Tuesday, March 8, 2011

శతదినోత్సవ మహిళ

ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ? 
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ? 


మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. 

ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే ! 

అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది. 

దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ? 
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు. 

అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.   

మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.... 

* గత సంవత్సరం టపా ..............

మహిళాలోకానికి శుభాభినందనలు

* 100 వ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి పుష్కర కాలం క్రితం శ్రీమతి దుర్గ డింగరి గారు రాసిన సవివరమైన వ్యాసం... దాని లింక్ .............
Vol. No. 02 Pub. No. 168

6 comments:

తృష్ణ said...

today morning i remembered your last year's post sir..

Thank you.

Subba Rao Venkata Voleti said...

"Antarjaateya Mahilaa Dinam- Sataabdi ni puraskarinchukoni ammaayi Durga -sariggaa- pannedellanaadu- andhra jyothi lo vraasina vyaasam chadivaanu. Saamaajikaparamgaa, mahilaalokam guri avuthunna paristhithilo- naatikee-netikee maarpu kanabadakapogaa- adi marintha dayadeeyamgaa maarindane cheppavachhunemo-- Samsthalu- Vyakthulu- chattaparamgaa tama vanthu krushini pattudalatho konasaagisthoo vunnaa- prajaa drukpadham lo ee disagaa gananeeyamayina maarpu raagaligithe -adee asalayina saaswatha parishkaaram kaagaladu- a manchi roju tondaralo raavalane mana aakanksha-mana andari nireekshana!-"

SRRao said...

* తృష్ణ గారూ !
గత సంవత్సరం టపాను గుర్తుంచుకున్నందుకు చాలా సంతోషం. ఈ సంవత్సరం అంత సమయం చిక్కలేదు. అందుకే సింపుల్ గా నా భావాలు మాత్రమే రాయగలిగాను... అది కూడా అసంపూర్ణంగా. ధన్యవాదాలు.

* సుబ్బారావు గారూ !

మంచి భావాలను అందించారు. ధన్యవాదాలు.

Durga said...

రామచంద్ర రావు గారు,
మీరు నేను రాసిన అసమాన చరిత్రను మీ బ్లాగ్ లో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలండి. నాకు సుబ్బారావు బాబయ్య గారు చెప్పారు ఈ రోజే. నాకూ ఈ సారి రాసే ఓపిక లేక ఈ ఆర్టికల్స్ అన్ని చూస్తున్నాను, మళ్ళి ఫ్రీలాంసింగ్ చేయాలనే ఆలోచన నిలకడగా వుండనీయటం లేదు. కొన్ని ఆర్టికల్స్ కాపీలు తీసి కొన్ని వార్తా పత్రికలకు పంపిద్దామని చూసినప్పుడు ఇది కనపడగానే దీనికే చిన్నగా నోట్ జత చేసి పెట్టాను.
సుబ్బారావు బాబాయ్య గారు మీ మాటలతో ఏకీభవిస్తున్నానండి. ఎంతమంది ప్రయత్నించినా మనుషుల ఆలోచనావిధానాల్లో, వైఖరిలో మార్పు రానంతకాలం పై పై మార్పులు ఎన్ని వచ్చినా సరిపోవు.
మీకూ,శ్రీరామచంద్ర్రావు గారికి మన:స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు....

Durga said...

శ్రీ రామచంద్రరావు గారు మీరన్నట్టు, స్త్రీ సమస్యలకు కేవలం పురుషులే కాదండి. ఇండియాలో టి.విలో వచ్చే షోస్ లో స్త్రీల మధ్య సంబంధాలను భయంకరంగా చూపించడం, ఒకరంటే ఒకరికి కక్షలు, పగలు, కార్పణ్యాలు. అవి సాధించడానికి రకరకాల వ్యుహాలు పన్నడం, ఒకరు పైకి వస్తున్నారంటే వారిని కిందకు లాగడానికి ప్రయత్నాలు. నేను చూడలేదు కానీ ఫ్రెండ్స్ చెప్పగా విన్నాను.

ఇలాంటివి వద్దని ప్రయత్నాలు చేసే వారు చేస్తారు కానీ టి.వి వారికీ డబ్బు ముఖ్యం, రేటింగ్స్ ముఖ్యం కాబట్టి వీటికే ప్రాధాన్యతనిస్తారు.

నిజ జీవితంలో ఈ మధ్యనే నేను బాగా నమ్మిన నేస్తమే కాదు ఆ పేరుకే కళంకం తెచ్చింది, నన్ను ఎన్నో రకాలుగా మానసిక హింసకి గురి చేసింది. ఇలాంటివారు కూడా వుంటారా అని అనిపించి మళ్ళి ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నాను.

SRRao said...

దుర్గ గారూ !
ధన్యవాదాలు. మళ్ళీ రాయడానికి ప్రయత్నించండి. మంచి రచనా శైలి వుంది మీలో. మీ రక్తంలోనే వుంది అది. ఆ మహాకవి వారసురాలిగా మీరు మంచి రచనలు అందిస్తారని ఆశిస్తున్నాను.

ఇక్కడ టీవీ సీరియల్స్ లో నిజ జీవితంలోనుంచే పాత్రలను తీసుకున్నా రేటింగ్స్ పేరుతో వాటిని చాలా ఎక్కువచేసి చూపుతున్నారండీ ! మంచి కథలు రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ మార్కెటింగ్ మాయ అడ్డుపడుతోంది. వాటి గురించి నా అనుభవాలతో వేరే టపా ఎప్పుడో రాస్తాను.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం