Sunday, July 31, 2011

'అల్లరా' మలింగయ్య

ఆయన ఊరు పాలకొల్లు 
పేరు రామలింగయ్య అల్లు

ఆయనుంటే హాస్యం ఫుల్లు 
ఆయన లేకుంటే ఆనందం నిల్లు

ఏం చేసినా ఆయనకే చెల్లు
కురిపించెను నవ్వుల జల్లు


ఆయన కనిపిస్తే అల్లరి 
ఆయన వినిపిస్తే అల్లరి 

ఎనిమిది దశాబ్దాల పైబడి చేసిన అల్లరి 
ఇంకా ఇప్పటికీ చేస్తున్న అల్లరి అల్లు 


 తన అల్లరితో గిలిగింతలు పెట్టిన.... పెడుతున్న అల్లు రామలింగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు హాస్యనీరాజనాలు సమర్పిస్తూ..........       


అల్లు రామలింగయ్య జీవించిన ఓ సన్నివేశం...............




Vol. No. 02 Pub. No. 298

సుస్వ 'రఫీ'


భారత చలన చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగిన గాయకుడు మహమ్మద్ రఫీ.

భారత చలన చిత్ర చరిత్రలో ఆయనదొక అథ్యాయం. పంజాబ్ లో అమృత్ సర్ కు దగ్గరలోని గ్రామంలో పుట్టి అక్కడ ఫకీర్ ని అనుకరిస్తూ తత్వాలు పాడుతూ తన గానకళను ప్రదర్శించి తండ్రితో లాహోర్ వలస వెళ్ళి చివరి మజిలీగా బొంబాయి చేరిన రఫీ బడే గులాం ఆలీఖాన్ లాంటి ప్రముఖుల దగ్గర సంగీతం అభ్యసించారు. అప్పట్నుంచి ఆరంభమైన ఆయన గాన ప్రవాహం హిందీతో బాటు దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో సాగింది.

మహమ్మద్ రఫీ శాస్త్రీయ గీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, గజళ్ళు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు, మెలోడి పాటలు, వేగం గల పాటలతో సహా వైవిధ్యభరితమైన పాటలెన్నో పాడారు.

మహాత్మాగాంధీ మరణం సమయంలో రఫీ పాడిన ' సునో సునో ఆయే దునియా వాలో బాపూజీ కి అమర్ కహాని ' పాట సంచలనం కలిగించింది. పండిట్ నెహ్రు చేత శభాష్ అనిపించింది.

రఫీ స్వరంలో వున్న మహత్తు ఎంతటిదంటే అప్పట్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ తనను ఉరి తీసేముందు చివరి కోరికగా రఫీ పాడిన ' దునియా కె రఖ్ వాలే ' పాట వినాలనుందని కోరాడట.

అనేక అవార్డులు, రివార్డులు స్వంతం చేసుకున్న గాన గంధర్వుడితో తెలుగు చిత్ర పరిశ్రమ అనుబంధం గురించి చెప్పుకోవాలంటే నాగయ్య గారి ' భక్త రామదాసు ' చిత్రంలో రఫీ తెలుగులోరఫీ తొలిసారిగా పాడినా అవి కబీర్ కు పాడడం వలన హిందీ గీతాలనే పాడించారు.

అట్లూరి పుండరీకాక్షయ్య గారి ' భలే తమ్ముడు ' చిత్రం కోసం మొదటిసారిగా తెలుగు పాటలు పాడారు. ఆరోజుల్లో బొంబాయిలో ఆయన రోజుకు అయిదారు పాటలు పాడే పరిస్థితి. కానీ ఈచిత్రంలో ఆరు పాటలకోసం ఆరురోజులు కేటాయించారు. అలా ఎందుకంటే తెలుగు తనకు అసలు పరిచయంలేని భాష కనుక పాటను క్షుణ్ణంగా నేర్చుకుని, భావం వంటబట్టించుకోవడానికి కనీసం ఆమాత్రం సమయం అవసరమని ఆయన భావించారు. ఆయన బొంబాయి నుంచి మద్రాసులో విమానం దిగుతూనే రిహర్శల్స్ కు బయిల్దేరారు. దానికి ముందు చిత్ర కథానాయకుడు రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. రోజు పుండరీకాక్షయ్య గారి ' శ్రీకృష్ణావతారం ' చూసారు. రామారావు గారి , ఆయన శ్రోతలు పలికే తీరు తెన్నులు, ఆయన శృతి వగైరాలు జాగ్రత్తగా పరిశీలించారు. తర్వాత పరిపూర్ణమైన రిహార్సల్స్ చేసి యుగళగీతాలతో సహా చిత్రంలోని ఆరు పాటల్ని పాడారు మహమ్మద్ రఫీ.

మధురమైన గళం మహమ్మద్ రఫీకి దేవుడిచ్చిన వరం
భారత శ్రోతలు ఎన్నటికీ మరచిపోలేని మధుర స్వరం.

రఫీకి గాలిపటాలంటే మక్కువ. ఎప్పుడు ఖాళీ దొరికినా గాలిపటాలెగర వెయ్యడానికి ఉత్సాహం చూపించేవారు. ఆయన మరణించడానికి ముందురోజు కూడా గాలిపటాలెగుర వేసారట.

 గాన గంధర్వుడు మహమ్మద్ రఫీ వర్థంతి సందర్భంగా ఆయన తెలుగు చిత్రాల్లో పాడిన కొన్ని పాటల కదంబం........ 




Vol. No. 02 Pub. No. 297

Saturday, July 30, 2011

రచనల మేస్త్రి


పీడిత తాడిత ప్రజలకు కొండంత అండ
వారి కష్టాలకు అక్షర రూపమిచ్చిన రచనాకొండ
వారి జీవిత చిత్రాలను కలంతో చెక్కిన శిల్పి రాచకొండ

బడుగు జీవన చిత్రణ అయినా, మధ్యతరగతి మిథ్యా జీవితమైనా
ఆ రచనలో తళుకు బెళుకు వుండవు... పాండిత్య ప్రదర్శన వుండదు
సూటిగా, స్పష్టంగా సాగిపోయే సజీవ స్రవంతి రావిశాస్త్రి గారి రచనలు

సజీవ జీవన చిత్రణకు మేస్త్రి
రాచకొండ విశ్వనాథ శాస్త్రి

ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ........

రావిశాస్త్రి గారి గురించి, ఆయన రచనల పరిచయాలు రాసిన టపాల లింకులు ......

ఆఖరి దశ
కార్నర్ సీటు
మెరుపు మెరిసింది
' రచనా ' కొండ
జరీ అంచు తెల్లచీర
జూలై 30


Vol. No. 02 Pub. No. 296

Friday, July 29, 2011

కవి గవర్నర్


కనుక్కోండి చూద్దాం - 48


ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ కవి డా. సి. నారాయణరెడ్డి గారు కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒక సినిమాలో గవర్నర్ గా నటించారు.

ప్రశ్న : ఆ సినిమా పేరేమిటో చెప్పగలరా ?


Vol. No. 02 Pub. No. 295

భళారే ' సినారె '



పౌర్ణమి నాడు పుట్టినవాళ్ళు కవులవుతారని ఒక వాదన వుంది. ఆది నిజమేనేమో ! ఎందుకంటే 1931 వ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ రోజున మనకో కవి లభించాడు. తన పద్నాలుగవ ఏటనే కవిత్వం రాయడం ఆరంభించిన ఆయనే డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి...... తెలుగువారు ముద్దుగా పిలుచుకునే సినారె.

సినారె కవిత ఎంత తీయగా వుంటుందో
సినారె గళం కూడా అంత మధురంగా వుంటుంది

ఆయన కవితా కులాలంకారుడు ...ద్విభాషా ప్రవీణుడు
తెలుగుతో బాటు ఉర్దూ కవిత్వాన్నికూడా ఔపోశన పట్టారు

సాంప్రదాయ ధోరణిలో పద్యాలు రాసారు
ఆధునిక ధోరణిలో వచన కవితలల్లారు

లలితమైన పదాలతో గేయాలు రాసారు
తెలుగులో అందమైన గజళ్ళు పాడారు

ప్రణయ గీతాలు... ప్రబోధ గీతాలు...
భావ గీతాలు.... భావోద్వేగ గీతాలు...

.... ఇలా ఎన్నో... ఎన్నెన్నో ఆణిముత్యాలు తెలుగువారికి అందించారు
.... తెలుగు కళామతల్లి కంఠహారంలో కవితా కుసుమాలు పొదిగారు

ఋతుచక్రం తిప్పి కర్పూర వసంతరాయలు ను పిలిచారు
విశ్వంభర డయి ప్రపంచ పదులు చెప్పి గదిలో సముద్రం పారించారు

ఆయనది అలుపెరగని సాహితీ వ్యవసాయం
అందుకే అత్యున్నతమైన జ్ఞానపీఠమెక్కారు


నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నుండి జేజమ్మా వరకూ
సినారే సినీ గీతాలు కూడా సాహిత్య పరిమళాలు వెదజల్లాయి

తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోగలిగిన కవి సినారె
ఆ తరానికి, ఈ తరానికి మధ్య వారధిగా నిలిచిన సినారె.... నిజంగా భళారే !!

ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.........

సినారె గారి కలమే కాదు... గళం కూడా మధురమే ! ఆయనకు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన ' విశ్వంభర ' నుంచి, సున్నితమైన వ్యంగ్యాన్ని కలబోసిన ' ప్రపంచ పదులు ' నుంచి సినారే తన స్వంత గళంలో అందించిన కొన్ని కవితా కుసుమాలు.......




గతంలోని టపా.....
సినారె మాటల చమక్కులు

Vol. No. 02 Pub. No. 294
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం