Tuesday, May 3, 2011

ఓ అద్భుతం ఆవిష్కృతమైన రోజు

సరిగ్గా తొంభై ఎనిమిదేళ్ళ క్రితం ఇదేరోజు ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. బొంబాయిలోని కార్నేషన్ సినిమాలో  తొలి  భారతీయ చలనచిత్రం ప్రదర్శితమైంది. అంతకుముందు కొన్ని దిగుమతి చేసుకున్న విదేశీ లఘు చిత్రాలు మాత్రమే చూడగలిగిన భారతీయులకు దాదా సాహెబ్ గోవింద ఫాల్కే పూర్తి నిడివి కథా చిత్రం చూపాడు. దీనికి సంవత్సరం క్రితం ' పుండలీక్ ' అనే చిత్రం వచ్చినా అది రంగస్థల నాటకాన్ని యథాతథంగా చిత్రీకరించినది కావడం వలన, చలనచిత్ర సాంకేతికతకు దూరంగా వుండడం వలన అన్ని హంగులతో వచ్చిన '  రాజా హరిశ్చంద్ర ' నే తొలి భారతీయ చిత్రంగా పరిగణిస్తారు.


చిన్న ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ఆరంభించిన దాదా సాహెబ్ ఫాల్కే అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి చివరికి చిత్ర నిర్మాణాన్ని ఎంచుకున్నారు. ఆయన చూసిన ' డాటర్ అఫ్ ఇండియా ' అనే చిత్రం ఆయనలో ఈ బీజాన్ని నాటింది. అందులో భారతీయ సాంప్రదాయాలను వక్రీకరించిన తీరు ఆయన్ని కలచివేసింది. అలాగే ' ది లైఫ్ అఫ్ క్రిస్ట్ ' అనే చిత్రం మన పురాణ కథల్ని కూడా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో కలిగించింది. తన జీవిత భీమా పాలసీని తాకట్టు పెట్టి పన్నెండువేల రూపాయిలు తీసుకుని లండన్ వెళ్ళారు. ఒక కెమెరా కొనుక్కొచ్చారు. చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఆ చిత్రంలో నటించడానికి ఎంత ప్రయత్నించినా  స్త్రీలెవ్వరూ ముందుకు రాలేదు. చివరికి పురుషుల చేతనే స్త్రీ పాత్రలు ధరింపజేశారు. ' రాజా హరిశ్చంద్ర ' చిత్రం పూర్తయి 1913 వ సంవత్సరం మే 3 వ తేదీన విడుదలైంది. దాదా సాహెబ్ ఫాల్కేను భారత చలనచిత్ర పితామహుడిగా చరిత్రలో నిలిపింది.

అప్పటివరకూ మన దేశంలో విడుదలైన విదేశీ చిత్రాలు నాల్గురోజులు మించి ఆడలేదు. కానీ ' రాజా హరిశ్చంద్ర ' మాత్రం 23 రోజులు హౌస్ ఫుల్  కలక్షన్స్ తో నడిచి రికార్డు సృష్టించింది. ఆ ఉత్సాహంతో ఆయన ఇంకా చాలా మూకీ చిత్రాలు నిర్మించాడు. వాటి విజయం ఎంతోమందిని ఆకర్షించింది. పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో చలనచిత్ర పరిశ్రమ ఎదిగింది. పన్నెండువేల రూపాయిలతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు కొన్ని వేల మిలియన్ రూపాయిల వ్యాపారంగా అభివృద్ధి చెందింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా  కొన్ని లక్షలమందికి ఉపాధి కల్పిస్తోంది. సాంకేతికంగా ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ఎన్నో కళాఖండాలను ప్రజలకు అందించింది. ప్రజల దైనందిక జీవితంలో విడదీయలేని భాగమైంది.  దాదా సాహెబ్ ఫాల్కే ముందు చూపు ఫలితంగానే ఇది సాధ్యమైంది. 

భారత చలన చిత్ర పరిశ్రమ ఆరంభమైన రోజుగా ఈరోజును పరిగణించవచ్చు. అందుకే తొలి భారతీయ చలనచిత్రం ' రాజా హరిశ్చంద్ర ' విడుదలైన ఈరోజు ( మే 3 వ తేదీ ) ఓ అద్భుతం ఆవిష్కృతమైన రోజు అని చెప్పవచ్చు. ఆ అద్భుతాన్ని అందించిన ఫాల్కే గురించి, రాజా హరిశ్చంద్ర నిర్మాణ నేపథ్యం వగైరాల గురించి వివరాలు ఈ లఘు చిత్రంలో చూడండి....




Vol. No. 02 Pub. No. 223

4 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

చాలా మంచి సమాచారము. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

SRRao said...

విజయవర్థన్ గారూ !

ధన్యవాదాలు

shri said...

దాదా ఫాల్కే గురించి విలువైన సమాచారాన్ని తెలిపిన మీకు ఎన్నో కృతజ్ఞతలు!
విత్తు నుండి మర్రి ఉద్భవించటం ఇదే కదా!!
ఒక ముందడుగు ఎంత అభివృద్ధినీ,వికాసాన్నీ చిగురింపజేసిందో దాదా ఫాల్కే జీవనయానం తెలియజేస్తూంది!
ధన్యవాదాలు
శ్రీదేవి

SRRao said...

శ్రీదేవి గారూ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం