Monday, November 15, 2010

డబ్బు భలే జబ్బు

సమాజాన్ని నడిపించేది డబ్బు
ఆ డబ్బే మనుష్యుల్ని పట్టి పీడించే జబ్బు
మితిమీరి సంపాదించాలనుకోవడమే ఓ జబ్బు
ఆ జబ్బు పట్టిన మనిషి చేసేదంతా పెద్ద గబ్బు

ఆ జబ్బు చేసిన మనిషికి మనసు మనసులో వుండదు . ఆ డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడతాడు. నానా గడ్డీ కరుస్తాడు. ఉష్ణోగ్రత నార్మల్ గా వున్నప్పుడు అంత ప్రమాదం లేదు గానీ డబ్బు వైరస్ ప్రభావం పెరగడం ప్రారంభిస్తే మాత్రం అంతకంతకు టెంపరేచర్ పెరిగిపోతుంది. డబ్బు యావ ఎక్కువై పోతుంది. విచక్షణ నశిస్తుంది. ఒళ్ళు తెలియదు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏం చేయబోతున్నారో తెలియదు. కళ్ళకు పొరలు కమ్మినట్లయి అన్నీ మసక మసకగా కనిపిస్తాయి. చుట్టూ వున్న వాళ్ళని గుర్తు పట్టలేరు. ముఖ్యంగా తన వాళ్ళని, తన మేలు కోరే వాళ్ళని అస్సలు గుర్తు పట్టలేరు. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మినట్లయి నక్షత్రాలు కనబడినట్లు డబ్బు మాత్రమే కనబడుతుంటుంది. మీరు మందు పట్టించినా, ఇంజెక్షన్ చేసినా అంటే తిట్టినా, కొట్టినా వాళ్లకు తెలియదు. టెంపరేచర్ బాగా పెరిగి 104 డిగ్రీలు దాటితే సంధి ప్రేలాపన వస్తుంది అంటారు. అలాగే ఈ డబ్బు జబ్బు ముదిరిన వాళ్లకి కూడా ఇలాంటి ప్రేలాపనే వస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మర్చిపోతారు. 

పాపం... అదో ట్రాన్స్. అదో లోకం. ఏదైనా జబ్బు చేసిన వాళ్ళు ఆది త్వరగా, పూర్తిగా తగ్గాలంటే సరైన మందు తీసుకోవాలి.  కొంతమంది అలౌకికానందం కోసం మత్తు పదార్థాలు లాంటివి తీసుకుంటారు. వీళ్ళకి ఆ అవసరం లేదు. డబ్బు అనే మాట చెబితే చాలు మత్తు దానంతటదే ఎక్కేస్తుంది. జబ్బు దానంతటదే పెరిగిపోతుంది. వాళ్లకి డబ్బే ఓ టానిక్. ఆస్పత్రి బెడ్ మీద దాదాపు కోమా లాంటి పరిస్థితుల్లో వున్నవాడైనా ఎక్కడైనా డబ్బు వచ్చే అవకాశం వుందంటే చాలు.  బెడ్ మీంచి అమాంతం దూకి పరుగుపెడతాడు.

ఈ జబ్బు చేసినవాళ్ళు డబ్బుంటే కొండ మీద కోతినైనా సులువుగా తీసుకురావచ్చని గట్టిగా నమ్ముతారు. పాపం వాళ్లకు తెలియదు అలా తెచ్చిన కోతిని గోలుసులేసి కట్టేసినా వీళ్ళకి ఈ డబ్బు జబ్బు తగ్గిపోగానే ఆ గొలుసులు తెంచుకుని పారిపోతుందని.  దానికీ తెలుసు డబ్బు లేకపోతే ఈ జబ్బు చేసిన మనిషి ఎందుకూ పనికిరాడని. పాపం ఈ విషయం మాత్రం ఈ జుబ్బు మనిషికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు.


ఈ జబ్బు ముదిరిన వాళ్ళను గుర్తించడం చాలా కష్టం. అసలు ఏ జబ్బైనా అందులోను టి. బి. , కాన్సెర్ లాంటి దీర్ఘ రోగాల పాలిట పడ్డ వాళ్ళు రోజు రోజుకీ కృంగి కృశించి పోతారు. కానీ అదేమిటో డబ్బు జబ్బు వచ్చిన వాళ్ళు ( యావ వున్న వాళ్ళు ) మాత్రం ఆకలి దప్పులు మర్చిపోయినా పుష్టిగా బలంగానే కనబడుతారు. ఆది మనో బలమేమో మరి. అందుకే అంటారు. నమ్మకం లేని చోట ఎంత పవర్ ఫుల్ మందైనా పనిచెయ్యదని.... మనో బలాన్ని మించింది లేదని. అందులోనూ డబ్బు బలమాయే !

ఈ డబ్బు జబ్బు చేసిన వాళ్ళ పరిస్థితి ఒక్కోసారి విచిత్రంగా వుంటుంది. ఏ నిముషంలో ఏరకంగా ప్రవర్తిస్తారో, ఎవరిని దగ్గరకు తీస్తారో, ఎవరిని ఎప్పుడు దూరంగా పెడతారో చెప్పడం చాలా కష్టం. ఈ నిముషంలో మిత్రుడైన వాడ్ని మరునిముషంలో శత్రువుగా మార్చేస్తారు. ఈ నిముషంలో ఆత్మ బంధువు. మరు నిముషంలో బద్ధ శత్రువు. ఈ జబ్బున్న వాళ్ళలో కొంతమంది వుంటారు. వాళ్లకి నిలువెల్లా అనుమానమే ! అంటే ఈ జబ్బులో అదొక లక్షణమన్నమాట. తన చుట్టూ వున్నవాళ్ళందరూ తన దగ్గరున్న డబ్బుని దొంగిలిస్తారమేనని అనుక్షణం భయపడుతుంటారు. ఎవ్వరినీ నమ్మరు. చివరికి కట్టుకున్న జీవిత భాగస్వామిని, కన్న పిల్లల్ని కూడా ! తనల్ని మోసం చేసేస్తారేమోనని అడుగడుగునా అపోహ పడిపోతుంటారు. విచిత్రమేమిటంటే వీళ్ళలో చాలామంది ఇతరుల్ని ఏమార్చో, పరిమార్చో ఆ డబ్బు సంపాదించిన వారే ! స్వానుభవం గనుక వీళ్ళకు భయం ఎక్కువ. అనుమానం కూడా ఎక్కువే ! తన విద్యే తన మీద ఎవరైనా ప్రయోగిస్తారేమోనని.

ఇంకొంతమంది రోగులుంటారు. వాళ్ళు డబ్బే సమాజంలో తన హోదాని నిలబెట్టే సాధనమని గాఠిగా నమ్ముతారు. దానికోసం  ఏ అడ్డదారులైనా తొక్కి సంపాదించాలనుకుంటారు. డబ్బున్నవాడిని ఏ నీతినియమాలు, న్యాయాన్యాయాలు అడ్డుకోలేవని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. తాము ఎన్ని అక్రమాలు చేసినా, మోసాలు చేసినా ఆ డబ్బు తమని సంఘంలో గొప్ప వాళ్ళు గా నిలబెడుతుందని నమ్ముతారు. అందుకని డబ్బు సంపాదించే విషయంలో తన పర: బేధం వుండదు. సొంత మనుష్యుల్ని కూడా ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. ఈ స్థితి ఈ జబ్బులో ప్రమాదకరమైన స్థితిగా చెప్పుకోవచ్చు. ఇంతగా ముదిరిన జబ్బు తగ్గాలంటే తప్పనిసరిగా సర్జెరీ లాంటిది చెయ్యాల్సిందే ! ఒక్కోసారి ఆది వికటించే ప్రమాదముంది కూడా ! అయినా అంతవరకూ వీళ్ళను తీసుకెళ్లడం కూడా కష్టమే !

ఈ జబ్బు చివరి దశలో మాత్రం వీళ్ళ పరిస్థితి ఘోరంగా వుంటుంది. అంటు రోగిలాంటి పరిస్థితి. అంటురోగిని ఎలా దూరంగా ఉంచుతారో అలాగే వీళ్ళను కూడా దూరంగా ఉంచుతారు. కాదు వీళ్ళే దూరం చేసుకుంటారు. ఆఖరి దశలో వీళ్ళను సరిగా పట్టించుకునే వాళ్ళుండరు. పెట్టేడు డబ్బు పట్టెడు అన్నం పెట్టదు. అందరి పొట్టలు కొట్టి సంపాదించిన డబ్బుతో తనకిష్టమైనవి తినడానికుండదు. ఒంటినిండా డబ్బు తెచ్చిన అనుబంధ జబ్బులు చాలా పేరుకుపోతాయి. కిలుం వదిలితే గానీ ఫలం దక్కదని ఓ సామెత. వీరి డబ్బు బలహీనతను కనిపెట్టిన వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారు. సాధారణంగా ఈ రోగులకి జబ్బు తగ్గాక గానీ ఆ విషయం తెలియదు. వంద రూపాయలు ఖర్చయ్యే చోట వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతకాలానికి తిరిగి చూసుకుంటే చేతులు కాలాక............ అన్నట్లుంటుంది. ఒకవేళ మన డబ్బు మనదగ్గరే భద్రంగా ఉందనుకుని ధీమాగా వున్నా ప్రమాదమే ! పండును ఎక్కువకాలం నిలవ చేస్తే కుళ్ళిపోయినట్లు డబ్బు కూడా మళ్ళిపోతుంది. తనవాళ్ళ, పరాయి వాళ్ళ కన్ను దాని మీద పడుతుంది. అంతకాలం నిద్రాహారాలు మాని, ఉచ్చనీచాలు మరచి సంపాదించిన ఆ డబ్బుని ఎలా స్వంతం చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు చుట్టూ చేరుతారు. రకాల రకాల యుక్తులు కుయుక్తులు. మంచి ఉచ్చదశలో అందర్నీ శాసించే పరిస్థితిలో వున్న వాడు కాస్తా నైతిక ప్రవర్తన వల్లో, నిజంగానే జబ్బు చేసి అంపశయ్యపై ఉన్నప్పుడో పనికిరాని వాడవుతాడు. పరాయివాళ్ళే కాదు రక్త సంబంధీకులు కూడా ఎప్పుడు పోతాడ్రా బాబూ అతగాడి డబ్బు పంచుకుందాం అన్నట్లుగా గోతి కాడ నక్కల్లా కాచుక్కూర్చుంటారు.

మందు మితంగా పుచ్చుకుంటే జబ్బు తగ్గిస్తుంది డబ్బు అవసరమైనంత మేరకు సంపాదిస్తే మేలు చేస్తుంది  అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి డబ్బు విషయంలో మరింత నిజమేమో  ! లక్షల కోట్లు సంపాదించేస్తే అంతులేని కీర్తి వస్తుందన్నది... అదే శాశ్వతమన్నది భ్రమ మాత్రమే !  చనిపోయాక ' అమ్మయ్య పోయాడు ' అని కాక ' అయ్యో చనిపోయాడే ' అనిపించుకోవడమే కీర్తి శేషం ! బతికున్నప్పుడు తాత్కాలిక ప్రలోభాలకి లొంగి డబ్బు సంపాదనా యావలో పడి మంచిచెడ్డలు మరిచే వారికి కీర్తి  శేషులయ్యే అవకాశం ఎప్పటికీ రాదు. డబ్బు ఇచ్చే ఆనందం తాత్కాలికం. మంచితనం,  మానవత్వం ఇచ్చే ఆనందమే శాశ్వతం. గుడిసెలో వున్నా, రాజమహల్ లో వున్నా ఈ డబ్బు జబ్బు చెయ్యని వాడు ఎప్పుడూ రాజానే ! బతికినా చచ్చినా ఏనుగు ఎప్పుడూ విలువైనదే !  
అందుకని డబ్బుకు దాసోహం అని జబ్బు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా మితంగా సంపాదించడం ఆరోగ్యకరం.  
 


Vol. No. 02 Pub. No. 057

2 comments:

Apparao said...

>>>డబ్బుకు దాసోహం అని జబ్బు తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా మితంగా సంపాదించడం ఆరోగ్యకరం.

మీరు ఇట్టా అంటే నాలాంటి సోమరిపోతులు ఉన్న పని కూడా చెయ్యరు :))

SRRao said...

శాస్త్రి గారూ !
'మితం' గా అంటే అవసరమైనంతవరకూ అని అర్థం. మీకు ఈ పరిమితి తెలుసు కనుక అంతవరకూ బద్ధకం చూపరనుకుంటున్నాను. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం