Tuesday, December 7, 2010

పాశ్చాత్య కర్ణాటక భాగవతార్

లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా, మరో సంగీతమైనా అన్నిటికీ శాస్త్రీయ సంగీతమే పునాది. అది పాశ్చాత్యమైనా, భారతీయమైనా, అందులో మళ్ళీ హిందుస్తానీ అయినా, కర్ణాటకమైనా  ..... మరేదైనా శాస్త్రీయత లేని సంగీతం మనడం కష్టం. చివరికి జానపదంలో కూడా దానికి చెందిన శాస్త్రీయత వుంటుంది. శాస్త్రీయ సంగీతాన్ని భక్తితో, నిష్టతో నేర్చుకునే / వినే తరం నుంచి అసలు శాస్త్రీయ సంగీతం అవసరమేమిటి ? మాకేలా తోస్తే అలా పాడుకుంటాం... పాశ్చాత్య ధోరణులే మాకు ప్రియం అనే తరానికి ప్రస్తుతం చేరుకున్నాం. ఇక ముందు మరెన్ని వినాలో ! ఈ సందర్భంలో మనదైన కర్ణాటక సంగీతాన్ని ఒక పాశ్చాత్యుడు నిష్టతో, శ్రద్ధతో నేర్చుకుని మన విద్వాంసుల సరసన కూర్చున్న విశేషాన్ని చూద్దాం.

దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతాన్ని ఎందఱో మహానుభావులు తమ విద్వత్తుతో పరిపుష్టం చేసారు. అయితే వారందరూ భారతీయులే ! ముఖ్యంగా దక్షిణాది వారే ! అయితే ఒక విదేశీయుడు మన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడమే కాక కచేరీలు చేసి లబ్ద ప్రతిష్టుల సరసన స్థానం సంపాదించుకోవడం విశేషమే !  గత తరంలోని సంగీత ప్రియులందరికీ పరిచితమైన గళం జాన్ బి. హిగ్గిన్స్ .

1939 లో అమెరికాలో జన్మించిన హిగ్గిన్స్ తొలుత యూరోపియన్, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో గాయకుడు. తర్వాత వెస్లీయన్ విశ్వవిద్యాలయంలో రాబర్ట్ ఇ. బ్రౌన్, టి. రంగనాథన్ గార్ల వద్ద భారతీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. అందులోని, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలోని మాధుర్యానికి ముగ్దుడై మరింతగా నేర్చుకోవడానికి అంకిత భావంతో భారతదేశం వచ్చారు. మొదట వీణ ధనమ్మాళ్ లాంటి ప్రసిద్ధ విద్వాంసుల దగ్గర శిష్యరికం చేసిన హిగ్గిన్స్ తరువాత టి. సరస్వతి గారి దగ్గర శిష్యరికం చేసి నాట్య సంగీతం పై గ్రంథాలు వెలువరించారు. అవిరళ కృషితో, పట్టుదలతో సాధన చేసి ఆనతి కాలంలోనే తిరువాయూరులోని త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాల్గోనగలిగారు. ఆ సమయంలోనే ఉచ్చారణ విషయంలో నిరసనలు ఎదుర్కొన్నారు. ఛాందసులు కొందరు ఆయన పాశ్చాత్య ఉచ్చారణను ఆక్షేపించారు. అయినా పట్టుదలతో తన ఉచ్చారణను సరి చేసుకున్నారు. చాలా కచేరీలు చేశారు. అనేక రికార్డులు వెలువరిచారు. భాగవతార్ బిరుదు కూడా అందుకున్నారు.

70 వ దశకంలో కర్ణాటక సంగీత విద్వాంసుల జాబితాలో జాన్ హిగ్గిన్స్ భాగవతార్ పేరు కూడా చేరింది. ఆయన ఎల్. పి. రికార్డు నేను మొదటగా 1976 ప్రాంతంలోననుకుంటాను, సెలవలకు హైదరాబాద్ వెళ్ళినపుడు మా బావ దగ్గర చూసాను. సంగీతం మీద మక్కువ కొంత, విదేశీయుడి గళంలో మన సంగీతంలో ఎలా ఉంటుందోననే ఉత్సుకత మరికొంత ఆ రికార్డు వినేటట్లు చేసింది. చాలా ఆశ్చర్యమేసింది. రికార్డు కవర్ చూడకుండా వుంటే మన దక్షిణాది కళాకారుడే పాడారని నమ్మేవాణ్ని. కృషి వుంటే మనుష్యులు ఋషులవుతారనే మాటకు హిగ్గిన్స్ నిదర్శనం అనిపించింది. అయితే 1984 డిసెంబర్ 7 వ తేదీన ఒక త్రాగుబోతు కారుతో డీ కొట్టడంతో ఆయన మరణించారు.
 
ఈరోజు జాన్ బి. హిగ్గిన్స్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వర నీరాజనం అర్పిస్తూ............

ఆయన గళాన్ని మ్యూజిక్ ఇండియా లింక్ లో వినండి.

http://www.musicindiaonline.com/#/artist/10-Classical_Carnatic_Vocal/93-Jon_B_Higgins/

మాధురి గారు పంపిన సమాచారం
ఒకసారి జాన్ బి. హిగ్గిన్స్ దక్షిణాది వేషధారణ అయిన పంచె, జుబ్బా తొడుక్కుని విభూది పెట్టుకుని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆయనకు సహజంగా పుట్టుకతో వచ్చిన తెలుపు వర్ణం, జుట్టు అతని            విదేశీయతను పట్టించాయి. దాంతో ఆలయ వర్గాలు ఆయన్ని లోపలి అనుమతించలేదు. ఆయన అక్కడే కూర్చుని " కృష్ణా ! నీ బేగనే బారో " అనే కీర్తన  అద్భుతంగా భక్తి రసం తొణికిసలాడుతూ గానం చేశారు. ఆ గానానికి         ముగ్ధులైన ఆలయ అధికారులు ఆయన్ని లోపలికి అనుమతించారు. ఈ విషయం మాధురి గారి తల్లిగారు ఆమెకు చెప్పినది. ఈ విశేషాన్ని మనకందించినందుకు ఇద్దరికీ ధన్యవాదాలు.                        
Vol. No. 02 Pub. No. 077

3 comments:

కొత్త పాళీ said...

హిగ్గిన్స్ గారు అలా అకాల మరణం చెందడం కర్నాటక సంగీతలోకాని చాలా లోటు మిగిల్చింది. రీతిగౌళలో ఆయన పాడిన త్యాగరాజ కృతి రాగరత్న మాలికచే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఒక వేడికోలు. మీ వద్ద కళ్యాణం రఘురామయ్యగారి విశేషాలు ఏమన్నా ఉంటే పంచుకోగలరు

susee said...

Higginns gaari akaala maranam carnataka sangeeta rangaaniki- teerani lotu. pinna vayasulo sambhavinchina aayana mruthi aayana abhimaanulandarinee teevra vishaadamlo munchivesindi.carnaataka sangeetha baanini- sampradaayaanni gowravinchina visistha vyakthi aayana.HMV samstha veluvarinchina oka audio-cassette nu naa apuroopa sekaranagaa bhaavisthaanu. Sri Tyagarajaswamy vaari pancharatna keertha 'yendaro mahaanubhaavulu..' adbhutamgaa aalapinchaaru aayana.Aayananu bhoutikamga manam kolpoyinaa-tanu gaanam chesina keeratanala dwaaraa aayana amarulu. ayanaku naa nivaalulu.-venkata subba rao voleti

SRRao said...

* కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు. మీరడిగింది త్వరలోనే అందించడానికి ప్రయత్నిస్తాను.

* సుబ్బారావు గారూ !
ధన్యవాదాలు. హిగ్గిన్స్ గారిని ఇప్పటి తరానికి పరిచయం చెయ్యాలని, తెల్సిన గత తరానికి గుర్తు చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే ఈ టపా రాసాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం