Thursday, February 25, 2010

సృజనాత్మక చిత్రాలు

మనలో చెలరేగే భావవ్యక్తీకరణకు మార్గాలెన్నో ! ఒక కవి తన భావాల్ని తన కవిత్వం ద్వారా, రచయిత కథలలాంటి రచనా ప్రక్రియల ద్వారా, సంగీతజ్ఞుడు తన సంగీతం ద్వారా, నటుడు తన నటన ద్వారా, శిల్పి తన శిల్పాల ద్వారా, చిత్రకారుడు తన చిత్రాల ద్వారా తెలియజేస్తారు. ఇందులో చిత్రలేఖన కళ విశిష్టమైనది. ఎందుకంటే పది పేజీలలో ఇమడ్చలేని భావాన్ని చిత్రకారుడు ఒక చిత్రంలో ఇమడ్చగలుగుతాడు. ఈ చిత్రలేఖనంలో నుంచి పుట్టుకొచ్చినదే చాయాచిత్ర కళ అదే ఫోటోగ్రఫి. ప్రస్తుతం ఈ కళ అత్యంత శక్తివంతమైన సమాచార సాధనం. సాంకేతికంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఫోటోగ్రఫి రాజ్యమేలుతోంది. అయితే డిజిటల్ గా ఎంత అభివృద్ధి చెందినా ఫిలింపై వచ్చే నాణ్యతను అధిగమించలేక పోతోంది.
ఆటో ఫోకస్ కెమెరాతోనో, డిజిటల్ కెమెరాతోనో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఎయిమ్ అండ్ షూట్ అన్న పద్ధతిలో పుంఖాన పుంఖాలుగా ఫోటోలు తీసిపడెయ్యడం మనకు తెలుసు. అలాంటి మనకు హఠాత్తుగా ఒక ఎస్.ఎల్.ఆర్. కెమెరా ఇచ్చి ఏదో ఒక విషయం మీద ఫోటోలు తీసుకురమ్మంటే అవి సాగరసంగమం సినిమాను గుర్తుకుతెస్తాయేమో ! అలాంటి దశ నుండి ఇప్పుడిప్పుడే సాంకేతికాంశాలు నేర్చుకుంటున్నవారికి ఓ కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకుని రమ్మంటే..... వాళ్ళు తీసిన ఫోటోలకు వాళ్ళ చేతనే వ్యాఖ్యలను రాయించి, అవి ప్రదర్శనకు పెడితే...............
అదే జరిగింది నిన్న ( ఫిబ్రవరి 23 ), మొన్న ( ఫిబ్రవరి 24 ) విజయవాడ లో .............
ఆంధ్ర లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం వారు స్పార్క్స్ ' 10 పేరిట ఫోటోగ్రఫి ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్న వారు నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్లేమీ కాదు. సాంకేతికాంశాలను ఔపోసన పట్టేసిన వారూ కాదు. ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫిలో ఓనమాలు దిద్దుతున్న విద్యార్థులు. ఆంధ్ర లయోలా కళాశాల లో విజువల్ కమ్యునికేషన్స్ విభాగంలో బి.ఎస్సీ. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టిన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో కళాశాల... వాళ్లకు కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకురమ్మని పంపించింది. అలా తీసిన వాటిల్లో మంచివి ఎన్నుకుని వాటికి సరిపడే వ్యాఖ్యలు వారిచేతనే రాయించి ప్రదర్శనకు ఉంచింది. ఎన్నుకున్న విషయానికి సంబంధించిన సబ్జెక్టు వెతుక్కోవడం ఒక ఎత్తైతే, వాటికి సరిపడే వ్యాఖ్య రాయడం మరో ఎత్తు. ఒక్కోసారి ఫోటో కంటే వ్యాఖ్యే మనల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
అవేమీ కళాఖండాలు కాకపోవచ్చు. కానీ ఇప్పుడే వికసిస్తున్న మొగ్గలు తీసినవి. వాళ్ళ లేత మేధకు అందిన అంశాలవి. దృశ్య మాధ్యమం ద్వారా సమాచార వ్యాప్తి చేసే క్రమంలో ఇది ఆ విద్యార్థుల తొలి అడుగు. వారిని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యానికి, వారికి నిర్దుష్టమైన మార్గాన్ని చూపుతున్న అధ్యాపక వర్గానికీ అభినందనలు. ఆ విద్యార్థుల కృషిని మీరు కూడా చూడండి........


కొసమెరుపు : ఈ విద్యార్థులలో మా అబ్బాయి కూడా ఒకడు.
Vol. No. 01 Pub. No. 207

2 comments:

జయ said...

చాలా బాగుందండి. మంచి ప్రోత్సాహం. ఇది వీళ్ళ భవిష్యత్తుకు కూడా పునాది వెస్తుంది.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలండీ !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం