Wednesday, November 24, 2010

ఛాన్స్ మిస్

ఇప్పుడు హిందీ తారల గమ్యస్థానం దక్షిణాది అయితే గతంలో దక్షిణాది తారల చూపు బాలీవుడ్. జాతీయ స్థాయి తారలుగా ఎదగడానికి ఆది రాచబాటగా భావించేవారు. ఆ రోజుల్లో ............

ఆంధ్రుల అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి రెండు సార్లు హిందీ చిత్రాల్లో నటించే అవకాశం తప్పిపోయింది.

ఒకటి - సాధనా వారు నిర్మించిన ' సంసారం ' చిత్రాన్ని జెమిని వారు హిందీలో అక్కినేని గారితో నిర్మించాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆయన చేతిలో చాలా చిత్రాలు వుండడం వలన కాల్ షీట్స్ కుదరక ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.

మరొక సందర్భం - అన్నపూర్ణ సంస్థనుండి వచ్చిన తొలి చిత్రం ' దొంగ రాముడు ' ఎంతటి ఘన విజయం సాధించిందో సినిమా ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విజయం హిందీ నిర్మాతల్ని టాలీవుడ్ బాట పట్టించింది. ఆ చిత్రం హక్కులకోసం చాలామంది హిందీ నిర్మాతలు అన్నపూర్ణ వారిని సంప్రదించారు. అయితే అన్నపూర్ణ వారికి తామే ఆ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది . అక్కినేని గారు కథానాయికుడిగా కె. వి. రెడ్డి గారి దర్శకత్వంలోనే ఆ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించాలని ఏర్పాట్లు మొదలుపెట్టారు. అప్పటికే ఉత్తరాదిన పంపిణీరంగంలో ప్రసిద్ధి చెందిన ఏ. వీ. యం. వారితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
సావిత్రి పాత్రకు మీనాకుమారిని, జమున పాత్రకు నందాను, రేలంగి పాత్రకు ఓం ప్రకాష్ ను, సూర్యకాంతం పాత్రకు మనోరమను ఎంపిక చేశారు. అయితే అన్నపూర్ణ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఆ సమయంలో తీవ్రమైన అనారోగ్యం చేసింది. డాక్టర్లు ఏ విధమైన మానసిక వత్తిడి ఉండకూడదని సంపూర్ణ విశ్రాంతి అవసరమన్నారు. దాంతో ఆ చిత్ర పునర్నిర్మాణ హక్కులు ఏ. వీ. యం. వారికి ఇచ్చేశారు.

అలా అక్కినేని రెండు సార్లు హిందీ చిత్రాల్లో నటించే ఛాన్స్ మిస్ అయ్యారు. ' దొంగ రాముడు ' చిత్రంలో నిత్య సత్యాలను బోధించే సముద్రాల గారి సాహిత్యాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరచగా సుశీలమ్మ పాడిన పాట మీకోసం .................




సాహిత్యం కోసం http://en.wikipedia.org/wiki/Donga_Ramudu లింక్ లో చూడండి.

Vol. No. 02 Pub. No. 066

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం