Tuesday, February 9, 2010

ఆజన్మాంతం

కొంతమంది అడ్డూ ఆపూ లేకుండా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు.
ఆ సమయంలో ఆకలిదప్పులు తెలియవు. కొందరైతే ఉచ్చ్హనీచాలు కూడా మరచిపోతారు.
అలా సంపాదించీ, సంపాదించీ అలసిపోయాక, జీవిత చరమాంకానికి చేరుకున్నాక బెంగ పట్టుకుంటుంది.
భయం చుట్టుకుంటుంది.
తన తదనంతరం ఈ సంపదంతా ఏమై పోతుంది ?
తన పిల్లలు దీన్ని సవ్యంగా నిలబెట్టుకుంటారా ?
తన సంపద మీద బంధువులు, దాయాదులు కన్నేసి కాజేయరు కదా ?
ఇలా....సవాలక్ష సందేహాలు.
తన బెంగ తీరాలంటే ఒకటే మార్గం.....
తాను మరణాన్ని జయిస్తే బాగుండును.
తన ఆస్థిని తనే కాపాడుకోవచ్చు. ఎవరి మీదా ఆధారపడనక్కర్లేదు.
కానీ... అది సాధ్యమా ?
ఒకవేళ సాధ్యమైతే...... ఏమవుతుంది ?


*** 

అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ఆయన గురించి చెప్పుకునే ఓ కథ........         

అలెగ్జాండర్ ప్రపంచంలో తనకు తెలిసిన భూభాగాన్నంతా జయించేసాడు.
అప్పుడు మరణం గుర్తుకు వచ్చింది. ఏదో ఒకరోజు చనిపోక తప్పదు.
ఆ తర్వాత ఇంత కష్టపడి జయించి సంపాదించిన సామ్రాజ్యమంతా ఏమైపోతుంది ? అని బెంగపట్టుకుంది.
అంతే ! ఆయనకు మృత్యువుని జయించాలనిపించింది. అమరుడవ్వాలంటే అమృతం కావాలి.
దానికోసం అన్వేషణ ప్రారంభించాడు. కొండలు, కోనలు, కీకారణ్యాలు అన్నీ గాలించాడు. చివరికి సాధించాడు. ఒకచోట అమృతధార దర్శనమిచ్చింది. మహదానంద పడిపోయాడు.
ఆ అమృతధార ఉన్న చిన్న గుహలో అంతా చీకటి.
ఆ ధార మాత్రం మిలమిలా మెరుస్తూ దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్ళి దోసిటపట్టి తాగబోయాడు.
ఇంతలో అక్కడే చిరకాలంనుంచి నివసిస్తున్న ఒక కాకి అలెగ్జాండర్ ని నిలవరించి 
" నేనూ నీలాగే అమరత్వం సాధించాలని, కలకాలం బ్రతకాలని చాలా యుగాల క్రిందటే ఈ అమృతాన్ని తాగాను. సుదీర్ఘమైన జీవితంలో కొంతకాలం కోరుకున్నవన్నీ తృప్తిగా అనుభవించాను.
తరువాత నెమ్మదిగా అన్నిటి మీదా వాంచ తగ్గింది.
కోరికలన్నీ నశించాయి. దేనిమీదా వ్యామోహం లే్దు.
ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ ఈ అమృతం కారణంగా చావు రావడం లేదు.
అనేక ప్రయత్నాలు చేసాను. పీక కోసుకుందామంటే కత్తి బండబారిపోతోంది.
సముద్రంలో దూకితే నీళ్ళమీద తేలుతున్నాను.
ఈ బ్రతుకు బ్రతకలేక రోజు రోజూ చస్తున్నాను.
ఇహలోకంలోనే నరకం అనుభవిస్తున్నాను.
తాగబోయేముందు ఇదంతా నీకు తెలిస్తే మంచిదని చెబుతున్నాను.
అయినా నీకు తాగాలని వుంటే నిరభ్యంతరంగా తాగు.
కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా దీనికి విరుగుడు తెలిస్తే మాత్రం నాకు చెప్పు " అందట ఆ కాకి.

ఇంకేం మాట్లాడతాడు ?
అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని వెనుదిరిగాడట బుద్ధిశాలైన అలెగ్జాండర్.  


Vol. 01 Pub. 192
4 comments:

SIVA said...
This comment has been removed by the author.
SIVA said...

రావుగారూ ఈ కథ నేను ఇదే మొదటిసారి వినటం. మరొక కథ నేను విన్నది చెపుతాను. అలెగ్జాండరు అలా దాడి చేస్తూ దేశదేశాలను గెలుచుకుంటూ వస్తున్నాడు.భారతదేశ సరిహద్దుల్లోకి వచ్చాడుట. గుడారులు వేసి విశ్రాంతి తీసుకుంటూ, అలా వాహ్యాళికి వెళ్ళాడట అలెగ్జాండరు. అలా వెళ్ళినవాడికి, ఓ చెట్టు కింద ఒక ఫకీరు దుమ్ములో పడుకుని ఉండటం కనపడిందిట. ఎందుకయ్య ఇలా పడుకునే బదులు ఏదన్న పని చెయ్యకూడదా అన్నాడుట అలెగ్జాండరు. దానికి

ఫకీరు,: చేసి ఏమి చెయ్యలి
అలెగ్జాండరు : డబ్బు సంపాయించు
ఫకీరు డబ్బు సంపాయించి?
అలెగ్జాండరు: కావలిసినవన్ని కొనుక్కో
ఫకీరు కొనుక్కుని??!!
అలెగ్జాండరు: హాయిగా పడుకో
ఫకీరు: ఇప్పుడు నేను చేస్తున్నది అదేగా, ఫో ఆవతలికి నేను నిద్రపోవాలి అన్నాడుట
అలెగ్జాండరుకు సుఖపడటానికి, దేశదేశాలు ఆక్రమించనక్కరలెదని తెలుసుకుని వెనుతిరిగాడట.

Anonymous said...

ఉచ్చనీచాలు

uccha means urine FYI

SRRao said...

శివగారూ !
అలెగ్జాండర్ విషయంలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. బహుశా ప్రపంచ విజేత కావడం వల్ల కావచ్చు. మరో కథను అందించినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత గారూ !
'ఉచ్చ్హనీచాలు' అనే పదబంధం ఎక్కువ వాడుకలో ఉన్నదే! కాకపోతే యూనికోడ్ లో ద్విత్వాక్షరాల వరకూ ఫర్వాలేదు. సంయుక్తాక్షరాలు ఒక్కోసారి సరిగా రావడం కష్టం. బాగా వాడుకలో ఉన్న పదాలను, పదబంధాలను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదనుకుంటాను. అదీకాక కలిపి అర్థం చేసుకోవలసిన వాటిని విడదీసి అర్థం చేసుకోనక్కరలేదనుకుంటాను. అయినా మీ వ్యాఖ్య చూసి సరిచెయ్యడానికి ప్రయత్నించాను. కానీ అది కూడా సరి కాదనుకుంటాను. యూనికోడ్ లో ఎలా రాయాలో మీకు తెలిస్తే చెప్పగలరు. మీ పేరు తెలియజెయ్యడం మాత్రం మరచిపోకండి.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం