Thursday, October 29, 2009

విజయవాడ అగ్నిహోత్రావధానులు

గురజాడ అప్పారావు గారి అగ్నిహోత్రావధానులుది విజయనగరమా ? విజయవాడా ? గురజాడ గారి ప్రకారం విజయనగరమే ! పి. పుల్లయ్య గారి ప్రకారం విజయవాడ ! 'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు ఒక పాత్రయితే ' కన్యాశుల్కం ' చిత్రంలో అది పాత్ర కాదు. సజీవమూర్తి. ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు విన్నకోట రామన్న పంతులు. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఆయన అసలు పేరు గుర్తులేదు. ఆయన పేరు అగ్నిహోత్రావధానులు. అంతే ! విజయవాడలో రామన్న పంతులు గారు వృత్తి రీత్యా వకీలు. ప్రవృత్తి రీత్యా నటుడు, దర్శకుడు మరెన్నో !
' పాతాళ భైరవి ' చిత్ర శతదినోత్సవం విజయవాడ లో వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ ' నాటకం ' అనే నాటకం. ఈ ' నాటకం ' నాటకీయంగా సినిమా రంగానికి కొందరు పెద్దమనుషుల్ని అందించింది. ఆ నాటకం చూసిన పాతాళ భైరవి దర్శకుడు కే. వి. రెడ్డి గారు తమ ' పెద్దమనుషులు ' చిత్రం ద్వారా ఆ నాటక రచయిత డి. వి. నరసరాజు గార్ని, నటుడు రామచంద్ర కాశ్యపను హీరోగానూ పరిచయం చేశారు. కానీ అదే నాటకంలో మరో ప్రధాన పాత్ర పోషించిన మన లాయర్ గారికి అప్పుడు పిలుపు రాలేదు. తర్వాత కాలంలో కె. వి. రెడ్డి గారు అన్నపూర్ణా వారికి ' దొంగ రాముడు ' మొదలుపెట్టినపుడు రామన్న పంతులు గారికి పిలుపు వచ్చింది. అందులో జగ్గయ్యకు అన్నయ్యగా వేషం దొరికింది. ' కన్యాశుల్కం ' చిత్రం ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టింది. అయినా ఆయన తన వృత్తిని, ఊరిని వదులుకోలేదు. ముఖ్యంగా రంగస్థలాన్ని అసలు వదలలేదు. అయితే ఆయన నటన అంటే అభిమానం ఉన్న సినిమా రంగం ఆయన్ని పూర్తిగా వదులుకోదలచలేదు. రామన్న పంతులు గారు తన నటనా వైదుష్యం వాహినీ వారి ' బంగారు పాప ' , అన్నపూర్ణా వారి ' చదువుకున్న అమ్మాయిలు ' , భరణీ వారి ' బాటసారి ' , బాపు గారి ' సాక్షి '. ' బంగారు పిచిక ' మొదలైన చిత్రాల్లో ప్రదర్శించారు. ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఆయన విన్నకోట రామన్న పంతులు కాదు నులక అగ్నిహోత్రావదానులే !




6 comments:

Anonymous said...

very nice intro n information sir..

SRRao said...

తృష్ణ గారూ !
కృతజ్ఞతలు.

కొత్త పాళీ said...

బాగుంది. ఈయన విజయవాడా వాస్తవ్యులని తెలీదు. ఆ కాలంలో తెనాలి వారు చాలామంది డాక్టర్లూ లాయర్లూ నటులుగా ప్రసిద్ధులు, కొందరు సినిమాల్లోనూ రాణించారు.
ఒక కరెక్షను. కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్ల వాళ్ళది విజయనగరం జిల్లా కాదు. ప్రస్తుత తుగోజీకి విశాఖజిల్లాకీ సరిహద్దుల్లో ఉన్న గ్రామం. ఆ భాష అక్కడి వైదిక బ్రాహ్మణ కుటుంబాలు వాడే భాష. చివర్లో జరిగే కోర్టుల వ్యవహారం అంతా విశాఖపట్టణంలో జరుగుతుంది, విజయనగరంలో కాదు, గమనించగలరు.

SRRao said...

కొత్త పాళీ గారూ !
మీ సవరణకు కృతజ్ఞతలు. నాదే పొరబాటు. అగ్నిహోత్రవధానులది కృష్ణరాయపుర అగ్రహారం.ఇలాంటి తప్పులు దొర్లినపుడు సహృదయులైన మిత్రులు సరిదిద్ది హెచ్చరిస్తూ ఉంటారని ఆశిస్తూ...

Saahitya Abhimaani said...

విన్నకోట రామన్న పంతులుగారు, అగ్నిహోత్రావదానులుగా కన్యాశుల్కం లో ఎంతగా జీవించారో, పెళ్ళాం చాటు భర్తగా బంగారు పిచ్చిక సినిమాలోనూ అంతే అద్భుతంగా జీవించారు.నటుడు అంటే అలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆయన నటన. ఆయన చివరి సినిమా ముద్దా మందారం అనుకుంటాను. అందులోనూ చక్కటి నటనను చూపించారు, జంధ్యాలగారి మొదటి దర్సకత్వంలో.

వ్యాపార పంధా ఎక్కువైపోయి మన సినిమాలు చాలా పేలవమైన నటనకు అంకితం అయిపోయినాయి కాని, గోవిందరాజుల సుబ్బారావు గారు, సి ఎస్ ఆర్, రామన్న పంతులు వంటివారు ఇంకెన్నో అద్భుతమైన పాత్రలను ధరించగలిగేవారు.

Unknown said...




24-10-2009 - విజయవాడ అనిహోత్రావధానులు

వీరి ప్రతిభా పాటవాలు ఆనాటి ప్రేక్షకులకు బాగాతెలుసు. నాటకానుభవం బాగాఉన్న ఉత్తమ నటుడు/ దర్శకుడు, వాచకం అభినయం అలవోకగా పండించగ నేర్పరి. వృత్తి ప్రవృత్తి సమంగా నడిపించి మహ వ్యక్తి.
Gumma Ramalinga Swamy




Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం