ఆయన మాటలు రాయడంలో ఘనాపాటీ అన్న విషయం తెలియని తెలుగు ప్రేక్షకులుండరు ( ఉంటే వాళ్ళు తెలుగువాళ్ళు కారు ). ఆయన మాటల్లో తొణికసలాడే చమత్కారెలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే సినిమా సంభాషణల్లో రాయడం వేరు. నిజ జీవితంలో...అదీ తన మీద తనే చమత్కార బాణాలు వేసుకోవడం విశేషం.
జంధ్యాల దర్శకత్వం వహించిన ' మూడుముళ్ళు ' చిత్రం షూటింగ్ కోనసీమ లో జరుగుతోంది. సరిగా అదే సమయంలో మా కోనసీమా ఫిలిం సొసైటీ వార్షికోత్సవం వచ్చింది. ఆ కార్యక్రమ రూపకల్పనలో ఉండగా మా కార్యవర్గ మిత్రులు ముఖ్య అతిథిగా జంధ్యాల గారిని పిలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. మా కార్యవర్గ సభ్యుల్లో షూటింగ్ జరుగుతున్న గ్రామం ' మాగాం ' వాస్తవ్యులు కూడా ఉన్నారు. వారితో బాటు జంధ్యాల గారిని కలిసి ముఖ్య అతిథిగా రావల్సిందిగా అభ్యర్థించాం. తనవి ఫిలిం సొసైటీలలో ప్రదర్శించదగిన సినిమాలు కావు కనుక తాను రావడం ఉచితంగా ఉండదేమోనని ముందు కొంచెం సందేహ పడ్డారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి వ్యక్తిగత పరిచయంతో ఆయన సందేహాన్ని తీర్చి ఒప్పించడానికి ఒక చిత్రాన్ని గుర్తుచేసాను. అది ' నెలవంక '. ఈ చిత్రం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆ చిత్ర విశేషాలు క్లుప్తంగా....
మత ఘర్షణలు ప్రధానాంశంగా సాగిన చిత్రం. హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకోవడం, వారి ప్రేమను భగ్నం చెయ్యడానికి పెద్దలు సృష్టించిన అడ్డంకులు మతకలహాలకు దారి తీయడం ఈ చిత్ర కథాంశం. ఇందులో తోలుబొమ్మలాట ప్రదర్శన మొదలైన ప్రయోగాలు జంధ్యాల చేసారు. అయితే ఆయన ఒరవడికి పూర్తి భిన్నంగా ఉన్న చిత్రం నెలవంక అనడానికి నిదర్శనం ఆ చిత్రంలో హాస్యం తేలిపోవడమే ! ' నాలుగు స్తంభాలాట ' సుత్తికి కొనసాగింపుగా అటుదిటు చేస్తూ వేలు యజమానిగా, వీరభద్రరావు సేవకునిగా సుత్తికి బదులుగా మేకులు వాడిన హాస్యం సీరియస్ గా నడుస్తున్న చిత్రంలో పేలవంగా కనిపిస్తుంది. రాజేష్ ముస్లిం యువకునిగా, తులసి హిందూ యువతిగా నటించారు. ఆ చిత్రం ఘోరంగా పరాజయం పాలయింది.
ఆ రోజు నేను ఆ చిత్రం గురించి చెప్పగానే ఆయన మా ఫిలిం సొసైటీ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి అంగీకరించడమే కాక ఆ చిత్రం ప్రదర్శిస్తే బాగుంటుందనే మా ప్రతిపాదనకు కూడా అంగీకరించి వెంటనే ఆయనే డిస్ట్రిబ్యూటర్ కి ఫోన్ చేసి చెప్పడంతో బాటు ఉచితంగా ఇవ్వవలసినదిగా ఒక ఉత్తరం కూడా రాసిచ్చారు. ఆ విధంగా వార్షికోత్సవం రోజు జంధ్యాల గారి సౌజన్యంతో ' నెలవంక ' చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసాం ! ఆ సభలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు నేను ఈ రోజుకీ మర్చిపోలేను.
" చాలా చిత్రాలకు మాటలు రాస్తున్నాను. దర్శకత్వం చేస్తున్నాను. అన్నీ నాకు సంతృప్తి ఇచ్చేవా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పొచ్చు. మరెందుకు ఇవన్నీ చేస్తున్నారని మీరడగవచ్చు. ఇది నా వృత్తి. నన్ను రచన చెయ్యమనో, దర్సకత్వం కోసమో నిర్మాతలు అడిగినప్పుడు నా వృత్తి ధర్మాన్ని అనుసరించి చేస్తాను తప్ప నా స్వంత అభిప్రాయాలను వారి మీద రుద్దే ప్రయత్నం చెయ్యను. కానీ మొదటిసారిగా నేను ఇష్టపడి రాసుకున్న కథ, మలచిన చిత్రం నెలవంక. అది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుందనుకున్న ' నెలవంక ' ........ ' నేల 'వంక చూసింది. దాంతో ఇక మీదట నా ఇష్టాల్ని ప్రేక్షకుల మీద కూడా రుద్దకూడదనుకున్నాను. " అన్నారు జంధ్యాల.
సమాజం పట్ల బాధ్యతతో తీసిన చిత్రం పరాజయాన్ని చూపించినందుకు కమర్షియల్ చిత్రాలే తీస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు ఆ మాటలు ధ్వనించినా ఆయన తన బాధ్యతను మరచి పోలేదు. కాకపోతే మరో రూపంలో నెరవేర్చారు. హాస్యంతో తెలుగు వారికెందరికో ఆరోగ్యాన్ని అందించారు. ఆయన అందించిన ఆణిముత్యం లాంటి, అమృత గుళిక లాంటి నినాదం
నవ్వడం ఒక భోగం
నవ్వలేక పోవడం ఒక రోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వలేక పోవడం ఒక రోగం
నవ్వించడం ఒక యోగం
Vol. No. 01 Pub. No. 158
5 comments:
You forgot another line in between
"Navvinchadam Oka Yogam"
మంచి విషయాన్ని తెలిపారు.ధన్యవాదాలు.
నిజమే నెలవంక గురించి విన్నాను కాని అది జంధ్యాల గారిదని తెలియదు.
ఆయన ఇష్టపడిన ఆ సినిమా చూడాలి.
వ్యాపార చిత్రాల వెల్లువలో కళాత్మక చిత్రం నెలవంక ఆడటం కష్టమే. ఈ విషయంలో కన్నడ ప్రేక్షకులు మనకంటే ముందున్నారు. ద్వీప, గులాబీ టాకీస్ , సంస్కార లాంటి మంచి చిత్రాలను ఆదరించారు వారు.
మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
* అజ్ఞాత గారూ 1
రాశానండీ ! పోస్టింగులో ఎలా ఎగిరిపోయిందో గమనించలేదు. మీ సూచనకు ధన్యవాదాలు. మళ్ళీ కలిపాను. మీ పేరు కూడా రాసి వుంటే బాగుండేది.
* శ్రీనిక గారూ !
ధన్యవాదాలు. ఈ చిత్రం లభించడం కొంచెం కష్టమే ! గతంలో ఏదో చానల్ లో చూపించినట్లు గుర్తు. మళ్ళీ వేస్తే మాత్రం తప్పక చూడండి.
* రావు గారూ !
నిజమేనండీ ! మనకి కూడా కళాత్మక హృదయం వుంది కానీ మొహమాటం ఎక్కువ, కళాత్మక చిత్రాలు చూసామని చెప్పుకోవడానికి . అందుకే వ్యాపార చిత్రాల ప్రభ వెలుగుతోంది. ధన్యవాదాలు.
Post a Comment