ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి ప్రసాదించిన వరం కోనసీమ
గోదావరి పాయల మధ్య అందంగా ఒదిగిన కోనసీమ కొంతకాలం క్రితం వరకూ సముద్రంలోని ఒక ద్వీపంలా చుట్టూ నీటితో నిండి వుండేది. అక్కడినుంచి బయిట ప్రపంచంలోకి రావాలంటే గోదావరి నదిని పడవలపైన దాటవలసిందే ! దేశంలోని మారుమూల ప్రాంతాలు కూడా విద్యుత్ వెలుగులతో వెలిగిపోతున్న రోజుల్లో కూడా ఆముదం దీపాలు, కిరోసిన్ దీపాలతో గడిపింది కోనసీమ. ఆ ప్రాంతానికి చెందిన అప్పటి రెవిన్యూ మంత్రి కళా వెంకటరావు గారి పుణ్యమాని యాభైవ దశకంలోననుకుంటాను విద్యుత్ వెలుగులకు నోచుకుంది. ఆయన చొరవతో గోదావరి పాయలపై రెండు వంతెనలకు అనుమతి లభించింది. తర్వాత కాలంలో వాటి నిర్మాణం జరిగి బాహ్య ప్రపంచానికి చేరువయ్యింది కోనసీమ. అప్పటినుంచి విడిగా విసిరేసినట్లు మూలగా వుందని అనిపించే కోనసీమ బయిట ప్రపంచాన్ని ఆకర్షించడం మొదలైంది. అక్కడి కొబ్బరి అందరికీ ప్రియమైంది. అక్కడి సహజవాయువు, పెట్రోలియం ఉత్పత్తులు దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆశాదీపాలుగా కనబడ్డాయి.
తరవాత ఎంతమంది రాజకీయనాయకులు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకే గానీ ఆ ప్రాంతాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారు దాదాపుగా లేరు. ఆ ప్రాంత సహజ వనరుల్ని తరలించుకు పోయే క్రమంలో అక్కడి ప్రజలకు కనీస సౌకర్యాల కల్పన మాట అలా వుంచి వున్న సౌకర్యాలు ఊడుతున్నా పట్టించుకోని నాయకులున్న తరుణంలో నేనున్నానంటూ ముందుకొచ్చిన నాయకుడు గంటి మోహనచంద్ర బాలయోగి.
నిజమైన ప్రజా సేవకుడు మాటలకన్నా చేతలకే ప్రాధాన్యం ఇస్తాడు అని నిరూపించిన నేత బాలయోగి.
భారత లోక్ సభకు ఎన్నికైన మొదటి దళిత సభాపతి బాలయోగి.
కులమత రహిత లౌకిక రాజ్యంగా చెప్పుకునే మనదేశ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యంగల అంశం కులమతాలే !
ఏ నాయకుడైనా మొదటగా చూసేది తన మతం లేదా కులం వైపే !
ఏ కులం వాడైనా, మతం వాడైనా చూసేది నాయకుడి కులం లేదా మతం వైపే !
కానీ బాలయోగి మాత్రం ఈ కుల మతాలకు అతీతం
ఆయన అందర్నీ అభిమానించాడు... ఆయన్ని అందరూ అభిమానించారు
అప్పటికీ...ఇప్పటికీ..... ఎప్పటికీ.... ఎందుకు ?
సుమారు మూడు దశాబ్దాలుగా జరగని కోనసీమ అభివృద్ధి కేవలం రెండు మూడు సంవత్సరాల్లో జరిగింది. దానికి సాక్ష్యాధారాలు నేటికీ సజీవంగా కనబడుతున్నాయి.అప్పట్లో కోనసీమ ప్రజలు జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడ చేరాలంటే చుట్టూ తిరిగి 100 కిలోమీటర్లు పైన ప్రయాణం చెయ్యాల్సివచ్చేది. దానికి పరిష్కారంగా ఎప్పటినుంచో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నట్లు కోటిపల్లి వద్ద గానీ, ఎదుర్లంక వద్దగానీ గోదావరి నది మీద వంతెన నిర్మించాలి. ఎదుర్లంక వద్ద అయితే కోనసీమలో మరో అంతర్భాగంగా వున్న ఐలాండ్ పోలవరం ప్రాంతానికి కూడా బయిట ప్రపంచంతో సంబంధాలు కలుస్తాయి. తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుగా వున్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం తో కూడా సంబంధం ఏర్పడుతుంది. ఇలా ఓ నిశ్చయానికి వచ్చి అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం ఎదుర్లంక - యానాం వంతెనకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అనేక అభ్యంతరాలు, అడ్డంకులు వల్ల చాలా కాలం ఆ ప్రతిపాదనలో కదలిక లేదు. బాలయోగి గారు లోక్ సభ స్పీకర్ అయ్యాక ఆ ప్రతిపాదనను వెలికి తీయించి వున్న అభ్యంతరాలను పరిష్కరించే దిశగా కృషి చేసి డిజైన్ లో అవసరమైన మార్పులు చేయించి వెంటనే పని ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం చేసారు.
అప్పటివరకూ కోనసీమ ప్రాంతంలో వున్న ప్రధాన సమస్యల్లో మరొకటి రహదారుల సమస్య. ఓఎన్జీసీ పుణ్యమాని అవి మరింత హీనదశకు చేరుకున్నాయి. వాటి బాగును పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పుడు అక్కడ జాతీయ సంపద పుష్కలంగా లభిస్తోంది. అందుకే బాలయోగి తన హయాంలో కోనసీమ ప్రాంత ప్రధాన రహదారి అయిన కత్తిపూడి - నర్సాపురంరేవు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేటట్లు చేసారు.
కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం... అక్కడి నాయకుల నిర్లక్ష్యం రైలు. అపారమైన సహజవనరులు కలిగి వున్నా సరైన రవాణా వ్యవస్థ లేక దళారుల చేతిలో మగ్గిపోతున్న రైతులకు ప్రయోజనం కలిగించే రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో అక్కడి ప్రజాప్రతినిధులేవ్వరూ అప్పటివరకూ సరైన శ్రద్ధ చూపలేదు. కానీ బాలయోగి పదవిలో వున్న కాలంలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తొలగింపబడి, పునర్నిర్మాణానికి దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా ప్రారంభయిన కాకినాడ - కోటిపల్లి రైల్వే లైన్ పనులు పూర్తి చేయించారు. చెన్నై - కొలకత్తా మెయిన్ లైన్ కు ప్రత్యామ్నాయ మార్గంగా వుండే విధంగా కాకినాడ, భీమవరం మీదుగా సామర్లకోట నుంచి విజయవాడ వరకూ లైన్ నిర్మాణానికి మధ్యలో మిగిలిన కోటిపల్లి నుంచి నర్సాపురం వరకూ రైల్వే లైన్ సర్వే, స్థల సేకరణ కూడా దాదాపుగా పూర్తి చేయించి కోనసీమకు రైలు వచ్చేందుకు మార్గం సుగమం చేయించారు. అయితే ఆయన అకాల మరణం ఆ ప్రాజెక్ట్ కు శాపంలా మారింది.
గత కొంతకాలంగా రైల్వే బడ్జెట్ లో ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనేది కాదనలేని సత్యం. దీనికి రైల్వే మంత్రుల్ని బాధ్యులుగా అందరూ మాట్లాడుతుంటారు. కానీ ప్రజాప్రతినిదులనేవారు తమ ప్రాంత ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చెయ్యాలి. అందుకే వాళ్ళను వాళ్ళ ప్రాంత ప్రజలు ఎన్నుకుని చట్ట సభలకు పంపుతారు. సరైన పద్ధతిలో, సరైన రీతిలో ప్రభుత్వానికి తమ ప్రాంత అవసరాలు, సమస్యలు తెలిపితే ఆయా శాఖల మంత్రులకు అర్థం అవుతుంది. పరిష్కారం దిశగా ఆలోచిస్తారు. పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఉదాహరణే కోనసీమ రైల్వే లైన్. ఈ లైన్ వల్ల అక్కడి వ్యవసాయ ఉత్పత్తులు బయిట ప్రాంతాలకు సులువుగా, దళారుల ప్రమేయం లేకుండా చేరడం వలన తక్కువ ఖరీదుకు దొరికే అవకాశం ఉంది. అలాగే జాతీయ సంపద తరలింపు విషయంలో కూడా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. బాలయోగి గారి ముందు వరకూ పనిచేసిన అక్కడి ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల వాగ్దానాల వరకే ఈ అంశాన్ని పరిమితం చేసారు తప్ప చిత్తశుద్ధితో కృషి చెయ్యలేదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితి అదే !
బాలయోగి గారి హయాంలో కూడా రైల్వే మంత్రి మమతా బెనెర్జీనే ! ఆవిడ స్వహస్తాలతో కోనసీమ నడిబొడ్డు, ప్రధాన పట్టణం అయిన అమలాపురంలో రైల్వే లైన్ కు శంకుస్థాపన చేసారు. అంతకుముందు దశాబ్దాలుగా సాధ్యం కానిది కేవలం ఆయన లోక్ సభాపతిగా వున్న అతి కొద్ది కాలంలో ఎలా సాధ్యమైంది ? ఇప్పుడెందుకు సాధ్యం కావడం లేదు ?
అప్పటి మమతా బెనేర్జీనే ఇప్పుడు కూడా రైల్వే మంత్రిగా వున్నారు. కానీ ఆ లైన్ బాలయోగిగారి తర్వాత ఒక అంగుళం కూడా ఎందుకు కదలలేదు ? అంటే అది బాలయోగి గొప్పతనమా ? తర్వాత ప్రజాప్రతినిధుల చేతకానితనమా ? కాదు.... చిత్తశుద్ధి లోపించడమే ప్రధాన అవరోధం. తమ రాజకీయ ప్రయోజనాలను, స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించకపోతే వారిని ఎన్నుకున్న ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కలుగదు.
పేద దళిత కుటుంబంలో, మారుమూల పల్లెలో పుట్టిన బాలయోగి కార్యదీక్షగల నాయకుడిగా ఎదగడానికి ఆయన క్రమశిక్షణ, పట్టుదల కారణం. దీక్షగా చదివి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లా పట్టా తీసుకున్నారు. సైకిల్ మీద కోర్ట్ కెళ్ళిన దశ నుండి ప్రభుత్వ వాహనంలో లోక్ సభకు వెళ్ళిన దశకు చేరుకున్న క్రమంలో ఎంతో పట్టుదల, దీక్ష కనిపిస్తుంది. ఆయన మిత్రుడు, తెలుగు దేశం నాయకుడు యనమల రామకృష్ణుడు తోడ్పాటుతో రాజకీయాల్లో ప్రవేశించి మెట్టు మెట్టు చాలా వేగంగా అధిరోహించి ఉన్నత స్థానానికి చేరారు. లోక్ సభ సమావేశాల సమయంలో తప్ప మిగిలిన సమయంలో చాలా భాగం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆయన స్నేహితుల జాబితా కుల, మత రహితం. అన్ని వర్గాల వారు ఆయన స్నేహితులే ! అందర్నీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. అందరి సమస్యలూ ఓపికతో విని పరిష్కారానికి ప్రయత్నించడం ఆయన నైజం. లోక్ సభాపతి స్థాయిలో కూడా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో తమ ఇంట్లో శుభకార్యానికి ఎవరు ఆహ్వానించినా అవకాశం ఉన్నంతవరకూ తప్పక హాజరయ్యేవారు.
బాలయోగి ఎస్టేట్లు సంపాదించుకోలేదు. ఆయన సంపాదించింది అంతకంటే విలువైన ప్రజాబలం. అదే ఆయన ధనం. దాన్ని ఆయన డబ్బు పోసి కొనుక్కోలేదు. ప్రజాసేవ పట్ల అంత చిత్తశుద్ధి కలిగిన నాయకుడిని మళ్ళీ మనం చూడలేమేమో ! ఆయన హయాంలో నాలుగు లైన్ల జాతీయ రహదారుల్నీ, పాత రహదారులకు కొత్తగా జాతీయ హోదాను, దూరంగా వున్న ప్రాంతాలను దగ్గర చేసే భారీ వంతెనలను, సుందరంగా మారిన కోనసీమ గ్రామాలను చూసాం గానీ...... ఆయన ఇంకొంతకాలం జీవించి వుంటే కోనసీమలో రైలు కూత తప్పక వినబడేది. మళ్ళీ మరొక బాలయోగి పుడితే తప్ప అది సాధ్యం కాదేమో !
మన దేశానికి చిత్తశుద్ధి, నిబద్ధత వున్న ప్రజానాయకులు అవసరం లేదనుకుంటాను. అందుకే బాలయోగిని కూడా దేవుడు ఇక్కడ నీ అవసరం లేదని అక్కడ తనకవసరమని అత్యవసరంగా తీసుకెళ్ళిపోయాడు.
2002 మార్చి 3 వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ లోక్ సభ సభాపతి గంటి మోహనచంద్ర బాలయోగి గారిని సంస్మరించుకుంటూ ................
Vol. No. 02 Pub. No. 164
7 comments:
samajika spruha kaligina naayakulu ippudu evaroo leru. raajakeeyam oka vyaaparangaa maarina ee roju, manakunna oke oka maargam prajaaswaamyam. daani viluva thelusukuni mana otunu sadviniyoga parchukunte baalayogi laanti naayakulu manku dorakavachchu. swargeeya balayogi gaariki ghana nivaalulu.
I really like your post. Will continue reading your blog. :)
* చంద్రమోహన్ గారూ !
ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. మీ పేరు తెలిపితే బాగుంటుంది.
Hats off to Balayogi.
madhuri
వినయ దత్తా !
ధన్యవాదాలు
బాలయోగి గారిని తలచుకోని కోనసీమ వాసి వుండడు.
గంట, రెండు గంటలు బస్ లో ప్రయాణింఛి రాజమండ్రి, కాకినాడ ల లో రైలు ఎక్కే ప్రతీ కోనసీమ వాళ్ళూ అనుకునే మొదటి మాట 'బాలయోగి గారు ఉండి ఉంటే ఈ రైలు అమలాపురం లో ఎక్కి ఉండేవాళ్ళం' అని.
రావులఫాలెం నుంచి అమలాపురం వెళ్తున్నపుడూ (రోడ్డు ఇరుకు గా ఉండి రెండు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 30 నిమిషాలకన్నా తక్కువ పడుతోంది), యానాం మీంచి కాకినాడ వెళ్తున్నపుడూ, చించినాడ మీంచి పాలకొల్లు వెళ్ళేటప్పుడూ ఆయన గొప్పతనం గూర్చి మాటలే
- బాలు
బాలు గారూ !
మీరు చెప్పినవి అక్షరాలా నిజం.ధన్యవాదాలు.
Post a Comment