ఎంత దూరమీ పయనం.... అంటూ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి తన విలక్షణమైన, మధురమైన గానంతో అలరించి సరిగా 22 సంవత్సరాల క్రితం దివి నుంచి భువికేగిన గంధర్వ గాయకుడు ఎ. ఎం. రాజా.
టాకీలతో బాటు 1931 లో చిత్తూరులో జిల్లా రామాపురంలో పుట్టి తన పందొమ్మిదవయేట మద్రాసులో అడుగుపెట్టి బి. ఏ. లో చేరారు. అప్పుడు జరిగిన సంగీతం పోటీలలో గెలుచుకున్న ప్రథమ బహుమతి ఆయనకు ' ఎంత దూరమీ పయనం ..... ' అనే పాటను పాడే అవకాశం ఇచ్చింది. హెచ్. ఎం. వి. సంస్థ ఈ పాటను ప్రైవేటు రికార్డుగా విడుదల చేసింది. తన ఇరవైయవయేట ఏ.వి. యమ్. వారి ' సంసారం ' తమిళ చిత్రంతో 1951 లో చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జెమిని వారి ' బహుత్ దిన్ హుయే ' హిందీ చిత్రంలో పాడారు. ' మరు మగళ్ ' అనే మళయాళ చిత్రానికి అనువాదమైన ' ఆకలి ' అనే చిత్రానికి తోలి తెలుగు పాట పాడారు.
1954 వ సంవత్సరం రాజా సంగీత జీవితం మలుపు తిరిగిన సంవత్సరం. ఆ సంవత్సరం విడుదలైన రాజకపూర్ అనువాద చిత్రం ' ప్రేమలేఖలు ' చిత్రంలో జిక్కితో కలసి పాడిన పాటలు రాజాకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వరుసగా ఆదుర్తి సుబ్బారావు గారి మొదటి చిత్రం ' అమరసందేశం ' , ' విప్రనారాయణ ' , ' మిస్సమ్మ ' ..... ఇలా చెప్పుకుంటూ పొతే చాలా చిత్రాలలో అనేక పాటలు రాజా స్వంతమయ్యాయి. ఈ ప్రభంజనం అప్పటికే ప్రసిద్ధుడైన గాయకుడు ఘంటసాలకు కొంతకాలం అవరోధమైంది. ఆయన చేత పాడించుకునే వారే కరువయ్యారు. బి. ఎన్. రెడ్డి గారి దర్శకత్వంలో పొన్నలూరి బ్రదర్స్ వారి ' భాగ్యరేఖ ' చిత్రంలో రాజా పాడిన పాటలు ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అందులో ఆయన పాటలు ప్రాచుర్యం పొందడంతో ఆ నిర్మాతలే తమ తర్వాత చిత్రం ' శోభ ' తో 1958 లో రాజాను సంగీత దర్శకుడిని చేసారు.
ఎన్నో చిత్రాల్లో ప్రేమ గీతాలు పాడిన ఏ. ఎం. రాజా, జిక్కి జంట ఆ సంవత్సరమే తమ గాన బంధాన్ని శాశ్వత సంబంధంగా మార్చుకున్నాయి.
రాజా సంగీతం సమకూర్చిన ' కళ్యాణ పరిశు ' తమిళ చిత్రం, దాని తెలుగు రూపమైన ' పెళ్ళికానుక ' చిత్రాలకు అవార్డులతోబాటు ప్రేక్షకుల రివార్డులు కూడా భారీగానే లభించాయి.
రాజా మృదుమధురమైన పాటలను పాడడం, స్వరపరచడమే కాక 1953 లో వచ్చిన ' పక్కింటి అమ్మాయి ' చిత్రంలో ప్రధాన పాత్ర ధరించారు కూడా !
సుమారు వివిధ భాషలలో పదివేల పాటలను పాడి, సుమారు వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏ. ఎం. రాజా జీవితం విషాదాంతం. మదురైలో సంగీత కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ కదిలే రైలు ఎక్కబోయి ప్లాట్ ఫారం మీదనుండి జారిపోయి రైలుకి, ప్లాట్ ఫారం కి మధ్య ఇరుక్కుని చనిపోయారు.
ఎంత దూరమీ పయనం.... అంటూ మొదలుపెట్టిన ఆయన సంగీత ప్రయాణం ఈ సంఘటనతో ముగిసింది.
ఈరోజు ( ఏప్రిల్ ) 8 వ తేదీ ఏ. ఎం. రాజా వర్థంతి సందర్భంగా
ఆ అమరగాయకునికి స్వరనీరాజనాలు అర్పిస్తూ ........
Vol. No. 02 Pub. No. 197
4 comments:
తెలియని చాలా విషయాల్ని చెప్పారు... థ్యాంక్యూ SRRao గారూ.
AM raja vardanthini gurthu cheyadame kaka aanaati kaalamloki, madhura geetaala swarnayugamloki lakkellipoyaaru ... dhanyavaadaalu...
వారి తరం లో నటులకున్నంత ఆదరణ, పేరు ప్రఖ్యాతులు నేపథ్య గాయకులకీ ఉండేవేమోనండి. రాజా-జీక్కీ జంట యుగళగీతాలు, విడి పాటలు మా నాన్నగారు వినటమే కాక, తిరిగి తిరిగి పాడుకునేవారు. నాకు అలా పరిచితమైన గళాలు ఎన్నో. కళాకారులకి మరణం ఉండదుగా!
* గీతిక గారూ !
* పి. ఆర్. తమిరి గారూ !
* ఉష గారూ !
ధన్యవాదాలు
Post a Comment