హాస్య బ్రహ్మ, గణపతి సృష్టికర్త చిలమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన ఓ పిట్ట కథ.......
ఒక ఊరిలో కాస్త కలిగిన కుటుంబంలోని బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వారెవరైనా సరే తనింటికి వస్తే భోజనం పెడతానని ప్రకటించాడు. వేదం రాని వారికి ఆ అవకాశం లేదని కూడా చెప్పేవాడు. ఆ మాట ప్రకారమే వేద పండితులు ఎవరు తన ఇంటికి వచ్చినా లేదనకుండా భోజనం పెట్టి వారిని ఉచిత రీతిని సత్కరించి పంపేవాడు.
ఒకసారి ఒక వేసవి కాలంలో మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్న వేళ ఓ బీద బ్రాహ్మణుడు ఆకలి దప్పికలతో మాడుతూ ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అతని షరతులు తెలుసుకున్న ఆ బీద బ్రాహ్మణుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎందుకంటే అతనికి వేదం రాదు. అతని బాధను కూడా గుర్తించకుండా అన్నదాతయైన బ్రాహ్మణుడు ' మీకు వేదం వచ్చునా ? ' అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఆకలితో బాధపడుతున్న ఆ రెండవ వ్యక్తి తనకు వేదం వచ్చునని, భోజనం చేసిన తరువాత తనను పరీక్షించవచ్చునని చెప్పాడు. గృహస్థుడా మాటలకు అంగీకరించి చాలా గౌరవంగా అతనికి భోజనం పెట్టాడు. మర్యాదలు చేశాడు. కొంతసేపు విశ్రమించి లేచిన తర్వాత పరీక్ష ఇస్తానని బ్రాహ్మణుడు చెప్పాడు. కొంతసేపు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అతడు వేదం చదివే దృష్టిలో లేకపోవడం చేత గృహస్థుడు అతనిని మళ్ళీ అడిగాడు. అందుకా బ్రాహ్మణుడు సమాధానం చెబుతూ ముందు ' క్రమము ' చెపుతానని ఇలా మొదలు పెట్టాడు.
' అయ్యా ! మీరు బ్రతికి వుండగా మీ కుమారుడు చనిపోవుట అక్రమము. మీ కుమారుడు జీవించి వుండగా మీరు చనిపోవుట క్రమము ' అని పలికాడు. ఇంటి యజమాని కోపించి అతనిని కొట్టబోగా అందరూ చేరి అతనిని వారించి బ్రాహ్మణుడి యుక్తికి మెచ్చుకుని ఆకలితో వున్నవారికి అందరికీ భోజనం పెట్టడం మంచిది కానీ, వేద పండితులకే భోజనం పెడతాననడం మంచిది కాదని చెప్పి అతనిని మందలించారు.
Vol. No. 02 Pub. No. 293
3 comments:
మీరు చెప్పిన కధ బాగుంది
అలాగే ఈ మధ్య చెప్పిన్న పెద్ద పెద్ద వాళ్ళ చిన్న చిన్న సంఘటనలూ బాగున్నాయి.
అభినందనలు
రావు గారు,
ఆకలి వేస్తున్న వారికి పట్టిడు అన్నం పెట్టడానికి నియమాలు పెడితే 'ఆకలో రామచంద్రా' అని ఇంటి ముందుకు వచ్చిన వారు ఎన్నో రోజుల నుండి తిండి లేక శోష వచ్చి పడిపోవడమో, ప్రాణాలే విడిచి పెట్టడం జరిగితే ఏం చేస్తాం. ఆకులు కాలిన తరవాత చేతులు పట్టుకోవడంలా అవుతుంది. చిన్న కథలో ఎంతో అర్ధం వుంది. అందించిన మీకు ధన్యవాదాలు!
* ఆత్రేయ గారూ !
* దుర్గ గారూ !
ధన్యవాదాలు
Post a Comment