Wednesday, December 30, 2009

నాన్నగారు 'నాగయ్య'





తెరమీద పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు
తెరవెనుక అందరికీ ఆయన నాన్నగారు
తెలుగు ప్రజలందరూ ఆయన్ని ఆయా మహనీయుల ప్రతిరూపమని తలిస్తే
తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్తూ ఆప్యాయంగా నాన్నగారూ అంది
ఆయనకు అవకాశాలు అయాచితంగా రాలేదు
అవకాశాలు సృష్టించే ' గాడ్ ఫాదర్లు' ఎవరూ లేరు
కృషి, పట్టుదల, ఓర్పు, దీక్ష ఇవే ఆయన ఆయుధాలు
అవే మహానటుడుగా ఎదగడానికి ఆయనకు సోపానాలు
ఆయనే చిత్తూరు వుప్పలదడియం నాగయ్య

గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టి, చిత్తూరు జిల్లాలో బాల్యం గడిపి
ప్రభుత్వోద్యోగం , పత్రికా వ్యాసంగం వృత్తులుగా
గానం, సంగీతం, నటన ప్రవృత్తులుగా
సాగిన ఆయన పయనం ' గృహలక్ష్మి ' ( 1938 )తో
తెలుగు చలన చిత్ర రంగానికి చేరింది
బి. ఎన్. రెడ్డి గారి వాహినీ సంస్థకు తొలి చిత్రం ' వందేమాతరం ' ( 1939 )
నాగయ్య గారికి హీరోగా, సంగీత దర్శకునిగా తొలి చిత్రం ' వందేమాతరం '
హీరోగా విజయం సాధించిన వెంటనే ' సుమంగళి ' ( 1940 )లో
సంఘ సంస్కర్తగా వృద్ధ పాత్ర ఆయన చేసిన సాహసం

ఆయన్ని భక్తుడి రూపానికి ప్రతీకగా నిలిపిన చిత్రం ' భక్త పోతన ' ( 1942 )
ఆ తర్వాత భాగ్యలక్ష్మి, స్వర్గసీమ, త్యాగయ్య, యోగి వేమన..... ఇలా ఎన్నో
చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని అందించాయి
తెలుగు ప్రేక్షకులకు ఆయన నిర్మాతగా ' భాగ్యలక్ష్మి ' ని
నిర్మాత, దర్శకుడిగా త్యాగయ్య, నా ఇల్లు, భక్త రామదాసు అందించారు

'త్యాగయ్య' తిరువాన్కూర్, మైసూరు సంస్థానాలనుంచి
అఖండ గౌరవాలు, అత్యున్నత పురస్కారాలనందిస్తే
' యోగి వేమన ' ఫిల్మిండియా పత్రిక చేత భారత పాల్ మునిగా ప్రశంసలందిస్తే
ఆయన నటన కోనసీమలోని ఒక నిరక్షరాస్య, పేద బాలుడిని యోగి ని చేసింది

1950 కు ముందే లక్ష రూపాయిల భారీ పారితోషికాన్ని తీసుకున్న ఆయన
చివరి రోజుల్లో పొట్టకూటి కోసం ఇచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితినెదుర్కున్నారు
ఆయన రేణుకా ఫిల్మ్స్ ఆఫీసు చిన్న నటీనటుల పాలిట ధర్మసత్రం
ఎప్పుడు, ఏవేళకైనా అక్కడకెళ్ళిన వారందరికీ ఉచితంగా భోజనం సిద్ధం

నటన, సంగీతంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతే
దయాగుణం, పరోపకారాలతో తెలుగు చిత్రసీమకు ఆరాధ్యుడయ్యాడు
జీవితంలో తనకంటూ ఏమీ మిగుల్చుకోని ఆ మహానటుడికి
చివరకు మిగిలింది ఆ కీర్తి, మద్రాసు పానగల్ పార్క్ లో శిలా విగ్రహం మాత్రమే !

మహానటుడు చిత్తూరు వి. నాగయ్య వర్థంతి ( డిసెంబర్ 30 ) సందర్భంగా
నివాళులర్పిస్తూ ఆయన గానవాహిని నుంచి కొన్ని మచ్చు తునకలు........



Vol. No. 01 Pub. No. 146

5 comments:

suresh babu said...

నాగయ్య గారి గురించి చెబుతూ ఏడిపించేశారు కదండీ

Aditya Madhav Nayani said...

బాగుంది.
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/

SRRao said...

* సురేష్ బాబు గారూ !
* మాధవ్ గారూ !
కృతజ్ఞతలు

Unknown said...

ముమ్మిడివరం బాలయోగి, భక్తపోతన సినిమా చూసి మారారని చదివాను, యోగివేమన కాదు. ఎందుకంటే, గుమ్మడి గారు ఒక ఇంటర్వ్యూలో, తను నటించిన భక్తపోతన గురించి కామెంట్ చేస్తూ, "బాలయోగికి తన భక్తపోతన చూపిస్తే, సమాధినుంచి తిరిగి వచ్చేస్తాడు" అంటూ జోక్ చేసారట.

SRRao said...

కె.కె. గారూ !
మీరు చెప్పిన విషయం నిజమే ! గుమ్మడి గారి ఇంటర్వ్యూ నేను కూడా చదివాను. కానీ కోనసీమ జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయం యోగి వేమన. వీటిలో ఏది నిజమో తెలియదు. ఎందుకంటే పోతన 1942 లోను, వేమన 1947 లోను విడుదలయ్యాయి. బాలయోగి తపస్సుకి కూర్చున్నది 1946 లో. కనుక వేమన అయ్యే అవకాశం లేదు. ఆయన శిష్యులు పొలమూరి సంపతరావు గారి 'భగవాన్ బాలయోగీశ్వర చరితము' లో ఈ ప్రస్తావన కనిపించదు. ఏమైనా నా టపా ఆ మేరకు మార్పు చేసాను . మీ వ్యాఖ్యకు దన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం