Saturday, May 7, 2011

సహజ నటి

 ఆమె నటనలో సహజత్వం వుట్టిపడుతుంది 
ఆమె వాచకంలో సహజత్వం తొణికిసలాడుతుంది
ఆమె నవరసాలను అద్భుతంగా పలికిస్తుంది 
ఆమె కరుణరస పోషణలో తనకు సాటిలేరని చాటింది 

ఆమే ఒకప్పటి ప్రముఖ నటి కన్నాంబ. 13 వ యేటనే రంగస్థల ప్రవేశం చేసిన ఆమె అక్కడ చంద్రమతి, సతీ సావిత్రి, అనసూయ లాంటి వైవిధ్యభరితమైన పాత్రలను ధరించారు.  1934 లో సీతాకల్యాణం చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసారు. 1935 లో స్టార్ కంబైన్స్ వారి ' హరిశ్చంద్ర  ' చిత్రంలో ఆమె ధరించిన చంద్రమతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. అప్పటినుండి సుమారు 150 చిత్రాలలో వివిధ రకాల పాత్రలు ధరించారు. తమిళంలో ఆమె ధరించిన ' కన్నగి ' పాత్రతో ఆమె నటన ఉన్నత శిఖరాలు చేరింది. ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ' పల్నాటి యుద్ధం ' లో ఆమె ధరించిన నాయకురాలు నాగమ్మ పాత్ర. మహానటుడు గోవిందరాజుల సుబ్బారావుతో పోటీగా నిలిచింది. 

1941 లో కడారు నాగభూషణంతో వివాహ బంధం ఆమెను నిర్మాతను చేసింది. రాజరాజేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై ఇరువురూ తెలుగు, తమిళ భాషలలో సుమారు 30 చిత్రాలు నిర్మించారు.

కన్నాంబ లాగ సులువుగా హావభావాలు పలికించగల నటి ఇంతవరకూ ఎవరూ లేరు. ఇకముందు రారు. ఆ రోజుల్లో ఆమె కన్నీళ్ళ గురించి ఒక విషయం బాగా ప్రచారంలో ఉండేది. గ్లిజరిన్ అవసరం లేకుండా సన్నివేశానికి ఎన్ని అవసరమైతే అన్ని కన్నీళ్లు కళ్ళ నుండి ఒక్క నిముషం లోపునే తెప్పించగలిగేదని. 

ఈ కన్నీటి వెనుక ఓ విషాద గాథ వుంది. ఆమె చిత్రరంగంలో అంతటి ఉన్నత స్థాయికి చేరడానికి ముందు చాలా ఇబ్బందులు  ఎదుర్కొంది. ఒక పూట తిని, మరో పూట తినక... ఉన్న ఒక్క చీరను  సగం చేసి ఒక ముక్క ఒంటి మీద, మరో ముక్క దండెం మీద ఆరేసుకుని అష్టకష్టాలు పడింది. అందుకే అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా ఆమె కానీ ( అప్పటి నాణెం ) కూడా ఊరికే ఖర్చు పెట్టేది కాదు. వీధిలోకి వచ్చిన చీపుళ్ళు కూడా గీసి గీసి బేరమాడి కొనేది. అది పిసినారితనం అని కొందరు అనుకున్నా దాని వెనుక ఆమె కష్టాల కన్నీళ్లు వున్నాయి. అందుకే ఆమె నటనలో అంత సహజత్వం ఉట్టిపడేదేమో ! అలాగని ఆమెలో దాతృత్వం లేదనుకుంటే పొరబాటే ! అవసరమైన చోట అవసరమైన దానాలు బాగానే చేసేది. ' చచ్చేటపుడు ఆస్తిపాస్తులు నాతో తీసుకుపోతానా ' అని తరచూ అంటుండే కన్నాంబ చివరకి ఆ ఆస్తులేమీ మిగుల్చుకోకుండానే వెళ్ళిపోయింది.

నటిగా, నిర్మాతగా, గాయనిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కన్నాంబ వర్థంతి ఈరోజు. ఆ సందర్భంగా ఆమెకు స్మృత్యంజలి.......




Vol. No. 02 Pub. No. 228

2 comments:

Anonymous said...

Many Thanks for posting about this great actress and about her. I heard from my grandma C.Pullayya's son C.S Rao married her daughter and her married life didnt do that well as C.S. Rao fell in love with actress Raja Sulochana. He divorced his first wife and married Raja Sulochana. This issue made upset Kannamba and she died with cancer in 1964. her Last movie after hera death rleased VN Films "Bhaktha Ramadasu" with V.Nagayya

SRRao said...

దీప గారూ !
మీరు రాసిన అన్ని వ్యాఖ్యలకూ కలిపి ఇక్కడే జవాబు రాస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. ముందుగా ఉత్తమాభిరుచికి వయసుతో నిమ్మిత్తం లేదని నిరూపించారు.... అభినందనలు. విలువైన సమాచారం పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం. మీరడిగిన కొన్ని విషయాలు ఒకసారి మళ్ళీ పరిశీలించి జవాబులు రాస్తాను. మీ అభిరుచినీ, విషయసేకరణను కొనసాగించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం