1957 లో విడుదలైన దొంగల్లో దొర చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి అరవై వ చిత్రం. ఆ చిత్రం విడుదల సందర్భంగా తన ఎదుగుదలకు సహకరించిన చిత్ర పరిశ్రమలోని వారందరినీ సత్కరించాలని అనుకున్నారు అక్కినేని. ఆరోజే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విరాళం కూడా ఇవ్వాలని తలపెట్టారు. ఇంత భారీ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకాన్ని తట్టుకునే వేదిక ఎక్కడా అన్న సమస్య వచ్చింది.
అప్పట్లో వాహినీ స్టూడియో ఎదురుగా పెద్ద ఖాళీ స్థలం వుండేది. ముళ్ళపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి చిట్టడవిలా వుండేది. వేదిక అనేది పెద్ద సమస్య కాదని కొట్టి పడేస్తూ విజయా సంస్థ అధినేత బి. నాగిరెడ్డి గారు ఆ ప్రదేశంలో వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దానికి అందరూ పెదవి విరిచారు. ఆ స్థలం బాగు చెయ్యాలంటే చాలా సమయం పడుతుందని, శ్రమ ఆవుతుందని... కనుక అది సాధ్యం కాదని అనుకున్నారు. అందరూ ఇంకా తర్జన భర్జనలు పడుతూ ఉండగానే నాగిరెడ్డి గారు ఒక బుల్ డోజర్ తెప్పించారు. చిట్టడవిని మైదానంగా మార్చేసారు. వందలాది మంది వడ్రంగులని, తాపీ మేస్త్రీలని, పెయింటర్లని, మౌల్దర్లని ఇంకా కూలీలు, తోట పని వాళ్ళు.... ఇలా ఎంతోమందిని ఏర్పాటు చేసి, ఎన్నో రకాల పూల మొక్కలు తెప్పించి ఆ ప్రదేశమంతా నందనవనంలా మార్చేసారు.
నాగిరెడ్డి గారి నిర్వహణా సామర్థ్యానికి గీటురాయిగా నిలిచిన ఆ ప్రదేశమే విజయా గార్డెన్స్. అప్పటినుంచి సినిమా వాళ్ళందరికీ అది కల్పవృక్షంగా మారింది. ఎన్నో చిత్రాలు అక్కడ రూపుదిద్దుకున్నాయి. విజయా సంస్థ కిరీటంలో మరో కలికి తురాయిగా నిలిచింది విజయా గార్డెన్స్.
Vol. No. 03 Pub. No. 061
2 comments:
అక్కినేని 60 చిత్రాలు పూర్తిచేసినప్పుడు ఆ సభకోసం విజయా నాగిరెడ్డి గారు సృష్టించిన ఆ నందన వనం విజయాగార్డెన్సుగా ప్రసిద్ధి పొందింది.ఆ విషయం
చాలా మందికి తెలియదు. మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ సంధర్భంలోనే తెలుగు దిన పత్రికలు ప్రత్యేక అనుబంధాలు ప్రచురించాయి. ఆనాటి పత్రికలు ,విశేషాలు కూడా వీలైతే వ్రాయండి.
Thanq sir. I will try.
Post a Comment