1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరువెక్కింది. వెంటనే బయిలుదేరాను. స్టూడియో చేరుకోగానే మా బాస్ కె.ఎస్. రామారావుగారి నుంచి ఫోన్. విషయం చెప్పి చూడ్డానికి వెళ్ళాలి పెద్ద పూల దండ తెప్పించమని. పంజాగుట్ట, అమీర్ పేట ప్రాంతాల్లో గాలించినా ఎక్కడా దొరకలేదు. మా సిబ్బందిని నగరమంతా పంపించాను. ఉదయాన్నే కావలిసినన్ని పువ్వులు దొరికే హైదరాబాద్ నగరంలో ఆరోజు దండలు కాదుకదా విడిపువ్వులు కూడా దొరకలేదు. నగరంలోని పువ్వులన్నీ రామారావు గారి మరణ వార్త బయిటకు రాగానే ఆయనకు నివాళులర్పించడానికి తరలిపోయాయి. వెతగ్గా వెతగ్గా జాంబాగ్ లో రీత్ లు కొద్దిగా దొరికాయి. రామారావు గారి మీద తెలుగు ప్రజల అభిమానానికి ఇదొక నిదర్శనం.
ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఈ జీవన రంగస్థలం మీద తెర దించేసి ఇప్పటికి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆరోజు జెమిని టీవిలో రామారావు గారి మీద కార్యక్రమ రూపకల్పనలో సహకరించడం, ఎన్డీటీవి వారికి వార్తా కథనంలోకి క్లిప్పింగ్స్ ఏర్పాటు చెయ్యడం, మరునాడు అంత్యక్రియలకు హాజరయిన అశేష జన వాహినిలో చిక్కుకుని మా బృందం విడిపోవడం, వాహనాలు నడిచే దారి లేక అయిదారు కిలోమీటర్లు నడక మొదలయినవన్నీ నిన్న మొన్న జరిగినట్లున్నాయి. ఈ రోజు ఆ మహానటుడి 14 వ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలు........
జననం : 1923 మే 28 వ తేదీన
స్వస్థలం : కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా నిమ్మకూరు గ్రామం.
తాత : పెదరామస్వామి
తల్లిదండ్రులు : వెంకట్రామమ్మ , లక్ష్మయ్య చౌదరి
పెద నాన్న/ పెంచిన తండ్రి : రామయ్య
తొలిగురువు : వల్లూరు సుబ్బారావు, నిడుమోలు
ప్రాధమిక/మాధ్యమిక విద్య : 1933 లో మకాం మార్పు. మునిసిపల్ స్కూలు, విజయవాడ లో చదువు. 1940 లో మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణత
కళాశాల విద్య : ఇంటర్మీడియట్ - ఎస్. ఆర్. ఆర్. కళాశాల
డిగ్రీ ( బి. ఏ. ఎకనామిక్స్ ) - ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరు
తొలి రంగస్థల అనుభవం : విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కళాశాలలో అప్పట్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ' రాచమల్లు దౌత్యం ' అనే నాటకం లో నాగమ్మ ( స్త్రీ పాత్ర ). దానికి ప్రథమ బహుమతి.
వివాహం : 1942 లో మేనమామ కుమార్తె బసవతారకం తో వివాహం.
తొలి నాటక సంస్థ : 1945 లో గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుతున్నపుడు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ( NAT ) స్థాపన.
తొలి పరిషత్తు నాటకం : 1946 లో జగ్గయ్య తో కలిసి విజయవాడ ఆంధ్ర కళా పరిషత్తు లో ప్రదర్శించిన ' చేసిన పాపం ' . ప్రథమ బహుమతి
తొలి సినిమా ఆఫర్ : ' కీలుగుఱ్ఱం ' చిత్రంలో. కానీ చదువు పూర్తి కాలేదని అంగీకరించలేదు. దాంతో ఆ అవకాశం అక్కినేనికి వెళ్ళింది.
తొలి మేకప్ టెస్ట్ : చదువు పూర్తయాక 1947 లో ఎల్వీ ప్రసాద్ చేయించారు
తొలి ఉద్యోగం : మద్రాసు సర్వీసు కమీషన్ పరీక్ష పాసయి సబ్ రిజిష్ట్రార్ గా కేవలం మూడు వారాలు ఉద్యోగం
తొలి సినిమా అవకాశం : 1949 లో బి.ఏ. సుబ్బారావు గారి ' పల్లెటూరి పిల్ల ' చిత్రంకోసం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మద్రాసు పయనం. 1950 లో విడుదలయింది.
ముందు విడుదలయిన చిత్రం : 1949 లోనే నిర్మించిన ' మనదేశం ' . ఈ చిత్రంలో పోలీసాఫీసరుగా చిన్న పాత్ర. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీయార్ పాత్రలో లీనమైపోయి నిజంగానే లాటీచార్జ్ చేసేసారని చెప్పుకుంటారు.
తొలి రాముడి పాత్ర : ' సంపూర్ణ రామాయణం ' తమిళ చిత్రం
తొలి రావణ పాత్ర : భూకైలాస్
తొలి డైమెండ్ జూబ్లీ చిత్రం : ' లవకుశ '
త్రిపాత్రాభినయ సాంఘిక చిత్రం : కులగౌరవం
త్రిపాత్రాభినయ పౌరాణిక చిత్రం : దాన వీర శూర కర్ణ
పంచ పాత్రాభినయ చిత్రం : శ్రీమద్విరాటపర్వం
సంక్షేమ కార్యక్రమాలు : 1952 లో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన కరువు బాధితులకు సహాయంకోసం తోటి నటీనటుల సహకారంతో లక్షన్నర రూపాయిల విరాళాల సేకరణ
1965 లో ఇండియా - పాకిస్తాన్ యుద్ధ నిధి కోసం పదిలక్షల రూపాయిల విరాళాల సేకరణ
1977 లో దివిసీమలో సంభవించిన పెను ఉప్పెన బాధితుల నిధికి పదిహేను లక్షల రూపాయిలు విరాళాల సేకరణ
రాజకీయరంగ ప్రవేశం : 1982 మార్చి 28 వ తేదీ
రాజకీయాధికారం : 1983 జనవరి 9 వ తేదీ
మరణం : 1996 జనవరి 18 వ తేదీ తెల్లవారుఝామున గం. 04 -00 - గం.04 -30 ల మధ్య
* ఈరోజు నందమూరి తారక రామారావు వర్థంతిసందర్భంగా నివాళులర్పిస్తూ... *
Vol. No. 01 Pub. No. 161
5 comments:
thanks for the memorable details of an immortal icon NTR
త్రిపాత్రాభినయం మొదట చేసింది కులగౌరవం - దా.వీ.శూ.కర్ణ కాదు.
నెనర్లు గుర్తు చేసినందుకు.
* హర్ష గారూ !
* వాసు గారూ !
ధన్యవాదాలు
* కె.కె. గారూ !
ముందుగా మీకు కృతజ్ఞతలు. పౌరాణిక పాత్రలు గురించి ప్రస్తావించే క్రమంలో ఈ పొరబాటు దొర్లింది. మీ సూచన మేరకు సవరించాను.
Post a Comment