Wednesday, January 27, 2010

'సాత్వికాభినయసామ్రాట్' గుమ్మడి
మహానటుడు అనే మాట గుమ్మడి వెంకటేశ్వర రావు గారి విషయంలో సరైనదేమో ! ఒక తండ్రి, ఒక అన్న లాంటి ఎన్నో పాత్రలకు జీవం పోసిన మహానటుడు గుమ్మడి. ఆయన వేసినన్ని విలక్షణమైన పాత్రలు మరెవరు వెయ్యలేదేమో ! నటుడు ఏ పాత్రలోనైనా ఒదిగిపోవాలి తప్ప కేవలం కథానాయకుడిగానో, ప్రతినాయకుడిగానో మాత్రమే చెయ్యాలనుకోవడం సరికాదని నిరూపించారు. 'క్యారెక్టర్ ఆక్టర్' అనే పదానికి 'సహాయనటుడు' అని వాడుకలో ఉంది. కానీ అది సరైన పదం కాదేమో ! గుమ్మడికి సంబందించినంతవరకూ మాత్రం ఇది పూర్తిగా తప్పు. ఆయన క్యారెక్టర్ నటుడే కానీ సహాయ నటుడు మాత్రం కాదు. ఆ విషయాన్ని ఆయన ధరించిన అనేక పాత్రలు నిరూపిస్తాయి.

ఆయన కొన్ని చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు కూడా పోషించారు. అలాంటి ఒక పాత్ర ' నిజం (1980)' చిత్రంలోనిది. రావిశాస్త్రి గారి నాటకం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి నాకు గుర్తున్నంతవరకూ దేవదాసు కనకాల దర్శకులు. ( ఈ చిత్రం వివరాలు ఎక్కడా లభించడం లేదు. వీలైనంతవరకూ అవి సేకరించి అందిస్తాను. ) ఆ చిత్రం చూస్తున్నపుడు మనకు గుమ్మడిగారు కనబడరు. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే మహానటుడాయన.

మొదట్లో హీరో పాత్రలు రావడంలేదని కొంచెం బాధపడినా ' చిత్రం హిట్టయితే హీరో బ్రతుకుతాడు. ప్లాపయితే ఆ హీరో జోలికి ఎవరూ పోరు. హీరోగా స్టాండ్ అవ్వాలనుకోవడం రిస్క్ ' అన్న ప్రముఖ రచయిత గోపీచంద్ సలహా ననుసరించి వచ్చిన ప్రతి పాత్రనూ ఒప్పుకుని విలక్షణ నటుడిగా ఎదిగారు. సాత్వికతకు మారుపేరుగా నిలిచారు.

గత కొంతకాలంగా అస్వస్తులుగా ఉన్న గుమ్మడి నిన్న రాత్రి సుమారు గం. 11. 30 లకు స్వర్గస్తులయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తూ......

గుమ్మడి గారి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు చేసిన ఇంటర్వ్యూ చూడండి.


Vol. No. 01 Pub. No. 170

7 comments:

జయ said...

గుమ్మడి గారు లేరు అంటే మాత్రం చాలా బాధగా ఉందండి. ఆ మధ్య ఎప్పుడో చదివాను. మాయా బజార్ లో మొత్తం 38 మందిమి నటిస్తే ఇప్పటికి ముగ్గురమే మిగిలిఉన్నాము అని అన్నారు. ఇప్పుడు ఇంక మిగిలింది ఇద్దరేనేమో! ఈయనను మించిన కారక్టర్ నటుడు ఇంకెవరున్నారో. మంచి ఇంటర్వ్యూ చదివించారు. మీకు కృతజ్ణతలు.

పరిమళం said...

గుమ్మడిగారికి హృదయ పూర్వక నివాళులు !

SRRao said...

* జయ గారూ !
కళాకారులకు చప్పట్లు, కవులకు ప్రశంసలు అలాగే బ్లాగర్లకు వ్యాఖ్యలే ఊపిరి. నేను రాసేవి క్రమం తప్పకుండా ఓపిగ్గా చదువుతూ, వ్యాఖ్యానిస్తూ ఉన్న మీకు కృతజ్ఞతలు.

* పరిమళం గారూ !
మీ స్పందనకు కూడా కృతజ్ఞతలు.

చదువరి said...

సాత్వికాభినయ సామ్రాట్ అని చక్కగా అన్నారు. ఈ ఇంటర్వ్యూ లింకు ఇచ్చినందుకు నెనరులు.

గుమ్మడిని తలుచుకుంటే గుప్పెట ముడిచి, చూపుడువేలు తెరచి మాట్టాడే ఆయన మూర్తి గుర్తొస్తుంది.

SRRao said...

చదువరి గారూ !
ధన్యవాదాలు

చదువరి said...

రావు గారూ, దూరదర్శన్‌లో గుమ్మడి గారి పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్ళీ ప్రసారం చేస్తూంటే చూసాను మూడు రోజుల కిందట. మధ్య నుంచి చూసాను. మీరిచ్చిన లింకులో ఉన్న ఇంటర్వ్యూ దాదాపుగా అదే! :)

SRRao said...

చదువరి గారూ !
అవునండీ అప్పట్లో గుమ్మడి గారు దాదాపుగా అన్ని ఇంటర్వ్యూ లలోను ఆ విషయాలే చెప్పేవారు. అప్పట్లో ' ఆంధ్రజ్యోతి' లో వచ్చిన ఇంటర్వ్యూ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. దన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం