Sunday, November 14, 2010

సినీ భీష్ముని నిర్యాణం

భారతంలో భీష్ముడు అజాత శత్రువు. కురు పాండవులిద్దరికీ హితుడే !
సినీ భారతంలో డి . వి. యస్. రాజు గారు కూడా అజాత శత్రువే ! అందుకే ఆయన ' భీష్మ ' అయ్యాడు.
కొంతమందితో ఎంత ఎక్కువ పరిచయమున్నా, ఎంతకాలం పరిచయమున్నా ఎక్కువకాలం గుర్తు పెట్టుకోలేము.
కొంతమందితో ఎంత తక్కువ పరిచయమున్నా, ఎంత తక్కువకాలం పరిచయమున్నా ఎల్లకాలం మరచిపోలేము.
ఈ రెండవ తరగతి మనిషి డి. వి. యస్. రాజు గారు.
సౌమ్యత, స్నేహశీలత ఆయనకు ఆభరణాలు.

రాజకీయాలతో సన్నిహితమున్న వ్యక్తి. కానీ తనకోసం రాజకీయాలను వాడుకోని మహామనిషి. మహానటుడుగా ఉన్నకాలంలోనూ, ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనూ ఎన్టీరామారావుగారికి సలహాలివ్వగలిగే స్థితిలో వున్నా కూడా ఏనాడు తన స్వార్థానికి ఈ స్నేహాన్ని ఉపయోగించుకోలేదు.

ఆ పెద్దాయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ 1987 వ సంవత్సరంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఉన్నకాలంలో మా ఫిలిం సొసైటీ ద్వారా ఇండియన్ పనోరమ చిత్రాలు ప్రదర్శించాలనే సంకల్పంతో వున్న అతి కొద్ది పరిచయాన్ని వుపయోగించి ఆయన్ని కోరాను. ఆ సంవత్సరమే ప్రభుత్వం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆ విభాగంలో ప్రదర్శించే  చిత్రాలు దేశంలోని కొన్ని ఎంపిక చేసిన నగరాలలో కూడా ప్రదర్శించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ఆ నగరాలను ఎంపిక చేసే బాధ్యత ఎఫ్. డి. సి. తీసుకుంది. నా అభ్యర్థనను మన్నించి మా సొసైటీకి ఆ అవకాశానికిచ్చి మా అమలాపురం లాంటి చిన్న పట్టణానికి ఆ భాగ్యాన్నందించారు. ఈ ఎంపికకు ఆయన తీసుకున్న శ్రద్ధ ఎలాంటిదో చెప్పడానికి ఆయన సూచనతో ఆంధ్రప్రదేశ్ లో అమలాపురం అనే పట్టణం వుందని కూడా తెలియని ఒక ఎఫ్. డి. సి. అధికారి నాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని ఏర్పాట్లు చెయ్యడం నిదర్శనం.

రాజు గారు రాజదర్పం చూపడం నాకు తెలీదు. నిత్యకృషీవలుడు అనే మాట ఆయనకు సరిగ్గా సరిపోతుంది. అందరికీ మంచి జరగాలని, మంచి చెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకునే ఆ మహామనిషి లేకపోవడం తెలుగు చిత్రసీమకు తీరని లోటు.

డి. వి. యస్. రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ..............

Vol. No. 02 Pub. No. 056

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం