Monday, May 3, 2010

సినారె మాటల చమక్కులు

డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు మాటలు కూడా బహు పసందుగా వుంటాయి. తెలుగు భాష సొగసును ఆయన మాటల్లో చూడవచ్చు. ఆయన ముఖ్య అతిథిగా వస్తే ఆ సభ కళ కళ లాడుతుంది. మాటలతో చదరంగం ఆడుకుంటారు సినారె.

* మన రాష్ట్రంలో పేరుపొందిన నాటక పరిషత్తులలో తూర్పుగోదావరి జిల్లా రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఒకటి. ఒకసారి ఆ పరిషత్తు ఉత్సవాల్లో డా. సి. నారాయణ రెడ్డి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా వున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ సందోహాన్ని చూసి ఒక వక్తకు ఉత్సాహం పెల్లుబుకింది. ఆ ఉత్సాహంలో ఆ సభను మయసభ తో పోల్చాడు.
సినారె గారు దానికి ప్రతిస్పందిస్తూ " ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు ఈ మహాసభను మయసభతో పోల్చారు. అయితే మయసభ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించడం. పైగా అపోహలూ, అవమానాలు. కనుక ఇది మయసభ అనడం సరైనది కాదు. దీన్ని మనం వాజ్ఞ్మయసభ అంటే బాగుంటుంది. " అన్నారు. ఇక సభంతా ఒకటే కేరింతలు ఆ గిలిగింతలకి. 

* మార్కాపురం పలకలకి ప్రసిద్ధి అని మనకందరికీ తెలుసు. రాతి పొరలనుండి ఆ పలకలు తయారవుతాయి. కొంతకాలం క్రితం వరకూ మార్కాపురం పలక మీద ఓనమాలు దిద్దని తెలుగు వారుండేరేవారు కాదు. ఇప్పటి తరానికి పలకాలంటే తెలీదేమో !
ఓసారి ఆ ఊరి కళాశాల వార్షికోత్సవానికి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు ఆయన తన ఉపన్యాసంలో " కొందరి గుండెల్లో పొరలు లాగే మార్కాపురం బండల్లో కూడా పొరలున్నాయి. అయితే మనుష్యుల గుండెల్లోవి పొరలు ఉండకూడని పొరలు. మార్కాపురం బండల్లో వున్న పొరలు ఉండాల్సిన పొరలు. ఎందుకంటే అవి అందరికీ పనికొచ్చేవి కనుక " అనడంతో మార్కాపురం వాసుల ఆనందం చెప్పాలా !

 ఇవి నారాయణ రెడ్డి పద విన్యాసానికి మచ్చు తునకలు మాత్రమే !

Vol. No. 01 Pub. No. 280

3 comments:

Anonymous said...

ఆయ్..మా తెలంగాణ వాని గురించి మీ ఆంద్రోల్లు మాట్లాడుడేంది...? జై తెలంగాణ

అక్షర మోహనం said...

సినారె మాటలగురించి మీరు బాగ రాసినారె..

SRRao said...

* అక్షర మోహనం గారూ !
ధన్యవాదాలు

* అజ్ఞాత గారూ !
సాహిత్యానికి, కళలకు సరిహద్దులు గియ్యడం ప్రారంభిస్తే మన జ్ఞానానికి కూడా హద్దులేర్పడతాయేమో ! సినారెకు, ఆయన సాహిత్యానికి ప్రాంతీయతా సంకుచిత భావాలు ఆపాదిస్తే మన మాతృ భాషైన తెలుగు భాషకు మనమే ద్రోహం చేసుకున్నట్లే ! మీ ఉద్యమం, నినాదాలు తెలుగు భాషా వికాసానికి దోహదపడితే ప్రపంచంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం