Monday, February 22, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 2

( 201 టపా తరువాయి )........  అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.......
అతణ్ణి గతంలో నదీతీరాన కనబడే తన ఆరాధకుడు షామరాజుగా గుర్తిస్తుంది. అతడ్ని చూసి బాధపడుతుంది. తానొక బానిసగా అక్కడ ఉన్నానంటుంది. కాదు రాయలవారితో సహా మేమందరం నీ సౌందర్యానికి బానిసలమంటాడతను. తన చుట్టూ శిలలున్నాయని, అసలు తానే ఒక శిలనైపోయానని అన్న ఆమెతో.....

ఆ శిలలలోని ప్రాచీనం నువ్వు సంపాదించుకున్నావు. సంధ్యాసమయాల సుకుమారమైన ఎరుపు నీది, వెన్నెల బరువుని మొయ్యలేక భయపడి పరుగులెత్తే కెరటాల నురుగు చాంచల్యం నీ కళ్ళది. చీకటి అడవుల పవిత్ర ప్రశాంతం నీలో వుంది. అనిశ్చలత్వ, వక్షోభారం మొయ్యలేక ముక్కలుగా విరిగిపడే ఆ నడుం- అన్నీ శిలాకారంగా ఏనాడో మార్చాను.

అంటాడతను. అంతటి ప్రేమను ఇంతకాలం దాచుకుని ఇప్పుడు చెబుతున్నావు, అప్పుడే ఎందుకు చెప్పలేదని అడుగుతుంది.

నాది వాంఛ కాదు. నోరులేని ప్రేమ. నాకేమీ అక్కర్లేకపోయింది. నువ్వు యీ మేఘాల మాదిరి, ఆ నదిలో కెరటాల మాదిరి మార్పులేక, ఆ కొండల మాదిరి, నక్షత్రాల మాదిరి మార్పులేక నశింపులేక, శాశ్వతంగా యీ లోకంలోనే వుంటావనుకునేవాణ్ణి. తరువాత అది ' భ్రమ ' అని తెలుసుకున్నా. ఏదో వెర్రి నమ్మకం. నువ్వెక్కడున్నా, ఎట్లా వున్నా నాదానవనేననుకుని తృప్తి పడేవాణ్ణి. ఈ గాలి మనిద్దరికోసం, సూర్యచంద్రాదులు మనకోసం - అదీ భ్రమే. 
అంటాడతను. మరి అంతగా సుఖపెట్టే ఆ భ్రమను వదులుకుని ఇప్పుడిలా వచ్చి తననెందుకు బాధపెడతావని ప్రశ్నిస్తుంది. ఆమె కోరిక మీద తన గాథ వివరిస్తాడు. విలువిద్యనేర్చుకుని రాయల సైన్యంలో చేరిన అతను ఉదయగిరి ముట్టడిలో పాల్గొంటాడు. ఆ దుర్గాధ్యక్షుడితో బాటు అతని మేనత్తను కూడా చెరబడతాడు కృష్ణదేవరాయలు. ఆమెను ఆ చెరనుండి విడిపించడం కోసం తిరుగుతుంటే స్వరూపిణి కళ్ళబడిందని చెబుతాడు. ఆమెని విడిపించాలనే పట్టుదల నీకెందుకని ప్రశ్నిస్తుంది స్వరూపిణి. దానికతను....

ఆమె సుశీల. చాలా అందమైనది. అందమైన యే వస్తువు ఖైదులో వున్నా నా ప్రాణం జిల్లార్చుకుపోతుంది. సూర్యచంద్రాదులనూ, గాలినీ సముద్ర కెరటాలనీ ఎవరు బంధించగలరు ? వాటినేనా అందరూ సమంగా అనుభవించేటట్లు చెయ్యడం దేవుడు చేసిన వొక మంచికార్యం. 

అని వివరిస్తాడు. అంతేకాదు. మూడు ఆలయాల్లో స్వరూపిణి ప్రతిమలను చెక్కినట్లు చెబుతాడు. ఆమె భయపడుతుంది. రాయలవారు గుర్తుపడితే ప్రమాదమంటుంది.   ఏమీ కాదు అంత అందమైన స్త్రీ తన స్వంతమని రాయలవారు గర్విస్తాడంటాడతను. అతనిక్కడికి వచ్చినట్లు తెలిస్తే రాయలవారు ప్రాణాలు తీస్తారని వెంటనే వెళ్ళిపొమ్మని బ్రతిమాలుతుంది. దానికతను..............

నువ్వు నాకు మల్లే తెగించి, యివన్నీ వొదులుకుని వొచ్చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను కోరిన పురుషులు యీ నగరంలొనే బోలెడుమంది వుండొచ్చు. కానీ వాళ్ళు నాకుమల్లే వారి గౌరవాలనూ, ప్రాణాలనూ త్యాగం చెయ్యడానికి సిద్ధంగా వుండలేరు. నేను నిన్ను కోరి సఫలీకృతం చేసుకోవడంలో నా మృత్యువు వుందని నాకు తెలుసు. నూరేండ్ల ముసలి వృథా బ్రతుకుకంటే వొక క్షణం మహత్తర ఆశాజ్వాలలో మండి బూడిదవడం వెయ్యిరెట్లు మేలని నా అనుభవం శాసిస్తూనే వుంది. నన్ను పొమ్మంటావు. ఎక్కడికి పోనూ ? 
ఇలా ఇద్దరిమధ్యా చాలాసేపు వాగ్వివాదం సాగుతుంది. ఆమె ఎంత బ్రతిమాలినా షామరాజు వినడు. ఆనందంగా మరణాన్ని ఆహ్వానిస్తానని, చివరగా తనకోసం ఒక్కసారి నాట్యం చెయ్యమనీ కోరుతాడు. అతని అభ్యర్థన కాదనలేక నాట్యం మొదలుపెడుతుంది స్వరూపిణి. ఇంతలో రాయలవారు అక్కడికి వేంచేస్తున్నట్లు సమాచారం తెస్తుంది చిట్టి. ఊహించని యీ పరిణామానికి బిత్తరపోతుంది స్వరూపిణి. షామరాజుని పారిపొ్మ్మని తొందరబెడుతుంది.

నిన్ను చూసి విప్పుకున్న కళ్ళని మళ్ళా యీ పాడులోకంమీద ఎట్లా వాల్చను ?
అని అడుగుతాడతను. ఆ పని చెయ్యలేకపోతే విషం తాగడమొకటే మార్గమంటుంది. ఆనందంగా విషం తీసుకుంటాడు. అతనికి తుది వీడ్కోలు చెబుతూ స్వరూప ముందుగదిలోకి వెడుతుంది. రాయలవారు వస్తారు. విఠలాలయంలో చూసిన ప్రతిమ స్వరూపిణి రూపాన్ని పోలియుండడం రామలింగడు గుర్తించి చెప్పినట్లు చెబుతారు. ఆ విషయం నిర్థారించుకోవడానికే అక్కడికి ఆమెను తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలియజేస్తారు. బయిల్దేరమంటారు. రాయలవారి ధోరణిని బట్టి ఇక తప్పదని అర్థం చేసుకుంటుంది స్వరూపిణి. బయిల్దేరుతుంది. రాణీవాస అలంకరణలేమీ లేకుండా రావడానికి రాయలవారు వప్పుకోరు. అలంకరణ కోసం ఆమెను బలవంతంగా లోపలకు తీసుకెడతారు.
ఆయనకు అక్కడ పడివున్న షామరాజు దేహం కనబడుతుంది. ఎవరని అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక ఒక ఖైదీ అని చెబుతుంది. ఆమెకు ఎప్పుడూ అత్తరులు పంపించే ఫెరిస్టాఖాన్ పంపిన విషాన్ని పరీక్షించడానికి ఆ ఖైదీని తెప్పించినట్లు, అతనిచేత తాగించగానే మరణించినట్లు చెబుతుంది. రాయలవారు అతన్ని చూసి జాలిపడతారు. స్వరూపిణి తట్టుకోలేకపోతుంది. ఎంతోసేపు నిజాన్ని దాచలేకపోతుంది. అతను తన స్నేహితుడని, తనని చూడడానికి వచ్చి సాహసం చేసాడని, మీరొస్తున్నారని తెలిసి వెళ్ళిపొమ్మంటే వెళ్లలేదని, అందుకే విషం ఇచ్చినట్లు చెబుతుంది. అంతేకాదు. అతను తనని ప్రేమించిన విషయం కూడా చెప్పేస్తుంది. దానికి రాయలవారు

పిచ్చివాడు ! నాతో చెబితే నిన్ను అతని వెంట పంపి వుందునుగా. నీది కఠిన హృదయం.
అనగానే స్వరూపిణి

మీదీ అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి నన్నిక్కడ బంధించారు. దాస్యమే స్వర్గమనుకున్నాను. మీకు హృదయం లేదు.

అంటుంది.
ప్రేమించిన వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపిన నీకే హృదయం లేదని నిందిస్తారు రాయలవారు. వాదనలో ఆయన పుట్టుకను గురించి నిలదీస్తుంది. అంతే. రాయలవారికి ఆగ్రహమొస్తుంది. తన తల్లి దాసీది కాదని, సాగివారి ఆడపడుచని అంటారు. రాజుకి కొందరు భార్యలు, స్త్రీలు ఉండటం సాంప్రదాయమని, అయితే వారందరూ మహాపతివ్రతలనుకునేంత మూర్ఖుణ్ణి కాననీ అంటారు. తన ప్రతిమల్ని స్థంభాలకెక్కించినది కూడా అతనేనని చెబుతుంది స్వరూపిణి. రాయలవారు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప శిల్పినీ, అతనిలోని అద్భుతమైన కళని ఆమె అందం బలిగోరిందని బాధపడతారు. అంతేకాదు. ఆమె అంత:పురంలో బందీకాదని అక్కడ వుండడానికీ, వెళ్ళిపోవడానికీ అమెకు స్వేచ్చ వుందంటూ....

ఇది బందిఖానా అంటూ ఏదో గొణిగావు మొదట్లో. నీకొక్కదానికే కాదు యీ సంకెళ్ళు. మనందరినీ యీ ప్రపంచం బంధించింది. కిరీటం నన్ను, స్వార్థం నిన్ను, కళ అతన్ని, ఆకృతి రాళ్ళనీ, చీకటి వెలుగునీ, సంస్థలు సంఘాన్నీ, ప్రేమ మానవ హృదయాన్నీ సంకెళ్ళతో సాకుతాయి. ఇదుగో ఈ సంకెళ్ళు చప్పుడు కాకుండా చూసే బాధ్యత మనదీ - బాధ్యత నాదీ...
అంటూ బయిటకు వెళ్ళిపోతారు. రాయలవారి వ్యక్తిత్వం ముందు తన ప్రేమ వెలవెలబోవడం గమనించి తన జీవితం వ్యర్థమనుకుంటుంది స్వరూపిణీదేవి. అక్కడేవున్న విషకలశం తీసుకుని నిర్జీవంగావున్న షామరాజు దగ్గరకు వెడుతుంది. కలశం ఎత్తి త్రాగబోతుండగా అతను దిగ్గున లేచి ఆమె చేతిలోని కలశాన్ని లాక్కుంటాడు. స్వరూపిణి ఆశ్చర్యపోతుంది. తాను నిజంగా విషం త్రాగలేదని, నటించానని చెబుతాడు. రాయలవారి ఔదార్యాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటాడు. ఎందుకీ సాహసం చేసావని అడుగుతుంది స్వరూపిణి.

నేను ప్రాణాలమీద ఆశ ఎల్లానూ వొదులుకున్నా. కానీ, చూద్దాం ఏం జరుగుతుందోనని విషం పారబోసి - చిట్టికి తెలుసు - చచ్చినవాడికిమల్లే పరున్నాను. రాయలకి ఎంత దయ ? ఎంత ఆదరణ ? మనం బైటికి పోదాం. పద గ్రహణ స్నానం చేద్దాం. ఆమట్టున మావూరు...

అని బయిల్దేరదీస్తాడు. చిట్టి కూడా వారిని అనుసరిస్తుంది.
**********************
క్రీ.శ. 1512 వ సంవత్సరంలో జరిగినట్లుగా చెప్పబడే యీ కథను నాటికగా అద్భుతమైన శిల్పంతో, పదునైన సంభాషణలతో తీర్చిదిద్దారు బుచ్చిబాబు. 1944 లో ' భారతి ' లో ప్రచురణ తర్వాత కొన్నాళ్ళకు మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైంది.

 

                          మిత్రులకు విన్నపం

' మల్లీశ్వరి ' చిత్రకథకూ, యీ కథకూ పూర్తి స్వామ్యం లేకపోయినా కొన్ని పోలికలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. అందుకే ఆ కథ రూపకల్పనకు యీ నాటికే బీజమయినట్లు చెబుతారేమో ! ఏమైనా బుచ్చిబాబు రచనా పటిమకు యీ నాటికలోని సంభాషణలే సాక్ష్యం.

ఇది కేవలం పరిచయం మాత్రమే ! ఆ క్రమంలోనే నాటికలోని ముఖ్యమైన సంభాషణలను ఇవ్వడం జరిగింది. ఇవి బుచ్చిబాబు గారి రచనా వైశిస్ట్యాన్ని తెలియజేసేందుకు ఉపయోగిస్తాయనుకుంటాను. ఈ రచన ఇదివరలో చదివిన వారు గానీ, ఆకాశవాణి నాటికను విన్నవారు గానీ బ్లాగు మిత్రులలో గానీ, వారి పరిచయస్థులలో గానీ, ఇతర చదవరులలో గానీ ఎవరైనా ఉంటే వారి స్పందననూ, అనుభూతిని తెలియజేస్తే బాగుంటుంది. అలాగే యీ పరిచయాన్ని చదివాక 'మల్లీశ్వరి' కథకూ, యీ కథకూ గల పోలికల్ని గురించి మిత్రులు తమ విశ్లేషణలను, స్పందనను తెలియజేయగలరు. ఈ టపాలోనే వ్యాఖ్యలరూపంలోగానీ, విడిగా నా ఇ-మెయిల్ కు గానీ పంపండి.
నా e-mail : srcrao@hotmail.com  

Vol. No. 01 Pub. No. 205

3 comments:

Rao S Lakkaraju said...

చాల చాల ధన్య వాదాలు ఈ పోస్ట్ వేసి నందుకు. బుచ్చిబాబు గారి మేధ ని చక్కగా మీ వాక్యాలలో మలిచారు.

కొత్త పాళీ said...

very interesting.
Is there any information on dates of this play versus the date of the movie?

SRRao said...

* రావు గారూ !
ధన్యవాదాలు

* కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు. నాటిక 1945 ప్రాంతంలో ప్రసారమయినట్లు మాత్రం తెలుస్తోంది. కానీ మిగిలిన వివరాలు లభించలేదు. మల్లీశ్వరి సినిమా 1951 లో విడుదలయింది.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం