Thursday, February 18, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 1

శ్రీకృష్ణదేవరాయుల కాలం స్వర్ణయుగంగా మన చరిత్ర అభివర్ణిస్తోంది. వజ్రాలు, రత్నాలు మొదలైనవి రాశులుగా పోసి అమ్మేవారని అంటారు. వాటిమాటెలావున్నా రాయలవారి కాలంనాటివని చెప్పుకునే కథలెన్నో ప్రచారంలో వున్నాయి. వాటిలో నిజమైనవి ఏవో, ఊహాజనితమైనవి ఏవో చెప్పటం చాలా కష్టం. అలాంటి ఒక కథే మన  తెలుగు చలనచిత్ర చరిత్రలో మరుపురాని మధుర కావ్యంగా నిలిచిపోయిన స్వర్గీయ బి.ఎన్. రెడ్డిగారి ' మల్లీశ్వరి ' . ఆ చిత్రకథ రూపకల్పనకు బీజంగా చెప్పుకునే నాటిక ' కృష్ణదేవరాయని కరుణకృత్యం ' . తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబుగా ప్రసిద్ధికెక్కిన శివరాజు వేంకట సుబ్బారావు గారు రాసిన ఈ నాటిక 1944 మే నెల ' భారతి ' మాస పత్రికలో ప్రచురించబడింది. ఆ నాటిక పరిచయం...........................

ఆ నాటిక ముందుమాటలో బుచ్చిబాబు ఇలా అంటారు.
విజయనగర సామ్రాజ్యాన్ని గురించి చాలా గ్రంథాలు చదివినా, గ్రంథకర్తలు ఆనాటి శిల్పాన్ని గురించి చరిత్రాత్మకంగా, మిగతా దేశాలలోని శిల్పాలతో పోల్చి వ్రాయడం తప్ప ఆ శిల్పులను గురించి వొక్క విషయం కూడా చెప్పరు. వాళ్ళు ఎట్ల్లాంటి వ్యక్తులు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళ వేతనాలెంత మొదలైన జీవితాలకి సంబంధించిన విషయాలేవీ కనిపించలేదు.  సామ్రాజ్యం పోయింది. కొన్ని శిల్పాలు మాత్రం మిగిలాయి. ఆనాటి వాతావరణాన్ని సృష్టించి, వొక శిల్పి ఆంతరంగిక జీవితాన్ని ప్రదర్శించి చూపుదామన్న సంకల్పానికి యీ నాటిక ఫలితం. 
ఆంధ్రోత్పత్తి, కర్ణాటకవాదాలతో దీనికి నిమిత్తం లేదు. ఈ నాటికలో జరిగిన విషయాలకి చరిత్రలో ఆధారం లేదు. కాని అవి అసంభవం కాదు. మొదట కృష్ణ్దదేవరాయలని  వివాహమాడటానికి అంగీకరించని ముదుగల్లు కన్య ' నేహాల్ ' కథ ఫెరిష్టా వ్రాశాడు. ఆమెలాంటి స్త్రీ, తిమ్మరసు లాంటి పురుషుడు వున్నకాలాలలో యిట్లాంటి వ్యక్తులుండటం అసహజం కాదు.        

ఇక కథాక్రమంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయుల జనానాలో స్వరూపిణీదేవి కూడా ఒక రాణి. ఆవిడకొక చెలికత్తె చిట్టి. స్వరూపిణి రాణివాసంలో చేరిన అయిదు సంవత్సరాల కాలంలో రాయలవారు ఆమె వద్దకొచ్చింది కేవలం ఒక్కసారే !
ఈ అయిదు సంవత్సరాలలో ఆమె అడుగు బయిట పెట్టలేదు. అందుకే అంటుంది................

నేను చిన్నప్పుడు చిలకల్ని పంజరంలో బంధించి పెంచుకున్నాను. నా పాపం వూరికే పోతుందా ! హజారి రాముడు నన్నిందులో బంధించాడు.

తన అందం అడవిగాచిన వెన్నెల అయిపోతోందని ఆమె ఆవేదన.  తన చెలి చిట్టితో అంటుంది..................

నా సౌందర్యానికి విలువ లేదే ! ఏకాకిగా అరణ్యంలో వుండే యోగి మంచితనానికి ఎంత విలువ వుందో నా అందానికీ అంతే ! ఒసే, ఒక విశేషం చెబుతా విను. జీవితం అంటే కంబళి మీద శయ్య కాదు. కత్తి మీద సాము. రాజుగారి కిరీటంలో మణిగా వెలిగినప్పుడే నా అందం మెరిసిపోతుంది. 

ఆ రోజు చంద్రగ్రహణం. తన భర్తతో కలసి నదీస్నానానికి వెళ్ళాలని స్త్రీ సహజమైన కోరిక ఆమెది. ఆయన ఉనికిని గురించి వాకబు చేసిన చిట్టి ఆయన విఠలాలయాన్ని చూడటానికి వెళ్ళారని చెబుతూ ఆ ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని వర్ణిస్తుంది. 

రాజుగారు కటకాధిపతిగార్ని జయించి వొచ్చింతర్వాత విజయసౌధాన్ని కట్టించారు. చూశారూ ? ........ నేను మొన్న అల్లా వెడ్తుంటే - అందరూ దాన్ని చూస్తో నిలబడ్డారు. నేనూ వెళ్ళాను. అందులో వెనుక రెండు ఆడబొమ్మలు రాళ్లమీద చెక్కి వున్నాయండి. నమ్మండి. నమ్మకపొండి - అచ్చం మీలాగే వున్నాయండి. ఆ సన్నటి నడుం. గుండ్రటి భుజాలు. ఆ ముక్కు అంతా మీరే. 

వారి సంభాషణ క్రమంగా చిన్ననాటి తీపి జ్ఞాపకాలమీదకు వెడుతుంది. తన అనుభవాన్ని వర్ణిస్తూ స్వరూపిణీదేవి...  

మా వీధి చివర వీరపాంచాలుల గుడిసెలుండేవి. ఓ గొర్రెల కాపరి వుండేవాడే. నేను నదికి నీళ్ళకి వెళ్ళే సమయానికే వాడూ మందలతో చక్కా వొచ్చేవాడు. ఆ గట్టున కూర్చుని నన్నే చూస్తూ వుండేవాడు. ఇల్లా రెండు నెలలు. ఏమీ మాట్లాడేవాడు కాడు సుమా. నాకన్నీ జ్ఞాపకం వొస్తున్నాయి. నల్లగా వుండేవాడు. నల్లగా అంటే ఎట్లాగనుకున్నావు ? వెన్నెల తాలూకు మెత్తని, పల్చని నలుపు. భుజాలూ - అవీ కండలు తిరిగి వుండేవాడు....................
నేనిక్కడికి వొచ్చేస్తున్నానని వాడుకెట్లా తెలిసిందో - రోజూ మా యింటిముందు అరుగు కింద నిలబడి, కిటికీలోంచి నేను నాట్యం నేర్చుకుంటూంటే చూస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో మందేశ్వర శర్మ నాకు నాట్యం నేర్పేవాడులే. నాకు వాణ్ణి చూడగానే సిగ్గువచ్చి పాట నిలిపి ఆగిపొయ్యేదాన్ని. 

స్వరూపిణి నాట్యం గురించి విన్న చిట్టి అడుగుతుంది అమాయకంగా ఇక్కడ ఎప్పుడూ నాట్యమెందుకు చెయ్యలేదని. అంతే స్వరూపిణిని నిస్పృహ ఆవహిస్తుంది. 

నన్ను చెయ్యమని అడిగేవాడు లేందే ? నే నీ నాట్యంతో రాయలని ఆకర్షించాలట. రాణీవాసం వొచ్చింతర్వాత నాట్యం నాగలోకానికి వెళ్ళింది. శుద్ధాంతంలో పడ్దతర్వాత నా శక్తులన్నీ శిలలుగా మారిపొయ్యాయి. 

ఇలా ముచ్చట్లాడుకుంటున్న సమయంలో కిటికీలోంచి ఒక బాణమొచ్చి వారిముందు పడుతుంది. దానికో కాగితం గుచ్చి ఉంటుంది. అందులో................................

 " నువ్వు రాణివని నాకు తెలుసు. నేను సాధారణ మనిషిని. నిన్ను దూరం నుంచి చాలాకాలం ఆరాధించాను - కీటకం నక్షత్రాన్ని ఆశించినట్లు. ఈ జీవితంలో నేను చెయ్యగల పని చేశాను. ఇప్పుడు నాకు నీతో వొక గంటసేపు ఆంతరంగిక స్నేహం కావాలి. ఆ తర్వాత చచ్చినా బ్రతికినా నాకు లెక్కలేదు. జవాబు పంపేవరకూ నేనిక్కడనుంచి కదలను. తూర్పున 13 వ ద్వారం వద్ద తెల్లదుప్పటీ పాగా చుట్టుకున్న వ్యక్తి. ఇట్లు అనామకుడు. " 

ఆ లేఖ రాసే సాహసం ఎవరు చేసారో ఇద్దరికీ అర్థం కాదు. ఏం చెయ్యాలో తెలియక తర్జన భర్జనలు పడతారు. ఒక దశలో తనని పరీక్షించడానికి రాయలవారే ఆ పని చేసారేమోననే అనుమానం కూడా వస్తుంది..............

 అబ్బే ! నాకు నమ్మకం కుదరడం లేదే. ఆలయానికి వెళ్ళిన మహారాజు చంద్రగ్రహణం నాడు ఎన్నో కృత్యాలు నెరవేర్చవలసి వుండగా నాతో పరాచికాలాడుతూ కూర్చుంటాడటే - నా వెర్రి కాక ? ఐదు సంవత్సరాల నుంచి లేని ప్రేమ యీనాడు బైలుదేరిందా - నేను నమ్మనే. వీడేవడో దుండగీడు. పొగరుబోతు. నేనంటే అసూయతో కుళ్ళిపోతున్న నా సవతుల ప్రేరేపణల వల్ల ఎవడో తుంటరి బహుమానాలకు ఆశపడి పన్నిన పన్నాగం ఇది.

అంటుంది స్వరూపిణి.   ఇలాగ రకరకాలుగా మధనపడి చివరకు ఆ లేఖ వ్రాసిన వాడ్ని తుదముట్టించాలని నిర్ణయించుకుంటుంది. చిట్టిని పంపి అతన్ని పిలిపించుకుంటుంది. అతడు వచ్చాక తెర వెనుకనే వుండి వివరాలడుగుతుంది. పేరడిగితే అనామకుడనే చెబుతాడు. అంతేకాదు....................

 పేర్లతో సంబంధమేముంది రాణీ. మిమ్మల్ని స్వరూపిణీ దేవి అనికాక కురూపిణీ దేవి అని పిలిస్తే మీ సౌందర్యం మారుతుందా ? నేనది చూడటానికే వచ్చాను.......
నేను నియమాలని, సంప్రదాయాలని, కట్టుబాట్లని, సంఘనీతిని లక్ష్యం చెయ్యను. అసలు మీ వ్యక్తితో, మీ హోదాతో నాకు నిమిత్తం లేదు. మీ సౌందర్యం చూడాలి.

అంటాడు.  స్వరూపిణికి ఒక సందేహం వస్తుంది. ఆ అనామకుడికి భార్య వున్నదాయని. అదే విషయం అతన్ని అడుగుతుంది. అతని సమాధానం..............

లేదు. నా దగ్గర నౌకరీ చెయ్యడానికి ఏ స్త్రీ అంగీకరించలే. నాకు అన్నం పెట్టే శక్తి లేదు గనుక.  

అంటాడు. ఆమెకర్థంకాదు. వివరణ అడుగుతుంది........

వాళ్ళనీ, వాళ్ళ కుటుంబాలనీ అన్నం, బట్టా పెట్టి పోషించగలడు గనక యీ జనానాలో స్త్రీలందరూ రాయలవారికి భార్యలుగా అమ్ముడు పోయారు. అంతకంటే వేరే గూడార్థం లేదు. 

అంటాడు. అతని వృత్తిని గురించి అడుగుతుంది...........

నా వృత్తి సౌందర్యం సృష్టించడం

అంటూ తన హృదయాన్ని ఆమె ముందు పరుస్తాడు.

నాకు బాంధవ్యాలూ, స్నేహాలూ, చుట్టరికాలూ లేవు. ప్రపంచం నాకు పరలోకం. మిగతా మానవులు ఏమీ చేతకాక వొఠి శుంఠలై యీలోకానికి లొంగిపోయి - ఖజానా గుమాస్తాల కింద అమ్ముడుపోయి, అందమైన వొస్తువును అనుభవించడానికి ధైర్యం, తెగింపూ లేక, గౌరవనీయులైన నీతిపరులక్రింద యీ ప్రపంచ రథచక్రాలని పట్టుకు కూర్చున్నారు. వీళ్ళలా నేనూ వుంటే యీ సాహసం యెల్లా చేస్తా. మీరే చెప్పండి. నాకు యథార్థమైన శరీరం వుంటే యిక్కడికి వొచ్చే వుండను. శరీరాన్ని శ్మశానంలోనూ, వ్యక్తిత్వాన్ని విబూదిలోనూ గిరవాటెట్టి, నాయథార్థమైన హృదయాన్ని మీముందు పారేసుకుంటున్నాను. దాన్ని తృణీకరించొచ్చు. హింసించొచ్చు. తన్నొచ్చు. త్యజించొచ్చు - కానీ దాన్ని చంపలేరు. 
స్వరూపిణి : దాన్ని చంపడమే నా సంకల్పం 

అంటుంది. వెంటనే అతను................

ఈ చీరలకోసం, ఈ నగలకోసం, ఈ హోదా కోసం అన్యులు మిమ్మల్ని చూసి అసూయపడాలన్న మీ గుడ్ది కోరిక - యివే యథార్థాలనుకుని నమ్మి, మాతృత్వ, స్త్రీత్వం మొగ్గలోనే తుంచిన మీ మలిన శరీరంలో హృదయం ఎక్కడేడిసింది. ఉంటే రాయలకి యింతమంది స్త్రీలెందుకు ? 

అని నిందిస్తాడు. గడువైపోతోందని హెచ్చరించిన ఆమెతో రాణీగా కాక స్త్రీగా తనకు కనబడాలంటాడు. ఆలోచించిన స్వరూపిణి అలాగే కనబడతానని, అయితే కనబడిన మరుక్షణం తాను సిద్ధం చేసిన విషం తాగాలంటుంది. దానికి సిద్ధమేనన్న అతనితో మరి నీకోసం ఏడ్చేవాళ్ళెవరూ లేరా యని అడుగుతుంది. నా కోసం ఏడ్చేది నువ్వేనంటాడు అతను. ఆమెకతని ధోరణి అర్థం కాదు. ఆగ్రహిస్తుంది. అతను మరింత వివరంగా......................

అవును. నాకోసం ఏడ్చేది మీరే. సృష్టికర్తను నేను. మీకు మాతృత్వం అర్పించే శిల్పం కోసం మీరు ఏడుస్తూ వుంటారు. మా యింటి ఎదురుగా చెరువొకటి వుండేది. అందులో కెరటాలు గట్టున పడి చేసే చప్పుడు ఎదురుతిరగడం చేతకాక, పైకి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చే ప్రాచీన స్త్రీల ఏడ్పు చప్పుడులా వుంటుంది. సరస్సులో కెరటాలు గట్టున వయ్యారంగా పడనట్లు మా కన్నీరు మీ రొమ్ము వొంకర్ల మధ్య జారతాయి - శక్తికోసం తపించే పల్చని, మధురమైన కన్నీరు. ఏకాంతసౌధంలో బంధింపబడ్డామని తెలుసుకున్నపుడు మనమందరం అల్లానే నిశ్శబ్దంగా ఏడుస్తూ వుంటాము. పురుషుడి ఘనమైన, నిండైన కలలని మీ కన్నీరు నీరుగా, శూన్యంగా మారుస్తుంది. స్త్రీ కన్నీరులో మునిగి చావడం తప్పనే నేను మీ సౌందర్యమైన కన్నీటిలో మునిగి, రెండు మధురమైన గుటకలేసి చావడానికి సిద్ధంగా వున్నాను

అంటాడు. అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.

                                                                                                       .....................ఇంకా వుంది. 


Vol. No. 01 Pub. No. 201

6 comments:

Rao S Lakkaraju said...

చక్కగా చెబుతున్నారు "ఇంకా ఉంది" కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాము.

Sai Brahmanandam Gorti said...

"మొదట కృష్ణ్దదేవరాయలని వివాహమాడటానికి అంగీకరించని ముదుగల్లు కన్య ' నేహాల్ ' కథ ఫెరిష్టా వ్రాశాడు. ఆమెలాంటి స్త్రీ, తిమ్మరసు లాంటి పురుషుడు వున్నకాలాలలో యిట్లాంటి వ్యక్తులుండటం అసహజం కాదు." అని బుచ్చి బాబు గారి ముందు మాటగాచెప్పరు మీరు.
నిజానికి నేహల్ కథ జరిగింది కృష్ణ దేవరాయలకి వందేళ్ళ ముందు జరిగిన కథ. దేవరాయల-1 కాలంలో జరిగిన కథని కృష్ణదేవరాయలుగా ఊహించి చెప్పారు. చరిత్రని పక్కనబెట్టి కేవలం విషయాన్ని మాత్రమే గ్రహించి నిజమనేలా ఒప్పించారు. వాస్తవానికి నేహలకి జరిగిన అన్యాయం వేరు.
ఈ నేహల్ కథనే నేహల పేరుతో నవలగా రాస్తున్నాను. కౌముది వెబ్ పత్రికలో వస్తోందిది. వీలయితే చదవండి.


http://vennello.wordpress.com/category/%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/page/2/

నేహల జీవితానికీ, ఈ నాటకంలో చెప్పినదానీ "రాజుని పెళ్ళాడ్డానికి తిరస్కరించడం" అన్నదొక్కటే కలిసే విషయం. ఆ తరువాత అంతా కల్పితమే!

Saahitya Abhimaani said...

వజ్రాలు, రత్నాలు మొదలైనవి రాశులుగా పోసి అమ్మేవారని అంటారు. కాని నిజంగా అలా వజ్రాలు, రత్నాలు కుప్పలుపోసి అమ్మితే వాటి విలువ ఏమి ఉంటుంది? అప్పటి ఆర్థిక పర్స్థితిలో ఉన్న పుష్కలత్వాన్ని చెప్పటానికి ఈ సూపర్లేటివ్ వాడి ఉంటారు. ఇప్పుడు మనం మార్కెట్టుకి వెళితే అక్కడ కుప్పలు కుప్పలుగా పూలు, పళ్ళు, కూరగాయలు పోసి అమంతూ ఉంటే, ఆ అమ్మేవాళ్ళు సరదాగా, సంతోషంగా అమ్ముకుంటూ ఉంటే, చూడటానికి ఎంత ఆనందదాయకం. అదే రత్నాలు కుప్పలు పోసి అమ్మటం అనిపిస్తుంది.

SRRao said...

* రావు గారూ !
ధన్యవాదాలు

* సాయి బ్రహ్మానందం గారూ !
చాలా సంతోషం. మంచి సమాచారమిచ్చారు. చరిత్ర లోతుల్ని నేను అంతగా అధ్యయనం చెయ్యలేదు. అందుకని బుచ్చిబాబు గారు రాసిన ముందుమాటనే టపాలో ఇచ్చాను. ఆయన కూడా దీనికి చారిత్రక ఆధారాలు లేవని అంటారు.
మీ ' నేహల ' రెండు భాగాలు చదివాను. మీ శైలి అద్భుతంగా వుంది. చారిత్రక గాథలు మన తెలుగులో రాసిన వాళ్ళు తక్కువ. మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు.

* శివ గారూ !
అభినందనలు

జయ said...

చాలా బాగుందండి. ఎన్నడూ తెలియని అంశాలను మీ బ్లాగ్ ద్వారా చెప్తున్నారు. థాంక్యూ.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం