Sunday, October 18, 2009

విశ్వనాథ వారి చెణుకులు


ఈ రోజు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్థంతి. ఆయన సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాఖ్యల్లో మాత్రం హాస్యం తొంగిచూసేది. ఆయనకు నివాళులర్పిస్తూ....
* విశ్వనాథ వారి ' శివార్పణం ' పద్యకావ్యం ఆవిష్కరణ సభ జరుగుతోంది. ఆయన్ని గుమ్మడి గారుసత్కరిస్తారని ప్రకటించారు. అలాగే గుమ్మడి గారు సత్కరించారు. దానికి విశ్వనాథ వారు " గుమ్మడి అంటే ఈయనా ? నేనింకా గుమ్మడి సత్కారమంటే గుమ్మడికాయనిస్తారేమో అనుకున్నాను " అన్నారట.

* విశ్వనాథ వారు బందరులో ఉండే రోజుల్లో ఆయన మిత్రుడొకాయన ఊరు వచ్చి " మీ ఊరి నిండా గాడిదలేఉన్నట్లున్నాయే ! " అన్నాడు వ్యంగ్యంగా. దానికి విశ్వనాథ వారు " అవును. నిజమే ! ఉన్నవి చాలవన్నట్లుఅప్పుడప్పుడు పొరుగూరి గాడిదలు కూడా వచ్చిపోతుంటాయి " అన్నారు.

* ఒక చిత్ర నిర్మాతకు విశ్వనాథ వారి ' వేయిపడగలు ' ని సినిమా గా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన్ని కలిసాడు. విశ్వనాథ వారు ఇరవై వేలు పారితోషికం అడిగారు. దాంతో ఆ నిర్మాతకు మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో తోచక " అంత ఇచ్చుకోలేను. రెండు వేలు ఇచ్చుకుంటాను. ఓ వంద పడగల్ని ఇప్పించండి " అన్నాడు. ఈసారి విస్తుపోవడం విశ్వనాథ వారి వంతయింది.

*
విశ్వనాథ వారు ఒక పని మీద సచివాలయం చుట్టూ చాలాసార్లు తిరిగి విసుగెత్తి, అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారిని కలిసి విషయం చెప్పారు. ఆయన " అదొక పెద్ద అడివి. దానిలో పని జరిపించుకోవడం అంత సులభం కాదు" అన్నారు. " మీరు ఆంద్ర కేసరి కదా ! ఆ అడవి మీకొక లెఖ్ఖా ? అందుకే మీ దగ్గరకు వచ్చింది " అన్నారు విశ్వనాథ వారు ప్రకాశం గారిని ఇరుకునబెడుతూ.

7 comments:

జయ said...

బాగున్నాయండి, మీ చెణుకులు.

SRRao said...

జయ గారూ !
ఆ చెణుకులు నావి కావండి. విశ్వనాథ వారివి. ఏమైనా మీకు నచ్చినందుకు సంతోషం.

భాస్కర రామిరెడ్డి said...

చణుకులు చర్నకోలలు భలే వున్నాయండి. సున్నిత హాస్యం.

చిలమకూరు విజయమోహన్ said...

రెండవది బాగా నవ్వించింది.
word verification తీసివేస్తే బాగుంటుందేమో!

SRRao said...

భా.రా.రె.గారూ !
ధన్యవాదాలు.
విజయమోహన్ గారూ !
సంతోషం. word verification తీసివేస్తే బాగుంటుందన్నారు. అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా !

భావన said...

బాగున్నాయి ఆయన చెణుకులు మీరు గుర్తు చేయటం.. రెండూనూ..

SRRao said...

భావన గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం