Tuesday, October 27, 2009

కట్టమంచి వారి చతురోక్తులు


కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనలో, అభివృద్ధిలో విశేష కృషి చేసిన మహనీయుడు. ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కళాశాల ఆయన పేరున వెలిసిందే ! ఆయన మంచి హాస్య చతురతగల వ్యక్తి. ఆయం చతురోక్తులు మచ్చుకి కొన్ని......
* రెడ్డి గారు ఒకసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో దిగి ప్లాట్ ఫాం మీదే నిలబడి చుట్టూ చూస్తున్నారు. అది గమనించిన ఒక విలేఖరి వచ్చి తనని పరిచయం చేసుకుని సహాయం కావాలా అని అడిగాడు. వెంటనే రెడ్డిగారు " నాకిప్పుడు కావల్సినది రిపోర్టర్ కాదు, పోర్టర్ ! " అన్నారు.
* చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారిని ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించిన సందర్భంగా విజయవాడలో జరిగిన సన్మాన సభకు కట్టమంచి వారు అధ్యక్షత వహించారు. ఆయనకు చెళ్లపిళ్ల వారంటే చాలా భక్తి, గౌరవాలు. రెడ్డిగారు అధ్యక్షోపన్యాసం చేస్తుండగా చెళ్లపిళ్ళవారు వెనుకనుంచి వెటకారంగా వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభించారు. అది రెడ్డిగారికి, సభికులకు ఇబ్బందిగా తయారయింది. పెద్దవారు, పండితులు ఆయన్ని ఎలా నియంత్రించాలో అర్థం కాలేదు. కొంతసేపు భరించాక కట్టమంచి వారు సమయస్పూర్తితో " మొదటినుండి మా గురువుగారికి అంట కవిత్వం అలవాటు కదా ! ఇక్కడ కూడా ఆ అలవాటు పోలేదు " అన్నారు.
* రామలింగారెడ్డిగారు కొంతకాలం విద్యాశాఖాధికారిగా పనిచేసారు. ఒకసారి ఒక ఉన్నత పాఠశాల తనిఖీకి వెళ్ళారు. ఒక తరగతిలో తెలుగు పండితుడు ఒక విద్యార్థిని బోర్డు మీద ' చీకటి ' అనే పదాన్ని రాయమన్నాడు. ఆ విద్యార్థి రాసాడు. " అందులో అరసున్న ఏదీ ? " అని విద్యార్థి మీద కోప్పడ్డాడా పండితుడు. వెంటనే రెడ్డిగారు " అసలే చీకటి కదా ! ఇక అరసున్న ఏం కనిపిస్తుంది ? " అని చమత్కరించారు.
*  కట్టమంచి వారు ఘోటక బ్రహ్మచారి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేసే రోజుల్లో ఒక సభలో కొందరు వక్తలు ప్రసంగిస్తూ ఆయన్ని పొగడడం మొదలు పెట్టారు. కలియుగ భీష్ముడు, వీర హనుమాన్ అదీ ఇదీ అనే విశేషణాలు తగిలించేసారు. దానికి రెడ్డి గారు సమాధానం చెబుతూ " ఇన్ని విశేషణాలూ, ఉపమానాలూ దేనికి ? క్లుప్తంగా బ్రహ్మచారి అంటే సరిపోతుందిగా ! " అని చలోక్తి విసిరారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఆయన పనిచేసే రోజుల్లో పి. కమలమ్మ అనే సెనేట్ సభ్యురాలుండేది. ఆవిడ మాట, ప్రవర్తన కటువుగా ఉండేవి. ఒక సమావేశంలో ఆవిడ తన స్వభావానికి విరుద్ధంగా ఉషారుగా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండడం రెడ్డి గారి కంట పడింది. ఆయన " కారణమేమైనను వివాహము వలన పరుషములు సరళములైనందుకు సంతోషముగానున్నది " అని చమత్కరించారు. ఇంతకీ ఇందులో చమత్కారం పి. కమలమ్మ గారికి కొద్దిరోజులముందే పెళ్లయి పేరు బి. కమలమ్మగా మారింది.

9 comments:

భాస్కర రామిరెడ్డి said...

:) :-)


అసలే చీకటి కదా ! ఇక అరసున్న ఏం కనిపిస్తుంది ?

కారణమేమైనను వివాహము వలన పరుషములు సరళములైనందుకు సంతోషముగానున్నది "

ఇవి రెండూ హైలైట్స్. చివరిదైతే మరీనూ :)

Anonymous said...

బాగుంది. :)

ఇలాటివే ఇక్కడ కూడా చూసినట్టు గుర్తు

http://www.maganti.org/migadatarakaluindex.html

sreenika said...

మంచి విషయాలు అందిస్తున్నారండి.
చాలా బాగున్నాయి.

SRRao said...

భా.రా.రె.గారూ !
శ్రీనిక గారూ !
కృతజ్ఞతలు. మీ అందరి ప్రోత్సాహమే నా చేత సేకరణలను వెలికి తీయిస్తోంది.
Annonymous గారూ !
కృతజ్ఞతలు. మీరిచ్చిన లింకు చూసాను. ' అరసున్న ' తిరుపతి వెంకటకవులకు చెందిన చలోక్తిగా ఇచ్చారు. వారి సేకరణ ఎక్కడిదో తెలియదు. కానీ నా సేకరణలో అది కట్టమంచి వారిదిగా ఉంది. గత ముఫ్ఫై ఏళ్ళుగా సేకరిస్తున్న విశేషాలను నాతోబాటు మిత్రులందరూ పంచుకుంటారనే ఉద్ద్యేశ్యంతో అందిస్తున్నాను. అయితే ఒక విషయం. కట్టమంచి వారు, తిరుపతి వెంకటకవులు సమకాలికులు. పైగా తిరుపతి వెంకటకవులకు కట్టమంచి వారు ఆత్మీయులు. అందుకని అసలు సేకరణ కర్తలు పొరబడే అవకాశం ఉంది. ఏమైనా ఈ విషయం తెలియజేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.

భావన said...

బాగుంది పరుషములు సరళములైన తీరు బాగా నవ్వించింది ఒక నిమిషం అర్ధం కాలేదు అర్ధం అవ్వగానే బాగా నవ్వు వచ్చింది. థ్యాంక్స్ అండి

amma odi said...

చాలా బాగున్నాయండి:)

amma odi said...

నాకు తెలిసిన ఒక చలోక్తి చెబుతాను. నేను ఎక్కడో చదివిందే సుమా!

ఒకసారి కట్టమంచి వారు పిల్లల్ని విహారయాత్రకు తీసుకు వెళ్ళారట. హోటల్ లో కాఫీ తాగే వేళ, విద్యార్ధి ఒకరు, కాఫీ సాసర్లో పోసుకుని దాన్ని టేబుల్ మీద పెట్టి వంగి సాసర్లో కాఫీ పీలుస్తూ చప్పుడు చేస్తూ తాగుతున్నాడట. అది చూసి కట్టమంచి వారు

"ఒరే అబ్బాయ్! పదార్ధాన్ని నోటి దగ్గరకు తెచ్చుకునేది మనిషి. నోటినే పదార్ధం దగ్గరకు తీసుకెళ్ళేది జంతువు" అన్నారట.

దానికా గడుగ్గాయి, గురువుకు తగ్గ శిష్యుణ్ణి అన్పించుకుంటూ,

"నాకు తెలుసు సార్! రెండింటిలో ఏది మంచి పద్దతో పరీక్షిస్తున్నా!" అన్నాడట.

SRRao said...

భావన గారూ !
కృతజ్ఞతలు.
అమ్మఒడి గారూ !
నేను కూడా రకరకాల పత్రికల నుంచి సేకరించినవేనండీ 1 నేను సేకరించినవి అందరికీ అందిస్తున్నానంతే ! మీరందించిన చలోక్తి బాగుంది. ఇలాగే మిగిలిన మిత్రులు కూడా తమకు తెలిసినవి అందిస్తే నా సేకరణలొ కలుపుకుంటాను.ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి said...

kattamamchi vari gurimchi baga chepparu dhanya vadamulu

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం