Wednesday, March 16, 2011

ఆదర్శజీవి - అమరజీవి

 మహనీయులు మహోన్నత ఆశయాలకోసం పుడుతుంటారు
ఆ ఆశయ సాధనకోసం తమ ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు

మనిషన్న ప్రతివాడికీ కొన్ని ఆశలు, ఆశయాలు వుంటాయి  
వాటిని నెరవేర్చుకోవడానికి పట్టుదల, చిత్తశుద్ధి వుండాలి

ఆశయ సాధనలో మనిషి ఉన్మాది కాకూడదు
మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి

ఉన్నతమైన లక్ష్యం, ఖచ్చితమైన ప్రణాళిక వున్న మనిషి తప్పక విజయం సాధిస్తాడు
అనుకున్నది నెరవేరడానికి, లోక కల్యాణానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడడు

అలాంటి ఓ మహనీయుడు అమరజీవి పొట్టిశ్రీరాములు
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించి తన ఆమరణ నిరాహారదీక్షతో  ఆ ఆశయాన్ని సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు.

ఆయన జీవితం ఉద్యమకారులకు ఆదర్శం
ఆయన త్యాగం నిరసనకారులకు ఓ పాఠం

తన ఆశయం సాధన కోసం 58 రోజుల అకుంఠిత దీక్ష చెయ్యడం, ఆ దీక్షలోనే తన ప్రాణం కోల్పోవడం, ఆయన ప్రాణ త్యాగంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం చివరికి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఎలా సాధ్యమయ్యాయో బహుశా ఇప్పటి నాయకులమనుకునే వాళ్లకు అర్థం కాకపోవచ్చు.

ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఆయన అనుసరించిన పంథాను ఇప్పటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు అనుసరిస్తే తప్పక వారి ఆశయం నెరవేరుతుంది. ఆయన త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని నిస్వార్థంగా ఉద్యమిస్తే తప్పక వారిని నమ్ముకున్న ప్రజల కల నెరవేరేది. అప్పుడు వందలమంది తమ జీవితాలను పణంగా పెట్టనవసరం లేదు. ఎవరినీ తిట్టనవసరం లేదు. బందుల పేరుతో రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యుల ఆకలితో అడుకోనవసరం లేదు. బంగారం లాంటి విద్యార్థుల భవిష్యత్తును బలి చెయ్యనక్కరలేదు. సంస్కృతికి చిహ్నాలైన విగ్రహాలను ధ్వంసం చేసి, ఆ చర్యను సమర్ధించి తమ అజ్ఞానాన్ని లోకానికి చాటుకోనక్కరలేదు. కేవలం ఒక్క నాయకుడైనా పొట్టి శ్రీరాములు గారిలా చిత్తశుద్ధితో, దీక్షతో..... 58 రోజులు అక్కరలేదు...... అందులో సగం రోజులు చేస్తే చాలు..... ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుంది.

ఇప్పటికైనా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోకుండా, ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చకొట్టకుండా...... ఈ ఉద్యమ ఆశయం నిజంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే అయితే, ఈ ఉద్యమం నిజంగా స్వార్థరహిత ఉద్యమమే అయితే..... పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పూనుకోవాలి.

అమరజీవి బాట ఉద్యమ విజయానికి మార్గదర్శి 

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన్ని, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ............

అమరజీవిపై గతంలో రాసిన తపాల లింకులు ........... 

ఆశయ సాధనలో అమరజీవి

 అమరజీవి ఆత్మఘోష

Vol. No. 02 Pub. No. 174

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం