Saturday, October 10, 2009

పెళ్లి సంబరం


బాబాయి కూతురు పెళ్ళి. చాలారోజుల తర్వాత దగ్గర బంధువులింట్లో పెళ్ళేమో చాలా ఉత్సాహంగా బయిల్దేరాను . చిన్నప్పుడు పెళ్ళంటే ఎంత హడావిడి. నెలరోజుల ముందే పనులు మొదలైపోయేవి. అందులోనూ ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ? పచ్చటి కొబ్బరాకుల చుట్టిన స్థంభాలతో వేసిన చలువ పందిరి, కర్పూరపు దండలు, పానకాలు, పప్పు దప్పళంతో విందు భోజనం ఇలా ఎన్నెన్నో...! చాలాకాలం తర్వాత చూడబోతున్నందుకు నా మనస్సు ఆనందంలో మునిగిపోయుండగా నేను మాత్రం బాబాయింట్లో తేలాను. ఇంటి ముందు పెళ్లి పందిరి కనబడలేదు. అంతే కాదు ఎక్కడా హడావిడి లేదు. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది . నాకర్థం కాలేదు. లోపలకెళ్ళాను. అక్కడక్కడా కొన్ని సామానులు కనిపిస్తున్నాయిగానీ ఎక్కడా మనుష్యుల అలికిడి లేదు. ఇంతలో పెరట్లోంచి పిన్ని వచ్చింది. " రారా ! శంకరం !! ఇదేనా రావడం ? సీతా పిల్లలేరి ? ఉండు. మంచినీళ్ళు తాగాక మాట్లాడుకుందాం " అని లోపలికి వెళ్ళిపోయింది. అదే హడావిడి. పిన్నెప్పుడూ అంతే! తన ధోరణి తనదే . మన మాట పట్టించుకోదు. " " బాబాయి లేడా పిన్నీ ? " కాఫీ కలుపుతుండగా అడిగాను. " ఏదో కోర్ట్ పని ఉందని రాజమండ్రి వెళ్ళారు. సాయింత్రానికి వచ్చేస్తారు. సీతా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు ? " అని మళ్ళీ అడిగింది. " పిల్లలిద్దరికీ పరీక్షలు జరుగుతున్నాయి పిన్నీ ! రాలేకపోతున్నందుకు సీత చాలా బాధపడింది. ఏం చేస్తాం ? కుదరలేదు. అవునూ ! సుజీ ఏదీ ? కనబడదేం ? " చుట్టూ చూస్తూ అడిగాను. " ఇంకా రాలేదు. బహుశా రేపు బయిల్దేరి వస్తుంది. ఏమిటో ! ఈ చదువులు !! " అంది పెదవి విరుస్తూ. " అదేమిటి ? నాల్గు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా రాకపోవడం ? " ఆశ్చర్యంగా అడిగాను. " అయినా అదొచ్చి ఏం చేస్తుంది చెప్పు. అనవసరంగా చదువు పాడవడం తప్ప " అంది అతి మామూలుగా. ఆలోచిస్తే నాకూ అదే అనిపించింది. " పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినట్లేనా పిన్నీ ? " అనడిగాను. " ఆ ! ఈ రోజుల్లో ఏర్పాట్లు చెయ్యడం ఎంత సేపు ! హైదరాబాద్లో అక్షయమో ఏదో పెళ్ళిళ్ళకి చాలా గొప్పగా ఏర్పాట్లు చేస్తారట. చాలా పేరట కదా ! ముహూర్తం పెట్టగానే మీ బాబాయి వాళ్లతో మాట్లాడేసారు. అసలే అమెరికా సంబంధమాయే ! గ్రాండ్ గా ఉండాలిగా ! వాళ్లక్కావాల్సిన ఏర్పాట్లూ అవీ మనకేం తెలుస్తాయి చెప్పు శంకరం ! " అని చెప్పుకుంటూ పోతోంది. హైదరాబాద్లో ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు, బఫే భోజనాలూ చూసి చూసి మొహం మొత్తి అచ్చమైన కల్తీ లేని సాంప్రదాయపు పెళ్లి మళ్ళీ చూసే అవకాశం వచ్చిందని, నాల్గు రోజుల ముందరే వెళ్లి బాబాయికి పెళ్లి పనుల్లో సాయపడాలని మా బాస్ ని బతిమాలి సెలవు పెట్టి వచ్చిన నాకు తలతిరిగినట్లయింది. పల్లెటూళ్ళో ఇంకా సాంప్రదాయాలు మిగిలి ఉంటాయనే నా నమ్మకం వమ్ము అయినందుకు, మళ్ళీ అదే ఆధునికతను ఇక్కడ కూడా చూడాల్సి వచ్చినందుకు బాధేసింది. నా సంబరమంతా ఆవిరైపోయింది. చెయ్యాల్సిన పనులమీ లేవుకదా కనీసం పాత స్నేహితుల్నైనా కలుసుకుందామని ఊరిమీద పడ్డాను.

2 comments:

sri jabili said...

chinna concept tho ee kathanika chalaa baagaaa.mariyu badagaa rasaru
nijjangaa
life anthaa yantrikangaa tayarayyindi.........

SRRao said...

శ్రీ జాబిలి గారూ !
ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం