Saturday, June 4, 2011

అక్షర చదరంగ నిపుణుడు

చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగి వేమన మాట
ఓ కూనలమ్మ...........

 ఇది రాసింది వేమన గారి మీదనయినా రాసినవారెవరో మాత్రం తెలుగు సాహిత్య ప్రియులకు బాగా తెలుసు. అక్షరాలతో చదరంగమాడడమే కాదు  నిజంగా అంతర్జాతీయ చదరంగ క్రీడ మీద ఓ పుస్తకమే రాసిన ఘనుడాయన. ఆయనే భాగవతుల సదాశివశంకరశాస్త్రి ... అనే ఆరుద్ర.

ఫస్ట్ ఫారం చదివేరోజుల్లోనే.... ఆరోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థులు పంచిన కరపత్రాలకు ప్రభావితుడై.... తన స్కూల్లో జరుగుతున్న అవకతవకలను వివరిస్తూ కరపత్రాలు రాసి, పంచి మాస్టారు చేత దెబ్బలు తినడంతో  ఆరుద్ర రచనా వ్యాసంగం ఆరంభమైంది.

ఆరుద్ర సృజించని సాహిత్య ప్రక్రియ లేదు. కవితలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలూ, చరిత్రలు, పరిశోధనాత్మక రచనలు, పాటలు, పదాలు, అనువాదాలు ......ఇలా ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి.

ఆయన ఆరుద్ర కాదు. ఆంధ్ర సాహిత్యాన్ని ఔపోసన పట్టిన అగస్త్యుడు.  చిన్నప్పుడే అన్యాయాలకు స్పందించిన ఆరుద్ర రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ కురిపించిన బాంబులకు భయపడి ప్రాణభయంతో పారిపోతున్న అమాయక ప్రజల గురించి....... 

ఓహో ! ఏమిటీ జీవ ప్రవాహం ?
యంత్రాలమాదిరి మనుష్యులు 
ప్రాణాలు పిడికెట పెట్టుకుని  
గుండెలు చేతబట్టుకుని
బలుసాకును వెతుక్కుంటూ 
బతుకుబాటపై కిక్కిరిసి 
భుజాలు రాసుకుంటూ ఉన్మాదంతో 
పోతున్నారు - రాసుకుంటూ, ఒత్తుకుంటూ 

... అంటారు తన ' లోహవిహంగాలు ' కవితలో .

తెలంగాణాలో నైజాం నవాబు తోత్తులైన రజాకర్ల దురాగతాలకు బలై రైల్లో నగ్నంగా తిరుగుతున్న యువతి సవాలును పత్రికల్లో చూసి చలించిపోయి ఆ అన్యాయాలను, అరాచకాలను  ఎండగడుతూ ' త్వమేవాహం ' కూడా రాసారు.


శ్రీశ్రీతో బంధుత్వం వల్లనో, ఆయన శిష్యరికం వల్లనో ఆరుద్ర మీద ఆ మహాకవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అన్యాయలతోనే కాదు కొంతకాలం గాల్లో కూడా యుద్ధం చేసారు. అంటే ఎయిర్ ఫోర్సు లో పనిచేసారు. అరవై రూపాయిల ఖర్చుతో రామలక్ష్మి గారిని ఆదర్శ వివాహం చేసుకున్నారు.

' ఆనందవాణి ' పత్రికలో పనిచేస్తున్నపుడే ఆయన ' బీదలపాట్లు ' చిత్రంతో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. ఎక్కువగా తొలినాళ్ళలో కే. బి. తిలక్ గారితోనూ, మలిరోజుల్లో బాపురమణ జంటతో కలిసి పనిచేసారు.ఆరుద్ర గారి కలానికి రెండువైపులా పాళీలే ! తిలక్ గారికి ఎంతటి అభ్యుదయ గీతాలు రాసారో, బాపు గారికి అంతటి సాంప్రదాయక గీతాలు రాసారు.

1939 లో చిత్రగుప్త పత్రికలో అచ్చయిన ' నా కలలు '  తో ప్రారంభమయిన ఆయన సాహిత్య ప్రయాణం ' గాయాలు - గేయాలు ', ' ఆరుద్ర కవితలు ', ' ఇంటింటి పద్యాలు ', ' సినీవాలి ', ' కూనలమ్మ పదాలు ', ' త్వమేవాహం ', ' వేమన్న వేదం ' లాంటి ఎన్నో సాహితీ కుసుమాలు వెదజల్లుతూ ' సమగ్రాంధ్ర సాహిత్యం ' వరకూ సాగింది.

1950 లో ' బీదలపాట్లు ' తో మొదలైన ఆరుద్ర గారి చిత్రరంగ ప్రయాణం ఎన్నో చిత్రాలకు మాటలు, పాటలు, కథలు, చిత్రానువాదాలు మొదలైన ఎన్నో ప్రక్రియలతో బాపు గారి ' మిస్టర్ పెళ్ళాం ' దాకా సాగింది.

అక్షరాలతో చదరంగమాడుకునే ఆరుద్ర గారు ఓసారి వనపర్తి కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్ళారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ సరదాగా ఆరుద్ర గారి ' ఇంటింటి పద్యాలు ' బాణీలో ....

ఆరుద్ర గారూ.. మీకూ వున్నారు 
ఆడపిల్లలు ముగ్గురు 
అన్యాయంగా అడిపోసుకుంటే
అరడజనుకి తగ్గరు 

.... అన్నారు. దానికి జవాబుగా ఆరుద్ర గారు ..

 అవును ఇప్పటికే ముగ్గురున్నారు 
అదే పదివేలు 
అందుకే అవలంబించాను 
బర్తు కంట్రోలు  

.... అన్నారు.

 ఈరోజు ఆరుద్రగారి వర్థంతి. ఆ సందర్భంగా ఆయనను, ఆయన సాహితీ సుగంధాలను మరోసారి స్మరించుకుంటూ..... 

ఆరుద్ర గారి తోలి చిత్రం ' బీదలపాట్లు ' చిత్రం నుంచి  ఎస్. ఎం. సుబ్బయ్యనాయుడు, అశ్వత్థామల స్వరరచనలో నాగయ్య గారు పాడిన పాట ..............



నాకెంతో ఇష్టమయిన ఆరుద్రగారి పాట ' ఉయ్యాల - జంపాల ' చిత్రంలో పెండ్యాల స్వరకల్పనలో ఘంటసాల, సుశీల పాడిన ఈ పాట........




Vol. No. 02 Pub. No. 248

6 comments:

రత్న మాల said...

ఆరుద్ర గారి గురుంచి బాగా రాసారు

సంతోష్ said...

Sahityam ambaramite aarudra egarani ettullev...
sahityam arnavamaite aarudra madhinchani lotullev..
:-)

Telugu font lo raayalekapotunnanduku chinthistunna..
:-(

SRRao said...

* రత్నమాల గారూ !
ధన్యవాదాలు

* సంతోష్ గారూ !
ధన్యవాదాలు. భావ వ్యక్తీకరణ ముఖ్యంకానీ ఫాంట్స్, భాష కాదనుకుంటాను. కానీ సాధ్యమైనంతవరకూ తెలుగు రాయడానికి ప్రయత్నిస్తే సంతోషం.

Anonymous said...

ఆరుద్రగారి సినీరంగప్రవేశం రాజరాజేశ్వరీవారి కధావిభాగంలో 1948లో జరిగిందనీ కానీ పేరు వేయలేదనీ ఆయనే రాసినట్టు గుర్తు.

శ్యాం

S said...
This comment has been removed by the author.
S said...

ఆయన చదంరంగం మీద రాసిన పుస్తకం పేరేమన్నా తెలిస్తే చెబుతారా ప్లీజ్?

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం