Saturday, December 31, 2011

కంచు కంఠం

కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అన్నారు.
ఇక్కడ కంచూ మ్రోగింది... కనకమూ మ్రోగింది....
తెలుగు వారి గుండెల్లో ఢమరుకాలు మ్రోగించింది.

ఆ కంఠం పేరే కొంగర జగ్గయ్య.
బహుముఖ ప్రజ్ఞ అందరికీ సాధ్యం కాదు. కానీ సాధించారు జగ్గయ్య.
ఆయన నటుడు, సాహితీవేత్త, రచయిత, అనువాదకుడు, ఉపాథ్యాయుడు, డబ్బింగ్ కళాకారుడు, రాజకీయనాయకుడు... ఇలా ఒకటేమిటి ?

అపజయాల్లోనుంచి విజయాలకు మెట్లు వేసుకున్న కృషీవలుడు జగ్గయ్య.
అందుకే తెలుగు చలన చిత్ర జగత్తులో సాటిలేని కళాకారుడిగా నిలిచిపోయారు.


కళా వాచస్పతి జగ్గయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...........

గతంలో జగ్గయ్యగారి గురించి రాసిన టపాల లింకులు............

తెలుగు చిత్ర గంభీర స్వరం

కళా వాచస్పతి

జగ్గయ్య గారి నటనా ప్రతిభను చూపే ఘట్టాల కదంబం ...........



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 097

Friday, December 30, 2011

' చిరంజీవి ' నాగయ్య

 1938 గృహలక్ష్మి తో తెలుగు చలనచిత్ర రంగ గృహప్రవేశం చేసిన అపర కళామూర్తి, అజరామర కీర్తి నాగయ్య. ఎంతకాలమైనా,  ఎన్ని ధోరణులు మారినా తెలుగు ప్రేక్షకుల్లో నాగయ్య గారి గురించిన ఏకాభిప్రాయం మారదేమో !
అందుకే ఆయన గురించిన విశేషాలు నిత్యనూతనం.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు. కర్మ యోగి కూడా.
తెలుగు నేలపైన తన కళా ప్రతిభను పంచడానికే విచ్చేశారు.
తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సంపదనంతా పదిమందికీ పంచేశారు. 

 
ఎంత సంపాదించినా ఇతరులు మూటకట్టుకు పొయినదేమిటి ?
ఎంత పంచిబెట్టినా నాగయ్య నిలబెట్టుకున్న కీర్తి ప్రతిష్టలముందు ఆ సంపదలు ఏ పాటివి ?
మనం ఎంత డబ్బు కూడబెట్టమన్నది ముఖ్యం కాదు....
ఎంతకాలం అందరి హృదయాల్లో నిలిచి వున్నామన్నది ముఖ్యం.
ఆ విషయంలో నాగయ్య గారు తెలుగు వారి హృదయాల్లో చిరంజీవి..... ఎప్పటికీ !

 నాగయ్యగారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ......


 నాగయ్యగారిపైన గతంలోని టపాలు..............

సంగీతమయం సమస్తం

న భూతో న భవిష్యతి ' నాగయ్య '

 నాన్నగారు 'నాగయ్య'


అపర త్యాగయ్య

నా ' త్యా ' గయ్య

నాన్నగారి జన్మదినం



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 096

Tuesday, December 27, 2011

తిరుప్పావై... ఆంగ్లంలో భగవద్గీత ... ఇంకా...

గోదాదేవి గోపికయై స్నానవ్రతమాచరించే విధానం గురించి.... భగవద్గీత శ్లోకాలకు ఆంగ్లంలో వ్యాఖ్యానం.... వందే బృహస్పతిం.... కార్టూన్లు.... ఇంకా ఎన్నో........

ఈవారం శిరాకదంబంలో.........





Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 095

Saturday, December 24, 2011

చండాలిక

కొన్ని అనుభూతుల్ని నిర్వచించలేము. అవి అనుభవించాల్సిందే ! తర్వాత కాలంలో వాటిని నెమరు వేసుకుంటూ హాయిగా గడిపేస్తాం. అలాంటి తరుణంలో మళ్ళీ ఆ మధురానుభూతుల్ని ఆస్వాదించే అవకాశం ఎదురయితే....... ?

అది ఇంకొక అనిర్వచనీయమైన అనుభూతే ! అలాంటి అనుభూతే నిన్న నాకు మళ్ళీ ఎదురయింది. ఎప్పుడో ముఫ్ఫై ఏళ్ళ క్రితం 1979 - 80 ల మధ్యలో తిరుపతిలోనో, మద్రాసులోనో.....  స్థలం సరిగా గుర్తులేదు కానీ కాలం మాత్రం ఇదే ! చలికాలం.

కొద్దిరోజుల తేడాలో రెండు నృత్య నాటికలు చూసే అవకాశం కలిగింది. ఒకటి ' కన్యక ' . రెండవది ' చండాలిక '. మొదటిది ఎవరు ప్రదర్శించారో ఇప్పుడు గుర్తు లేదుకానీ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. రెండవది ' చండాలిక ' కేవలం ఆకట్టుకోవడమే కాదు..... మరచిపోలేని అనుభూతిని పంచింది. వెంపటి చిన సత్యం గారి మీద అభిమానాన్ని కలిగించింది. తర్వాతనేను త్యాగరాయ గాన సభ ( అమలాపురం ) కార్యనిర్వాహక సభ్యునిగా వున్నపుడు, శోభానాయుడు గారి నృత్య ప్రదర్శనకు సత్యం మాస్టారు గారు కూడా వచ్చినపుడు వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు స్వయంగా, ప్రత్యేకంగా చూసుకునే భాగ్యం కలిగింది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన్ని చూసే భాగ్యం కలిగింది.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఎనభై అయిదు సంవత్సరాల వయసు కలిగిన ఆయన్ని చూసే భాగ్యం కలిగింది. అంతే కాదు మళ్ళీ ఇన్నాళ్ళకు వారి రూపకల్పన ' చండాలిక ' నృత్య నాటకాన్ని దర్శించే భాగ్యం కలిగింది. కన్నుల పండుగ గా జరిగిన ఆ కార్యక్రమం మళ్ళీ అప్పటి అనుభూతుల్ని గుర్తుకు తెచ్చింది. 

కొంతమంది తమకు నచ్చిన కళను నేర్చుకుంటారు. నిష్ణాతులవుతారు. కానీ అనేక కారణాలవల్ల తమ కళను తమలోనే దాచుకుంటారు. కొంతమంది మాత్రమే తమలోని విద్వత్తును సమాజంతో పంచుకుంటారు. ఇంకొందరు తమలోని విద్వత్తునే కాదు... ఆ కళల్లో ప్రముఖులైన వారి విద్వత్తును కూడా సమాజానికి పంచడానికి కృషి చేస్తారు. అలాంటి బృహత్తర ప్రయత్నమే హంసధ్వని కూచిపూడి నృత్యాలయం చేసింది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారిని విజయవాడ వాసుల ముందుకు తెచ్చింది. వారి ' చండాలిక ' నృత్య నాటకంతో కనువిందు చేసింది. ఇందుకు సింగారమణి అజయకుమార్  గారి సోదరులకు, వారి బృందానికి విజయవాడ వాసులు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా నాకీ అదృష్టం కలిగించిన వర్షాభార్గవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి.  ముందే  ఈ కార్యక్రమం గురించి తెలియజేసి, ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక పంపి, ఎన్నో సార్లు మెయిల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా హెచ్చరిస్తూ నాలో బద్దకాన్ని వదిలిస్తూ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే భాగ్యాన్ని కలిగించింది వర్షాభార్గవి గారే ! లేకపోతే నా జీవితంలో మళ్ళీ ఈ ప్రదర్శనను చూసే అవకాశాన్ని పోగొట్టుకునే వాడినేమో ! అందుకే భార్గవి గారికి మరోసారి ధన్యవాదాలు.

బుద్ధుని జాతక కథల ఆధారంగా రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ లో  రచించిన సంగీత రూపకం ' చండాలిక '. దాన్ని తెలుగులో రచన చేసింది శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ గారు. సంగీతం సమకూర్చింది శ్రీ మల్లిక్ గారు. నృత్య దర్శకత్వం పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు. దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు సత్యం గారు. ఈ నాటిక రూపకల్పన జరిగి సుమారుగా అర్థ శతాబ్దం గడుస్తున్నా ఇంకా సజీవంగా వుందంటే అది సత్యం గారి కృషే ! నాట్యం మీద ఆయకున్న మక్కువ ఏమిటో ఎనభై అయిదు సంవత్సరాల వయస్సులో రంగస్థలానికి ఎదురుగా కూర్చుని ఆద్యంతం తిలకించడం చూస్తే అర్థమవుతుంది.

వెంపటి నృత్యోత్సవ్ - 2011 లో భాగంగా రెండవరోజు కార్యక్రమం డా. సరస్వతి గారు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తే పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు నృత్యోత్సవ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డిప్యూటీ కీపర్ శ్రీ మల్లం వీరేందర్ గారు, ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ వేదాంతం రాధేశ్యాం గారు, అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి శ్రీ పసుమర్తి కేశవప్రసాద్ గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

చండాలిక నృత్య నాటిక సంక్షిప్తంగా ........

   

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 094

Friday, December 23, 2011

అష్టవిధ నాయిక అజయ్

కూచిపూడి నృత్య సంప్రదాయంలో పురుషులు స్త్రీ వేషం ధరించి నర్తించడం జరుగుతుంటుంది. ఇంతకూ ముందు తరంలో ఆ ప్రక్రియకు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు జీవం పోశారు. ఇప్పుడు ఈ తరంలో ఆయనకు వారసుడిగా ఎదగడానికి కృషి చేస్తున్నారు సింగారమణి సి. హెచ్. అజయ్ కుమార్ గారు.

విజయవాడలో జరుగుతున్న వెంపటి నృత్యోత్సవ్ - 2011  లో మొదటిరోజైన 22  వ తేదీ గురువారం శ్రీ అజయ్ కుమార్ గారు స్త్రీ వేషం ధరించి అష్టవిధ నాయికలను రంగస్థలం మీద ఆవిష్కరించారు. అంగికాభినయాలను అద్భుతంగా పలికించిన ఈ అంశంతో బాటు ఆ రోజు ప్రదర్శనలో అమెరికాలో ఉంటున్న శ్రీమతి పుష్యమి ప్రదర్శించిన అంశాలు, నాట్యాచార్య హేమంత్ దంపతుల ఆధ్వర్యంలో సాగిన కథక్, మణిపురి, కథకళి, మోహినియాట్టం రీతుల్లో ప్రదర్శించిన అంశాలు, ముఖ్యంగా వివిధ నాట్య సంప్రదాయాల కదంబంగా కూర్చిన దశావతారాల అంశం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు కార్యక్రమాలను హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఆనాటి కార్యక్రమాల చిత్ర కదంబం .............  





Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 093

Thursday, December 22, 2011

వెంపటి నృత్యోత్సవ్ - 2011


తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన కూచిపూడి నృత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింపజెయ్యడానికి కృషి చేసిన మహనీయుల్లో పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు ఒకరు. తెలుగు వారి సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలిచిన కూచిపూడి సాంప్రదాయాన్ని పరంపరగా అందిపుచ్చుకున్న చినసత్యం గారు అదే పరంపర కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు.....  చేస్తున్నారు.

కూచిపూడి నాట్యానికి చినసత్యం గారు చేస్తున్న సేవకు కృతజ్ఞతగా హంసధ్వని కూచిపూడి నృత్యాలయ వ్యవస్థాపకులు ' సింగారమణి ' సిహెచ్. అజయకుమార్ గారు, సి హెచ్. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల ఈ నెల 22, 23, 24 తేదీలలో వెంపటి నృత్యోత్సవ్ 2011 పేరిట అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఆ విశేషాలను వివరిస్తున్నారు శ్రీ అజయ్ కుమార్ గారు.......




ఈ మూడురోజుల ఉత్సవానికి విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని మిత్రులందరూ హాజరయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.

కార్యక్రమ ఆహ్వాన పత్రిక ఈ క్రింది లింక్ లో ............ 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 092

Tuesday, December 20, 2011

ధనుర్మాసం...గోదాదేవి వృత్తాంతం......

 ధనుర్మాసం ప్రవేశించింది. ముంగిళ్ళన్నీ ముగ్గులతో నిండి వుంటాయి. గోదాదేవి విరచిత తిరుప్పావై పఠనం ఈ మాసం ప్రత్యేకత.
గోదాదేవి వృత్తాంతం, బుధ గ్రహ స్తుతి, గుర్రంకొండ కోట వంటి అనేక విశేషాలు ఈ వారం శిరాకదంబం వెబ్ పత్రిక తాజా సంచిక లో ..........



 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 091

Friday, December 16, 2011

ఆదుర్తి ' మనసు '

మనసు గురించి చెప్పుకోవాల్సి వస్తే మనకు ప్రధానంగా రెండు పేర్లు గుర్తుకు వస్తాయి.
అవి రెండు ' ' లు. ఒకటి ఆత్రేయ అయితే, రెండవ పేరు ఆదుర్తి
మనందరికీ ఎన్నో మనసుల్ని చూపించిన ఆదుర్తి సుబ్బారావు గారు చిన్నతనం నుంచీ తన మనసంతా సినిమానే నింపుకున్నారు.
అందుకే తండ్రికి నచ్చకపోయినా బొంబాయి పారిపోయి సినిమాటోగ్రఫి కోర్స్ చేసారు. సినిమా రంగంలో కీలకమైన శాఖల్లో  పనిచేసిన అనుభవం స్వంతం చేసుకున్నారు.

' అమరసందేశం ' తో ప్రారంభించి అన్నపూర్ణ పిక్చర్స్ కు దగ్గరయి
బాబు మూవీస్ తో తన ' మంచి మనసులు '  పంచుకుని  
' మూగమనసులు ' తో విజయఢంకా  మ్రోగించి 
నూతన ' తేనె మనసులు ' ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించి
' కన్నె మనసులు ' ని అందించారు. 
అంతేకాదు....
' మనసున మనసై ' అని డాక్టర్ చక్రవర్తి చేత అనిపించారు.

ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిండిపోయిన ఆదుర్తి ' మనసు ' కి తొంభై తొమ్మిదేళ్ళు పూర్తవబోతున్నాయి. శతజయంతి సమీపిస్తోంది.

ఆదుర్తి సుబ్బారావు గారి 99  వ జయంతి సందర్భంగా నివాళులతో.............

ఆదుర్తి గారి మీద గతంలోని టపాలు..... 

అ.  మన 'సు' దర్శకుడు ఆదుర్తి

ఈ వ్యాసం ఈరోజు TFDC  దర్శకులం లో ప్రచురితమైంది.  ఆ లింక్....


http://www.telugufilmdirectorsclub.com/article.php?catid=5&storyid=92


 ఆ. మనసున మనసై ...

Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 03 Pub. No. 090

Thursday, December 15, 2011

బుడుగు గ్రీటింగ్స్

జగమెరిగిన కుంచె వీరుడు బాపు
తెలుగు కళకు గౌరవం తెచ్చిన ఘనుడు బాపు
పదహారణాలా తెలుగమ్మాయిని ప్రపంచానికి చూపిన గీతాకారుడు బాపు
కుంచెతో చిత్రాన్ని గీసి, కెమేరాతో ఆ చిత్రానికి చలనం తెచ్చిన చిత్రకారుడు బాపు
గీత గీసినా.... రాత రాసినా.... చిత్రం తీసినా.... బాపురే అనిపించగల సమర్థుడు బాపు

తెలుగు కాన్వాస్ పై వేసిన అందమైన వర్ణచిత్రం బాపు 
తెలుగుదనం గుబాళించిన చిత్ర పరిమళం బాపు

బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో........... 

అలోవలో....వలో.... ఆగండాగండి........
బాపు గారికి బుడుగు అందిస్తున్న గ్రీటింగ్స్ ఇవిగో చూడండి............



బాపు గారి మీద గతంలోని టపాలు...... 



 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 089

Tuesday, December 13, 2011

పురాణములు ఎన్ని ? .... ఇంకా........

 పురాణములు ఎన్ని ?
వాటి విశేషాలు ఏమిటి ?
...... వివరణతో బాటు ఇంకా........





Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 088

Sunday, December 11, 2011

తెలుగు బ్లాగుల దినోత్సవం

తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ శుభాకాంక్షలు
 



e - తెలుగు ఆధ్వర్యంలో తెలుగు బ్లాగుల దినోత్సవ కార్యక్రమం - 

తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ ఆహ్వానం 
ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!


 తెలుగు బ్లాగుల దినోత్సవం - డిసెంబర్ రెండవ ఆదివారం


సమయం:
ఆదివారం, డిసెంబర్ 11, 2011 మధ్యాహ్నం 3 గంటలకు వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రాంగణం,
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004. (పటం)
సంప్రదింపులు:
93965 33666
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం.
వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ… తెలుగు బ్లాగరులందరికీ ఇదే మా ఆహ్వానం! ,
తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 087

Saturday, December 10, 2011

జడ్జికి శిక్ష

గతంలో ఇంచుమించుగా ప్రతి కళాశాలలోనూ ' మాక్ పార్లమెంట్ ' నిర్వహించేవారు. పార్లమెంట్ లో వాద ప్రతివాదాలు ఎలావుంటాయో విద్యార్థులకు తెలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే మాక్ న్యాయస్థానాలు కూడా జరుగుతూ వుండేవి.

ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడిగా పనిచేసిన ఎ. యస్. రామన్ విద్యార్థిగా వుండగా ఒక ప్రపంచ న్యాయస్థానం కార్యక్రమం జరిపారు. అందులో కేసు ' సైన్స్ మానవాళికి హాని చేస్తోంది '  అనే విషయం గురించి. సైన్స్ తరఫున సూరి భగవంతం గారు, ప్రజల తరఫున మామిడిపూడి రంగయ్య గారు వాద ప్రతివాదులు.

మూడు గంటలకు సరిపడా కార్యక్రమం రూపొందించారు. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండమని సి. ఆర్. రెడ్డి గారిని కోరారు. మూడు గంటలే కదా అని రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇరువైపులా వున్నది సామాన్యులా ? ఒకరు తర్వాత కాలంలో భారత దేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన వారు. మరొకరు తర్వాత రోజుల్లో రచయిత, విమర్శకుడు గా ఖ్యాతి వహించిన వారు. వాద ప్రతివాదాలు నిరాఘాటంగా తొమ్మిది గంటలు సాగాయి.

చివరికి రెడ్డి గారు న్యాయమూర్తిగా తన తీర్పుని సైన్స్ కి అనుకూలంగా ఇచ్చారు. అయితే శిక్ష విషయానికొచ్చేటప్పటికి ఆయన సహజ ధోరణిలో
" నిజానికి ఈరోజు దోషిగా బోనులో నుంచున్నది సైన్స్ కాదు.... నేను. ఇంత సమయం అవుతుందని తెలియక ఈ న్యాయమూర్తి పదవికి ఒప్పుకున్నాను. అందుకే నాకు బాగా శిక్ష పడింది "
అనడంతో అందరూ ఘొల్లుమన్నారు. 


 ప్రముఖ విద్యావేత్త, సాహితీ విమర్శకుడు కట్టమంచి రామలింగ రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ..........

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 086

దత్త జయంతి

 దత్త జయంతి సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలతో .............


దత్త జయంతి విశేషాలు, దత్తాత్రేయుని గురించి, దత్త సంప్రదాయం గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ ఈ క్రింది లింక్ లో ..............





Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 085

Thursday, December 8, 2011

కృష్ణపక్షం


మనసు కవి ఆత్రేయ చమత్కార భాషణం గురించి చాలా చెప్పుకోవచ్చు. భవిష్యద్దర్శనం చెయ్యగల మేధావి కూడా ఆయన. నిజాలను నిర్భయంగా చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

ఒకసారి ఒక నిర్మాత ఆత్రేయ గారి రచన, దర్శకత్వంలో ' అన్నమాచార్య ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.


ఆ సందర్భంలో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో ఒక మిత్రుడు ఆయన్ని
" ఆత్రేయ గారూ ! కలం పేరుగా మీరు ఈ పేరే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ? " అని అడిగారు.

దానికి ఆత్రేయ గారు నిట్టూరుస్తూ
" అప్పుడు ఆలోచించలేదు. ఆత్రేయ అంటే చంద్రుడు కదా ! చంద్రుడికి వృద్ధి, క్షీణతలు వుంటాయని గ్రహించి వుండవల్సింది. ప్రస్తుతం నా జీవితంలో ' కృష్ణపక్షం ' నడుస్తోంది " అన్నారు.

అలాగే ఆ ' అన్నమాచార్య ' చిత్ర నిర్మాణం ఆగిపోయింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 084

Tuesday, December 6, 2011

తొమ్మిదో మాసం మార్గశిరం.....

సంవత్సరంలోని పన్నెండు మాసాలలో తొమ్మిదో మాసమైన మార్గశిరం విశిష్టమైనది.
తొమ్మిదో మాసం మనకి మాత్రమే కాదు ముస్లింలకు కూడా పవిత్రమైనదే !
ఆ విశేషాలు, ఈ నెలలో వచ్చే పండుగలను గురించి వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె శ్రీమతి శ్యామల ఘంటసాల తమ తండ్రిగారికి స్వర నీరాజనాలర్పిస్తూ ' శిరాకదంబం ' కోసం ప్రత్యేకంగా పంపిన రచన.......

రేడియో అక్కయ్య, అన్నయ్యల చేత స్థాపించబడి అరవై దశాబ్దాలు పూర్తిచేసుకున్న  ఆంధ్ర బాలానంద సంఘం పై శ్రీదేవీ మురళీధర్ రచన................
ఈ వారం ' శిరాకదంబం ' వెబ్ పత్రిక లోని కొన్ని ప్రత్యేకతలు.... ఇంకా .............






Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 083

Sunday, December 4, 2011

మధుర పాటశాల ' ఘంటశాల '

 నిండు చందమామను చూసినపుడు చాలా ఆనందం కలుగుతుంది
చల్లని, తెల్లని వెన్నెల ఇస్తాడని
పురి విప్పి నాట్యమాడే నెమలిని చూస్తే హృదయం ఉప్పొంగి పోతుంది
అందాలతో కనువిందు చేస్తుందని
కమ్మగా పాడే కోయిల కుహు కుహు రాగాలతో మనసు గాలిలో తేలిపోతుంది
మాధుర్యంతో వీనులవిందు చేస్తుందని

ఘంటసాల పాట వింటుంటే...................
...................................ఆ అనుభూతి వర్ణనాతీతం

అమరత్వం సిద్ధించిన గళం ఘంటసాలది
నిన్న, నేడు, రేపు ........ ఇలా నిరంతర గానప్రవాహం ఆయనది

తండ్రి వారసత్వంగా ఇచ్చిన ఆస్తి సంగీతం
దానితో కళల రాజధాని విజయనగరం చేరి
పస్తులుండి,  ఇల్లిల్లూ తిరిగి వారాలు చేసుకుని 
ఆదిభట్ల వారి నేతృత్వంలో ద్వారం లాంటి వారి శిష్యరికంలో
ఆ ఆస్తిని పదింతలు కాదు వందింతలు చేసారు ఘంటసాల

జన్మనిచ్చిందీ,  సంగీతాన్నిచ్చింది తండ్రి అయితే
చలనచిత్ర రంగంలో ఘంటసాలను ఆదరించి అన్నం పెట్టి వేషం ఇచ్చి
గాయకుడిగా ప్రోత్సహించిన ' నాన్నగారు ' చిత్తూరు నాగయ్య.

ఇప్పటికీ, ఎప్పటికీ వన్నె తగ్గని మేలిమి బంగారం ఘంటసాల గళం
ఆ గళం అమరం.... ఆ గళం శాశ్వతం

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా స్వరనీరాజనాలు........

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన ఘంటసాల గానం చేసిన బీదపూజ, గోవిలాపం పద్యాలతో బాటు పాటలపల్లకి దుర్గ సమర్పించిన మహాకవి దాశరథి గారి జయంతి కార్యక్రమంలోని రెండు లలిత గీతాలతో కూర్చిన కదంబం..........

  


ఘంటసాలను స్మరించుకుంటూ రాసిన గతంలోని టపాల లింకులు....


గాన గంధర్వుడి పుట్టిన రోజు
అమర గాయకుడు
అజరామరగానం
గాన సామ్రాజ్య సామ్రాట్
గంధర్వ గానం - HMV


 ఘంటసాల గారి 89 వ జయంతిని పురస్కరించుకుని ఆ గానగంధర్వుడి కుమార్తె శ్రీమతి శ్యామల గారి ప్రత్యేక వ్యాసం సోమవారం విడుదలయ్యే శిరాకదంబం వెబ్ పత్రిక తాజా సంచికలో చదవండి.   

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 082

Saturday, December 3, 2011

రాజేంద్ర ' బాబు '

మన దేశానికి స్వాతంత్యం సముపార్జించడంలో అనేకమంది తమ చదువుల్ని, ఆస్తుల్నీ, చివరకి తమ జీవితాల్ని కూడా పణంగా పెట్టారు. ఆ త్యాగాల ఫలం మనమిప్పుడు అనుభవిస్తున్నాం.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నవ భారతాన్ని తీర్చిదిద్దడంలో అనేకమంది మహనీయుల కృషి వుంది.  సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నాయి.  క్రమంగా అప్పటి త్యాగధనులను, పథ నిర్దేశకులను, ఈనాటి భారతావనికి రూపకల్పన చేసి, పునాదులు వేసిన ప్రముఖులను ఒక్కొక్కరినే మరచిపోతున్నాము. ఇప్పటి తరానికి అసలు కొందరి పేర్లు తెలియదంటే ఆశ్చర్యం లేదు. అయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలను అందించిన వారిని కనీసం జయంతుల, వర్థంతుల పేరుతోనైనా గుర్తు చేసుకోవడంతో బాటు, మన తర్వాత తరాలకు వారి గురించి ఎరుకపరచాల్సిన బాధ్యత వుంది. వారి త్యాగాలనుంచి, కార్యదక్షత నుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవాల్సింది, స్పూర్తి పొందాల్సింది ఎంతైనా వుంది.   


అలాంటి మహనీయుల్లో  మన ప్రథమ రాజ్యాంగ పరిరక్షకుడు తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈరోజు ఆయన జయంతి. ఆ సందర్భంగా ఆయన వివరాలు, విశేషాలతో కూడిన గతంలోని టపా ఈ లింక్ లో .......

 మన తొలి రాష్ట్రపతి

 భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్  జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 082

Friday, December 2, 2011

' విజయ ' పథం


ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా చెప్పుకుంటున్న ' ఎవరెస్ట్ ' ఒక్కరోజులో ఏర్పడలేదు. అంతటి ఉన్నతమైన రూపం సంతరించుకోవడానికి శతాబ్దాలు పట్టింది. పవిత్రమైన నదిగా చెప్పుకుంటున్న గంగ పుట్టినచోట చిన్న పరిమాణం లోనే వుంటుంది. పోను పోను విస్తృతమై అఖండ గంగగా దర్శనమిస్తుంది.

అలాగే మహానీయులందరూ తొలి రోజుల్లో సామాన్యులే ! తమ కృషితో, మేధస్సుతో ఉన్నత శిఖరాలకు ఎదిగి అందరికీ ఆదర్శ మూర్తులుగా నిలిచి పోతారు. తెలుగు సాహిత్యాన్ని, పత్రికా రంగాన్ని, సినిమా రంగాన్ని తెలుగు వెలుగులతో నింపి కొన్ని విలువలను ఆపాదించిన వ్యక్తి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఆయనే ' విజయ ' నాగిరెడ్డి.

1912 వ సంవత్సరంలో కార్తీక సోమవారం డిసెంబర్ ఒకటి అర్థరాత్రి ( తెల్లవారితే రెండవ తారీకు ) కడప జిల్లాలోని చిత్రానది ఒడ్డున  పొట్టిపాడు గ్రామంలో సహజ సుందరమైన ప్రకృతి ఒడిలో జన్మించారు నాగిరెడ్డి. తండ్రి నరసింహారెడ్డి మద్రాసులో కమీషన్ వ్యాపారం చేస్తుంటే  పల్లెటూరిలో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. రోజూ సాయింత్రం జరిగే రామాయణ, భారత, భాగవతాల పారాయణం వినడం,  రోజూ తెల్లవారకుండా లేచి పశువుల్ని బయిట కట్టి కొట్టం శుభ్రంచెయ్యడం, అమ్మ పశువులకోసం గడ్డి కోస్తుంటే మోపులు కట్టి మోసుకు రావడం లాంటి పనులు చేస్తూ వుండడం ఆయన చిన్నప్పటి దైనందిన చర్య.


ప్రకృతిని, పక్షుల్ని ఆయన ఎంత ప్రేమించేవారో ఆయన విజయ గార్డెన్స్ సంరక్షణ గురించి తెలుసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఒక ప్రాంతంలో ఏదైనా చెట్టుని తొలగించవలసి వస్తే పూర్తిగా వేళ్ళతో సహా తెగిపోకుండా వచ్చేటట్లు పెకిలించి  మరో చోట భద్రంగా పాతించి అది మళ్ళీ చిగిర్చే వరకూ ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు.

అన్నకు ( బి. ఎన్. రెడ్డి ) చదువు మీద ఆసక్తి, తమ్ముడికి  వ్యాపారం మీద ఆసక్తి. ఫలితంగా అన్న ఆడిటింగ్ చదివారు. తమ్ముడు తండ్రికి వ్యాపారంలో చేదోడు అయ్యాడు. ఇద్దరికీ స్వాతంత్ర్య పోరాటం మీద ఆసక్తి. తండ్రి అనుమతితో గ్రామాల్లో ఖద్దరు ఉద్యమం నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధ ఉద్యమాల్లో పాల్గొన్నారు.


1939 లో ' వందేమాతరం ' చిత్రంతో బి. ఎన్. రెడ్డి గారి వాహినీ పిక్చర్స్ ఆవిర్భావానికి మూలకారకులైన వారిలో నాగిరెడ్డి కూడా ఒకరు. ఆయన వ్యాపార దక్షతకు నిదర్శనం ' సుమంగళి ' చిత్రానికి చేసిన వినూత్నమైన పబ్లిసిటీ. చెన్నై డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కలేదనే కోపంతో కార్పోరేషన్ నుంచి వీధిదీప స్తంభాలపై బోర్డులు పెట్టే లైసెన్స్ కలిగిన వ్యక్తి అభ్యంతరం పెట్టడంతో ప్రత్యేకమైన బ్యానర్లు తయారు చేసి చెట్ల కొమ్మలకి కట్టించారు. అది వివాదమై తరవాత తొలగించినా ఒక వారం రోజులు వినూత్నంగా వుండి ప్రజల్ని ఆకర్షించి చిత్రానికి మంచి ప్రచారాన్ని తెచ్చి పెట్టాయి. చిత్రం విడుదలయిన థియేటర్ దగ్గర బ్లాకులో టికెట్లు అమ్ముతున్న వాళ్ళని సినిమా ఫక్కీలో ఫైటింగ్ చేసి దారికి తెచ్చి వారి చేతనే  బజార్లలో, ట్రాములు, బస్సుల్లో కరపత్రాలు పంచి పెట్టించి పబ్లిసిటీ కి వాడుకున్న ఘనత నాగిరెడ్డి గారిది.


రెండో ప్రపంచ యుద్ధం వ్యాపారానికి తీరని నష్టం కలగజేస్తే అన్నగారు, స్నేహితుల సలహాతో చిత్ర రంగంలో అడుగు పెట్టిన నాగిరెడ్డి గారు వాహినీ వారి చిత్రం ' భక్త పోతన ' కు బెంగుళూరులో చేసిన పబ్లిసిటీ ఆయన సృజనాత్మకతకు అద్దం పడుతుంది. అప్పటికే పెద్ద సంస్థ అయిన జెమిని లాంటి సంస్థ పబ్లిసిటీతో ఢీ కొనడానికి ఆయన అనుసరించిన విధానం నుంచి ఇప్పటి నిర్మాతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నగరం నిండా ఎక్కడ చూసినా జెమిని వారి ' బాలనాగమ్మ ' పోస్టర్లే ! వాటి మధ్యలో ఎన్ని పోస్టర్లు వేసినా ' భక్తపోతన ' కనిపించడు. ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ మల్లేశ్వరం మిట్ట దగ్గరకు వచ్చిన నాగిరెడ్డి గారికి స్పురించిన ఆలోచన ఫలితమే పది అడుగుల పీఠం మీద ముఫ్ఫై అడుగుల హనుమంతుడి కటౌట్ వెలియడం. ఇది నగరంలో సంచలనం సృష్టించింది. నిజంగా హనుమంతుడు వెలిసాడని తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. అవును... అప్పటికి అది వింతే మరి. ఫలితంగా భక్త పోతన ఘనవిజయం సాధించింది.


ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డ వాహినీ స్టూడియోను గట్టెక్కించడానికి మిత్రుల కోరికతో నిర్వహణా బాధ్యతలను తీసుకున్నారు నాగిరెడ్డి.  జెండాపై కపిరాజు తో  ' విజయా ప్రొడక్షన్స్ ' ప్రారంభించారు. మొదటి చిత్రంగా ' షావుకారు ' రూపుదిద్దుకుంది.


పి. పుల్లయ్య గారి ' ధర్మపత్ని ' చిత్రంతో రచయితగా రంగ ప్రవేశం చేసిన ఆలూరు వెంకట సుబ్బారావు వాహినీ వారి ' స్వర్గసీమ ' కు కూడా రచయితగా పనిచేయ్యడంతో నాగిరెడ్డి గారికి మంచి మిత్రులయ్యారు. ఆ స్నేహం వికసించి 1945  లో రాజకీయ, సామాజిక చైతన్యం కలిగిన  ' ఆంధ్రజ్యోతి ' మాస పత్రిక ఆవిర్భావం, 1947  లో పిల్లల పత్రికగా ప్రారంభమై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ' చందమామ '  ఆవిర్భవించాయి.

ఒక తల్లి కడుపున పుట్టినవారే అని తెలుగు జాతి అంతా భావించే స్థాయికి చేరిన స్నేహబంధం వారిది. ఆ జంట ఎన్నో కళాఖండాలను తెలుగు వారికి అందించింది.  తెలుగు సినిమాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.  ఆ జంటను విడదీయడం ఎవరికీ సాధ్యం కాలేదు, ఒక్క మృత్యువుకి తప్ప. ఆ జంటే నాగిరెడ్డి - చక్రపాణి. స్నేహానికి నిర్వచనంగా ఇప్పటికీ, ఎప్పటికీ చెప్పుకునే జంట నాగిరెడ్డి - చక్రపాణి. ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ, ఆప్యాయత, గౌరవం, ఎదురి వారి మాటను మన్నించే లక్షణం, ఎవరి పని వారు చేసుకుంటూ ఎదుటి వారి పనిలోగానీ, నిర్ణయాలలో గానీ కలుగజేసుకోకపోవడం లాంటి మంచి లక్షణాలెన్నో ఆ స్నేహాన్ని కూర్చిన దారంలా అమరాయి. పత్రిక నడిపినా, సినిమాలు తీసినా ఏం చేసినా విజయ కేతనం ఎగురవేసింది ఆ స్నేహం.


అసలైన నిర్వహణా సామర్థ్యం ప్రతిభను గుర్తించడంలో తెలుస్తుంది. ఆ ప్రతిభను విజయవంతంగా ఉపయోగించడంలో రాణిస్తుంది. అలా చక్రపాణి గారి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, ఆయన మీద నమ్మకముంచి, ఆయనకు బాధ్యతలను పంచి విజయం సాధించారు నాగిరెడ్డి. తన విజయానికి అసలు కారకుడు చక్రపాణే అని చెప్పడం ఆయన ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఎదుటి వారి ప్రతిభను, శ్రమను వాడుకుని తమ గొప్పతనంగా చెప్పుకునే ఇప్పటి సమాజానికి ఈ సంస్కారం అర్థరహితంగా కనిపించవచ్చు. కానీ నాగిరెడ్డి గారి విజయాలు అసత్యం కాదుగా !


దక్షిణ భారత చలన చిత్ర రంగానికి పెద్ద దిక్కుగా వెలిగిన జెమిని వాసన్ అంటే అమితమైన గౌరవం. జెమిని స్టూడియోను అమ్మివేసినపుడు తన స్వంత ఆస్తి పరుల పాలైనంత బాధ పడ్డారు నాగిరెడ్డి. ' నాన్నగారూ ! ' అని ఆప్యాయంగా పిలిచే ఎన్టీయార్ అన్నా, ఎంజీయార్ అన్నా  విపరీతమైన అభిమానం. వారికి కూడా ఆయన మాటంటే వేదం.  ' ఎంగవీట్టు పిళ్ళై ' తమిళ చిత్రానికి ఎంజీయార్, సరోజాదేవి ల మీద చిత్రీకరించిన పాట రష్  చూసి నాగిరెడ్డి గారు అసంతృప్తి వ్యక్త పరిస్తే ఆ రోజు రాత్రికి రాత్రి దాన్ని ఆయనకు నచ్చేటట్లు రీ షూట్ చేసి చూపించి శభాష్ అనిపించుకున్నారు ఎంజీయార్.


...... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని విశేషాలో ఆ ' జ్ఞాపకాల పందిరి ' లో ! అవును. ఇవన్నీ ' విజయ ' నాగిరెడ్డి గారి సుదీర్ఘజీవితంలో మాణిక్యాల లాంటి జ్ఞాపకాలను వెలికి తీసి సంకలించిన విజయ పబ్లికేషన్స్ వారి ' జ్ఞాపకాల పందిరి ' పుస్తకంలోని కొన్ని విశేషాలు. 

వెలకట్టలేని విలువైన ఈ పుస్తకాన్ని ' శిరాకదంబం ' కు కానుకగా అందించిన 
' మాధురీకృష్ణ ' గారికి ధన్యవాదాలతో...... 

' విజయ ' పథమే తన లక్ష్యమన్న బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ...............  


నాగిరెడ్డి గారి గురించి గతంలో రాసిన టపాలు.....

'విజయ' నాగిరెడ్డి
విజయాధినేతకు నివాళి 
విజయా చందమామ
' విజయా ' రెడ్డి 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 081
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం