Monday, April 26, 2010

సినిమాల గురించి శ్రీశ్రీ



ఈ ఇమేజ్ పైన క్లిక్ చెయ్యండి.
 సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలో వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్రనిర్మాణం చేస్తున్నారు.




అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతా వినండి. ఆహారం విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండి కోసం హోటల్ కు వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటల్ కు వెళ్లక తప్పదు.


ఆహారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం - అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశెనగ నూనెతో చేసే వంటకాలనుకాని ప్రజలు ముట్టరని, వాటికి వాళ్ళు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.


నాటకానుభవం లేని కవులు సినిమారచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి. శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి అట్టి అనుభవం ఉన్నందువల్లనే " పాతాళ భైరవి " ( ఆంధ్ర ప్రభ లోని వ్యాసం లింక్ ) వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసికొని రాగలిగారు.


సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోను నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' , ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రమే కాదు.


ఏమైనా ఏప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల స్థాయిని బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.


సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి వార పత్రికలో  ప్రచురించిన మహాకవి శ్రీశ్రీ గారి వ్యాసం నుండి..........  

Mahasankalpam: Vacana kavita sankalanam, 1940-1975 = Mahasankalpam, an anthology of modern Telugu poetry from 1940 to 1975
  మహాకవిగారి సొంతగళం నుండి ప్రవహించిన  మహాప్రస్థాన గీతం  ......



Vol. No. 01 Pub. No. 269

3 comments:

Anonymous said...

సినిమా రచయితకి(మాటకొస్తే ఏ రచయితకైనా)కావలసింది నాటకానుభవం కాదు.. సృజనాత్మకత.కవిత్వానికి కావలసింది యతి ప్రాసలు కావు..భగ భగ మండే భావాగ్ని!పరిణామక్రమ సిద్దాంతాన్ని ఒడిసిపట్టిన శ్రీశ్రీ యేనా ఇలా అన్నది? ఐ హర్ట్!నేను గాయపడ్డాను!కొత్తపాళీ గారనుకుంటా.. ఇలాఅన్నారు.. "ఆధునికత తమతోనే ఆగిపోతుందా...!

జయ said...

చాలా విషయాలు తెలియజేసారు. శ్రీ శ్రీ శతజయంతికి మంచి కానుక ఇది. మీకు అభినందనలు.

SRRao said...

* Sat గారూ !
మీరు చెప్పింది నిజమేనండీ ! ఏ రచయితకైనా కావలిసింది సృజనాత్మకతే ! అది లేకపోతే రచయితే కాలేడు కదా ! శ్రీశ్రీ గారు చెప్పింది సినిమా రచయితకు వుండవలసిన అదనపు అర్హత గురించి మాత్రమే ! నాటకానుభవం ఎంత మేరకు సినిమాను చిరస్థాయిగా నిలబెడుతుందో ఆయనే ఇచ్చిన ఉదాహరణ పింగళి గారి చిత్రాలు చాలవూ ! ఇక శ్రీశ్రీ గారి ఆధునిక కవిత్వానికి మూలాలు ప్రాచీన కవిత్వంలోనే వున్నాయని ఆయన రచనల్ని లోతుగా విశ్లేషించిన పెద్దలెందరో చెబుతూ వుంటారు. ఇక్కడ రాసినవన్నీ ఆయన చెప్పినవేనని ఆయన జీవించివున్న కాలంలోనే ఆంధ్రజ్యోతి వారు ప్రచురించారు.

* జయ గారూ !
ధన్యవాదాలు. ఏప్రిల్ 30 వ తేదీ శ్రీశ్రీ గారి జయంతి అందుకే అప్పటివరకూ రోజూ ఆయన గురించిన విశేషాలను ఇవ్వాలని సంకల్పం. సమయం అనుమతించాలి మరి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం