Tuesday, May 10, 2011

చలువ పందిళ్ళు

ఎండలు మండిపోతున్నాయి. పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. 

అదేమిటో నడివేసవిలోనే ఎక్కువగా పెళ్లి ముహుర్తాలుంటాయి. ప్రయాణాలూ వుంటాయి. పిల్లలకి వేసవి సెలవలు వుండడం అసలు కారణమనుకుంటే మరి ఇప్పటి పిల్లల్లో సగంమంది ఎర్రటి ఎండలో కూడా కాలేజీ లకు, స్కూళ్ళకు వెళ్తున్నారే ! అందుకని సెలవలతో సంబంధం లేకుండా....ఎండవేడి, ఉక్కపోత భరించలేకుండా వున్నా....... బస్సులు, రైళ్ళు కిక్కిరిసి వున్నా..... బస్సులవాళ్ళు స్పెషల్స్ పేరుతో, ఆటో వాళ్ళు ఇవ్వకేం చేస్తారనే ధీమాతో ఎక్కువ డబ్బులు దోచేస్తూ వున్నా.... జనం మాత్రం ప్రయాణాలు మానరు. పెళ్లిళ్లకు వెళ్ళడం మానరు.

ఈ వేసవి పెళ్ళిళ్ళలో అతిథిలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి పూర్వకాలంలో.... అంటే ఈ షామియానాలు, కాటరింగులూ తెలియని కాలంలో చక్కగా అప్పుడే కోసుకొచ్చిన తాటియాకులతో పందిళ్ళు వేసేవారు. పెళ్లిరోజుకి కనీసం ఐదారు రోజులముందు పెళ్లికొడుకునో, పెళ్లికూతురినో చెయ్యడం ఆనవాయితీ. ఆ ముహూర్తం తో బాటు పందిరి వెయ్యడానికి కూడా ముహూర్తం పెట్టేవారు. శుభకార్యం అనగానే పందిరి వెయ్యడం కూడా శుభసూచకంగా భావించే రోజులవి. అందులో తాజా తాటియాకులతో వేసిన పందిరిని మరీ శ్రేష్టంగా  భావించేవారు. పైగా తాజా తాటియాకులు అదో రకమైన వాసన కలిగి వుంటాయి. నిజానికి ఆ వాసన మనలో తాజాదనాన్ని నింపుతుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా మా కోనసీమలో కొబ్బరి ఆకులతో పందిరి వెయ్యడం ఆనవాయితీ. స్తంభాలకి పచ్చటి కొబ్బరియాకులు చుట్టేవారు. భవిష్యత్తులో కొత్తజంట కాపురం పచ్చగా ఉండాలనే పెద్దల ఆకాంక్షకు ప్రతిరూపంగా ఉండేవి ...అప్పటి పెళ్లి పందిళ్ళు. పెళ్ళికి ముందరే వేసిన పందిరి పదహారురోజుల పండుగ అయ్యేవరకూ తియ్యకపోవడం సాంప్రదాయం. 

ముహూర్తానికి గంట ముందు షామియానా వేసి,  పెళ్ళయిన గంట తర్వాత తీసేస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరానికి తాటియాకుల పందిళ్ళ గొప్పదనం చెప్పినా అర్థం కాదేమో ! మన కళ్ళెదురుగా నిప్పులు చెరుగుతున్న ఎండ.... అయినా ఆ పందిరి క్రిందకు వెళ్ళగానే పలకరించే చల్లదనం.... అనుభవించాల్సిందే గానీ చెప్పనలవికాదు. దీని ముందు కృత్రిమంగా చల్లబరిచే ఎయిర్ కండిషనర్స్ ఎందుకు పనికొస్తాయి. సహజసిద్ధమైన చల్లదనాన్ని అనుభవించగలం కనుకనే ఆ పందిళ్లను చలువ పందిళ్ళు అన్నారు. 

పెళ్ళికి వెళ్లి చక్కని చలువ పందిరి క్రింద కూర్చుని పెళ్లి వారిచ్చే తాటియాకుల విసనకర్రతో విసురుకుంటూ.... కర్పూరం వాసన పీలుస్తూ.... మీదకు చిలికిన పన్నీరు సుగంధాన్ని అందుకుంటూ... పూసిన చందన సౌరభాన్ని ఆస్వాదిస్తూ.... .పెళ్లి వేడుకల్ని చూడడం..... ఒక అందమైన అనుభవం. చాలాకాలం తర్వాత కలిసిన బంధుమిత్రులతో ముచ్చట్లాడుకుంటూ.. మేలమాడుకుంటూ... మేళతాళాల నేపథ్యంలో కూర్చుని, కొసరి కొసరి వడ్డిస్తుంటే పంక్తి భోజనం చెయ్యడం ఎంతటి మధురానుభూతి.  బఫే భోజనాల కాలంలో ఎవరికివారు తమ ప్లేట్లు పట్టుకుని తమకి కావాల్సిన పదార్థాలు తామే వడ్డించుకుంటూ... ప్రక్కవారు ఇంత తింటారా... అన్నట్లు చూస్తున్నారేమోనన్న అనుమానంతో వేసుకున్న వాటిలో కొన్ని తీసేసి ....తిన్నారా అని అడిగేవాళ్ళే తప్ప... ఏం తింటున్నారని, ఏం కావాలని అడిగే వాళ్ళు కనబడక... పెళ్లి భోజనానికి వెళ్తున్నాం కదా అని ఇంట్లో వంట చేసుకోని పాపానికి  పస్తుండలేక నాలుగు మెతుకులు కతికి బయిట పడే ఈరోజుల్లో.... ఈ అనుభూతులు, అనుభవాలు అర్థం కావేమో ! ఇప్పటి తరం ఈ మధురానుభూతుల్ని కోల్పోతోందనేది నిజం. 

అప్పటి రోజుల్లో పెళ్ళికి హాజరయి వస్తే అది కొన్ని నెలల వరకూ చెప్పుకోగలిగే అనుభూతుల్ని మిగిల్చేది. ఇప్పుడు మంటపం దాటాక ఆ పెళ్లి గురించి తలచుకునే పరిస్థితి లేదు. కొన్నాళ్ళు  గడిచాక అసలు ఆ పెళ్లి జరిగిన విషయమే మరిచిపోతామేమో ! ఇప్పటి పెళ్ళిళ్ళలో ఆడంబరం, డాంబికం తప్ప ఆప్యాయతతో కూడిన పలకరింపులు... అనుభూతితో కూడిన వీడ్కోళ్ళు మృగ్యమైపోయాయి. యాంత్రికమైన జీవితాల ఫలితమా ? ఆధునీకరణ ప్రభావమా ? ఈ పరిస్థితికి కారణమేది ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమేమో ! 

ఒక్కోసారి అక్కడక్కడ ఎదురయ్యే కొన్ని సంఘటనలు, దృశ్యాలు గతకాలపు  జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. అప్పుడు ఆ మధురానుభూతుల్లోనుంచి బయిటకు రావడం కొంచెం కష్టమైన పనే ! నాకు మొన్న అలాంటి పరిస్తితి ఎదురయింది. ఒకరోజు ఉదయమే లేచి బయిటకొస్తే మా ఎదురింటి దగ్గర వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంగా తాటియాకుల పందిరి వెయ్యడం కనబడింది. అది పూర్తయ్యే లోపున చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని బయిటకొచ్చాయి. పల్లెటూళ్ళలో కూడా షామియానాలు, బఫేలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో... నగరంలో ..ఇలా మండు వేసవిలో చలువపందిరిని వేయించిన ఆ దంపతుల అభిరుచిని అభినందించకుండా ఉండలేకపోయాను. నగరాల్లో కూడా అక్కడక్కడ తాటియాకులతో పందిరి వేసినా, వాటికి చాందిని పేరుతో గుడ్డలు కట్టి..అలంకారాలు చేసి  తాటియాకుల తాజాదనాన్ని మనకందనీయకుండా అడ్డుకట్టలు వేసేస్తున్నారు. అలా కాకుండా మావిడాకుల తోరణాలు తప్ప ఇంకేమీ అదనపు అలంకారాలు లేకుండా వేసిన స్వచ్చమైన చలువ పందిరిని చూసి ముచ్చటేసింది. అందుకే వెంటనే ఆ పందిరిని నా కెమెరాలో బంధించాను. ఆ అనుభూతిని మీక్కూడా పంచాలని ఇలా మీకందిస్తున్నాను. అందుకోండి.


Vol. No. 02 Pub. No. 231

3 comments:

Tejaswi said...

మేము కూడా ఆనందించాము. అయితే ఫొటోలు ఇంకొద్దిగా పెద్దవయితే బాగుండేదేమో.

SRRao said...

తేజస్వి గారూ !
ధన్యవాదాలు. మీకు తెలియని విషయం కాదు గానీ ఓసారి గుర్తు చేస్తున్నాను. ఫొటో మీద క్లిక్ చేసి చూడండి.

Vinay Datta said...

The pandals are really good. Cooling the mind!

madhuri.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం