Sunday, January 31, 2010

భంగపాటు

మనలో కొంతమందికి తమకు అన్నీ తెలుసునని, సర్వజ్ఞులమనే భావన ఉంటుంది. నిజానికి కొంతమందిలోనే కాదు, చాలామందిలో ఈ స్థితి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. మనకు తెలిసిన విషయం స్వల్పమని దాన్ని మనలో ఉండే అహం గోరంతలు కొండంతలు చేస్తోందని అర్థం చేసుకోలేం ! ఆ అహమే మనని ఆడిస్తుంది. ఆ సమయంలో ఎదుటి వాళ్ళందరూ అమాయకులుగా, బుద్ధిహీనులుగా, చేతకాని వాళ్ళుగా కనిపిస్తారు. అయితే ఈ అహం ప్రభావానికి లొంగిపోయి రెచ్చిపోతే ఎప్పుడో ఒకప్పుడు భంగపాటు తప్పదు.

అదిగో..... అలాంటి భంగపాటే ప్రముఖ ఫ్రెంచ్ రచయిత బాల్ జాక్ విషయంలో జరిగింది. తను అందరిలాంటి వాడ్ని కాననీ, ఓ ప్రత్యేకత కలిగిన వ్యక్తినని ఆయనకు తన మీద తనకు విపరీతమైన నమ్మకం. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏమిటంటే ఎవరి దస్తూరీనైనా చూసి, అది రాసిన వ్యక్తి గుణగణాలేమిటో, వ్యక్తిత్వమేమిటో ఇట్టే చెప్పగలగడం. ఈ విషయం ప్రపంచమంతా గుర్తించాలని ఆయన తాపత్రయం. ఆయన తనకు తాను ఇచ్చుకున్న ప్రచారానికి ఈ విషయం మీద ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చేవారు.

అలా ఓసారి ఒకావిడ ఒక నోట్ బుక్ పట్టుకుని వచ్చింది. బాల్ జాక్ దాన్ని తీసుకు చూసాడు. అది బాగా నలిగి, కొంచెం చిరిగి, మాసి ఉంది. చూడగానే అది చాలాకాలంనాటిదని, ఒక చిన్నపిల్లవాడి నోట్ పుస్తకమని తెలుస్తోంది.

ఆ పుస్తకంలోని రాతను నిశితంగా పరిశీలించిన జాక్ ఆవిడ్ని అడిగాడు.
" ఇది మీ అబ్బాయి చిన్నప్పటిదా ? " అని.
ఆవిడ కాదంది.
" కాదుకదా ! అయితే ఈ రాతను బట్టి నేను గమనించిన విషయాలు దాచకుండా చెబుతాను, ఈ అబ్బాయి పరమ సోమరి అవుతాడు. తన జీవితకాలంలో కష్టపడి ఏ పనీ చెయ్యలేడు. దేనికీ పనికి రాకుండా తయారవుతాడు " అంటూ చెప్పుకుపోతుండగా ఆవిడ పగలబడి నవ్వసాగింది.

అదిచూసి తన మాటలు నమ్మడం లేదేమోననే అనుమానం వచ్చింది ఆయనకు." ఏమిటీ ? నేను చెప్పేది మీరు నమ్మటంలేదా ? నేను చెప్పేది నూటికి నూరుపాళ్ళు నిజం " అని దబాయించడానికి ప్రయత్నించాడు.

ఆవిడ కాసేపు నవ్వునాపి " మిస్టర్ జాక్ ! తొందరపడకండి. ఈ నోట్ బుక్ వేరెవరో అబ్బాయిది కాదు. మీదే ! మీ చిన్నప్పటిది !! ఒకప్పటి మీ టీచర్ గారి దగ్గర పాతపుస్తకాలు వెదుకుంటే ఇది కనబడింది. మీకిద్దామని తీసుకొచ్చాను " అని నవ్వు కొనసాగించింది. ఇక మన జాక్ గారి మొహం చూడాలి పాపం !!!

Vol. No. 01 Pub. No. 177

పౌరాణికాల స్క్రీన్ ప్లే ఎవరిది ?


మనదేశం లో చలన చిత్ర నిర్మాణం ప్రారంభమైన తొలినాళ్ళలో వచ్చిన చిత్రాలన్నీ పౌరాణికాలే ! ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు పౌరాణిక చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అంతే కాదు మన సినిమా కథలన్నీ అటు తిరిగీ ఇటు తిరిగీ పౌరాణిక కథల చుట్టూనే తిరుగుతూ ఉంటాయనేది సత్య దూరం కాదేమో ! అయితే ఈ కథలను ఎవరు రాసారు ? కథనాలను..... అదే ! స్క్రీన్ ప్లే లను ఎవరు రూపొందించారు ? ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు గారి మాటల్లో ......


" పురాణ కథలు కొందరు తీస్తూ దానికి స్క్రీన్ ప్లే ఫలానావారు రాసారని టైటిల్స్ లో వేస్తుంటారు. ఇది ఏం సబబు ? ఆ కథలు వాళ్ళ సృష్టా ? అసలు ' రామాయణం ' లోని ఏ భాగమైనా తీసుకోండి. స్క్రీన్ ప్లే అందులోనే వాల్మీకి మహాముని రాసారు. ఉదాహరణకు రామకథను గానం చెయ్యడానికి వచ్చిన లవకుశులు తన కుమారులని శ్రీరామునికి తెలియదు. ఆ బాలురకు ఆ శ్రీరాముడే తమ తండ్రిగారని తెలియదు. ఎంత డ్రామా ! మహాభారతం తీసుకోండి. కలర్ లోనే స్క్రీన్ ప్లే ఉంది. ఎలాగంటే రణరంగం లో కొన్నివేల శ్వేత అశ్వాలు, వాటి పక్కన కొన్నివేల నల్లగుర్రాలు, ఎదుట కొన్నివేల గోధుమ వన్నె తురంగాలు ఉన్నాయని నేత్ర పర్వమొనర్చేలా రాయబడి ఉంది చూసారా ! " అంటారు పింగళి గారు.

పురాణాల మీద పేటెంట్, కాపీ రైట్ హక్కులు ఎవరికీ లేకపోవడమే ఇలా యధేచ్చగా తమ పేర్లు వేసుకోవడానికి కారణమై ఉండొచ్చు.

Vol. No. 01 Pub. No. 176

Saturday, January 30, 2010

'మాయాబజార్' మీద ముళ్ళపూడి

ఈ రోజు రంగుల ' మాయాబజార్ ' చిత్రం విడుదలయింది.
ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు గతంలొ అప్పటి సినిమాల మీద సమీక్షలు రాసేవారు. అవి ఇప్పటి సమీక్షల్లాంటివి కావు. ఆయన రచనలలాగే వ్యంగ్యం, హాస్యం మేళవించి సునిశితమైన విమర్శతో కూడుకుని ఉండేవి.


' మాయాబజార్ ' చిత్రాన్ని సమీక్షిస్తూ ముళ్ళపూడి వారు
" మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది " అని రాసారు.
ఇలా రాయడానికి కారణం ' మాయాబజార్ ' చిత్రానికి సంభాషణలు మొదటి సగానికి తాపీ ధర్మారావు గారు, రెండో సగానికి ఆరుద్ర గారు రాసారు. అదీ సంగతి.


Vol. No. 01 Pub. No. 175

మహాత్ముడి స్మరణ

మహాత్మా గాంధీ మరణించి 62 సంవత్సరాలు పూర్తి అయింది. ఆయన ఆశలు, ఆశయాలు భారత జాతి ఉన్నతికి ఆయన చేసిన పోరాటం, దానికి ఆయన చూపిన మార్గం ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే పరిస్థితి నేడు పూర్తిగా నెలకొంది. దానికి తార్కాణమే మొన్ననే అమెరికా లోని ఒక జిల్లా పేరును ' గాంధీ జిల్లా ' గా మార్చడం.

ఒకప్పుడు గాంధీని అనుసరించడమే గొప్ప విషయం
మరిప్పుడు గాంధీయిజాన్ని విమర్శించడమే ప్రయోజకత్వం

గాంధిజీ ప్రభోదించిన సత్యం, అహింస, సర్వమానవ సమానత్వం ఇవన్నీ ఎవరైనా ఇప్పుడు మాట్లాడితే చేతకాని వారుగా జమగడుతున్నారు. కానీ ఆ నినాదాలే, ఆ మార్గాలే, ఆ అస్త్రాలే మన జాతిని పట్టి పీడించిన పరాయి పాలన నుంచి విముక్తి చేసాయి. వాటిలో ఉన్న శక్తికే ఈనాటికీ ప్రపంచం జోహార్లు పలుకుతోంది. భారతదేశం పేరు చెబితే ప్రపంచం మొత్తంలో వెంటనే గుర్తించే వ్యక్తి... కాదు శక్తి గాంధీజీ !

మరి మన దేశంలో ఆయన వారసులుగా మనమేం చేస్తున్నాం ! ఆయన ఆశయాలను, ఆయన పాటించిన సత్యాహింస మార్గాలను వదిలేసి ఆయన వ్యక్తిగత జీవితంలో తప్పులేం ఉన్నాయా అని రంద్రాన్వేషణ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాం ! కనీసం అమెరికా వాళ్ళు వప్పుకున్నాక నైనా మనం గాంధీ మార్గం అంటే ఏమిటీ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన గౌరవం దక్కుతుంది. లేదా రేపు ప్రపంచం మొత్తం మనల్ని చూసి నవ్వే రోజు వస్తుంది.

బాపు వర్థంతి సందర్భంగా మహాత్మునికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ...........................





Vol. No. 01 Pub. No. 174

Friday, January 29, 2010

తెలుగు పాటకు చిరునామా వేటూరి



తెలుగు పాటకు ఆయన చిరునామా
తెలుగు పాటే ఆయనకు చిరునామా

సంస్కృత భూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి
సమోసాలాంటి పాటగా మార్చి అందించినా

లలిత శృంగార భావాలను మనోహరంగా పేర్చి
అందమైన పాటగా మలిచి అలరించినా




మొరటు పదాల జానపద పలుకులను నేర్పుగా అల్లి
మసాలా కూర్చి సగటు ప్రేక్షకుడ్ని మెప్పించినా

జీ్వితంలోని బాధల్ని, విషాదాల్ని గాయకుల స్వరాల్లో నింపి
రాలిపోయే పువ్వుల్ని వర్ణించి ప్రేక్షక శ్రోతల గుండెలు పిండి ఏడిపించినా





అది
వేటూరికే చెల్లింది.

ఆయన పుట్టుకే కవి




ఆయన బీజం కవుల కుటుంబంలోనిది
అందుకే ఆయనకు కవిత్వం వెన్నతో పెట్టిన విద్య
అందుకే పాట ఆయనకు అలవోకగా పట్టుబడింది

ఆయన వృత్తి తొలుత పాత్రికేయుడు
అందుకే సమాజంలోని వైరుధ్యాలు తెలుసాయనకు
అందుకే ఆయన పాటలో అన్ని వైరుధ్యాలు ప్రతిబింబించాయి




సహజసిద్ధంగా వచ్చిన భావ జాలం, దానికి తోడైన పాండిత్యం
పూవుకు తావి అబ్బిన చందంగా భాసించాయి
మూడు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్నాయి

విశ్వనాథ, తిరుపతి వెంకటకవులు, సముద్రాల సీనియర్ లాంటి
మహామహుల శిష్యరికం మరింత వన్నె తెచ్చి
తెలుగు వాకిట సిరిమువ్వ అయి చిందేసింది




1936 లో పుట్టిన వేటూరి సుందరరామమూర్తి పేరు
వెండితెరకెక్కి సరిగ్గా 36 యేళ్ళవడం యాధృచ్చికం
దానికి గురువు గారి ' ఓ సీత కథ ' వేదిక అయింది

అక్కడనుంచి వేసిన ప్రతి అడుగూ ఒక మైలు రాయే
పలికించి ప్రతి పాటా అబాలగోపాలానికి వీనులవిందే
అందుకే ఆ పాట జాతీయ స్థాయిలో పరిమళించింది



ఆ కలానికి విశ్రాంతి లేదు,,.. ఉండకూడదు
మరిన్ని మధుర గీతాల్ని అందించాలి
మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

నేడు వేటూరి సుందరరామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలతో .........

Vol. No. 01 Pub. No. 173

Thursday, January 28, 2010

భేతాళ మాంత్రికుడి అస్తమయం



' చందమామ ' కు, తెలుగువారికి విడదీయరాని అనుబంధం. అంతగా తెలుగువారిని ప్రభావితం చేసిన పత్రిక ఇంకొకటి లేదేమో ! పేరుకి పిల్లల పత్రికయినా పెద్దల చేత కూడా విడవకుండా చదివించిన  ఏకైక పత్రిక ' చందమామ ' . ఆ రోజుల్లో ఆ పత్రికలో అందరూ ముందుగా చదివేది ' భేతాళ కథలు ' . అవెంత ప్రాచుర్యం పోందాయంటే వాటి సృష్టికర్తను గురించి కూడా పాఠకులెవరూ ఆలోచించకుండా అందులో చివర్న ఇచ్చే ప్రశ్నకోసమే ఎదురుచూసి జవాబుకై ఆలోచించేంత !  ఆయన కథలే కనిపించాయి గానీ వాటి వెనుకనున్న ఆయన కనిపించలేదు.

ఆ భేతాళ కథల్ని సృష్టించిన మాంత్రికుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం. చాలా సంవత్సరాల పాటు  అవిశ్రాంతంగా విక్రమార్కుణ్ణి, భేతాళుడ్నీ, వారితో కూడా పాఠకుల్నీ నడిపించిన ఆయన ఇంక పై లోకంలో వారిని అలరించడానికా అన్నట్లు  మనల్ని, మన లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడింక ఆయన మనకు కనిపించే అవకాశం లేదు. నిన్న అంటే బుధవారం ( 27 జనవరి 2010 ) న విజయవాడలో సుబ్రహ్మణ్యం గారు తనువు చాలించారు. తన జీవితకాలంలో ఎక్కువభాగం తెలుగు పాఠకుల్ని అలరించడానికే కృషిచేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పిస్తూ....................

  
Vol. No. 01 Pub. No. 172

Wednesday, January 27, 2010

మరో విషాద వార్త

ఈ రోజు ఉదయాన్నే తెలుగు చలనచిత్ర రంగంలో తండ్రిగా పేరు పొందిన గుమ్మడి గారి
మరణవార్త విని తేరుకోక ముందే మరో విషాద వార్త వినవలసి వచ్చింది.

మన బ్లాగ్లోకంలో సీనియర్ బ్లాగర్ 'కొత్తపాళీ' గా సుపరిచితులైన నారాయణస్వామి గారికి
మామగారైన శ్రీ M.V. సుబ్బారావు గారు
స్వర్గస్తులైనారని తెలియజేయడానికి విచారిస్తున్నాను.

నారాయణస్వామి గారికి , ఆయన శ్రీమతి సావిత్రి గారికి , వారి కుటుంబ సభ్యులకు
' శిరాకదంబం ' తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Vol. No. 01 Pub. No. 171

'సాత్వికాభినయసామ్రాట్' గుమ్మడి




మహానటుడు అనే మాట గుమ్మడి వెంకటేశ్వర రావు గారి విషయంలో సరైనదేమో ! ఒక తండ్రి, ఒక అన్న లాంటి ఎన్నో పాత్రలకు జీవం పోసిన మహానటుడు గుమ్మడి. ఆయన వేసినన్ని విలక్షణమైన పాత్రలు మరెవరు వెయ్యలేదేమో ! నటుడు ఏ పాత్రలోనైనా ఒదిగిపోవాలి తప్ప కేవలం కథానాయకుడిగానో, ప్రతినాయకుడిగానో మాత్రమే చెయ్యాలనుకోవడం సరికాదని నిరూపించారు. 'క్యారెక్టర్ ఆక్టర్' అనే పదానికి 'సహాయనటుడు' అని వాడుకలో ఉంది. కానీ అది సరైన పదం కాదేమో ! గుమ్మడికి సంబందించినంతవరకూ మాత్రం ఇది పూర్తిగా తప్పు. ఆయన క్యారెక్టర్ నటుడే కానీ సహాయ నటుడు మాత్రం కాదు. ఆ విషయాన్ని ఆయన ధరించిన అనేక పాత్రలు నిరూపిస్తాయి.

ఆయన కొన్ని చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు కూడా పోషించారు. అలాంటి ఒక పాత్ర ' నిజం (1980)' చిత్రంలోనిది. రావిశాస్త్రి గారి నాటకం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి నాకు గుర్తున్నంతవరకూ దేవదాసు కనకాల దర్శకులు. ( ఈ చిత్రం వివరాలు ఎక్కడా లభించడం లేదు. వీలైనంతవరకూ అవి సేకరించి అందిస్తాను. ) ఆ చిత్రం చూస్తున్నపుడు మనకు గుమ్మడిగారు కనబడరు. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే మహానటుడాయన.

మొదట్లో హీరో పాత్రలు రావడంలేదని కొంచెం బాధపడినా ' చిత్రం హిట్టయితే హీరో బ్రతుకుతాడు. ప్లాపయితే ఆ హీరో జోలికి ఎవరూ పోరు. హీరోగా స్టాండ్ అవ్వాలనుకోవడం రిస్క్ ' అన్న ప్రముఖ రచయిత గోపీచంద్ సలహా ననుసరించి వచ్చిన ప్రతి పాత్రనూ ఒప్పుకుని విలక్షణ నటుడిగా ఎదిగారు. సాత్వికతకు మారుపేరుగా నిలిచారు.

గత కొంతకాలంగా అస్వస్తులుగా ఉన్న గుమ్మడి నిన్న రాత్రి సుమారు గం. 11. 30 లకు స్వర్గస్తులయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తూ......

గుమ్మడి గారి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు చేసిన ఇంటర్వ్యూ చూడండి.


Vol. No. 01 Pub. No. 170

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవ కానుక


అమెరికా మనకు గణతంత్ర దినోత్సవ షష్టి పూర్తి సందర్భంగా ఒక ప్రత్యేకమైన కానుక అందించింది.
అదేమిటో ఇక్కడ చూడండి. స్పందించండి.


Vol. No. 01 Pub. No. 169

నవభారతనందనాన.........

" నవభారతనందనాన 
వలపు లొలుకుపువ్వుల్లారా !
తెలుగుతల్లివదనమ్మున 
విరిసినచిరునవ్వుల్లారా !
నవతావాదుల్లారా !
మానవతావాదుల్లారా !
నవచైతన్యం ఉరకలు వేసే 
యువతీయువకుల్లారా !
భారతయువతీయువకుల్లారా !
నవభారతనిర్మాతల్లారా ! "
......................................

మా గురువు గారు, కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు రచించిన దేశభక్తి గేయం అది. ఆయన అనేక లలితగీతాలు, దేశభక్తి గీతాలు రచించారు. అవి 1970-90 ప్రాంతాలలో విరివిగా ఆకాశవాణి కేంద్రాలలో వినపిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆకాశవాణి కేంద్రాలనుంచి పున: ప్రసారం అవుతూ ఉంటాయి. అప్పట్లో ఆకాశవాణి గుర్తింపు ఉన్న రచయిత. ఇవే కాక ఇంకా అనేక గ్రంథాలు రాసారు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

గణతంత్ర దినోత్సవం షష్టి పూర్తి చేసుకుంటోంది. ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్తి గేయాన్ని ఇక్కడ చూడండి .............



Vol. No. 01 Pub. No. 168

Sunday, January 24, 2010

చిలకమర్తి వారి చమత్కారం

చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు తమ రచనలలో చమత్కారాన్ని అందంగా పొదుగుతూ ఉంటారు. మచ్చుకి ఒకటి ....

ఆడిదం సూరకవి యొకనాడు తాటియాకుల మీద వ్రాయబడిన మహాభారతమును చేతబట్టుకుని నడిచిపోవుచుండగా నొక వెలమదొర వానిని చూసి
' అయ్యా ! ఈ వేళ వర్జ్యమెప్పుడు ' అని అడిగెను.
నేను కవిత్వము చెప్పుదును గాని పంచాంగము చెప్పను. అందుచేత నాకు తెలియదని సూరకవి ప్రత్యుత్తరమిచ్సెను.
' అంత పెద్ద పుస్తకము చదువుకోన్నవాడవు. నీకు పంచాంగము చెప్పుట తెలియదా ' అని ఆ వెలమ దొర కవిని పరిహసించి తన దారిని పోయెను.

మరునాడు ఆ వెలమ దొర తన చేతిలో పెద్ద కత్తి పట్టుకొని పోవుచుండగా సూరకవి వానిని సమీపించి ' అయ్యా ! నాకు క్షురకర్మ చేయగలవా ? ' అని అడిగెను.
వెలమదొర ఆ మాటలు విని ఆశ్చర్యపడి కోపముతో ' నేను మంగలి ననుకొంటివా ' అని పలికెను.
సూరకవి ఆ మాటలు విని ' కత్తి ఇంత పొడవుగా వున్నది. క్షురకర్మ చేయుటకు పనికిరాని దీని ప్రయోజనమేమి? ' అని పరిహసించి పోయెను.

Vol. No. 01 Pub. No. 167

అరవై వసంతాల ' జనగణమణ '

జనగణమణ అధినాయక జయహే
భారత భాగ్య విధాతా !
............................

మన జాతీయ గీతం
విశ్వకవి రవీంద్రుని కవితాఝరి
ఆసేతు హిమాచలం పరవశించి పాడుకునే చైతన్య గీతం
యావత్తు భారత దేశం జాతీయతా భావం నింపిన గీతం


1911 డిసెంబరు 27 న కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో వినిపించిన ఈ గీతం చివరిసారి స్వరపరచడానికి, ఆంగ్ల భాషలోకి అనువాదం చెయ్యడానికి 1918-19 ల మధ్య మన ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోని థియొసాఫికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్న ఐరిష్ కవి, తన మిత్రుడయిన జేమ్స్ హెచ్. కజిన్స్ ఆహ్వానం మేరకు అక్కడకు వచ్చి తుది మెరుగులు దిద్దారు.




ఈ గీతం 1911 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అయిదవ జార్జ్ చక్రవర్తిని పొగుడుతూ రాసినదని అప్పట్లోనే పత్రికల్లో దుమారం రేగింది. దానికి ఠాగూర్ జార్జ్ చక్రవర్తిని కీర్తించిన గీతం ఒక హిందీ కవి రాసిన గేయమని, జనగణమణ కాదని, పత్రికలు పొరబడ్డాయని అప్పట్లోనే వివరణ ఇచ్చారు.





జనగణమణ గీతం భారత జాతీయ గీతంగా అధికారికంగా 24 జనవరి 1950 న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ రోజు మన జాతీయ గీతం షష్టి పూర్తి జరుపుకుంటోంది. ఇంతకాలంగా మనలో జాతీయతా భావాన్ని నింపిన ఈ గీతాన్ని భావితరాలకు అందించడం అందరి కర్తవ్యం.
 


జనగణమణ  
అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసమయంలో 
జాతీయ స్పూర్తి గల భారతీయులందరికీ శుభాకాంక్షలు 


 Vol. No. 01 Pub. No. 166

Saturday, January 23, 2010

నేతాజీ - ఆంధ్రతో అనుబంధం

భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు నేతాజీగా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్. గాంధీజీది మితవాదం. అహింసామార్గం. బోస్ ది అతివాదం. హింసాయుత మార్గం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి.
ఏ పద్ధతిలో పని చేసినా మన దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులు వీరందరూ ! ఇలాంటి వారెందరి త్యాగఫలమో ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం.

నేతాజీ
ఆంధ్ర ప్రాంతంలో 1939 సెప్టెంబర్ నెలలో పర్యటించారు. సెప్టెంబర్ 3 వ తేదీన కాకినాడలో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహా సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి నాంది పలికిన రోజది. ఆనాడే హిట్లర్ పోలాండ్ పైన దాడి చేసాడు.

1940 జనవరి లో మరోసారి ఆంధ్రకు వచ్చారు సుభాష్ చంద్రబోస్. ఏలూరులో జరిగిన రాష్ట్ర రాజకీయ బాధితుల సభలో పాల్గొన్నారు. శ్రీయుతులు మద్దూరి అన్నపూర్ణయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు ప్రభృతులు కూడా ఆ సభలో పాల్గొన్నారు. తరువాత నేతాజీ రాజమండ్రి, మండపేట, రామచంద్రపురం సభలలో కూడా ప్రసంగించారు.

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని నమ్మి బ్రిటిష్ వారికి శత్రువులైన జర్మనీ, జపాన్ దేశాల సాయం తీసుకున్నాడు. ' ఆజాద్ హింద్ ఫౌజ్ ' అనే పేరుతో ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించాడు. ఆ సైన్యంలో ఆయనకు అండదండలుగా ఉన్న ఆంధ్రులను మనం ఒకసారి స్మరించుకుందాం !

కల్నల్ డి. ఎస్. రాజు - పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణ రాజు గారు ఐ.ఎన్.ఏ. ( ఇండియన్ నేషనల్ ఆర్మీ ) లో నేతాజీకి కుడిభుజంగా ఉండేవారు. విశాఖపట్నం మెడికల్ కాలేజ్ మొదటి బాచ్ విద్యార్థి అయిన రాజు గారు ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళారు. డాక్టర్ గా ప్రాక్టీసు చేస్తున్న ఆయన తొలుత బ్రిటిష్ ఆర్మీ లో చేరారు. నేతాజీకి వ్యక్తిగత వైద్యునిగా సేవలందించినపుడు ఆయనతో ఏర్పడిన అనుబంధం తర్వాత కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరడానికి కారణమైంది. అచిరకాలంలోనే అందులో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. నేతాజీ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి స్వాతంత్ర్యానంతరం విముక్తి పొంది తన స్వగ్రామంలో తిరిగి వైద్య సేవలందించడం కొనసాగించి 1973 లో మరణించారు.

మేజర్ అబిద్ హసన్ సఫ్రానీ : కుల - మత, పేద - ధనిక తేడాలు లేకుండా యావత్తు భారత దేశాన్ని ఒక్కటిగా నిలిపిన నినాదం ' జైహింద్ ' . దాని సృష్టి కర్త సఫ్రానీ. హైదరాబాద్ కు చెందిన ఈయన ఐ.ఎన్.ఏ. లో గాంధీ బ్రిగేడ్ కమాండర్ గా, మేజర్ గా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం అనేక దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు.

డాక్టర్ సురేష్ చంద్ర : హైదరాబాద్ కి చెందిన సురేష్ చంద్ర బెర్లిన్ నుంచి ప్రసారమయిన ఆజాద్ హింద్ రేడియోలో ప్రసంగాలు చేశారు. అంతేకాదు. నేతాజీకి ఎన్నో ప్రసంగాలను రాసిచ్చిన ఘనత ఆయనది.

ఎన్. భూషణం : మచిలీపట్టణం నుంచి రంగూన్ వెళ్లి స్థిరపడిన కుటుంబంలోని వ్యక్తి భూషణం. ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం చదువుతున్నపుడే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ కు ఆకర్షితుడై అందులో చేరిపోయారు. పోర్టబుల్ వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఆపరేటర్ గా పనిచేశారు.

పీతల పైడయ్య యాదవ్ : విశాఖపట్నం లోని శివాజీపాలెంలో జన్మించిన పైడయ్య మొదట కాంగ్రెస్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. తర్వాత బ్రిటిష్ ఆర్మీ లో చేరారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడి ఖైదీగా జపాన్లో
ఉన్న కాలంలో నేతాజీ ఐ.ఎన్.ఏ. పట్ల ఆకర్షితుడై అందులో చేరిపోయారు. నేతాజీ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీ పైడయ్య. తరువాత విశాఖలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లో పనిచేశారు.

బండి అడవయ్య యాదవ్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రాళ్ళ గూడేనికి చెందిన వారు. నేతాజీ విధానాలకు ఆకర్షితులై ఐ.ఎన్.ఏ. లో చేరారు. అందులో ఒక బాచ్ హెడ్ గా ఉంటూ మలయా, సింగపూర్, బర్మాలలో పనిచేసారు. స్వాతంత్ర్యాననంతరం పోలీసు శాఖలో పనిచేశారు.

లావిసేట్టి అప్పారావు : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా హుసేనీ పురం అప్పారావు గారి స్వస్థలం. క్విట్ ఇండియా ఉద్యమం రగిల్చిన స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో నేతాజీ పోరాటానికి ఆకర్షితుడయిన మరో వ్యక్తి అప్పారావు. ఇటలీ లో జైలు శిక్ష అనుభవించారు.

షేక్ ఖాదర్ మొహియుద్దీన్ : విజయనగరం జిల్లా వేపాడ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ మొహియుద్దీన్ టీ స్టాల్ నడుపుకుంటూ అతి సామాన్యమైన జీవనం కలిగిన వ్యక్తి. ఐ.ఎన్.ఏ. లో రైఫిల్ మాన్ గా పనిచేశారు.

డాక్టర్ పి. రంగాచార్యులు : మద్రాసు మెడికల్ కాలేజీ లో పట్టా పొందిన రంగాచార్యులు బ్రిటిష్ ఇండియా మెడికల్ సర్వీసెస్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత నేతాజీ స్పూర్తితో ఐ.ఎన్.ఏ. లో చేరారు. బర్మాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయారు.

వి.ఆర్.జార్జ్ : గుంటూరు జిల్లా రెంటచింతల దగ్గర నడికుడి గ్రామానికి చెందిన జార్జ్ నేతాజీ ప్రభావానికి లోనైనా వారే ! బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న ఈయన నేతాజీ పిలుపుతో 1942 లో ఐ.ఎన్.ఏ.లో చేరిపోయారు. ఆయన సేవలకు పతకాలు లభించినా చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

రోజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ............




Vol. No. 01 Pub. No. 165

Thursday, January 21, 2010

ఉక్కు మనిషి

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు.

తెలుగువారికి నిజాం చేతుల్నుంచి, రజాకార్ల దౌష్ట్యాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని మిలటరీ చర్యతో విడిపించిన నాయకుడు గుర్తుకొస్తాడు.

ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు, వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ విషయం నమ్ముతారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లోను, రాజకీయ నాయకుల్లోనూ విలువలు మిగిలున్న రోజుల్లో జరిగిన సంగతి కనుక ఇది నిజంగా నిజం

పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు.

పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో......

' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. '

ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా ?

Vol. No. 01 Pub. No. 164

Wednesday, January 20, 2010

చాయాగ్రహణానికి పట్టాభిషేకం

భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం ' దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం '.
భారత చలనచిత్ర పితామహుడు ఫాల్కే జ్ఞాపకార్థం నెలకొల్పిన ఆ పురస్కారాన్ని అందుకున్న తొలి చాయాగ్రాహకుడు, తెలుగు వ్యక్తి శ్రీ వి. కె. మూర్తి .

శుభ సందర్భంలో ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ వి. కె. మూర్తి గారికి శుభాభినందనలు తెలియజేద్దాం !





Vol. No. 01 Pub. No. 163

Tuesday, January 19, 2010

దత్తపది


మహాకవి శ్రీశ్రీ పద్మనాభం నిర్మించిన
' కథానాయిక
మొల్ల ' చిత్రంలో రాసిన ఒక పద్యం.

సందర్భం : శ్రీకృష్ణ దేవరాయల వారు తెనాలి రామకృష్ణుడిని కవయిత్రి మొల్ల కవితా పాటవాన్ని పరీక్షించడానికి పంపిస్తారు. రామకృష్ణుడు మొల్లకు ఒక సమస్య ఇస్తాడు.

సమస్య : ' అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు ' అనే నాలుగు మాటలుపయోగించి రామాయణ పరంగా వచ్చేటట్లు ఒక పద్యం చెప్పమంటాడు. మొల్ల చెప్పబోతోంటే ఇంకో షరతు విధిస్తాడు. ' ఆ పద్యంలో అప్పు అంటే ఋణం అని, నిప్పు అంటే అగ్ని అని, మెప్పు అంటే ప్రశంస అని, చెప్పు అంటే పాదరక్ష అని అర్థాలు రాకూడదు ' అని ఆ షరతు.
ఆ నియమాలు తప్పకుండా కవయిత్రి మొల్ల చెప్పిన కంద పద్యం .........

అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్

ఇంతవరకూ ' కథానాయిక మొల్ల ' చిత్రంలో ఉంటుంది. కానీ శ్రీశ్రీ గారు దాన్ని పొడిగిస్తూ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలో ఇలా అంటారు.

" చాలా తేలికగా ఒక కంద పద్యం చెప్పేశావు గాని ఇదే అర్థంతో ఒక ఉత్పలమాల చెప్పమ్మాయి " అని రామలింగడు అడిగాడనుకుందాము. అప్పుడామె చెప్పే పద్యం --

అప్పుడు ఖ్యాతి గన్న మిథిలాఖ్య పురంబున చేరనేగి, నే
నిప్పుడు చేయు వింత నెవరేనియుజీవిత కాలంమందు తా
మెప్పుడుగాని చూడరని యెంతయు సంతసమార, ధీరుడై
చెప్పుచు రాఘవుండు విరిచెన్ శివకార్ముక మద్భుతంబుగన్

Vol. No. 01 Pub. No. 162

Monday, January 18, 2010

నటరత్న- ముఖ్య జీవన ఘట్టాలు


1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరువెక్కింది. వెంటనే బయిలుదేరాను. స్టూడియో చేరుకోగానే మా బాస్ కె.ఎస్. రామారావుగారి నుంచి ఫోన్. విషయం చెప్పి చూడ్డానికి వెళ్ళాలి పెద్ద పూల దండ తెప్పించమని. పంజాగుట్ట, అమీర్ పేట ప్రాంతాల్లో గాలించినా ఎక్కడా దొరకలేదు. మా సిబ్బందిని నగరమంతా పంపించాను. ఉదయాన్నే కావలిసినన్ని పువ్వులు దొరికే హైదరాబాద్ నగరంలో ఆరోజు దండలు కాదుకదా విడిపువ్వులు కూడా దొరకలేదు. నగరంలోని పువ్వులన్నీ రామారావు గారి మరణ వార్త బయిటకు రాగానే ఆయనకు నివాళులర్పించడానికి తరలిపోయాయి. వెతగ్గా వెతగ్గా జాంబాగ్ లో రీత్ లు కొద్దిగా దొరికాయి. రామారావు గారి మీద తెలుగు ప్రజల అభిమానానికి ఇదొక నిదర్శనం.
ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు జీవన రంగస్థలం మీద తెర దించేసి ఇప్పటికి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆరోజు జెమిని టీవిలో రామారావు గారి మీద కార్యక్రమ రూపకల్పనలో సహకరించడం, ఎన్డీటీవి వారికి వార్తా కథనంలోకి క్లిప్పింగ్స్ ఏర్పాటు చెయ్యడం, మరునాడు అంత్యక్రియలకు హాజరయిన అశేష జన వాహినిలో చిక్కుకుని మా బృందం విడిపోవడం, వాహనాలు నడిచే దారి లేక అయిదారు కిలోమీటర్లు నడక మొదలయినవన్నీ నిన్న మొన్న జరిగినట్లున్నాయి. ఈ రోజు ఆ మహానటుడి 14 వ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలు........


జననం : 1923 మే 28 తేదీన
స్వస్థలం : కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా నిమ్మకూరు గ్రామం.
తాత : పెదరామస్వామి
తల్లిదండ్రులు : వెంకట్రామమ్మ , లక్ష్మయ్య చౌదరి
పెద నాన్న/ పెంచిన తండ్రి : రామయ్య
తొలిగురువు : వల్లూరు సుబ్బారావు, నిడుమోలు
ప్రాధమిక/మాధ్యమిక విద్య : 1933 లో మకాం మార్పు. మునిసిపల్ స్కూలు, విజయవాడ లో చదువు. 1940 లో మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణత

కళాశాల విద్య : ఇంటర్మీడియట్ - ఎస్. ఆర్. ఆర్. కళాశాల
డిగ్రీ ( బి. ఏ. ఎకనామిక్స్ ) - ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరు
తొలి రంగస్థల అనుభవం : విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కళాశాలలో అప్పట్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ' రాచమల్లు దౌత్యం ' అనే నాటకం లో నాగమ్మ ( స్త్రీ పాత్ర ). దానికి ప్రథమ బహుమతి.
వివాహం : 1942 లో మేనమామ కుమార్తె బసవతారకం తో వివాహం.
తొలి నాటక సంస్థ : 1945 లో గుంటూరు ఏ.సి. కాలేజీలో చదువుతున్నపుడు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ( NAT ) స్థాపన.
తొలి పరిషత్తు నాటకం : 1946 లో జగ్గయ్య తో కలిసి విజయవాడ ఆంధ్ర కళా పరిషత్తు లో ప్రదర్శించిన ' చేసిన పాపం ' . ప్రథమ బహుమతి
తొలి సినిమా ఆఫర్ : ' కీలుగుఱ్ఱం ' చిత్రంలో. కానీ చదువు పూర్తి కాలేదని అంగీకరించలేదు. దాంతో ఆ అవకాశం అక్కినేనికి వెళ్ళింది.
తొలి మేకప్ టెస్ట్ : చదువు పూర్తయాక 1947 లో ఎల్వీ ప్రసాద్ చేయించారు
తొలి ఉద్యోగం : మద్రాసు సర్వీసు కమీషన్ పరీక్ష పాసయి సబ్ రిజిష్ట్రార్ గా కేవలం మూడు వారాలు ఉద్యోగం
తొలి సినిమా అవకాశం : 1949 లో బి.ఏ. సుబ్బారావు గారి ' పల్లెటూరి పిల్ల ' చిత్రంకోసం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మద్రాసు పయనం. 1950 లో విడుదలయింది.

ముందు విడుదలయిన చిత్రం : 1949 లోనే నిర్మించిన ' మనదేశం ' . ఈ చిత్రంలో పోలీసాఫీసరుగా చిన్న పాత్ర. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీయార్ పాత్రలో లీనమైపోయి నిజంగానే లాటీచార్జ్ చేసేసారని చెప్పుకుంటారు.


తొలి పౌరాణిక పాత్ర : ' మాయా బజార్ ' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర
తొలి రాముడి పాత్ర : ' సంపూర్ణ రామాయణం ' తమిళ చిత్రం
తొలి రావణ పాత్ర : భూకైలాస్
తొలి డైమెండ్ జూబ్లీ చిత్రం : ' లవకుశ '
త్రిపాత్రాభినయ సాంఘిక చిత్రం : కులగౌరవం
త్రిపాత్రాభినయ పౌరాణిక చిత్రం : దాన వీర శూర కర్ణ
పంచ పాత్రాభినయ చిత్రం : శ్రీమద్విరాటపర్వం


సంక్షేమ కార్యక్రమాలు : 1952 లో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన కరువు బాధితులకు సహాయంకోసం తోటి నటీనటుల సహకారంతో లక్షన్నర రూపాయిల విరాళాల సేకరణ

1965 లో ఇండియా - పాకిస్తాన్ యుద్ధ నిధి కోసం పదిలక్షల రూపాయిల విరాళాల సేకరణ

1977 లో దివిసీమలో సంభవించిన పెను ఉప్పెన బాధితుల నిధికి పదిహేను లక్షల రూపాయిలు విరాళాల సేకరణ

రాజకీయరంగ ప్రవేశం : 1982 మార్చి 28 వ తేదీ
రాజకీయాధికారం : 1983 జనవరి 9 వ తేదీ








మరణం : 1996 జనవరి 18 వ తేదీ తెల్లవారుఝామున గం. 04 -00 - గం.04 -30 ల మధ్య





* ఈరోజు నందమూరి తారక రామారావు వర్థంతిసందర్భంగా నివాళులర్పిస్తూ... *

Vol. No. 01 Pub. No. 161

Sunday, January 17, 2010

తెలుగు చిత్ర రంగ పితామహుడు



ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ మూలాలు మచిలీపట్నం లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎలాగంటే తెలుగు చిత్రసీమ వేళ్ళూనుకోవడానికి బాధ్యత తీసుకున్న తొలి వ్యక్తిగా చెప్పుకోదగ్గ మహనీయుడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన స్వస్థలం మచిలీపట్నం.

అప్పటివరకూ బొంబాయి, కలకత్తా వగైరా ప్రదేశాలకు వెళ్లి చిత్రసీమలో వివిధ విభాగాలలో పనిచేసిన వారేగానీ, చిత్రాలు నిర్మించే ధైర్యం చేసినవారు దాదాపుగా లేరనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తెలుగు చిత్రసీమ ఆవిర్భావానికి కృషి చేసిన వ్యక్తి వెంకయ్య.

మచిలీపట్నానికి చెందిన సుబేదారు రఘుపతి అప్పయ్య నాయుడు రెండవ కుమారుడు వెంకయ్య. ఈయనకు చిన్నప్పట్నుంచీ చదువు మీదకంటే కళలంటే ఆసక్తి ఎక్కువ. రాజా రవి వర్మ చిత్రాలన్నా, కొండపల్లి బొమ్మలన్నా ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తే ఆయన్ని చిత్రకారుణ్ణి, శిల్పినీ చేసాయి.

స్థానికంగా ఉండిపోతే ఆయన కళ వెలుగు చూడదని భావించిన అప్పయ్య నాయుడు గారు వెంకయ్య గారిని 1886 లో మద్రాసు పంపారు. అక్కడ మౌంట్ రోడ్డులో ఒక చిన్న ఇంట్లో నివాసముంటూ కళాకేంద్రం ప్రారంభించారు. అచిరకాలంలోనే అఖండ ఖ్యాతి గడించారు. అటు తూర్పునుంచి దక్షిణం వరకూ వున్నరాజ సంస్థానాలన్నీ
వెంకయ్యగారిని ప్రశంసలతో ముంచెత్తాయి. బ్రిటిష్ క్రింది స్థాయి అధికారినుండి గవర్నర్ వరకూ ఆయన్ని మెచ్చుకోన్నవారే !


వెంకయ్య గారు దీంతో తృప్తి పడక ఛాయాచిత్ర కళను అభ్యసించారు. అందులో ప్రయోగాలు కూడా చేశారు.

ఆ సమయంలోనే వార్తాపత్రికలలో వచ్చిన ఒక సమాచారం ఆయన్ని విశేషంగా ఆకట్టుకుంది. అది ' క్రోనో మెగా ఫోన్ ' అనే సినిమాటోగ్రాఫ్ యంత్రం కనుగోనబడిందని, దీంతో చిత్రం ప్రదర్శించేటపుడు రికార్డెడ్ డిస్క్ సాయంతో సంగీతం, ఇతర శబ్దాలు వెలువడతాయని ఆ సమాచార సారాంశం .


....... దీని సృష్టికర్తలైన లండన్ కి చెందిన గౌమాంట్ కంపెనీ బకింగ్ హాం ప్యాలస్ లో అయిదవ జార్జ్ చక్రవర్తి, రాణీ మేరీ ల సమక్షంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రదర్శన విజయవంతమైందని కూడా ఆ సమాచారంలో ఉంది.

వెంకయ్య గారు వెంటనే మదరాసులోని జాన్ డికెన్ సన్ అండ్ కంపెనీ వారి ద్వారా ఆ యంత్రాన్ని రు. 30,000 /- లకు కొన్నారు. దీనికోసం ఆయన తన ఫోటో స్టూడియోను తాకట్టు పెట్టారు.

'క్రోనో మెగా ఫోన్ ' తో మదరాసులో తొలి చిత్ర ప్రదర్శన విక్టోరియా పబ్లిక్ హాలులో ఏర్పాటు చేశారు. చెప్పుకోదగ్గ ఫలితం లేకపోయినా తర్వాత ప్రదర్శనలకు ఆదరణ పెరగసాగింది. ఇందులో పన్నెండు లఘుచిత్రాలు ప్రదర్శించడం జరిగింది.
1910 లో ఎస్ ప్లనేడ్ లో ఒక టెంట్ హాలు ఏర్పాటు చేసి ప్రదర్శనలిచ్చేవారు. ఇప్పుడక్కడ రాజా అన్నామలై హాలు ఉంది. తర్వాత ఆ టెంట్ తో బెంగుళూరు, ఆంధ్రలోని కొన్ని ముఖ్య పట్టణాలతో బాటు సిలోన్ ( శ్రీలంక ), బర్మా లాంటి ప్రదేశాలకు వెళ్లి ప్రదర్శనలిచ్చారు.

1911 లో మదరాసు నగరంలో మొదటి సినిమా థియేటర్ అయిన గెయిటీ టాకీస్ రఘుపతి వెంకయ్య నిర్మించారు. ఆదేకాకుండా మింట్ స్ట్రీట్ లో క్రౌన్ థియేటర్, పరశువాక్కం లో గ్లోబ్ థియేటర్ ( తర్వాత కాలం లో ' రాక్సీ ' ) నిర్మించారు. ప్రసిద్ధ యూనివర్శల్ పిక్చర్స్ వారి లఘు చిత్రాలు, మూకీ చిత్రాలు ఆ థియేటర్లో ప్రదర్శించేవారు.

1913 లో వెంకయ్య గారు ' స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ కంపెనీ ' అనే కంపెనీని స్థాపించి గ్లోబ్ థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో ఒక గ్లాసు స్టూడియో నిర్మించారు. ఆ రోజుల్లో విద్యుత్ సదుపాయం సరిగా లేకపోవడంతో సూర్యరశ్మి ఆధారంగా చిత్ర నిర్మాణం చేసేవారు.

వెంకయ్య గారి పెద్దకొడుకు ప్రకాష్ మొదట ఇంగ్లాండ్, జర్మనీ దేశాలకు వెళ్లి సినిమా సాంకేతికాంశాలలో శిక్షణ పొంది హాలీవుడ్ చేరుకున్నారు. అక్కడ సిసిల్ బి.డి. మిల్లీ, డి. డబ్ల్యు. గ్రిఫిత్ లాంటి ప్రఖ్యాత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసి మంచి సినిమా జ్ఞానాన్ని సంపాదించారు. అక్కడనుంచి వచ్చేటపుడు విలియంసన్ సైలెంట్ కెమెరాతో తిరిగివచ్చారు.

ఆర్.ఎస్. ప్రకాష్ సిసిల్ బి.డి. మిల్లీ దగ్గర ' టెన్ కమాండ్మెంట్స్ ' చిత్రానికి సహాయకునిగా పనిచేస్తున్నపుడు జరిగిన ఒక సంఘటన.

ఒకరోజు షూటింగ్ జరుగుతోంది. అది క్లోజ్ రేంజ్ షాట్. ఆ షూటింగ్ లో పాల్గొన్న పాత్రదారులందరూ శరీరంపై భాగంలో ఆచ్చాదన యేదీ లేకుండా కెమెరా ముందునుండి నడిచి వెడుతున్నారు. హటాత్తుగా ప్రకాష్ గారు ' కట్ ' చెప్పారు. మిల్లీకి చాలా కోపం వచ్చింది. ఎందుకు కట్ చెప్పావని గద్దించారు. దానికి ఆయన
" ఇది బైబిల్ కాలం నాటి కథ. కథాకాలం నాటికి వాక్సినేషన్లు లేవు. కెమెరా ముందు పోతున్న ఒక నటుడి చేతి మీద వాక్సినేషన్ గుర్తు స్పష్టంగా కనబడుతోంది. అందుకే కట్ చెప్పాను " అన్నారు.
ఆయన సునిశిత పరిశీలనకు సంతోషించి మిల్లీ ఆయన్ని తన ప్రథాన సహాయకునిగా తీసుకున్నాడు.

తండ్రీ కొడుకులిద్దరూ తమ గ్లాస్ స్టూడియోలో ' గజేంద్ర మోక్షం ' . మత్స్యావతారం ' , 'నందనార్ ' , భీష్మ ప్రతిజ్ఞ ' మొదలైన చిత్రాలు నిర్మించారు.

అప్పట్లో తెలుగు, తమిళ స్త్రీలు సినిమాల్లో నటించడానికి ముందుకు రాకపోవడం చేత ఆంగ్లో ఇండియన్ స్త్రీల చేత ఆ పాత్రలు ధరింపజేసారు.

కెమెరాలో లెన్స్ లు పనిచెయ్యక పోవడం వలన ప్రకాష్ గారు తీసిన ' మీనాక్షి కళ్యాణం ' చిత్రం పాడయిపోయి వారిని ఆర్థికంగా కృంగదీసింది. ఫలితంగా వెంకయ్య గారి ఆస్థులతో బాటు గ్లాసు స్టూడియో కూడా చేజారి పోయింది. తర్వాత కాలంలో ప్రకాష్ గారు మిత్రులతో కలిసి తీసిన కొన్ని చిత్రాలు కూడా వారిని ఆదుకోలేక పోయాయి. తెలుగు వారికి చిత్ర పరిశ్రమనందించిన వెంకయ్య గారి చివరి దశ ఇబ్బందిగానే గడిచింది. చివరకు ఆయన 1941 లో స్వర్గస్థులయ్యారు.


* ఈ రోజు హైదరాబాద్ ఫిలిం నగర్ లో రఘుపతి వెంకయ్య గారి విగ్రహావిష్కరణ సందర్భంగా.... *





Vol. No. 01 Pub. No. 160

Saturday, January 16, 2010

ధుమాలమ్మ ఓఘాయిత్యం

నేను : ఆవిడ నూతులో పడాలని అదుగో ఇదుగో అని ఆర్నేల్లనుంచి పట్టుట. వెనుక వీళ్ళింట్లో నుయ్యి పడడానికి ఎంతమాత్రం వీలైంది కాకపోబట్టి అది పూడిపించేసి, ఆవిడ ఇప్పుడున్న నుయ్యి దింపించిందని పుకారు. నుయ్యి ఇరుకైపోయి మనిషి ప్రాణాలు మధ్యదార్లోనే పోతే, జల మరణ పుణ్యం ప్రాప్తించదని ఆవిడ మతం.


అతను : వెనకటికి పూర్వసువాసిని తన ఆడ పడుచు మీద తట్టుగా లేసుగోచ్చి తమరి దొడ్లో ఉన్న వరల నూతిలో దూకపోయి పైనే చిక్కడి రుకుంది, ఒట్టి పొడుం బిరడాలాగ. అప్పుడు, ఎండు కొబ్బరి కాయ పెంకు బద్దలు కొట్టినట్టు పై వరలన్నీ బద్దలు కొట్టి ఆవిణ్ణి విడిపించారట.


నేను : వెనుక, ఈవిడ చలి అని కొన్నాళ్ళూ, ట్టుబండలని కొన్నాళ్ళూ, కాలు బెణికిందని కొంతకాలం, మొగుడు ళ్లో లేడని కొన్నిరోజులూ జాప్యం చేసిందటగానీ, మధ్య చాలామంది పరిచయులతో రూడిగా పడతానని చేబుతోందట. పైగా, ఎక్కడా చెప్పద్దని ప్రతివాళ్ళచేతా కేటాయింపుగా చేతులో చెయ్యి వేయించుగుని, ఊరందరితోనూ తనే చెప్పిందట.


అతను : అంతమంది పెద్దల దగ్గిర తనే చేసిన శపథం తను నిలబెట్టుగో లేకపోతే, మళ్ళీవెళ్లి వాళ్ళమొహం ఎల్లా చూడడం అని ఆవిడ భయం అయి ఉంటుంది. అదీ గాక, వాళ్ళంతా తనని ఎంతమాత్రం స్త్రీత్వం గానీ, మాట నిజాయితీ గాని లేని వ్యక్తి కిందగట్టి తేలిక చేస్తారని ఆవిడ సంకల్పం బహుశా.

నేను : ఏమో ! ఆవిడ ఎప్పుడో ఓఘాయిత్యం చేస్తుందనుకుంటాను మామా

అతను : నే అల్లా అనుకోను. ఆయన అల్లా వెనక్కి లాగుతున్నాకొద్దీ ఆవిడ అల్లా ముందుకి సాగుతూంటుంది. లాగుడు లేని సాగుడు ఉండదు. తెగసాగుడు అంతకన్నా ఉండదు. కొందరు దెబ్బలాటల్లో మధ్యవర్తులు ఆపు చేస్తూన్నకొద్దీ, ఎదర పార్టీ మీద ఎగురుతుంటారు. అవతల్నించి తగిలే దెబ్బలు ఎల్లానూ ఉండవని వాళ్లకి తెలుసును గనుక, అయ్యా తీర్చిన కొద్దీ అములు ఎక్కువ !

నేను : నిజమేస్మీ. కొందరు రోగులు ఇంట్లో ఉరుకోమనే వాళ్ళు ఉంటున్న కొద్దీ మూలుగు అధికం చేస్తుంటారు. అంచేత, ఆవిణ్ణి ఎవరేనా నూతులోకి గెంటాలిగాని, ఆవిడ ఉరకదు, నాదీ పూచీ.

ఒక సగటు మధ్య తరగతి గృహిణి తన భర్త బాధ్యతా పట్టకుండా రికామీగా తిరుగుతూంటే భరించలేక తన కోపాన్నీ, ఆక్రోశాన్నీ వెళ్లగక్కే సందర్భమది. ఆవిడ పేరు ధుమాలమ్మ. ఆవిడ భర్త పేరు సరప్ప. ఇద్దరికీ ఒక్క నిముషం పడదు. వాళ్ళింట్లో నిత్యాగ్నిహోత్రమే !

అందుకే ఆవిడ ఓసారి నిజంగానే నూతిలోకి ఉరికి భర్తను తిడుతున్నపుడు ఆయనంటాడు....

' నువ్వు నీళ్ళలో మండే జ్యోతివే ! కానీ మొగుణ్ణి తిడుతున్నావ్, అనుభవిస్తావ్ లే ' అని.

అప్పుడావిడ ' అయ్యా వింటున్నారా ! మొగుడయేది, వారయేది, వీరయేది, నాది ఇంకోరి చేత మాట పడే ఘటం కాదు. మరేం చెప్పద్దూ ! మా వంశం మహా అభిమానం గల వంశం. అందులో నాకు మహా రోషం. మంచికి మంచిదాన్నేగానీ, ఆజ్ఞలు అధికారాలు నా దగ్గర సాగవ్ ' అని ఖరాఖండీగా చెప్పేస్తుంది.

భర్తతో ఆవిడెంత విసిగిపోయిందో అర్థమయింది కదా ! భర్త మీద కోపం వచ్చినపుడల్లా ఆవిడ ఉపయోగించే ఆయుధం ఆత్మహత్య. అది కూడా నూతిలో దూకడం. విధంగా భర్తని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యగలుగుతున్నానని ఆవిడ భావన.

కానీ మానవుడు చలించడు. అందుకే ఆవిడ నూతిలో దూకినపుడు ఆవిణ్ణి కాపాడడానికి ప్రయత్నిస్తున్న వారితో తాపీగా

' నిచ్చెన వెయ్యండి. మహా చక్కగా వస్తుందీ పెళ్లికూతుర్లాగా ! ' అంటాడు.

దాంతో ఆవిడ కోపం నసాళానికి అంటింది. చెడామడా తిట్టి పోసింది. చివరకు పెంపుడు కూతురు బాధ చూడలేక ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంటుంది.

ఆవిణ్ణి రక్షించడానికి నూతిలోకి దిగినతను ' ధుమాలమ్మ గారూ ! మీకు దణ్ణం. మీ సాటి ఏలోకంలోనూ లేరు. నే బాఘా ఎరుగుదును. దయచేసి నిచ్చెన ఎక్కండి ' అని బ్రతిమలాడ్తాడు.

కొంచెం బెట్టు చేస్తూ ' మీరంతగా పట్టుబడితే నేను ఏం జెప్పనూ ! అల్లాగే ! నిచ్చెన మెట్టు ఘట్టిదేనా నన్నూ, నిచ్చేన్నీ కూడా ఈడవాలేమో, తాడు కాస్త జమిలిగా ఉండేది తేకపోయారూ ! ' అంటుంది.

ఆయనకు ఒళ్ళుమండి ఆవిడ నూతిలోంచి బయిటకు వచ్చేదాకా ఊరుకుని ' ఇంత తాపత్రయంగల ఘటానివి ఎందుకు పడాలమ్మా అసలూ ' అంటాడు.

మొత్తానికి ఎలాగయితే అన్ని ఏళ్ళ ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం అర్థంతరంగా ముగుస్తుంది. భర్తను బెదిరించడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా నిజంగా అయితే ఆవిడ ఎప్పుడూ దూకలేదు.

ప్రతీసారి ఆవిడ దూకుతానని నూతి దగ్గరకు వెళ్ళడం, ఒక ప్రక్క భర్త, మరో ప్రక్క పెంపుడు కూతురు పట్టుకుని బ్రతిమాలి తీసుకు రావడం మామూలయిపోయింది. మరి ఇప్పుడు ఆవిడకి నూతిలో దూకేసేం ధైర్యం ఎలా వచ్చింది ?

ఎలాగంటే ...................

ఆరోజు కూడా ఆవిడ నూతిగోడ మీదనుంచి లోపలకు వంగుని యధావిధిగా తనను పట్టుకున్న భర్త, కూతురు చేతుల్లోంచి పెనుగులాడుతూ హంగామా సృష్టిస్తోంది.

భర్తకు విసుగొచ్చి " పోన్లేవే, ఇంతకంటే నన్ను చావమన్నవా ఏమిటీ " అంటూ చెయ్యి వదిలెయ్యడంతో పట్టుదప్పి నూతిలో పడిపోయింది.

అదీ ' ధుమాలమ్మ ఓఘాయిత్యం ' కథ.

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారు రాసిన కథలో అడుగడుగునా ఆయన మార్క్ హాస్యం తొణికిసలాడుతుంది. మధ్య తరగతి మనస్తత్వాలకు హాస్యపు తళుకులు అద్ది కథ ఇది. హద్దులు దాటని సున్నితమైన హాస్యం పాఠకుల్నిగిలిగింతలు పెడుతుంది.

భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, ఉద్రేకాలకు లోను కావడం, ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త విషయం కాదు. కానీ ఎంత ఆవేశపడినా, ఎదుటి వారిని భయపెట్టడానికి ఇటువంటి హంగామాలను సృష్టించినా వారికి సాధారణంగా సంసార ఝంఝాటం, పిల్లల బాధ్యతలు అడ్డు పడతాయి. కానీ ప్రయత్నాలు శృతి మించితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.

విషయాన్ని సీరియస్ గా పాఠంలా కాకుండా ఆహ్లాదకరమైన శైలిలో రాసారు భమిడిపాటి కామేశ్వర రావు గారు.

Vol. No. 01 Pub. No. 159
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం