Saturday, December 10, 2011

జడ్జికి శిక్ష

గతంలో ఇంచుమించుగా ప్రతి కళాశాలలోనూ ' మాక్ పార్లమెంట్ ' నిర్వహించేవారు. పార్లమెంట్ లో వాద ప్రతివాదాలు ఎలావుంటాయో విద్యార్థులకు తెలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే మాక్ న్యాయస్థానాలు కూడా జరుగుతూ వుండేవి.

ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడిగా పనిచేసిన ఎ. యస్. రామన్ విద్యార్థిగా వుండగా ఒక ప్రపంచ న్యాయస్థానం కార్యక్రమం జరిపారు. అందులో కేసు ' సైన్స్ మానవాళికి హాని చేస్తోంది '  అనే విషయం గురించి. సైన్స్ తరఫున సూరి భగవంతం గారు, ప్రజల తరఫున మామిడిపూడి రంగయ్య గారు వాద ప్రతివాదులు.

మూడు గంటలకు సరిపడా కార్యక్రమం రూపొందించారు. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండమని సి. ఆర్. రెడ్డి గారిని కోరారు. మూడు గంటలే కదా అని రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇరువైపులా వున్నది సామాన్యులా ? ఒకరు తర్వాత కాలంలో భారత దేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన వారు. మరొకరు తర్వాత రోజుల్లో రచయిత, విమర్శకుడు గా ఖ్యాతి వహించిన వారు. వాద ప్రతివాదాలు నిరాఘాటంగా తొమ్మిది గంటలు సాగాయి.

చివరికి రెడ్డి గారు న్యాయమూర్తిగా తన తీర్పుని సైన్స్ కి అనుకూలంగా ఇచ్చారు. అయితే శిక్ష విషయానికొచ్చేటప్పటికి ఆయన సహజ ధోరణిలో
" నిజానికి ఈరోజు దోషిగా బోనులో నుంచున్నది సైన్స్ కాదు.... నేను. ఇంత సమయం అవుతుందని తెలియక ఈ న్యాయమూర్తి పదవికి ఒప్పుకున్నాను. అందుకే నాకు బాగా శిక్ష పడింది "
అనడంతో అందరూ ఘొల్లుమన్నారు. 


 ప్రముఖ విద్యావేత్త, సాహితీ విమర్శకుడు కట్టమంచి రామలింగ రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ..........

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 086

2 comments:

Indian Minerva said...

:D

SRRao said...

ఇండియన్ మినర్వా గారు !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం