Friday, December 10, 2010

కట్ట ' మంచి ' - ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపశిల్పి - అనుబంధం

బ్లాగ్మిత్రులు మంద పీతాంబర్ గారు కట్టమంచి వారి గురించి తమ వ్యాఖ్యలో మరింత విలువైన సమాచారం అందించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సమాచారం వ్యాఖ్య రూపంలోనే ఉండిపోతే చాలామందికి చేరే అవకాశం తక్కువ కాబట్టి అనుబంధ టపాగా అందిస్తున్నాను. 

"యువభారతి"వారు 1980 లో ప్రచురించిన "ఆలోచనా లహరి"లో శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని గూర్చి డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు చేసిన ప్రసంగ వ్యాసం నుండి కొన్ని విషయాలను యీ సందర్భంలో తెలియజేయడం సముచింగా ఉంటుందనిపించింది .
" మా వంశమున కేది వచ్చిన రానిండు,తెనుగు భాష యొక్కటి మాత్రమక్షయముగా నిలిచియుండిన చాలును" అన్న మహనీయుడు.గొప్ప భాషాభిమాని శ్రీ రామలింగా రెడ్డి గారు..ఆయన మేధావి,పండితుడు,రచయిత ,వక్త ,విద్యా వేత్త,రాజనీతి వేత్త,పరిపాలనా దక్షుడు. యీ గుణాలతో పాటు ఆయన మానవత వాదిగా కూడా ఉండడం ఒక గొప్ప లక్షణమని వారు పేర్కొన్నారు.రాజనీతి వేత్తగా కంటె,విద్యా వేత్తగా కంటె,విద్వాంసుడుగా కంటే కూడా వ్యక్తిగా కట్టమంచి వారు చాలా ఉదాత్తుడని ఆచార్య కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు పేర్కోన్నారట.

1921 నుండి 1926 వరకు,1930 నుడి 1936 వరకు వారు రాజకీయాలలో పాల్గోన్నారట ఆ రోజుల్లో ఆయనంటే మంత్రులకు సింహ స్వప్నమట.వివిధ సమయాలలో ఆయన చేసిన ప్రసంగాలు,వాటిలో దొర్లిన చెణుకులు ,విసిరిన విసుర్లు,ఆలోచనామృతాలు."కాలం గతిస్తున్నది కాబట్టి,కాలంతో పాటే జ్ఞాపక శక్తి కూడా గతించ కూడదు " ద్వంద పరి పాలన ఒక్క,మదరాసుకే పరిమితమైన వ్యాధి కాదు. అది అఖిల భారత వ్యాధి ""పదవుల ఆశ సంశ్లేషానికి హేతువైతే ఆశా భంగాలు విశ్లేషానికి దారి తీస్తాయి"

ఒకసారి ఆయన శాసన మండలిలో ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తుండగా ,సహించలేక పోయిన ముఖ్య మంత్రి(పానగల్ రాజా) తన జేబులోంచి ఒక కాగితం తీసి భయ పెట్టలనుకొన్నాడు.అందులో రెడ్డి గారు స్వకార్యం గురించి విన్నవించుకొన్నారట.అది గమనించిన కట్టమంచి వారు వెంటనే యిలా అన్నారట "ఇంగ్లాడులో అయితే కలహించుకొన్న ప్రేమికులు విడి పోయేటప్పుడు ఎవరి ఉత్తరాలను వాళ్లకు ఇచ్చివేస్తారు" అంతే ; ముఖ్య మంత్రి నోటికి తాళం పడిందట .

ఇంకొక సారి ఆయన బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని సంఖ్యా వివరాలు తన ప్రసంగంలో తెలియ జేశారట. అవి సరి కావని ఒకరు ఆక్షేపణ తెలపడం తరువాయి "నేను లెక్కలు చెప్పడం లేదు ,రాజకీయాలు మాట్లాడుతున్నాను " అన్నారట ఏమాత్రం
తడుముకోకుండా.

ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తుండగా కొందరు వేదిక మీదకు రాలు రువ్వారట.వెంటనే "మన రాజకీయాల్లో
జస్టిస్ పార్టి వారు కొందరు రాతి యుగాన్ని ప్రవేశ పెడుతున్నారు"అన్నారట వెంటనే.

ఒకసారి రైలు ప్రయాణం చేసి మదరాసు దిగారట పత్రికా విలేఖరులు చుట్టు ముట్టి అప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న ఓ ప్రశ్న వేసి ,మీ అభిప్రాయ మేమిటని అడిగారట "ఇప్పుడు నాకు కావలసింది పోర్టరు గాని ,రిపోర్టరు కాదు " అని అన్నారట .

ఆయన మహ స్వతంత్రులట.ఒక సారి కేంద్ర విద్యా మంత్రి ఒకరు "మీరు విద్యా శాఖ కార్య దర్శిగా చేరతారా? " అని అడిగారట అందుకు కట్టమంచి సమాధానం "ఇద్దరు విద్యా మంత్రులు ఎలా ఉంటారు "

రాజాజీ అంతటి వాడు ఆయన్ని "అసాధారణ ఉపాద్యక్షుడని"అభివర్ణిoచారట.

రామలింగా రెడ్డి గారి రచనల్లో అందాలు దిద్దుకొన్న కొన్ని సూక్తులు

"కుటుంబ రక్షణార్ధం ద్రవ్యార్జన కై యత్నించుట దోషము కాదు గదా!"

"కనిత్వమునకు జీవకళ భావము .పద్యము శరీర మాత్రము"

"రక్షించుట కు శక్తి లేనిచో సృష్టించుట మహా పాతకము"

"రసార్ద్ర హృదయులు నిత్య యౌవనులు గదా!"

"కవిత్వము నెదురు గొన్న వారికి మేఘ సంచారమే గాని భూసంచార మెక్కడిది ?"

ఆత్మ ప్రశంస ఆత్మ హత్యకు దుల్యము"

"మన:కృషియు,హస్త కృషియు గలియక యున్న నేర్పడునది "కళ" గాదు "కళంకము""

"విజ్ఞాన ముండిన మాత్రమున జన్మ సాఫల్యము కలుగ బొదు"

Vol. No. 02 Pub. No. 079a

2 comments:

సుమ చామర్తి said...

ఏలురు కట్టమంచి రామలింగారెడ్డి కళాశాల లొ చదువుకున్నా కాని ఆ మహనీయుని గురించి తెలుసు కో లెక పొయిన విషయాలు తెలియ చేసారు. చాల సంతోషం.

SRRao said...

సుమ గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం