Friday, March 4, 2011

వెండితెర నవలలపై రమణ

 
ముళ్ళపూడి వెంకటరమణగారు రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి వెండితెర నవలలు. ఒక కథని వెండితెరకేక్కించడం సులువేనేమో గానీ వెండితెర మీద దృశ్యకావ్యంగా ఒదిగిన కథని ఒక నవలగా మలచి పాఠకులను ఒప్పించడం చాలా కష్టం. నవల పఠనంలోనే పాఠకునికి సినిమా చూపించగలగాలి. ఆ శైలి ముళ్ళపూడి గారి ప్రత్యేకత. ఆయన రాసిన ' భార్యాభర్తలు ' వెండితెర నవల చదివి ఆ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ " సినిమా తియ్యడానికి ముందే ఈ నవలను చదివివుంటే సినిమాను ఇంకా బాగా తీసేవాడిని " అన్నారంటే ముళ్ళపూడి వారు ఆ చిత్ర సన్నివేశాల్ని ఎంత బాగా కాగితం మీద పరిచారో అర్థం చేసుకోవచ్చు. 

తాను రాసిన వెండితెర నవల గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమంటున్నారో చదవండి.....

" నిర్మాతగా మారక ముందు ఆదుర్తి, ప్రత్యగాత్మ, వి. మధుసూదనరావు సినిమాలకు వెండితెర నవలలు రాసాను. నాకు గుర్తుండి నేను రాసినవి నాలుగు వెండితెర నవలలే ! వాటితో బాటు కొన్ని సినిమా స్క్రిప్ట్ లు కూడా ప్రచురించాం. నేను నిర్మాతగా మారాక మా బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు ఎమ్వీయల్, శ్రీరమణ తో వెండితెర నవలలు రాయించాను. 
అప్పుడు ఈ నవలల్ని రాయడంలోనే కాదు, ప్రచురణలోనూ కొత్త పోకడలను అనుసరించాం ! ' ఇద్దరు మిత్రులు ' నవల చూడండి. అందులో అక్కినేనిది ద్విపాత్రాభినయం. పేజీల కార్నర్ లో అక్కినేని ఫోటోలను ప్రచురించాం. పేజీలను వేగంగా తిప్పినపుడు ఇద్దరు నాగేశ్వరరావు లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించేది. 1962 జనవరిలో విడుదలైన ఈ పుస్తకాన్ని డెబ్భై అయిదు పైసలకు అందించాం. విడుదలైన రెండో నెలలోనే పునర్ముద్రణ కూడా జరిగింది. సినిమా స్టిల్స్ తో బాటు బాపు రేఖాచిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలానే ' బుద్ధిమంతుడు ' వెండితెర నవలను అక్కినేని నాగేశ్వరరావు ఆటోగ్రాఫ్ తో 1969 సెప్టెంబర్ 20 న ఆయన జన్మదిన కానుకగా విడుదల చేసాం. సినిమా కూడా అదే రోజున విడుదలయింది "   

మనవి : ' ఇద్దరు మిత్రులు ' వెండితెర నవలలో రమణగారు చెప్పిన ఇద్దరు అక్కినేని గార్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించే ఫోటోలను గమనించిన వారెవరైనా వున్నారా ?  వుంటే దయచేసి వారి అనుభూతుల్ని తెలియజెయ్యండి.  

సాక్షి జంట గురించి ఆరుద్ర టపా గురించి వ్యాఖ్యానిస్తూ పెద్దలు, మిత్రులు వోలేటి వెంకట సుబ్బారావు గారు బాపురమణ ల జంట గురించి మరో మంచి విషయాన్ని చెప్పారు. వారికి కృతజ్ఞతలతో ఇక్కడ ఆ విషయాన్ని అందిస్తున్నాను. 

" ఇద్దరూ ఒకటేననీ .... అందువల్ల ఇద్దరికీ మధ్య - ( గీత ) ఉండకూడదని...... ఒకచోట చదివిన మీదట బాపురమణ అని ఏకపదంగా ఉపయోగిస్తున్నాను " 

నిజమే ! మనుషులనే కాదు బాపురమణ పేర్లను కూడా విడదీసి చూడలేం కదా ! 

 Vol. No. 02 Pub. No. 165

2 comments:

susee said...

venditera navalalaku aarojullo yentho giraakee vundedi.konnitini naaku telisi EMESCO samstha 'buddhimanthudu' (Navaleekarana: Mullapudi Venkata Ramana Garu)-aa taruvaata konnitini Sakshi Books - vudaaharanaki-'Bhaktha Kannappa'- 'Gorantha Deepam'- venditera navalalu Sri MVL roopondinchhaaru.'Buddhimantudu' pustakam lopala Akkineni gari autograph- 'Gorantha Deepam ' pustakam lopan Vanisri autograph lanu manam choodavachhunu.
'Haasam'- patrika lo aa naati 'iddaru mitrulu' venditera navalalu- Raja garu- iteevala serial gaa prachurinchadam jarigindi.- Voleti Venkata Subba Rao,Slough/UK

SRRao said...

సుబ్బారావు గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం