Wednesday, September 7, 2011

కళాకారుల జంట

 మనకున్న కళలు అరవై నాలుగు .  ఈ కళలన్నీ అవినాభావ సంబంధం కలవి. ఉదాహరణకు నాట్యానికి తోడు సంగీతం. సంగీతానికి తోడు సాహిత్యం. అలాగే శిల్పకళకు తోడు చిత్రలేఖనం. ఇంకా ..... ఇలా చెప్పుకుంటూ పోతే ఏ తోడూ లేని కళ వుండదేమో ! ఈ కళలన్నిటినీ సమన్వయపరచి ఏకతాటిపైకి తెచ్చిన ఈ శతాబ్దపు అద్భుతం సినిమా ! ఇదొక ప్రత్యేకమైన ఆధునిక యుగపు కళగా అభివృద్ధి చెందింది. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పకళ, చిత్రకళ..... ఇలా దాదాపు కళలన్నీ ఈ సినిమాల్లోనే అమరిపోతున్నాయి. ఆ రకంగా సినిమా అనేది ఒక సమగ్రమైన కళారూపం అని చెప్పవచ్చు. అయితే పిచ్చివాడి చేతిలోని రాయిలాగ కళాత్మక హృదయం కాకుండా కేవలం వ్యాపార దృష్టి మాత్రమే ఉన్నవాళ్ళ చేతిలో అన్ని కళల్లాగే అప్పుడప్పుడు సినిమా కూడా విపరీత పోకడలు పోతుంటుంది. కానీ నిజమైన కళను ప్రజలెపుడూ ఆదరిస్తారు. కలకాలం ఆ కళాఖండాలను, కళాకారులను గుర్తుపెట్టుకుంటారు. 

ఒక కళకు మరొక కళ తోడైనట్లు ఒకరికి మరొకరు తోడుగా, నీడగా చిత్రసీమలో చిరకాలం నిలిచిన జంట భానుమతి - రామకృష్ణ. 1943 లో ' కృష్ణప్రేమ ' చిత్రంతో అంకురించిన భానుమతీరామకృష్ణల ప్రేమ సుమారు నలభై మూడేళ్ళ వైవాహికబంధంగా కొనసాగింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెత వారి విషయంలో నిజం కాలేదు. ఇద్దరూ సినిమారంగంలో ఉన్నవారే ! ఆ మాటకొస్తే వారి వివాహానికి వేదిక సినిమారంగమే ! సహాయ దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి... తండ్రి ఒప్పుకోకపోతే పక్షం రోజులపాటు కఠినమైన దీక్ష చేసి మరీ వివాహం చేసుకున్నారు భానుమతి.
 ఆ వివాహబంధం సాక్షిగా ఆ జంట అనేక విజయాలు చవిచూశారు. తమ కుమారుడి పేరుమీద స్థాపించిన భరణీ పిక్చర్స్ పతాకంపైన అనేక చిత్రాలు నిర్మించారు. వారు ఏ చిత్రం నిర్మించినా సామాజిక విలువలు, కళాత్మక విలువలు పుష్కలంగా ఉండేవి. తమ చిత్రాల్లో చాలావాటికి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 

 సాహిత్యంలో రచయిత విశ్వనాథకవిరాజు శిష్యురాలిగా భానుమతిలో హాస్యం పాలు ఎక్కువే ! అందుకే తమ చిత్రాల్లో హాస్యరసానికి ఎక్కువ ప్రాదాన్యమిచ్చేవారు. ఆవిడ రచనలు చూసినా హాస్యానికే పెద్ద పీట. భానుమతి సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా సంగీతంలో ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించారు. తమ సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి అగ్రస్థానమిచ్చారు. నృత్యానికి కూడా తగిన ప్రాధాన్యతే ఇచ్చారు. భానుమతి నటన గురించి చెప్పడం అంత సులభం కాదు. నవరసాలు పలికించిన నటి ఆమె. నటనా వ్యాకరణం అని అన్నాదురై నుండి బిరుదందుకున్న నటీమణి భానుమతి.

ఆ జంట రూపొందించిన చిత్రాలను పరిశీలిస్తే సినిమాలలో ఒదిగిపోయే అన్ని కళలకూ సమానమైన ప్రాధాన్యమే కల్పించారని చెప్పవచ్చు. అసలు రామకృష్ణ సినిమా కళను బాగా ఒంటబట్టించుకున్నారు గనుకనే ఆ చిత్రాల రూపకల్పనలో తీసుకున్న శ్రద్ధ వారి విజయానికి కారణమైంది. 1947 లో రత్నమాల తో ప్రారంభించి వారు నిర్మించిన లైలామజ్ఞు, చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి, వివాహబంధం లాంటి ఎన్నో చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. 


1939 లో వరవిక్రయం తో ప్రారంభమైన భానుమతి సినిమాజీవితం 1953 లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చండీరాణి చిత్రానికి దర్శకత్వం వహించడంతో మలుపు తిరిగింది. తర్వాత వారి పతాకంలో తయారైన కొన్ని చిత్రాలకు ఆవిడకూడా దర్శకత్వం చేసారు. భరణి స్టూడియోను స్థాపించి విజయవంతంగా నిర్వహించారు. 

...... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జంట సాధించిన విజయాలెన్నో ! సినిమావారి ప్రేమలు, వివాహాలు విఫలమవుతాయనే విమర్శకు సమాధానం ఆ జంట సుదీర్ఘ వైవాహిక జీవితమే ! సినిమావారికి కళాత్మక దృష్టికంటే వ్యాపార దృష్టే ఎక్కువ అనుకునేవారికి వారి చిత్రాలే సమాధానం. 

 జీవితాన్ని, వృత్తినీ సమానంగా పంచుకున్న ఆ కళాకారుల జంట ఇంకో విషయం కూడా పంచుకున్నారు. అది సెప్టెంబర్ 7 వ తేదీని. 1925 వ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన భానుమతి గారు జన్మిస్తే 1986 సెప్టెంబర్ 7 వ తేదీన రామకృష్ణ గారు దివంగతులయ్యారు. ఇద్దర్నీ ఒకేరోజు స్మరించుకునే అవకాశాన్ని మనకిచ్చారు. 

  భానుమతి - రామకృష్ణ జంటకు కళా నీరాజనాలు అర్పిస్తూ.......

 భానుమతి గారిపై గతంలోని టపా, ఆవిడతో ఇంటర్వ్యూ వీడియో ఈ క్రింది లింకులో...... 


భానుమతి గళంలో జయదేవుని అష్టపది........ Vol. No. 03 Pub. No. 027

6 comments:

jags said...

Bro Ramachandra Rao gaaru, Thanks for the enlightenment given on the mastero duo of yester years but relevant in many ways even today. The insight given by you is worth applauding and I urge U keep doing this yeoman service for the generation next to learn and understand the importance of acts and sacrifices of the renowned telugu doyens.
V J

Gomati Dittakavi Jonnalagadda said...

maastru...64 kalala prastavana techi naku oka manchi bahumati ichharu. Nenu Howard Gardner theory of intelligence in nammutanu. Oka manishi kevealam academic intelligence kakanda bahumukha prajna saali kavachu annadi vari vaadana. adi bharateeya sanskritilo antarbhagam. vare cheppini 8 domains of intelligence teesukunte okkokka domain lo 64 fine arts 8 choppuna imidipotayi. Bhanumatigaru naa dristilo aa kovaki chendina varu. vari gurinchi inta machi vivaralalni pondu parachina meeku malli inko sari .....:)

Pallavi Nara said...

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి సరైన నిర్వచనం భానుమతి గారు ...
ఆవిడ ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్, సింగర్, స్టూడియో ఓనర్ .. అండ్ ఎ లెజెండ్ ఆఫ్
ఇండియన్ సినిమా ఇండస్ట్రి.. tq 4 sharing sir...

SRRao said...

* jags గారూ!
* గోమతి గారూ !
* పల్లవి గారూ !

ధన్యవాదాలు

Anonymous said...

in my Opinion Bhanumati garu is the one & only cine artist who is 100% eligible for Dada saheb palke award. She is a actor,director,singer, music director, producer,Story writer,critic.

Unfortunately our AP govt didn't promoted her and nominated her to any awards. Very sad.

SRRao said...

అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు. వారు ఇలాంటి పురస్కారాలకి అతీతులు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం