ఎన్టీరామారావు అయినా, నాగేశ్వరరావు అయినా మరొకరు అయినా అప్పటితరం నటులు తాము ధరించిన పాత్రలో ఎలా లీనమైపోయేవారో చెప్పే సంఘటన ఇది.....
' మనదేశం ' చిత్రంలో ఎన్టీరామారావు ధరించింది సబ్ ఇనస్పెక్టర్ పాత్ర. నిజానికది చాలా చిన్నపాత్ర. మంచి స్పురద్రూపంతో వున్న రామారావు నటనలో ఎంతవరకూ పనికోస్తాడో చూడడానికి ఎల్వీ ప్రసాద్ పెట్టిన పరీక్ష ఆ పాత్ర.
షూటింగ్ ప్రారంభమైంది. ప్రసాద్ గారు సన్నివేశం వివరించారు ఎన్టీయార్ కి.
" రామారావ్ ! ఇది కాంగ్రెస్ వాలంటీర్ల మీద లాఠీఛార్జ్ ! నేను యాక్షన్ అంటాను. వెంటనే వాళ్ళని లాఠీలతో ఎదుర్కోవాలి " అన్నారు ప్రసాద్.
" ఓకే సార్ ! " అన్నారు రామారావు.
" యాక్షన్ " అన్నారు ప్రసాద్.
రామారావు గారు లాఠీతో రంగంలోకి దూకేశారు. వాలంటీర్లను చావబాదేశారు. ఆపమని ప్రసాద్ గారు ఎంత కేకలు పెట్టినా వినిపించుకోనంత ఆవేశంగా ఆ పాత్రలో లీనమైపోయారు. ఏదీ విన్పించుకునే స్థితిలో లేరు. ప్రసాద్ గారు ' కట్ ' చెప్పారు. కెమెరా ఆగిపోయింది. కానీ ఎన్టీయార్ లాఠీ ఆగలేదు. వాలంటీర్ పాత్రధారులని స్టూడియో గేటు దాకా తరిమికొట్టి వచ్చారు.
" ఏమయ్యా ! రామారావ్ ! ఇది సినిమా. నువ్వు వాళ్ళను దుమ్ము విరిగేలా చావబాదావు. నేను ఆగమని కేకలేస్తున్నా విన్పించుకోలేదు. వాట్ ఇస్ థిస్ ? " అన్నారు ప్రసాద్ .
" పోలీసు వాళ్ళు ఇలాగే లాఠీ ఛార్జ్ చేస్తారండీ ! నేచురల్ గా వుండాలని అలా చేసాను, తప్పా ? " అనడిగారు రామారావు.
" వెళ్లి వాళ్ళందర్నీ పిల్చుకురా ! మళ్ళీ షాట్ తీద్దాం ! " అన్నారు ప్రసాద్ గారు ప్రొడక్షన్ మేనేజర్ తో. అతను నీళ్ళు నమిలాడు. నెమ్మదిగా చెప్పాడు.
" అక్కడ ఎవరూ లేరు సార్ ! కొంతమంది ఇళ్ళకీ, మరికొంతమంది ఆస్పత్రికీ వెళ్ళిపోయారు " అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.
ఆ దెబ్బలు తిన్న వారిలో తర్వాత దర్శకుడిగా ప్రముఖుడైన తాతినేని ప్రకాశరావు కూడా వున్నారు.
Vol. No. 01 Pub. No. 334



అన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తున్నామనుకున్నా మన దేశం అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబడే వుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి ఎన్నో రకాల పథకాలు మన ప్రభుత్వాలు రూపొందించాయి. కొంత కాలం క్రితం వరకూ ప్రజల నుంచి కూడా ఈ విషయంలో స్పందన బాగానే ఉండేది. ఇన్ని పథకాలు అమలులోవున్నా, ప్రజల భాగస్వామ్యం వున్నా స్వాతంత్ర్యం వచ్చిన 63 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్షరాస్యత పూర్తి స్థాయిలో లేకపోవడం శోచనీయం. దీనికి కారణం పథకాల అమలులో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లోపించడం. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం ప్రజల ఉదాశీనతకు కారణమై ఉండవచ్చు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశకంలో గాంధీజీ బోధనల ప్రభావం ఎక్కువగా వున్న రోజుల్లో ఇదొక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. గాంధీజీ ఎంతమందినో ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. ముఖ్యంగా విదేశీయులెందరో ఈ ఉద్యమాన్ని చేపట్టి మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలామందిని అక్షరాస్యుల్ని చేశారు. దీనికో ఉదాహరణ........






















