Sunday, February 21, 2010

మాతృభాషాదినోత్సవం-విలువైన సమాచారం

ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 వ తేదీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఆ సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగుకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు శ్రీ నూర్ రెహమతుల్లా గారు. ఈయన తెలుగు భాషా వ్యాప్తికి, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా తనకున్న విస్తృతాధికారాల్ని తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించడం ఎంతైనా అభినందనీయం. తెలుగుకు ప్రాభవానికి విశేషమైన కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతూ, తెలుగు భాషను ప్రేమించే వారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో రెహమతుల్లాగారు అందించిన ఈ వ్యాసం...................

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

Vol. No. 01 Pub. No. 204

2 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

తెలుగు భాష గురించి నాకు తెలియని కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను.

ధన్యవాదములు.

SRRao said...

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ్ గారూ !

కృతజ్ఞతలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం