Saturday, July 31, 2010

గిలిగింతల ' అల్లు '


హాస్యానికి పుట్టినిల్లు
ఏ పాత్రకైనా చెల్లు
కురిసే హాస్యపు జల్లు 
గిలిగింతల ' అల్లు '

ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్లుంటుంది
అల్లురామలింగయ్య గారి గురించి, ఆయన నటన గురించి,
ముఖ్యంగా ఆయన హాస్యాన్ని గురించి చెప్పడం.


హాస్యనటులలో పద్మశ్రీని అందుకున్న అరుదైన గౌరవం ఆయనది
రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందిన విశిష్టత ఆయనది
ఉన్నతమైన ఆ అవార్డులను మించిన ప్రేక్షకుల రివార్డులు అందుకున్న వ్యక్తిత్వం ఆయనది

ఈరోజు ( జూలై 31 )  అల్లురామలింగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయనకు హాస్యాంజలులు సమర్పిస్తూ....


Vol. No. 01 Pub. No. 359

Friday, July 30, 2010

జరీ అంచు తెల్లచీర


 జరీ అంచు తెల్లచీర, సామాన్యులకది అందని పండే ! అందులోను విశాలాక్షి లాంటి దిగువ మధ్య తరగతి అమ్మాయిలకైతే మరీను. ఎప్పుడో పదేళ్ళ క్రితం తనకు ఆరేళ్ళప్పుడు   సినిమా హాల్లో చూసింది, జరీ అంచు తెల్లచీరని. అప్పట్నుంచి ఆమె కలల్లో తళుక్కుమని ఆ చీర మెరవడం ప్రారంభమైంది.  ఆ కోరిక ఆమెతో బాటు పెరిగి పెద్దదయింది. అడిగితే నాన్న " చూద్దాంలే " అంటాడు. అమ్మ కష్టాలన్నీ ఏకరువు పెట్టి ఎలాగూ పెళ్లి చెయ్యాలి కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని ముగిస్తుంది.



.........................................................................................

"  ఎవ్వర్నీ ఏమీ అడగను " 
అని ఎన్నోసార్లు నిశ్చయించుకుంది విశాలాక్షి. 
ఫలానాది కావాలని ఎవర్నడిగినా వాళ్ళకుండే బాధలన్నీ వెళ్ళబుచ్చక తప్పదు.
వాళ్ళలా చెపుతుంటే ఇంకా బాధగా వుంటుంది విశాలాక్షికి. 

..........................................................................................

ఆడపిల్లకు పెళ్లి అవసరం దేనికి ?

..........................................................................................

కట్టుకుందికి గుడ్డముక్కా ! రెండు పూటలా ఇంత తిండీ, వీటికోసం ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు.
తప్పదా !
-- తప్పకపోయినా సరే ! ముష్టయినా ఎత్తి బతుకుతాను గానీ పెళ్లి మాత్రం చేసుకోను.
పెళ్ళాడకపోతే నువ్వు ముష్టి ఎత్తవలసి వుంటుంది. నీకు డబ్బూ లేదు  ; చదువూ లేదు 
---- హావు న్నిజం !! 
ఈమెకి పాటయినా రాదు. ఈమె గుడ్డిదయినా కాదు. ఈమేకి శక్తయినా లేదు, మరి, లోకానికి దయన్నది లేదు.

.........................................................................................

ఆన్నయ్య ఫ్రెండ్ కనకారావు. వాడంటే విశాలాక్షికి చిరాకు. పిల్లను పెళ్లాడితే బాగుంటుందని తల్లి ఆశ.

........................................................................................

----- కనకారావునా నే పెళ్ళాడేది !!

.........................................................................................

ఇది విశాలాక్షి అభిప్రాయం.

........................................................................................


ఒక్క తెల్ల చీర .... నేతదే..... నూలుదే...... కానీ..... జరీ అంచుది ! 


........................................................................................


అది కూడా కొనుక్కోలేని, అన్నాతమ్ముడు చదువుకోవడానికి మంచి దీపం, పడుకోవడానికి మంచి మంచం, నాన్నకి అగ్గిపెట్టెలు  కొనుక్కోలేని తమ దీన పరిస్థితికి విశాలాక్షికి ఏడుపు వస్తోంది.

ఆరోజు విశాలాక్షి తండ్రి చీర కొనడానికి బజారుకెడదాం అన్నప్పుడు సహజంగానైతే ఎగిరి గెంతాలి విశాలాక్షి. కానీ ఆమెకు ఆస్పత్రి, రోగాలు గుర్తుకు వచ్చాయి.

.........................................................................................

.... ఈ రోజు సాయంకాలం ----
గోడవైపు తిరిగి కంటినీరు పెట్టడానికి కారణం అవన్నీ జ్ఞప్తికి రావడం కాదు.
ఇంకోటి కూడా వుంది.
అది ఉండబట్టే అవన్నీ స్పురణకు వచ్చాయి. 
అది......
రక్తం !
బజారుకి వెళ్దామన్న మనిషి బజార్లో ఇవ్వబోయేది డబ్బుకాదు. నెత్తురు.
అతని ముఖం చూస్తేనే తెలుస్తుందా విషయం.
రక్తం ధారపోస్తేనేగానీ తీరని కోరికలు నా కక్కరలేదు. 


.........................................................................................
 

.... అనుకుంది విశాలాక్షి. ఆమె చీర వద్దన్నా తండ్రి వినలేదు. బయిల్డేరదీసాడు.

........................................................................................

అతని దగ్గరున్నది పన్నెండు కాబోలు అంతకంటే ఎక్కువ మాత్రం కాదు. 
ఏ దుకాణంలో అడిగినా, కావలసిన, చీర కనీసపు ఖరీదు ఇరవై. 
షాపులు ఎక్కేరు, దిగేరు. 
అందులోను ఆఖరి షాపువాడు !
మరొక కనకారావు !
ఆ షాపు మొఖం చూస్తేనే వెళ్లాలనిపించలేదు. 
"  ఒద్దు నాన్నా ! అది గొప్ప షాపు " 
"  ఇంతదూరం వచ్చేం కదా ! పోయి చూద్దాం రా " 
షాపు వాడేకాదు కనకారావు, వాడి నౌఖర్లందరూ కూడా కనకారావులే !  

..........................................................................................

.... షాపు వాడి పలకరింపులో, మాటల్లో వెటకారం స్పష్టంగా కనిపించింది విశాలాక్షికి. చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.

.........................................................................................

...... ఇంతలో వాడు చీరలమేటిలోంచి పైకి.   
జరీ ! జరీ ! జరీ అంచు తెల్లచీర  
తాచుపాముని చూసినట్లు జడుసుకుంది విశాలాక్షి.
దూరంగా, దూరంగా, ఈ విషాన్ని దూరంగా తీసేయండి. 
"  ఎంతండీ ?  "
"  ఇరవై రెండు "
అతను జంకి జంకి, భయపడి భయపడి,
"  కొంచెం.....కొంచెం అయినా....తగ్గదంటారా ? "  అనేసరికి
"  ఇదేం శుక్రవారం సంత కాదు బేరాలాడ్డానికి "  అనే మాటలతో కొట్టాడు వాడు .   

..........................................................................................

 .... తండ్రి తక్కువ ఖరీదులో చూపించమన్నప్పుడు షాపులో వాళ్ళు కనీసం వెటకారంగానైనా నవ్వలేదు.

........................................................................................

"  నేవద్దంటే ఎందుకు విన్నావు కాదు నాయినా ! "

" అంత ఖరీదుంటాయనుకోలేదే "

నెత్తురే ఖరీదుగా ఇచ్చినా దొరకని వస్తువులు !

..........................................................................................
 
.... విశాలాక్షి నిరాశతో కొట్టుకుపోతోంది. ఏడుపు వస్తోంది.

..........................................................................................

అన్నయ్యకి ఫిజిక్స్ పాఠం అర్థం కాదు. తమ్ముడికి పదమూడో ఎక్కం చస్తే రాదు. అమ్మకి నిద్దర పట్టడం అనేది వుండదు. నాన్న అగ్గికోసం వెతుకుతూనే ఉంటాడు. చిన్నతమ్ముడు ఏడవక తప్పదు. ఈ వెలగలేని దీపం ఎంతోసేపు వెలగదు. 
---- నే నేడ్వను,
అనుకున్న విశాలాక్షికి మరింక ఆగకుండా ఏడుపు వస్తోంది.

.........................................................................................

ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపిలేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దవాలనం. ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం.----


ఒక్కటి ! ఒక్కటే సుమండీ ! ఒక్క జరీ అంచు తెల్లచీర !!


..........................................................................................

..... మధ్య తరగతి మిథ్యా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న సగటు ఆడపిల్ల మనస్తత్వం ఇది. అందరికీ కలలుంటాయి. కొందరికి అవి తీర్చుకునే అవకాశం, అదృష్టం వుంటాయి. కానీ మన సమాజంలో చాలామంది పరిస్థితి తమ కలల్ని నిజం చేసుకునే దారి లేక, వాటికోసం కన్నవారిని ఇబ్బంది పెట్టలేక నలిగిపోవడమే !

ఈ సత్యాన్ని ఆవిష్కరించిన ఈ ' జరీ అంచు తెల్లచీర ' రచయిత రావిశాస్త్రి గారు.  ఆయన జన్మదినం సందర్భంగా ఈ కథాపరిచయం.   

Vol. No. 01 Pub. No. 358

జూలై 30

1922 వ సంవత్సరం జూలై 30 వ తారీఖు 
అవినీతిని, అన్యాయాన్నీ కలమే బలంగా
అక్షరమే ఆయుధంగా ఎదుర్కొన్న రచనా యోధుడు
రావిశాస్త్రి అనబడే రాచకొండ విశ్వనాధశాస్త్రి పుట్టిన రోజు 

ఆయన కథావస్తువు వాస్తవ ప్రపంచం
ఆయన పాత్రలు మనచుట్టూ వున్న సామాన్యులు
సాహితీ ప్రియులకు ఆయన రావిశాస్త్రి
బడుగు ప్రజలకు ఆయన చాత్రిబాబు

' ఆరు సారో కథలు ' వినిపిస్తాయి ' ఆరు సారా కథలు '
అల్పజీవి నుండి ఇల్లు వరకూ సాగింది నవలా ప్రయాణం 
రచనలెన్నైనా సామాన్య జనుల వెతలే ఆయన రాతలు
వాటినిండా వారి జీవితాల్ని మింగేస్తున్న అవినీతి, అన్యాయాలు

ఆయన మార్గం విప్లవమా ? సాంప్రదాయమా ?
సంప్రదాయంలోంచి పుట్టిన విప్లవం 
ఆయన వాదం నైతికమా ? అనైతికమా ?
అనైతికతను ప్రశ్నించగలిగే నైతికత

సమాజ హితాన్ని కోరే దేన్నైనా స్వీకరించగలగడం ఆయన సహృదయత
విశ్వనాథుని శిరసునుండి వేగంగా ప్రవహించే గంగా ప్రవాహం ఆయన శైలి
' నిజం ' నిర్భయంగా చెప్పగలగడం, భేషజమనేది లేకపోవడం ఆయన నైజం
తెలుగు రచనకు, తెలుగుదనానికి అచ్చతెనుగు సంతకం రావిశాస్త్రి 

రావిశాస్త్రి గారి జన్మదినం సందర్భంగా ఆయన, ఆయన రచనల స్మృతులతో .......................

Vol. No. 01 Pub. No. 357

Wednesday, July 28, 2010

హాస్యాస్పదం





సున్నితమైన హాస్యం, వ్యంగ్యం అణువణువునా తొణికసలాడే సంభాషణలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రచయిత డి.వి. నరసరాజు గారు. సన్మానాలు, బిరుదులపై ఆయన విసిరిన ఓ ఛలోక్తి ............



ఒకప్పుడు ఒకానొక ' కళాసమితి ' వారు నాకు సన్మానం చేస్తామని వచ్చారు.
సన్మానంతో బాటు బిరుదు కూడా  ఇవ్వదలచుకున్నామని చెప్పారు.

" ఏం బిరుదు ఇస్తారు ? " అని అడిగాను. 

" మీరు హాస్యం బాగా రాస్తారుగనుక ' హాస్యాస్పదబ్రహ్మ ' అని ఇద్దామనుకున్నాం " అన్నారు.

" ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. తర్వాత చేయించుకుంటాను సన్మానం " అని పంపేసాను.

' హాస్యం ' , ' హాస్యాస్పదం ' ఈ రెండు పదాలకు తేడాలేదు వారి దృష్టిలో.

మిత్రుల ఇళ్ళకు వెడితే వాళ్లకిచ్చిన సన్మాన పత్రాలు  గోడలకు తగిలించినవి, షో కేసులలో పెట్టివున్నవి తీరిగ్గా చదవడం నాకు ఎంతో ఇష్టం !

వాటిలో ఎంతో ' హాస్యం ' వుంటుంది. ' హాస్యం ' , హాస్యాస్పదం ' లాంటిదే !

Vol. No. 01 Pub. No. 356

Tuesday, July 27, 2010

దాశరధి రత్నాలు - జవాబు

  కనుక్కోండి చూద్దాం - 23
 జవాబు 


 
కోటి రతనాల పాట ' దాశరధి 'టపాలో ఆయన మధుర గీతాలను గుర్తు చేస్తూ
అందించిన కదంబ మాలికలో వున్న పాటలు
చిత్రాల లోనివో వరుస క్రమంలో చెప్పగలరా ?


ఈ ప్రశ్నకు జవాబు .................


1 . వాగ్దానం ( 1961 ) 2 . ఇద్దరు మిత్రులు ( 1961 ) 3 . చదువుకున్న అమ్మాయిలు ( 1963 ) 4 . అమరశిల్పి జక్కన ( 1964 ) 5 . దాగుడు మూతలు ( 1964 ) 6 . మూగమనసులు ( 1964 ) 7 . నాదీ ఆడజన్మే ( 1965 ) 8 . రంగులరాట్నం ( 1966 ) 9 . పూలరంగడు ( 1967 ) 10 . బంగారుగాజులు ( 1968 ) 11 . బుద్ధిమంతుడు ( 1969 ) 12 . కథానాయకుడు ( 1969 ) 13 . మనసు మాంగల్యం ( 1970 ) 14 . రామాలయం ( 1971 ) 15 . పండంటికాపురం ( 1972 ) 16 . మేనకోడలు ( 1972 ) 17 . మంచిరోజులు వచ్చాయి ( 1972 ) 18 . గూడుపుఠాణీ ( 1972 ) 19 . దేవుడమ్మ ( 1972 ) 20 . అంతా మన మంచికే ( 1972 ) 21 . బుల్లెమ్మ బుల్లోడు ( 1972 ) 22 . కాలం మారింది ( 1972 ) 23 . భక్త తుకారాం ( 1973 ) 24 . కన్నె వయసు ( 1973 ) 25 . పుట్టినిల్లు మెట్టినిల్లు  ( 1973 ) 26 . మీనా  ( 1973 ) 27 . గౌరి ( 1974 ) 28 . నోము ( 1974 ) 29 . జమిందారుగారి అమ్మాయి ( 1975 ) 30 . తోటరాముడు ( 1975 ) 31 . పూజ ( 1976 ) 32 . భద్రకాళి ( 1976 ) 33 . మహాకవి క్షేత్రయ్య ( 1976 ) 34 .  దాన వీర శూర కర్ణ ( 1977 ) 35 . ప్రేమ పగ ( 1978 ) 36 . మాయింటి దేవత ( 1980 )   

Vol. No. 01 Pub. No. 355

Monday, July 26, 2010

కార్గిల్ అమర వీరులకు జోహార్లు

 దేశరక్షణలో నిస్వార్థంగా 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం చేసి ప్రాణాలర్పించిన  వీరుల గౌరవార్థం ఈరోజు కొంత సమయం కేటాయిద్దాం. 

మనం సినీ నటుల్నో, క్రికెటర్ లనో ఆరాధించేముందు వారి కంటే ఆ ఆరాధనకు నిజంగా అర్హులైన వాళ్ళు వేరే  వున్నారని గుర్తించాలి.  ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా వారి త్యాగాలకు ప్రణామాలర్పిస్తూ.....


1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు తన కుటుంబానికి రాసిన లేఖలోని సారాంశం :



పాకిస్తాన్ నుండి మన చివరి పర్వతాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నాం. 
కానీ విలువైన గొప్ప సైనిక సోదరుల్ని పోగొట్టుకున్నాం. ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన తరుణం.






 



కార్గిల్ యుద్ధంలో అమరులైన

 


 

కు అంజలి ఘటిద్దాం !

లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా



 



 







అతని జ్ఞాపకంగా అతను ధరించిన యూనిఫారం




కెప్టైన్ విక్రం బాత్రా
పరమ వీర చక్ర ( మరణానంతరం )
    






 

  





గ్రేనడీర్ యోగేంద్ర సింగ్ 
పరమ వీర చక్ర





 

RFN .సంజయ్ కుమార్
(పరమ వీర్ చక్ర )



 

 




 
మేజర్ పద్మపాణి ఆచార్య,
మహా వీర్ చక్ర ( మరణానంతరం )
 2 వ బెటాలియన్, రాజపుటాన రైఫిల్స్

 






లెఫ్టినెంట్ బలవాన్ సింగ్,
మహా వీర్ చక్ర
18 వ బెటాలియన్, గ్రేనేడర్స్ రెజిమెంట్ 






 


మేజర్  M శరవణన్,
వీర్ చక్ర ,
1 బీహార్ 







  
లెఫ్టినెంట్ కనద్ భట్టాచార్య,
సేన మెడల్ ( మరణానంతరం )(
22 సంవత్సరాలు )
సిఖ్ లి
 













కెప్టైన్ సాజు చెరియన్ ,
సేన మెడల్
307 మీడియం రెజిమెంట్ 




 

లెఫ్టినెంట్  కీషింగ్ క్లిఫ్ఫార్డ్ నంగ్రుం,
మహా వీర్ చక్ర (
మరణానంతరం )
  12 వ బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ 



 




కెప్టైన్ R జెర్రీ ప్రేమ్ రాజ్ ,
వీర్ చక్ర (
మరణానంతరం ),
158 మీడియం రెజిమెంట్ 

 
 




మేజర్ సోనం వాంగ్ ఛుక్ ,
మహా వీర్ చక్ర
లడఖ్ స్కౌట్స్  






 

యుద్దానికి బయిల్దేరే ముందు రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన  జవానులు, సైన్యాధికార్లు ప్రార్థన చేస్తున్న దృశ్యం.
ముందు రైఫిల్ తో వున్న సైనికుని వెనుక గెడ్డంతో ముఖం కొంతమేర కప్పబడి వున్న వ్యక్తి కెప్టెన్ విజయంత్ తాపర్. ఆయనకు మరణానంతరం వీర చక్ర బిరుదు ఇవ్వబడింది.


 

 టోలోలింగ్ శిఖరాన్ని జయించిన తర్వాత ద్రాస్ సబ్ సెక్టార్ లో వున్న నల్లరాతి నాల్ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య ( ఆంధ్రప్రదేశ్ ) తన దళాన్ని నడిపిస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ఆయన 29 జూన్ 1999 న అమరుడయ్యారు. 
ఆయనకు మరణానంతరం పరమ వీర చక్ర పురస్కారం లభించింది.






మన సైనికుల సాహస విన్యాసాలు

శ్రీనగర్ - కార్గిల్ రోడ్ గా పిలువబడే లే - బాతాలిక్ రహదారి అత్యంత ప్రమాదకరమైనది. ఏటవాలుగా ఉండే పర్వత ప్రాంతాలలో ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తుంటారు మన జవానులు. ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణంతో విశ్రాంతికి, ఆలోచించుకోవడానికి కూడా వారికి చాల స్వల్ప సమయమే దొరుకుతుంది.


 



అనునిత్యం ప్రమాదాల అంచున ప్రయాణించే మన వీర జవానులకు ఈ కొండ అంచున వున్న సన్నని రహదారి ఓ లెఖ్ఖా ?








కెప్టెన్ విజయాంత్ థాపర్ ( రాబిన్ )

తన 22 వ ఏట మనందరి భవిష్యత్తుకై ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు 


 






 









తన తల్లిదండ్రులకు విజయాంత్ రాసిన చివరి ఉత్తరం 



 


  




 










  

 ఆ తర్వాత మువ్వన్నెల జెండా కప్పుకుని ఇంటికి జేరాడు















ఆనాటి కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన 23 మంది సైనికుల త్యాగం
మరువలేనిది. ఆ బెటాలియన్ భారత దేశంలో అత్యంత ప్రతిష్థాకరమైన మహవీర చక్ర పురస్కారాలు నాలుగు లభించాయి. అందులో మూడు మరణానంతరం అందించారు.








శత్రు సంహారంలో మరణించిన రెండవ రాజపుఠానా రైఫిల్స్ కు చెందిన మేజర్ వివేక్ గుప్తా భౌతిక కాయానికి ఆయన భార్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ కి చెందిన కెప్టెన్ ( డా. ) రాజశ్రీ గుప్తా సెల్యూట్ చేస్తున్న దృశ్యం.





 
మన రక్షణ కోసం ప్ర్రాణాలను పణంగా పెట్టిన మన వీర జవానులను చూసి మనమంతా గర్వపడాలి 




ముఖ్యంగా భారతీయులమైనందుకు గర్వపడాలి 









Vol. No. 01 Pub. No. 354

Friday, July 23, 2010

దాశరధి గారి రత్నాల్లాంటి పాటలు కనుక్కోండి !

  కనుక్కోండి చూద్దాం - 23  


మధురకవి దాశరధి గారి జయంతి సందర్భంగా  నిన్న ప్రచురించిన

కోటి రతనాల పాట ' దాశరధి '

టపాలో ఆయన మధుర గీతాలను గుర్తు చేస్తూ
అందించిన కదంబ మాలికలో వున్న పాటలు
చిత్రాల లోనివో వరుస క్రమంలో చెప్పగలరా ?

దాశరధిగారి జయంతి హైదరాబాద్ లో జరుపుకున్న విశేషాలు ప్రముఖ రచయిత శ్రీ సుధామ ( అల్లంరాజు వెంకటరావు ) గారు పంపించారు. వారికి ధన్యవాదాలతో....... మీకోసం ......

ఆ వార్త లింక్ :  http://www.andhrajyothy.com/tabloids/2010/jul/23/Hyd/hyd17.pdf 






Vol. No. 01 Pub. No. 353

Thursday, July 22, 2010

కోటి రతనాల పాట ' దాశరధి '


 ఆ కలం ' అగ్నిధార ' యై నిజాం మీద నిప్పులు కురిపించింది
ఆ కలం పేదల ఆకలిని  ' రుద్రవీణ '  పై పలికించింది
ఆ కలం ' మహాంధ్రోదయం ' కి నాంది పలికింది


ఆ కలం ' గాలిబ్ గీతాలు ' అనువదించింది
ఆ కలం ' తిమిరంతో సమరం ' చేసింది
ఆ కలం మనందరికీ ' కవితాపుష్పకం ' పంచింది


ఆ కలం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారమందుకుంది
ఆ కలం తెలుగు ప్రజల సాహితీ నీరాజనాలందుకుంది
ఆ కలం తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించింది

............... ఆ కలం దాశరధి కృష్ణమాచార్యులుది.
తెలుగు కవితా భారతిని తన కవిత్వంతో పరిపుష్టం చేసిన కవి దాశరధి.
తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన కవి దాశరధి.

దాశరధి గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతుల రతనాలు కొన్ని .......

 



Vol. No. 01 Pub. No. 352

Tuesday, July 20, 2010

కవిత - నాటిక

 డి.వి. నరసరాజు గారు సంభాషణలు చమత్కారాలు, వ్యంగ్యాలతో నిండి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. నరసరాజు గారు రాసిన ఒకేఒక పాట " మావూరి గంగ " ( 1975 ) చిత్రంలో వుంది. దాని ట్యూనింగ్ సమయంలో జరిగిన సంఘటన.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరో పాట రాయడానికి ఆ సమయంలో రావడం జరిగింది. నరసరాజుగారి కుమార్తె కూడా అప్పుడు అక్కడే వుంది. కృష్ణశాస్త్రి గారికి ఆమెను
" మా అమ్మాయి కవిత " అంటూ పరిచయం చేశారు.
 శాస్త్రి గారు వెంటనే " అదెలా సంభవం ? నేనొప్పుకోను. న్యాయమైతే ఆ అమ్మాయి పేరు నాటిక అని  వుండాలి "  అని రాసారు.
నరసరాజు గారి పాట ట్యూనింగ్ అయిపొయింది. కృష్ణశాస్త్రిగారు పాట విన్నారు.  ఎవరు రాసారని అడిగారు. నరసరాజు గారని చెప్పగానే మళ్ళీ
 " మా అమ్మాయి పేరు కవిత " అన్నారు.
" ఇప్పుడు ఒప్పుకుంటాను " అంటూ ఇంకా ఏదో రాసి కవితకు ఇచ్చారు. అందులో
" మీ నాన్నగారు పాటలు కూడా రాసి మా నోట్లో మట్టి కొట్టేలా వున్నారు " అని వుంది.

Vol. No. 01 Pub. No. 351

Monday, July 19, 2010

ఫైటింగ్ లంటే ఈలపాటలా ?

మన సినిమాల్లో చూపించనంత సులువుగా యుద్ధ దృశ్యాలు, హీరో విలన్ ల ఫైటింగ్ లు రంగస్థలం మీద చూపడం కుదరదు. మన స్టార్ లు వెండితెర మీద చాలా రకాల ఫైటింగ్ లు చేసేస్తూ వుంటారు. అమాంతం సూపర్ స్టార్ లయి పోతుంటారు. కానీ రంగస్థలం మీద అలా కాదు. ముఖ్యంగా పౌరాణిక నాటకాలలో పద్యం ఎంత బాగా పాడితే, సంభాషణలు ఎంత బాగా పలికితే అంత సూపర్ స్టార్లు.

ఈలపాట రఘురామయ్య రంగస్థలం మీద సూపర్ స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిందే ! ఆయన పద్యం పాడే పధ్ధతి, సంభాషణలు పలికే తీరు గురించి తెలుగు నాటక ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనకే ప్రత్యేకమైన ఈలపాట గురించి వేరే చెప్పాలా ? ఆయన్ని ఫైటింగ్ చెయ్యమంటే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా .............

ప్రముఖ దర్శక నిర్మాత బి. ఏ. సుబ్బారావు గారు 1950 లో నిర్మించిన  " పల్లెటూరి పిల్ల " చిత్రంలో  అక్కినేని నాగేశ్వర రావు గారు పోషించిన పాత్రకు మొదట రఘురామయ్య గారిని తీసుకున్నారు. రెండు మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు. ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన చేతికి కత్తి గీసుకుపోయింది. అసలే ఫైటింగ్ ల అనుభవం లేకపోవడం, మొదటి సారే గాయం కావడంతో ఆయన భయపడ్డారు. దాంతో

" బాబ్బాబూ ! మాటా, పాటా అంటే ఏదో అఘోరిస్తాగానీ ఈ ఫైటింగ్ లు చచ్చినా నా వల్ల కాదు. మరెవరినైనా బుక్ చేసుకోండి. మీకు పుణ్యం వుంటుంది "

అని సుబ్బారావు గారిని బ్రతిమలాడి ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అప్పుడా పాత్ర అక్కినేనిని వరించింది. 

Vol. No. 01 Pub. No. 349

Reunion - స్నేహమేరా జీవితం

 స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం

ఆ స్నేహాన్ని నిజంగానే శాశ్వతం చేసుకున్నారు రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1984 బ్యాచ్ విద్యార్థులు. నిన్న జరిగిన ఆ కలయికలో వారి ఆనందం, ఉత్సాహం, ఉద్వేగం చెప్పనలవికాదు. ఒక్కసారిగా అందరూ పాతిక సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ చిన్న పిల్లలయిపోయారు. పదవతరగతి విద్యార్థులుగా మారిపోయారు. హాయిగా ఆడి పాడి తమ మిత్రుల్ని కలసిన ఆనందాన్ని పంచుకున్నారు. నిన్నటి వారి ఆనందం వర్ణనాతీతం.

వారి స్కూల్ జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి నేను తయారు చేసిన డాక్యుమెంటరీలోని కొన్ని ఘట్టాలు.........



Vol. No. 01 Pub. No. 348a

Saturday, July 17, 2010

స్నేహబంధమూ... ఎంత మధురమూ ...!!


స్నేహబంధము ఎంత మధురము 
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ ...

చిన్ననాటి జ్ఞాపకాలు తీయనైనవి
నూరేళ్ళు గడిచినా అవి మరపురానివి





...... అని నిరూపించారు విజయవాడ రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1983-84 నాటి విద్యార్థులు....... ఇప్పటి బాధ్యతలు గలిగన పౌరులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో, వృత్తుల్లో స్థిరపడి ఆ భాధ్యతల్లో మునిగిపోయి తీరిక లేకుండా వున్న సుమారు 100 మంది ఈరోజు  ( జూలై 17 వతేదీ శనివారం ) విజయవాడలో కలవబోతున్నారు.

తమ తమ స్థాయిలు, హోదాలు మరచిపోయి బాల్యమిత్రులను కలవాలనే అభిలాషతో ఉత్సాహంగా ఉరకలేస్తూ  దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్నారు.

తమకు విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన అప్పటి ఉపాధ్యాయులను, ఆ అవకాశాన్ని కల్పించిన ఆ పాఠశాలను స్మరించుకోవడానికి, సత్కరించుకోవడానికి సిద్ధంగా వున్నారు.

ఎప్పుడో పాతికేళ్ళక్రితం నాటి సహాధ్యాయుల వివరాలు సేకరించడం అంత సులభం కాదు.  ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారందరి వివరాలు, చిరునామాలు సేకరించడం కష్టం. ఒకరకంగా అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు విజయవాడలో స్థానికంగా వున్న మిత్రులు. ముఖ్యంగా ఏక్సిస్ బ్యాంకు లో ఉన్నత స్థానంలో వున్న శరత్ చంద్ర, విజయవాడ రైల్వే లో పనిచేస్తున్న మరికొందరు మిత్రులు, ఇంకా ఇతర రంగాలలో వున్న మిత్రులు కలసి సుమారు నాలుగు నెలలుగా ఈ బృహత్ కార్యక్రమం చేపట్టి ఇంటర్నెట్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా అందరి వివరాలు సేకరించగలిగారు. అందర్నీ ఒక త్రాటి మీదకు తీసుకురాగలిగారు. ఫలితంగా ఇంతమంది మిత్రులు పాతికేళ్ళ అనంతరం మళ్ళీ కలవబోతున్నారు.

ఆ అనుభూతి ఎంత మధురమో ముందరే నేను చవిచూసాను. మిత్రులు శరత్ చంద్ర గారికి ఈ సందర్భంలో కేవలం కలవడం, చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవడం, విడిపోవడం మాత్రమే కాకుండా తమ చిన్నప్పటి మధుర స్మృతుల్ని శాశ్వతంగా పదిలపరచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నన్ను సంప్రదించారు. అప్పటి ఉపాధ్యాయుల,  మిత్రుల జ్ఞాపకాలను వారి చేతనే చెప్పించి రికార్డు చేసి డీవీడీలుగా తయారుచేసి మిత్రులందరికీ అందించడానికి ప్రణాళిక రూపొందించాం. ఆ మిత్రుల పట్టుదల  నాకు ఉత్సాహాన్నిచ్చింది. క్రిందటి నెలలో షూటింగ్ అనుకున్న రోజున విజయవాడ పరిసరాలు, హైదరాబాద్, చెన్నై లాంటి చోట్లనుండి సుమారు 30 మంది హాజరయ్యారు. అప్పటి ఉపాధ్యాయులు సుమారు 10 మంది హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమానికి నాంది పలికిన ఆనాటి కార్యక్రమానికి హాజరయిన మిత్రుల ఆనందం వర్ణనాతీతం. అందులోను వారు చదువుకున్న పాఠశాలలో కలవడం వారి ఆనందాన్ని అవధులు దాటించింది. వాళ్ళు వయసు, హోదాలు అన్నీ మరచిపోయి మళ్ళీ ఆనాటి విద్యార్థి దశకు వెళ్ళిపోయారు. వారి సంతోషం చూసి తీరాల్సిందే ! వారికంటే ఎక్కువ అనుభూతి పొందినవారు, ఆనందించినవారు అప్పట్లో వారికి విద్యనందించిన ఉపాధ్యాయులు. 

మళ్ళీ వాళ్ళూ, ఇంకా మిగిలిన మిత్రులు తమ కుటుంబాలతో సహా ఈరోజు కలుస్తున్నారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభూతుల్ని, అనుభవాల్ని, ముచ్చట్లను చిత్రీకరించే అవకాశం నాకిచ్చారు. అవన్నీ డాక్యుమెంటరీ లాగ పేర్చి, కూర్చి పదిలపరిచాను. ఈరోజు వారందరూ ఆ జ్ఞాపకాలమాలికను అందుకోబోతున్నారు. వారి జీవితకాలంలో ఆ జ్ఞాపకాల్ని  కేవలం మనసులో తలుచుకోవడంతో సరిబెట్టక తమ బాల్య మిత్రుల్నీ, తాము చదివిన పాఠశాలను కళ్ళెదుట నిలుపుకోవాలని మిత్రులు శరత్ చంద్ర ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేను కార్యరూపంలో పెట్టాను.

భవిష్యత్తులో వాళ్ళే కాదు.... వారి పిల్లలు.... వారి మనుమలు కూడా ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటారు. స్నేహబంధం లోని మాధుర్యాన్ని చవి చూస్తారు.  ఇదొక విచిత్రమైన, మధురమైన అనుభూతి. పాతికేళ్ళ తర్వాత ఒకే వేదిక పైకి రానున్న ఆ మిత్రులందరికీ శుభాకాంక్షలు.

Vol. No. 01 Pub. No. 348

Thursday, July 15, 2010

మధురకవి అస్తమయం

 
మధుర కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు

 భావగీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు ఎన్నో ఎన్నెన్నో...
మధురమైన రచనలు ఎన్నిటినో ఆయన కలం అందించింది
ఆ గీతాల ఆలాపనతో గాయనీ గాయకులు తరించారు
ఆ గీతాలు ప్రసారం చేసి ఆకాశవాణి పులకించింది




తెలుగు కవితామతల్లి ముద్దుబిడ్డ డా. వక్కలంక
అందుకేనేమో ఆ తల్లి అన్నట్లుంది పుడమిని చాలింకని 
ఆయన కవితాగంధం పరిమళాలని తాము కూడా అందుకోవాలని 
అందుకేనా వెళ్ళిపోయారు ఆతల్లి మాట జవదాటనని 

పాటంటే ఏమిటో పరిచయం చేశారు
కవిత్వాన్ని రుచి చూపించారు
భాషలోని సొగసుని తెలిపారు
దగ్గరుండి అక్షరదోషాలు సవరించారు

ఈనాడు ఈ మాత్రం భాషా జ్ఞానం ఆయన భిక్ష
ఈ మాత్రం రాయగలిగే దైర్యమిచ్చింది ఆయన శిక్షణ
ఆయన పుస్తకాలకు మేలు ప్రతులను రాసే వరమివ్వడం నా అదృష్టం
ఆ మహానుభావుడి శిష్యరికం నా జీవితంలో మరువలేని ఘట్టం

మరణం అనివార్యమని తెలుసు
మనమెవరం తప్పించుకోలేమని తెలుసు
ఇదంతా ఆ పరిస్థితి ఎదురవనంతవరకూ మాత్రమే
ఎదురైనప్పుడు మాత్రం తట్టుకోవడం కష్టమే !

అందుకే ఆయన లేరనే విషయం నమ్మబుద్ధి కావటం లేదు
ఆయన అందించిన కవితా జ్యోతులు వెలుగుతూనే వున్నాయి
ఆయన వినిపించిన గీతాలు సుస్వరాలను పంచుతూనే వున్నాయి
అవి ఎప్పుడూ...ఎల్లప్పుడూ...... సంగీత, కవితా ప్రియుల మనస్సులో నిలిచే వుంటాయి 

గురువు గారికి అశ్రునయనాలతో ఆయన రాసిన ఆణిముత్యాలలో ఒకటి .................



ఆదివారం ( 11 - 07 - 2010 )  హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో జరిగిన సంతాప సభ వార్త - ఆంధ్రజ్యోతి నుండి.....


Vol. No. 01 Pub. No. 347

Tuesday, July 13, 2010

పుగళేంది - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 22 
 జవాబులు 

జ్యోతి గారు 5 వ ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. 1 వ ప్రశ్నకు కూడా దాదాపుగా సరైన సమాధానమే ! వారికి ధన్యవాదాలు. స్పందించిన మాధురి గారికి కూడా ధన్యవాదాలు. ఇక జవాబులు ......................

1.  పుగళేంది అసలు పేరేమిటి ?


జవాబు : వేలప్పన్ 
( కొన్నిచోట్ల జ్యోతి గారు చెప్పిన ' వేలాయుధన్ నాయర్ ' అని కూడా కనిపిస్తుంది. పుగళేంది అనే పేరుతో ప్రసిద్దులవడం వలన అసలు పేరు విషయంలో ఈ కన్ఫ్యూజన్  )

2 .  పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?

జవాబు : ' పుగళేంది పులవర్ ' అనేది ఒక ప్రముఖ తమిళ సాహిత్యకారుని పేరు. ఆయన మీద అభిమానంతో ఆ పేరులోని ' పుగళేంది ' ని తన వృత్తి నామం చేసుకున్నారు.

3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ? 


జవాబు : ఆయన ముద్దు పేరు ' అప్పూ '

4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?


జవాబు : తిరువనంతపురం

5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?


జవాబు : విశాలి, వింతకథ, పసివాని పగ, జడగంటలు ... ఇంకా కొన్ని ప్రైవేటు ఆల్బమ్స్ కు కూడా స్వతంత్ర్యంగా సంగీతం సమకూర్చారు. 

Vol. No. 01 Pub. No. 346

Saturday, July 10, 2010

పుగళేంది

  కనుక్కోండి చూద్దాం - 22 

 సుస్వరాల స్వరకర్త మామ కె. వి. మహదేవన్ కు జీవితాంతం కుడిభుజంగా మెలిగిన మిత్రుడు, సహాయకుడు  పుగళేంది.
ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు చెప్పగలరా ?

1.  పుగళేంది అసలు పేరేమిటి ?

2 .  పుగళేంది అనే పేరు ఎక్కడినుంచి గ్రహించారు ?

3 . పుగళేందికి ఒక ముద్దు పేరు వుంది. మామ కూడా తరచుగా అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరేమిటి ? 

4 . పుగళేంది జన్మస్థలం ఏమిటి ?

5 . పుగళేంది కొన్ని తెలుగు చిత్రాలకు స్వతంత్ర్యంగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటి ?


Vol. No. 01 Pub. No. 345

Friday, July 9, 2010

'భట్' రాజీయం


డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి చెప్పగానే మనకి ముందు గుర్తుకొచ్చేది ఆంధ్రాబ్యాంకు. ఆయన దాని వ్యవస్థాపకుడు. తర్వాత కృష్ణా జిల్లాతో, ముఖ్యంగా బందరుతో  అనుబంధమున్న వాళ్లకి ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆంధ్రా జాతీయ కళాశాల. దాని వ్యవస్థాపకుల్లో ముఖ్యులు డా. పట్టాభి. ఆయన దేశభక్తుడు, జాతీయవాది.




ఒకసారి ఆయనకు బందరులో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. సన్మాన సభ అనగానే ఆ సన్మాన స్వీకర్తను పొగడ్తలతో ముంచెత్తడం సర్వసాధారణం. అలాగే ఆ సభలో కూడా పట్టాభిగారి మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఒక శ్రోత మరీ రెచ్చిపోయి " భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు. దానం చేయడంలో ఆయన దానరాజు, త్యాగశీలత గల త్యాగరాజు..... " అంటూ ఆవేశంగా పొగిడేస్తున్నాడు.

డా. పట్టాభి గారికి పొగడ్తలంటే సుతరామూ గిట్టదు. హద్దులు దాటేస్తున్న పొగడ్తలను భరించలేక లేచి మైక్ అందుకుని
" నా గురించి ఈయన చెప్పింది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, ఈయన మాత్రం నిజంగా  ' భట్ ' రాజే ! " అని చమత్కరించారు.
ఇంతకీ అప్పటివరకూ డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిని పొగడ్తలతో ముంచేసిన వక్త పేరు పి.సి.భట్. అదీ సంగతి.


Vol. No. 01 Pub. No. 344

Thursday, July 8, 2010

శిధిల శిల్పం

 తెలుగు నాటక ప్రియులకు చిరపరిచితమైన పేరు బళ్ళారి రాఘవ. రంగస్థల నటుడిగా ఆయన అధిరోహించిన కీర్తిశిఖరాలు మహోన్నతమైనవి.

బళ్ళారి రాఘవాచార్యులు గారి వృద్ధాప్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటయింది. ఆ సభకు ప్రముఖ కవులు, రచయితలు తల్లావఝుల శివశంకర శాస్త్రి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి మహామహులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వీరందరూ రాఘవ గారింట్లోనే బస చేశారు. సభ విజయవంతంగా జరిగింది. ఆ ఆనందం పంచుకోవడానికి వీరందరూ మరో నాలుగైదు రోజులు అక్కడే వుండి పోయారు. వారు తిరుగు ప్రయాణానికి తయారవుతుంటే బళ్ళారి రాఘవగారు .......

" ఎలాగూ ఇంత దూరం వచ్చారు. ఇక్కడకి దగ్గరలోనే హంపి వుంది. అక్కడ శిధిలాలు చూసి పోదురుగాని " అన్నారు.

ఆది విని మాటల శ్లేషల శ్రీశ్రీ  " మిమ్మల్ని చూస్తున్నాంగా...... "  అన్నారు, అప్పటికే శిధిల శిల్పంలా మారిన రాఘవగారిని చూస్తూ !
  
Vol. No. 01 Pub. No. 343

Wednesday, July 7, 2010

ప్రేమ విజయం

1931 వ సంవత్సరం సినిమాలకు మాటలొచ్చిన సంవత్సరం. తెలుగు సినిమాలు కూడా ఆవిర్భవించిన సంవత్సరం. అంతవరకూ సాగిన మూకీల కాలంలో ఇంచుమించుగా అన్ని చిత్రాలు రంగస్థల నాటకాల ఆధారంగా తయారైన పౌరాణికాలే ! అలాగే టాకీలొచ్చిన తొలినాళ్ళలో అప్పటి సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించే సాంఘిక చిత్రాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి.  అవి వెలుగు చూడడానికి సుమారు అయిదేళ్ళు పట్టింది. 1936 లో తొలి తెలుగు సాంఘిక చిత్రం ' ప్రేమ విజయం ' విడుదలయింది.

ఇండియన్ మూవీటోన్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కృత్తివెంటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ప్రేమ విజయం చిత్రం అపజయం పాలు కావడంతో ఆ చిత్రానికి సంబంధించిన చాలా వివరాలు మరుగున పడిపోయాయి. కానీ లభిస్తున్న సమాచారం ప్రకారం ఆ చిత్రానికి ప్రముఖ భావకవులు ' గౌతమీ కోకిల ' వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు సాహిత్యం సమకూర్చారని, ప్రభల కృష్ణమూర్తి కథానాయకునిగా నటించారని మాత్రం తెలుస్తోంది. పౌరాణికాలకు అలవాటుపడ్డ అప్పటి ప్రేక్షకులు సమకాలీన వ్యక్తుల ప్రేమను అంగీకరించే స్థాయికి చేరుకోలేకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలవరకూ ( 1938 ) సాంఘిక చిత్రాల నిర్మాణం చేసే ధైర్యం ఎవరికీ లేకపోయింది. గూడవల్లి రామబ్రహ్మం గారి ' మాలపిల్ల ' వరకూ ఈ స్తబ్దత కొనసాగింది. అయితే సమకాలీన సమస్యల మీద కూడా చిత్రాలు నిర్మించవచ్చనే ఆలోచనను నిర్మాతలలో కలిగించి తర్వాత కాలంలో సాంఘిక చిత్రాల నిర్మాణానికి ' ప్రేమ విజయం ' చిత్రం బాటలు వేసిందని చెప్పవచ్చు.   

Vol. No. 01 Pub. No. 342
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం