Sunday, February 27, 2011

ఆజాద్

మెల్లగా స్వాతంత్ర్య సమరం మన దృష్టిలోంచి తొలగిపోతోంది. అంతః కలహాలు పెచ్చుమీరిన సమయంలో మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు సుమారు రెండు వందల సంవత్సరాలు  మన దేశాన్ని తమ వలస రాజ్యంగా చేసుకుని, ఇక్కడ వుండే సంపదను దోచుకుని, స్వేచ్చా స్వాతంత్ర్యాలు హరించి ప్రజల్ని బానిసలుగా మార్చేసారు. ఈ విషయం ఇప్పుడు పూర్తిగా చరిత్ర పుస్తకాలకే పరిమితమైంది. ఇప్పుడెవరికీ ఆ పుస్తకాలు చదివి ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్చకు కారణమైన ఆనాటి సంగ్రామాన్ని గురించి తెలుసుకునే ఓపిక గానీ, తీరిక గానీ వుండడం లేదు. విజ్ఞానం అందివ్వాల్సిన చదువు వృత్తి విద్యల పేరుతో డబ్బు సంపాదించే యంత్రాలను తయారుచేస్తూ వ్యాపారంగా మారిపోయింది. 
ఇంక స్వాతంత్ర్యాన్ని  సాధించడానికి జరిగిన సమరం గురించి, ఆ సమరం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల గురించి ఇప్పటితరానికి తెల్సేదేలా ? వాటినుంచి ఇప్పటి తరం స్పూర్తి పొందేదేలా ? ఎవరో కొందరు రాజకీయనాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చరిత్రను తమకనుకూలంగా మలచుకుని చెప్పే కట్టుకథలే నిజమైన చరిత్రని నమ్ముతున్నారు గానీ, వాస్తవ చరిత్ర పరిశీలించే పరిస్థితి ఈనాడు కనిపించడం లేదు. ఆ చరిత్రనుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు బంగారం చేసుకునే బదులు నరకం చేసుకుంటున్నారు. అందుకే.... అప్పుడు పరాయి దేశస్తులు దోచుకున్నారు.... ఇప్పుడు మనవాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు. 

 ఈ తరుణంలో అప్పటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కొన్ని ముఖ్య సందర్భాలలోనైనా గుర్తు చేసుకోవడమే కాక మన తర్వాత తరాలవారికి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

అతి చిన్నవయసులోనే స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకి అందరికీ ఆదర్శంగా నిలిచి ఆ ఆశయం కోసమే తమ ప్రాణాలను అర్పించిన మహనీయులు మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎంతోమంది వున్నారు. అహింస, శాంతి లతో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించవచ్చని గాంధీజీ లాంటి నాయకులు నమ్మితే,  బ్రిటిష్ వాళ్ళు మన ప్రజల్ని హింసకు గురి చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోవడం సరికాదని హింసకు హింసే సరైన జవాబని నమ్మిన వారూ వున్నారు. వారిలో సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ ప్రముఖులు. భగత్ సింగ్ కీ, ఆయన అనుయాయులైన సుఖదేవ్, రాజ్ గురు లకు గురుతుల్యుడైన మరో స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. 

మధ్యప్రదేశ్ లోని భావ్రా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వారణాసిలో సంస్కృతం అభ్యసించారు. గాంధీజీ బ్రిటిష్ వారిపై సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించే సమయానికి చంద్రశేఖర్ యువకుడు. ఆ ఉద్యమం అతన్ని ఆకర్షించి స్వాతంత్ర్య సమరంలోకి దూకేటట్లు చేసింది. 1919 అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి చలించిన చంద్రశేఖర్, భగత్ సింగ్ లాంటి వారు విప్లవబాట పట్టారు. అప్పటినుండి చంద్రశేఖర్ స్వేచ్చ అనే అర్థంలో తన పేరు చివర ' ఆజాద్ ' ను కలుపుకున్నారు. ఆ సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోను భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి తీరాలని ప్రతిజ్ఞ చేస్తూ తనను బ్రతికుండగా పోలీసులు పట్టుకోలేరని చాలంజ్ కూడా చేసారు. సామాన్య ప్రజలను అణిచివేస్తూ, స్వాతంత్ర్య యోధులను జైళ్లలో పెట్టి హింసించే బ్రిటిష్ అధికారులపైన తన సమర భేరిని మ్రోగించారు. కొంతమందిపై దాడి చేసి హతమార్చారు. భగత్ సింగ్ నీ, అతని అనుచరులకు కోవర్ట్ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా శిక్షణనిచ్చారు చంద్రశేఖర్ ఆజాద్. వారిని దేశభక్తితో బాటు తెగువ, సాహసం గల యోధులుగా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో భారతదేశం సోషలిస్ట్ దేశంగా ఎదగాలని కలలుగన్న చంద్రశేఖర్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసారు. 

  
ఆరోజు 1931 ఫిబ్రవరి 27 . ఒక నమ్మక ద్రోహి సమాచారంతో అలహాబాద్ లో అప్పటి అల్ఫ్రెడ్ పార్క్ లో వున్న చంద్రశేఖర్ ని బ్రిటిష్ పోలీసులు వలపన్ని చుట్టుముట్టారు. వారి దగ్గర చివరి బుల్లెట్ కూడా అయిపోయే వరకూ పోరాడుతూనే వున్నారు చంద్రశేఖర్ ఆజాద్. చివరికి నేలకొరగక తప్పలేదు. పాతిక సంవత్సరాల పిన్న వయసులోనే ఆ విప్లవ యోధుడు వీరమరణం పొందిన ఆ పార్కు పేరు తరవాత రోజుల్లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ గా మారింది.    


 ఈరోజు భారత స్వాతంత్ర్య సమర విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్భంగా స్మరించుకుంటూ......       
Vol. No. 02 Pub. No. 159

2 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

రావు గారు, మంచి post. నా చిన్నపుడు ఈనాడు పత్రికలో వచ్చిన అమర్ చిత్ర కథ వారి "చంద్రశేఖర్ ఆజాద్" గుర్తుకు వచ్చింది. చాలా అరుదైన photos కూడా పెట్టారు. వీలైతే వాటి source కూడా ప్రచురించగలరు. Thank you - విజయ్

SRRao said...

విజయవర్ధన్ గారూ !
ధన్యవాదాలు. ఆ ఫోటోలు నెట్ లోనివేనండీ ! గూగుల్ లో దొరికాయి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం