Thursday, April 7, 2011

అసలు పేరు - కొసరు పేరు

 ఇప్పటి సినిమాలకు అసలు పేరు ఒకటి, కొసరు పేరు మరొకటి ఉంటున్నాయి. అంటే అసలు పేరు ఒకటైతే, దానికో ట్యాగ్ లైన్ అంటూ కొసరు పేరు తగిలిస్తున్నారు. దీని అవసరానవసరాలు ప్రక్కన పెడితే కొన్నిసార్లు ఈ కొసరు పేర్లు అసలు పేరుకు కొనసాగింపుగా, మరికొన్నిసార్లు వివరణగా, ఇంకొన్నిసార్లు గందరగోళం లేకుండా చేసేందుకు ఉపయోగపడతాయి. తెలుగు చలనచిత్ర రంగ తొలిరోజుల్లో కొన్ని చిత్రాలకు కూడా ఇలాగే రెండు మూడు పేర్లు పెట్టడం జరిగింది.

వాహినీ పిక్చర్స్ వారు 1939 లో  నాగయ్య, కాంచనమాలతో ' వందేమాతరం  ' చిత్రాన్ని నిర్మించారు. పేరు దేశభక్తిని సూచిస్తున్నా ఆ చిత్ర ప్రధాన కథాంశం మాత్రం నిరుద్యోగ సమస్య. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇలా జాతీయ భావాలు ప్రచారం చేసే చిత్రాలను నిషేధించేది. ఆ భయం చేత ఆ చిత్రానికి ' మంగళసూత్రం ' అనే కొసరు పేరు పెట్టారు. ఇప్పటి ట్యాగ్ లైన్ లాగే వందేమాతరం పేరు క్రింద చిన్న అక్షరాలతో మంగళసూత్రం కనిపిస్తుంది. 

ఇలా కొసరు పేరుగా వున్న ' మంగళసూత్రం ' 1944 ప్రాంతంలో అసలు పేరుగా మారి రెండు కొసరు పేర్లను తనతో కలుపుకుంది. ఆ వైనం ఏమిటంటే........ గతంలో సిక్కిం లెఫ్టినెంట్ గవర్నర్ గాను, మహారాష్ట్ర కు గవర్నర్ గాను పనిచేసిన కోన ప్రభాకరరావు గారు నటుడు, నిర్మాత కూడా. ఆయన తొలుతగా నిర్మించిన వినోదాత్మక చిత్రానికి ' ఇది మా కథ ' అని పేరు పెట్టారు. తర్వాత అంతకంటే ' మా యిద్దరి కథ ' అన్న పేరు సరిగా సరిపోతుందని భావించి మార్చారు. కానీ విడుదలకు ముందు ఎందుకో అదే చిత్రానికి ' మంగళసూత్రం ' అన్న పేరును ఖాయం చేసారు. ఇన్నిసార్లు పేర్లు ప్రకటించాక ప్రేక్షకులు తికమక పడతారేమోనని మంగళసూత్రం పేరు క్రింద చిన్న చిన్న అక్షరాలతో ఇది మా కథ, మా యిద్దరి కథ పేర్లు కూడా వేసారు. 

అలా గమ్మత్తుగా మంగళసూత్రం ఒకసారి కొసరు పేరైతే, మరోసారి అసలు పేరయింది.  

Vol. No. 02 Pub. No. 195

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం