Monday, July 11, 2011

అపర శకుని

నటన అంటే జీవితమే ! 
జీవితం నుంచే నటన పుట్టింది. 
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం ' నిజం '
ఉన్నది లేనిదిగా చెప్పడం ' అబద్ధం '
ఉన్నదానిని లేనిదానిగా మభ్యపెట్టి నమ్మించడం ' గారడీ ' 
లేనిది ఉన్నదిగా నమ్మించడం ' మోసం ' 
లేనిది ఉన్నదిగా సృష్టించడం ' నటన '

నటనను ఇంతగా నిర్వచించడం అందులో నిష్ణాతులైన వారికే సాధ్యం. ఆ అనితర సాధ్యుడు చిలకలపూడి సీతారామాంజనేయులు . మనమందరం ముద్దుగా పిలుచుకునే  సీయస్సార్.... మారుపేరు అపర శకుని.

మనం చూడని, మన ఊహకందని దేవతామూర్తులకు చక్కటి ఆకారాలనిచ్చారు రవివర్మ.

అలాగే మహాభారత యుద్ధానికి కారకుడైన, దాయాదులను యుద్ధానికి నడిపించిన మామ శకునికి రూపాన్నిచ్చారు సీయస్సార్. అసలు శకుని ఎలా వుంటాడో ప్రపంచంలో ఎవరికీ తెలియకపోవచ్చు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కాదు.

శకుని అంటే ఇలాగే వుంటాడు అని సీయస్సార్ ని చూపి బల్లగుద్ది మరీ చెప్పోచ్చు. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మనందర్నీ సాక్షాత్తూ శకునే తెర మీదకు దిగివచ్చాడనే భ్రమలో వుంచేశారు.

 మాయాబజార్ చిత్రం ఎంత చిరంజీవో అందులో శకునిగా సీయస్సార్ కూడా అంతే చిరంజీవి. ముఖ్యంగా ఈనాటి చిన్నారులకు కూడా శకునిగా ఆయన తెలియకుండా వుండరేమో !

1907 లో మచిలీపట్నం దగ్గర చిలకలపూడి లో పుట్టిన సీయస్సార్ నాటకాల మీద మక్కువతో చదువును త్యాగం చేశారు. ఎంతో దీక్షతో ఎన్నో నాటకాలాడారు. ఎందరో ప్రముఖ నటుల సాహచర్యం చేశారు. తన నటనకు పదును పెట్టుకున్నారు.

టాకీల కంటే ముందే చిత్రసీమలో ప్రవేశించి తొలినాళ్లలోనే ఆయన కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు. పాతాళభైరవితో ప్రారంభించి అనేక చిత్రాల్లో కారెక్టర్ పాత్రలు ధరించారు. నటనలో తనదంటూ ఒక బాణీని ఏర్పరచారు. 1939 లో ' జయప్రద ' చిత్రానికి దర్శకత్వం వహించారు.

చలనచిత్ర రంగంలో ఎంతో అనుభవం గడించిన సీయస్సార్ ఆ రంగం గురించి ఇలా నిర్వచించారు..........

చిత్రరంగం ఎలాంటిదంటే......... 
నువ్వు వంగితే అది నీ మీదకెక్కుతుంది. 
నువ్వు ఎక్కబోతే అది వంగుతుంది.  

 అపర శకుని ' సీయస్సార్ ' జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు సమర్పిస్తూ...... 


సీయస్సార్ గారి గురించిన గతంలోని టపా........ 


 
Vol. No. 02 Pub. No. 276

5 comments:

Unknown said...

ఎంతో బాగా రాసారు. నా దృష్టిలో శకుని వేరూ.. సీ. ఎస్. ఆర్ వేరూ కాదు.. అంతలా ప్రాణం పోసారు ఆ పాత్రకి...

Saahitya Abhimaani said...

సి ఎస్సార్ గారు తుకారాం పాత్రలో కూడా సినిమాలో నటించారని విన్నాను. అక్కినేని నాగేశ్వర రావు తుకారాం వేషం వెయ్యటానికి, సి ఎస్సార్ ఉన్నంతవరకూ ఆ వేషం తాను వెయ్యలేనని చెప్పారని వదంతి. కారణం సి ఎస్సార్ తుకారాం గా అంత బాగా నటించారుట.

మీకు ఆ విశేషాలు తెలిస్తే మీ బ్లాగులో వ్రాయగలరు.

Shasikala Kumbhajadala said...

చిలకలపూడి సీతారామాంజనేయులు"; "గారికి "జన్మ దిన శుభాకాంక్షలు ".

Bhaskar said...

AAyana Natana Aayanake Saati!
Alanati Natulani Andhariki Gurthu Chesthunnandhuku Chaala Chaala Krithajnathalu.......

Bhaskar

SRRao said...

* ప్రసీద గారూ !
* శశికళ గారూ !
* భాస్కర్ గారూ !

ధన్యవాదాలు

* శివ గారూ !
ధన్యవాదాలు. సీయస్సార్ గారు తుకారాం గా నటించిన మాట మాత్రం నిజమే ! మీరు అడిగిన విషయం గురించి సరైన సమాచారం నా దగ్గర వున్నట్లు లేదు. అయినా మరోసారి వెదుకుతాను. దొరికితే మీతో తప్పక పంచుకుంటాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం