Thursday, April 28, 2011

లంకాదహనకాండ

 తెలుగు చలనచిత్రసీమలో పేర్ల సెంటిమెంట్, కాంబినేషన్ సెంటిమెంట్ లాంటి సెంటిమెంట్లెన్నో పనిచేస్తూ వుంటాయి. అవన్నీ వట్టి మూఢనమ్మకాలో, చాదస్తాలో లేక నిజాలో చెప్పడం చాలా కష్టం. అది ఫలితం మీద ఆధారపడి వుంటుంది. అయితే ' లంకాదహనం ' సెంటిమెంట్ మాత్రం చిత్రసీమలో బలంగానే పనిచేసింది.

తొలి ' లంకాదహనం '  చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి. నటేశం అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేదో ఎవరికీ అంతుపట్టలేదు.

ఆ తర్వాత సుమారు అరడజనుసార్లు ' లంకాదహనం ' చిత్రం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. ప్రతీసారి అవి మొదలు కాకపోవడమో, పూర్తయి విడుదల అవకుండా నిలిచిపోవడమో జరిగేది. దీనికి కారణం మాత్రం అగ్నిప్రమాదాలే ఎక్కువ. ఒకాయన తిథి, వార, నక్షత్రాలన్నీ చూసుకుని మంచి ముహూర్తం నిర్ణయించి తాను ' లంకాదహనం ' చిత్రం నిర్మిస్తున్నట్లు పత్రికలలో ప్రకటించాడు. ఆ వెంటనే ఆయన ఇల్లు తగలబడిపోయింది. మరొకాయన ఇవేమీ పట్టించుకోకుండా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించాడు. చేతికి అందివచ్చిన ఆయన కొడుకు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

అప్పటికి చాలామంది ' లంకాదహనం ' అన్న పేరు వల్లనే ఈ ఉపద్రవాలన్నీ జరుగుతున్నాయని నమ్మడం మొదలుపెట్టారు. అందుకే ఇంకొకాయన ఇదే కథకు పేరు మార్చి ' సుందరకాండ ' అని పెట్టి నిర్మించాడు. అప్పుడు కూడా పరశురామ ప్రీతి జరిగింది.  ఇలా కాదని ఇంకో పెద్దమనిషి అటూ ఇటూ కాకుండా ' లంకాయాగం ' అనే పేరుతో చిత్రనిర్మాణానికి పూనుకోగానే ఆయన పెరట్లోని గడ్డివామి తగలబడిపోయింది.

ఇవన్నీ నిజంగానే ఆ పేరు మహాత్మ్యమో, యాదృచ్చికమో తెలీదుగానీ మళ్ళీ ఎవరూ ఆ పేరుతో సినిమా తియ్యడానికి సాహసించలేదు.

- ప్రముఖ రచయిత, ఫిలిం జర్నలిస్ట్  డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారి సమాచారం ఆధారంగా.........

గతంలో ఉత్సవాలు, సంబరాలలో రంగస్థల నాటకాలు తప్పనిసరి. అందులోను పౌరాణిక పద్య నాటకాలదే వైభవం. పేరు బడ్డ నటులు, సమాజాలే కాక గ్రామాలలో ఉత్సాహవంతులైన యువకులు కూడా నాటకాలు వెయ్యడానికి పూనుకునేవారు. అయితే వారు వృత్తిరీత్యా అనుభవమున్న నటులు కాకపోవడంతో కొన్ని సందర్భాలలో రసాభాస జరిగేది. ఇలాంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ' లంకాదహనం ' నాటకం నటరత్న నందమూరి తారక రామారావు గారి స్వంత చిత్రం ' ఉమ్మడికుటుంబం ' చిత్రంలో వుంది. ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూసి ఆనందించండి.   



Vol. No. 02 Pub. No. 215

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం