విజయనగరం పేరు చెప్పగానే గజపతుల వైభవంతో బాటు సంగీత, సాహిత్య వైభవం కూడా మన కళ్ళ ముందు మెదులుతుంది. ముఖ్యంగా సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు. పుట్టింది కృష్ణా జిల్లా అయినా ఘంటసాల మాస్టారు సంగీతజ్ఞుడిగా తయారయింది విజయనగరంలోనే ! స్వర కోకిలమ్మ సుశీలమ్మను మనకందించింది కూడా విజయనగరమే ! గురజాడ రచనలకు వేదిక అయింది కూడా విజయనగరమే ! వీరికే కాదు ఇంకా ఎందఱో సాహితీవేత్తలకు కూడా విజయనగరం స్థానం కల్పించింది.
ఆ విజయనగరానికే తలమానికమైన సంగీత కళాశాల అదే.... ఒకప్పటి సంగీత పాఠశాల చరిత్ర సుమారు ఎనిమిదిన్నర దశాబ్దాలనాటిది. కర్ణాటక సంగీత రంగాన్ని సుసంపన్నం చేసిన ఎందఱో మహానుభావులు ఆ కళాశాలనుంచి తయారయ్యారు. మరెందరో మహనీయులు ఆ కళాశాల కీర్తిని ఇనుమడింపజేసారు. ఆ పాఠశాల తొలి అథ్యక్షులుగా హరికథా పితామహ శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1935 లో నియమితులయ్యారు.
సాధారణంగా ఇతరులైతే తమ హోదాను పాఠశాల అథ్యక్షులు అనే రాసుకుంటారు. కానీ నారాయణదాసు గారు తమ హోదాను రాసుకోవలసి వచ్చినప్పుడు శుద్ధ వ్యావహారికంలో ' పాటబడి పెద్ద ' అని రాసుకునేవారట. ఎంత చక్కటి పలుకుబడి......
ఓసారి పురిపండా అప్పలస్వామి గారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా చర్చ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన వ్యావహారిక భాషోద్యమం మీదకి మళ్ళింది. ఆయన అకస్మాత్తుగా ఒక ప్రశ్న వేసారు.
" ' తవ్వోడ ' అనే మాట ఎప్పుడైనా విన్నారా ? " అని అడిగారు.
మేము బుర్రలు గోక్కున్నాం. ఆ పదం అసలు తెలుగు పదమేనా ? లేక మరేదైనా భాషా పదమా ? అనే సందేహం వచ్చింది.
ఆ విషయమే అప్పలస్వామి గారిని అడిగాం. అది తెలుగు భాషకు చెందినదే అని చెప్పారు.
ఎంత ఆలోచించినా ఆ పదం ఏమిటో, దాని అర్థం ఏమిటో అప్పుడు మాకు తట్టలేదు. చివరికి ఆయనే ఆ పదం గురించి వివరించారు.
మీకెవరికైనా ఆ పదం గురించి తెలిస్తే చెప్పగలరా ?