Saturday, January 23, 2010

నేతాజీ - ఆంధ్రతో అనుబంధం

భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు నేతాజీగా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్. గాంధీజీది మితవాదం. అహింసామార్గం. బోస్ ది అతివాదం. హింసాయుత మార్గం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి.
ఏ పద్ధతిలో పని చేసినా మన దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులు వీరందరూ ! ఇలాంటి వారెందరి త్యాగఫలమో ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం.

నేతాజీ
ఆంధ్ర ప్రాంతంలో 1939 సెప్టెంబర్ నెలలో పర్యటించారు. సెప్టెంబర్ 3 వ తేదీన కాకినాడలో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహా సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి నాంది పలికిన రోజది. ఆనాడే హిట్లర్ పోలాండ్ పైన దాడి చేసాడు.

1940 జనవరి లో మరోసారి ఆంధ్రకు వచ్చారు సుభాష్ చంద్రబోస్. ఏలూరులో జరిగిన రాష్ట్ర రాజకీయ బాధితుల సభలో పాల్గొన్నారు. శ్రీయుతులు మద్దూరి అన్నపూర్ణయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు ప్రభృతులు కూడా ఆ సభలో పాల్గొన్నారు. తరువాత నేతాజీ రాజమండ్రి, మండపేట, రామచంద్రపురం సభలలో కూడా ప్రసంగించారు.

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని నమ్మి బ్రిటిష్ వారికి శత్రువులైన జర్మనీ, జపాన్ దేశాల సాయం తీసుకున్నాడు. ' ఆజాద్ హింద్ ఫౌజ్ ' అనే పేరుతో ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించాడు. ఆ సైన్యంలో ఆయనకు అండదండలుగా ఉన్న ఆంధ్రులను మనం ఒకసారి స్మరించుకుందాం !

కల్నల్ డి. ఎస్. రాజు - పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణ రాజు గారు ఐ.ఎన్.ఏ. ( ఇండియన్ నేషనల్ ఆర్మీ ) లో నేతాజీకి కుడిభుజంగా ఉండేవారు. విశాఖపట్నం మెడికల్ కాలేజ్ మొదటి బాచ్ విద్యార్థి అయిన రాజు గారు ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళారు. డాక్టర్ గా ప్రాక్టీసు చేస్తున్న ఆయన తొలుత బ్రిటిష్ ఆర్మీ లో చేరారు. నేతాజీకి వ్యక్తిగత వైద్యునిగా సేవలందించినపుడు ఆయనతో ఏర్పడిన అనుబంధం తర్వాత కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరడానికి కారణమైంది. అచిరకాలంలోనే అందులో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. నేతాజీ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి స్వాతంత్ర్యానంతరం విముక్తి పొంది తన స్వగ్రామంలో తిరిగి వైద్య సేవలందించడం కొనసాగించి 1973 లో మరణించారు.

మేజర్ అబిద్ హసన్ సఫ్రానీ : కుల - మత, పేద - ధనిక తేడాలు లేకుండా యావత్తు భారత దేశాన్ని ఒక్కటిగా నిలిపిన నినాదం ' జైహింద్ ' . దాని సృష్టి కర్త సఫ్రానీ. హైదరాబాద్ కు చెందిన ఈయన ఐ.ఎన్.ఏ. లో గాంధీ బ్రిగేడ్ కమాండర్ గా, మేజర్ గా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం అనేక దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు.

డాక్టర్ సురేష్ చంద్ర : హైదరాబాద్ కి చెందిన సురేష్ చంద్ర బెర్లిన్ నుంచి ప్రసారమయిన ఆజాద్ హింద్ రేడియోలో ప్రసంగాలు చేశారు. అంతేకాదు. నేతాజీకి ఎన్నో ప్రసంగాలను రాసిచ్చిన ఘనత ఆయనది.

ఎన్. భూషణం : మచిలీపట్టణం నుంచి రంగూన్ వెళ్లి స్థిరపడిన కుటుంబంలోని వ్యక్తి భూషణం. ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం చదువుతున్నపుడే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ కు ఆకర్షితుడై అందులో చేరిపోయారు. పోర్టబుల్ వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఆపరేటర్ గా పనిచేశారు.

పీతల పైడయ్య యాదవ్ : విశాఖపట్నం లోని శివాజీపాలెంలో జన్మించిన పైడయ్య మొదట కాంగ్రెస్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. తర్వాత బ్రిటిష్ ఆర్మీ లో చేరారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడి ఖైదీగా జపాన్లో
ఉన్న కాలంలో నేతాజీ ఐ.ఎన్.ఏ. పట్ల ఆకర్షితుడై అందులో చేరిపోయారు. నేతాజీ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీ పైడయ్య. తరువాత విశాఖలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లో పనిచేశారు.

బండి అడవయ్య యాదవ్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాళ్ళ గూడేనికి చెందిన వారు. నేతాజీ విధానాలకు ఆకర్షితులై ఐ.ఎన్.ఏ. లో చేరారు. అందులో ఒక బాచ్ హెడ్ గా ఉంటూ మలయా, సింగపూర్, బర్మాలలో పనిచేసారు. స్వాతంత్ర్యాననంతరం పోలీసు శాఖలో పనిచేశారు.

లావిసేట్టి అప్పారావు : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా హుసేనీ పురం అప్పారావు గారి స్వస్థలం. క్విట్ ఇండియా ఉద్యమం రగిల్చిన స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో నేతాజీ పోరాటానికి ఆకర్షితుడయిన మరో వ్యక్తి అప్పారావు. ఇటలీ లో జైలు శిక్ష అనుభవించారు.

షేక్ ఖాదర్ మొహియుద్దీన్ : విజయనగరం జిల్లా వేపాడ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ మొహియుద్దీన్ టీ స్టాల్ నడుపుకుంటూ అతి సామాన్యమైన జీవనం కలిగిన వ్యక్తి. ఐ.ఎన్.ఏ. లో రైఫిల్ మాన్ గా పనిచేశారు.

డాక్టర్ పి. రంగాచార్యులు : మద్రాసు మెడికల్ కాలేజీ లో పట్టా పొందిన రంగాచార్యులు బ్రిటిష్ ఇండియా మెడికల్ సర్వీసెస్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత నేతాజీ స్పూర్తితో ఐ.ఎన్.ఏ. లో చేరారు. బర్మాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయారు.

వి.ఆర్.జార్జ్ : గుంటూరు జిల్లా రెంటచింతల దగ్గర నడికుడి గ్రామానికి చెందిన జార్జ్ నేతాజీ ప్రభావానికి లోనైనా వారే ! బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న ఈయన నేతాజీ పిలుపుతో 1942 లో ఐ.ఎన్.ఏ.లో చేరిపోయారు. ఆయన సేవలకు పతకాలు లభించినా చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

రోజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ............




Vol. No. 01 Pub. No. 165

4 comments:

Padmarpita said...

నాకు ఇష్టమైన నేతాజీ గురించి ఆయన అనుబంధం ఆంద్రాతో చక్కగా చెప్పారు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

చాలా మంచి సమాచారం ఇచ్చారు సర్.

SRRao said...

* పద్మార్పిత గారూ !
* లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !

ధన్యవాదాలు

SRRao said...
This comment has been removed by the author.
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం