిలించి మా పూలరంగడిని గుర్తు చేసిన, అతను చేస్తున్న సేవను వెలుగులోకి తెచ్చిన అరుణ పప్పు గారికి, ఆంధ్రజ్యోతి వారికీ కృతజ్ఞతలతో ............ 

పూలరంగడు చేస్తున్న సంఘసేవ ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలోని లింక్.........

 పూలరంగడి ' సంస్కారం '

Vol. No. 03 Pub. No. 019

తెలుగు సత్యభామ

తెలుగు చిత్ర రంగానికి పౌరాణికాలకు విడదీయరాని అనుబంధం. తెలుగు పౌరాణిక చిత్రాలకు ఒక ప్రత్యేకత వుంది. కొన్ని పురాణ పాత్రలు కొంతమంది నటీనటులకోసమే సృష్టించబడ్డాయా అన్నంత అందంగా అమరిపోయాయి.

రాముడు, కృష్ణుడు గా నందమూరిని కాక మరొకరిని ఊహించలేం. రావణ, దుర్యోధన, ముఖ్యంగా కీచక పాత్రలకు ఎస్వీయార్ తప్ప మన మదిలోకి మరెవరైనా వస్తారా ! అలాగే శకుని పాత్ర అనగానే గతంలో అయితే సీయస్సార్, తర్వాత ధూళిపాళ మన కళ్ళముందు మెదులుతారు. నారదుడి పాత్ర కాంతారావు గారికి పేటెంట్ అయిపొయింది. ఇక స్త్రీ పాత్రల విషయంలో కొంత వైవిధ్యం వున్నా సీత పాత్రకు మన మనస్సులో అంజలీదేవి ముద్ర పడినట్లు ఇంకెవరూ పడలేదు.

అసలు తెలుగు రంగస్థలం మీద సత్యభామ పాత్రకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దానికి కారణం ఆ పాత్ర స్వభావంలోని వైవిధ్యమే ! రుక్మిణి పాత్ర స్వభావం ఎక్కువగా సాత్వికతతో కూడి వుంటుంది. కానీ సత్యభామ అలా కాదు. ఆమెకు ప్రేమ ఎంత వుందో తాను అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా అంతే వుంది. కృష్ణుడు తనవాడనే అహంకారంలా కనిపించే  ఆత్మవిశ్వాసం వుంది. ఓ ప్రక్క ప్రేమ కురిపిస్తుంది. మరో ప్రక్క ఇంత ద్వేషమా అనిపించేలా అలుగుతుంది. అయితే నాథుని సన్నిధిలో ఆమె కోపమంతా మంచులా కరిగిపోతుంది. వైవిధ్యమున్న నటనకు, భావ ప్రకటనకు అవకాశమున్న పాత్ర కాబట్టే సత్యభామ పాత్రపై మన నటీనటులకు అంత మోజు. అటు నాటకాలలో, ఇటు నృత్యాలలో, అటు పిమ్మట సినిమాల్లో ఆ పాత్ర అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. అసలు కూచిపూడి నాట్యమనగానే ముందుగా గుర్తుకొచ్చేది భామాకలాపం మాత్రమే ! గతంలోని నాటక భామ స్థానం నరసింహారావు, కూచిపూడి భామగా వేదాంతం సత్యనారాయణ శర్మ అయితే ఇప్పటి ఆంద్రనాట్యం భామ కళాకృష్ణ. అలా రంగస్థలం మీద మగవారి నటనలో హొయలొలికించింది .....ఒలికిస్తోంది సత్యభామ.

ఇంతగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆ పాత్రను వెండితెరపైన సజీవం చేసిన నటి జమున. సత్యభామ పాత్ర ఎంతమంది ధరించినా మన మనసులో మెదిలేది జమున మాత్రమే ! హొయలు, లయలు, ధీరత్వం, కించిత్తు అమాయకత్వం....... ఇలా అన్ని రసాలను కలబోసిన సత్యభామను వెండితెరమీద ఆవిష్కరించారు జమున. ఆ పాత్ర స్వభావాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, బాగా అర్థం చేసుకుని జీర్ణించుకున్నారేమో జమునకు ఆ పాత్ర అంతగా అమరిపోయింది. ఆ పాత్ర ఆవిడను ఎంతగా ప్రభావితం చేసిందంటే శ్రీకృష్ణ తులాభారం తర్వాత వచ్చిన చిత్రాల్లోని చాలా పాత్రల్లో అక్కడక్కడ ఆ ఛాయలు కనబడతాయి. అలాగని ఆవిడ నటన అక్కడే ఆగిపోలేదు. ఆగిపోతే ఇతర భాషలతో సహా 198 చిత్రాలు వచ్చేవి కాదు. అన్ని రకాల చిత్రాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు ధరించారు. ప్రేక్షకులను మెప్పించారు. అమాయకత్వం, గడుసుతనం, ప్రేమ, అభిమానం కలబోసిన పల్లెటూరి పిల్లగా ఆమె ధరించిన, ప్రేక్షకుల మనస్సులో శాశ్వత ముద్ర వేసుకున్న మరో పాత్ర ' మూగమనసులు ' గౌరి.

 గుంటూరు జిల్లాలోని నిడమర్రులో జన్మించి దుగ్గిరాలలో పెరిగిన జమున రంగస్థలం మీద చాలా నాటకాల్లో నటించారు. ఆ రంగస్థలమే ఆవిడను చిత్రరంగంలోకి నడిపించింది. జమున నటన ప్రజానాట్యమండలి చెందిన దర్శకులు డా. గరికిపాటి రాజారావు దృష్టిలో పడడంతో ' పుట్టిల్లు ' చిత్రంలో అవకాశం లభించింది. తెలుగు చిత్ర నటీనటుల సంఘంలో చాలాకాలం చురుకుగా వ్యవహరించిన జమున కొంతకాలం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు. తర్వాత భాజపా లో చేరి , కొంతకాలం తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు.

 ఈరోజు తెలుగు సత్యభామ జమున జన్మదినం సందర్భంగా ఆవిడకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ......





Vol. No. 03 Pub. No. 018

Monday, August 29, 2011

తెలుగు పిడుగు ' గిడుగు '

 గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులుగా మాత్రమే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ కారణంగానే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  సామాన్య ప్రజలకు అర్థం కాని... వేదాల్లో ఉండే భాషను ప్రామాణికంగా తీసుకున్న కాలంలో తెలుగు భాషను సామాన్యుల స్థాయికి దించడానికి ఆయన జీవితకాల పోరాటం చేసిన మాట వాస్తవమే ! 

 కానీ ఆయన కేవలం తెలుగు భాషోద్ధరణకే పరిమితం కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ పట్టని ఆదివాసుల సమస్యలకు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేసిన వాళ్ళకు ఈయనే మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు మాట్లాడే భాషలలో ముఖ్యమైనది సవర భాష. ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఈ భాష ప్రస్తావన ఉందంటారు. అప్పటివరకూ ఆ భాషకు లిపి లేదు. వారి మాతృ  భాషలో చదువుకునే యోగం ఆ గిరిపుత్రులకు ఉండేది కాదు. ఈ పరిస్థితి గమనించిన గిడుగు వారు ఆ భాషపై విస్తృత పరిశోధన చేసి ధ్వన్యాత్మక లిపిని రూపొందించారు. 

 కేవలం లిపిని రూపొందించి వదిలివేయలేదు. ఆ లిపిలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసారు. ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజలను విద్యావంతులను చెయ్యడానికి పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వాటి నిర్వహణకు తన స్వంత డబ్బును సైతం ఖర్చు చెయ్యడానికి వెనుకాడలేదు. వాటిని అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించారు. అంతే కాదు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం కూడా రూపొందించారు. వారి సమస్యలెన్నిటికో ఆయన పరిష్కారాలు చూపారు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతగా కృషి చేసినవారు అప్పటికీ, ఇప్పటికీ ఇంకెవరూ లేరేమో ! 

 గిడుగు వారు కేవలం తెలుగు వ్యావహారిక భాష మీదనే పరిశోధనలు చెయ్యలేదు. గ్రాంథిక భాషలో కూడా ఉద్దండులే ! ఆంగ్ల భాషలో కూడా ఆయన పరిశోధనలు సాగాయి. తెలుగు వారికి ఆంగ్లం సులువుగా నేర్చుకునే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఒక పత్రికను కూడా నిర్వహించారు. 

నిజానికి గిడుగు రామమూర్తి గారి ముందుతరం వారు, సమకాలీనుల గురించి పరిశోధన, ప్రచారం జరిగినంతగా ఆయన గురించి జరుగలేదేమో ! అక్కడక్కడ కొంత జరిగినా అది అసమగ్రంగానే వుంది. మన భాషావికాసానికి ఉద్యమించి తెలుగును సజీవం చెయ్యడానికి పాటుపడిన ఆ మహానుభావుడి గురించి మరింత విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సార్థకత వుంటుంది. 


 తెలుగు పిడుగు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......
తెలుగు సోదర, సోదరీమణులందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.  

తేనే కన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు లెస్స తెలుగు భాష ....... 
 



Vol. No. 03 Pub. No. 017

Sunday, August 28, 2011

తెలుగు బాట 2011

ఆగష్టు 29 వ తేదీ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం ( 28 ఆగష్టు 2011 ) ఈ - తెలుగు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన తెలుగు బాట కార్యక్రమం యొక్క వర్షా భార్గవి అందించిన ఫోటోలు, వీడియోలు ఈ  క్రింది లింకులో చూడండి........ 






Vol. No. 03 Pub. No. 016

ఈవారం..... శిరాకదంబం

శిరాకదంబం వెబ్ పత్రికలో ఈ వారం .......
 

గణపతి విశిష్టత

- డా. ఇవటూరి శ్రీనివాసరావు
గణములకు అధిపతి కనుక గణపతి. గణాలంటే, కేవలం దేవతాగణాలే కాదు. సమూహంగా ఏర్పడిన ఏ అణువులైనా సరే. ఓం గణపతయే నమః .....

 
సాంస్కృతికం  : నాట్యరీతులు - ఆంధ్ర నాట్యం                - మాధురీకృష్ణ
2000 సంవత్సరాల చరిత్ర కలిగిన శాస్త్రీయ నృత్యం. లాస్య ప్రధానమైనది.....



 - వర్షా భార్గవి
అసలు సత్యభామ ఇలానే ఉంటుందేమో అనిపించేంత మోహన రూపం. నిజంగా ఇంత అందాలరాసి అయిన భామను ఇంతలా ఏడిపించాడా అని  కృష్ణుడి మీద కోపం కూడా వస్తుంది, మా గురువుగారి నృత్యం చూశాక...............


సాహిత్యం : 
భాసుని పాంచ 'రాత్రం'--కొన్ని తారకలు
- వోలేటి వెంకట సుబ్బారావు 
సంస్కృతము జీవ భాష.సకల భాషలకు మాతృభాష .ఈ భాషలో ఎన్నో ప్రబంధకావ్యాలు పుంఖాను పుంఖాలు గా వెలువడ్డాయి .అవధులు లేని సంస్కృత సాహితీ సంద్రం  లోతులలో  ఎన్నో నవ మౌక్తిక రాసులు .వాటిని అన్వేషించి వెలికి తీయాలంటే  ఎంతో ఓరిమి,పట్టుదల, శ్రద్ధ  కావాలి .అందుకు మనకు ఒక జీవిత కాలం  కూడా సరిపోదు............. 

సాహిత్య మరమరాలు
భమిడిపాటి వారికి గుర్తు

 వినోదం :    చిత్రం భళారే....
                   తొలి తెలుగు చిత్ర వీరులు
తెలుగు వారు మూకీ చిత్ర యుగంలో కొంచెం వెనుకబడినా, టాకీలను మాత్రం వెంటనే అందుకున్నారు. అంతేకాదు. తొలి టాకీ ' ఆలం ఆరా ' లో తెలుగు వారు పాలు పంచుకోవడం మనందరికీ గర్వకారణం. మరిన్ని వివరాలు....

 
తెరవండి..... చదవండి......చూడండి.... మీ అభిప్రాయాలు తెలపండి.


Vol. No. 03 Pub. No. 015
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం