Saturday, December 24, 2011

చండాలిక

కొన్ని అనుభూతుల్ని నిర్వచించలేము. అవి అనుభవించాల్సిందే ! తర్వాత కాలంలో వాటిని నెమరు వేసుకుంటూ హాయిగా గడిపేస్తాం. అలాంటి తరుణంలో మళ్ళీ ఆ మధురానుభూతుల్ని ఆస్వాదించే అవకాశం ఎదురయితే....... ?

అది ఇంకొక అనిర్వచనీయమైన అనుభూతే ! అలాంటి అనుభూతే నిన్న నాకు మళ్ళీ ఎదురయింది. ఎప్పుడో ముఫ్ఫై ఏళ్ళ క్రితం 1979 - 80 ల మధ్యలో తిరుపతిలోనో, మద్రాసులోనో.....  స్థలం సరిగా గుర్తులేదు కానీ కాలం మాత్రం ఇదే ! చలికాలం.

కొద్దిరోజుల తేడాలో రెండు నృత్య నాటికలు చూసే అవకాశం కలిగింది. ఒకటి ' కన్యక ' . రెండవది ' చండాలిక '. మొదటిది ఎవరు ప్రదర్శించారో ఇప్పుడు గుర్తు లేదుకానీ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. రెండవది ' చండాలిక ' కేవలం ఆకట్టుకోవడమే కాదు..... మరచిపోలేని అనుభూతిని పంచింది. వెంపటి చిన సత్యం గారి మీద అభిమానాన్ని కలిగించింది. తర్వాతనేను త్యాగరాయ గాన సభ ( అమలాపురం ) కార్యనిర్వాహక సభ్యునిగా వున్నపుడు, శోభానాయుడు గారి నృత్య ప్రదర్శనకు సత్యం మాస్టారు గారు కూడా వచ్చినపుడు వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు స్వయంగా, ప్రత్యేకంగా చూసుకునే భాగ్యం కలిగింది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన్ని చూసే భాగ్యం కలిగింది.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఎనభై అయిదు సంవత్సరాల వయసు కలిగిన ఆయన్ని చూసే భాగ్యం కలిగింది. అంతే కాదు మళ్ళీ ఇన్నాళ్ళకు వారి రూపకల్పన ' చండాలిక ' నృత్య నాటకాన్ని దర్శించే భాగ్యం కలిగింది. కన్నుల పండుగ గా జరిగిన ఆ కార్యక్రమం మళ్ళీ అప్పటి అనుభూతుల్ని గుర్తుకు తెచ్చింది. 

కొంతమంది తమకు నచ్చిన కళను నేర్చుకుంటారు. నిష్ణాతులవుతారు. కానీ అనేక కారణాలవల్ల తమ కళను తమలోనే దాచుకుంటారు. కొంతమంది మాత్రమే తమలోని విద్వత్తును సమాజంతో పంచుకుంటారు. ఇంకొందరు తమలోని విద్వత్తునే కాదు... ఆ కళల్లో ప్రముఖులైన వారి విద్వత్తును కూడా సమాజానికి పంచడానికి కృషి చేస్తారు. అలాంటి బృహత్తర ప్రయత్నమే హంసధ్వని కూచిపూడి నృత్యాలయం చేసింది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారిని విజయవాడ వాసుల ముందుకు తెచ్చింది. వారి ' చండాలిక ' నృత్య నాటకంతో కనువిందు చేసింది. ఇందుకు సింగారమణి అజయకుమార్  గారి సోదరులకు, వారి బృందానికి విజయవాడ వాసులు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా నాకీ అదృష్టం కలిగించిన వర్షాభార్గవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి.  ముందే  ఈ కార్యక్రమం గురించి తెలియజేసి, ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక పంపి, ఎన్నో సార్లు మెయిల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా హెచ్చరిస్తూ నాలో బద్దకాన్ని వదిలిస్తూ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే భాగ్యాన్ని కలిగించింది వర్షాభార్గవి గారే ! లేకపోతే నా జీవితంలో మళ్ళీ ఈ ప్రదర్శనను చూసే అవకాశాన్ని పోగొట్టుకునే వాడినేమో ! అందుకే భార్గవి గారికి మరోసారి ధన్యవాదాలు.

బుద్ధుని జాతక కథల ఆధారంగా రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ లో  రచించిన సంగీత రూపకం ' చండాలిక '. దాన్ని తెలుగులో రచన చేసింది శ్రీ యస్వీ భుజంగరాయ శర్మ గారు. సంగీతం సమకూర్చింది శ్రీ మల్లిక్ గారు. నృత్య దర్శకత్వం పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు. దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు సత్యం గారు. ఈ నాటిక రూపకల్పన జరిగి సుమారుగా అర్థ శతాబ్దం గడుస్తున్నా ఇంకా సజీవంగా వుందంటే అది సత్యం గారి కృషే ! నాట్యం మీద ఆయకున్న మక్కువ ఏమిటో ఎనభై అయిదు సంవత్సరాల వయస్సులో రంగస్థలానికి ఎదురుగా కూర్చుని ఆద్యంతం తిలకించడం చూస్తే అర్థమవుతుంది.

వెంపటి నృత్యోత్సవ్ - 2011 లో భాగంగా రెండవరోజు కార్యక్రమం డా. సరస్వతి గారు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తే పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు నృత్యోత్సవ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డిప్యూటీ కీపర్ శ్రీ మల్లం వీరేందర్ గారు, ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ వేదాంతం రాధేశ్యాం గారు, అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి శ్రీ పసుమర్తి కేశవప్రసాద్ గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

చండాలిక నృత్య నాటిక సంక్షిప్తంగా ........

   

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 094

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం