Thursday, December 31, 2009

' కొత్తవెలుగు ' కి స్వాగతం

కొన్ని మధురానుభూతులు
మరికొన్ని చేదు అనుభవాలు
వెరసి మరో గతించిన సంవత్సరం

కొన్ని సంతోషాలు, సంబరాలు
మరికొన్ని ఆశలు, కోరికలు
వెరసి మరో రాబోయే సంవత్సరం

గత సంవత్సరపు చీకటిని తొలిగించి
కొత్త వెలుగుని నింపాలని కోరుకుంటూ
2010 కి స్వాగతం పలుకుదాం !

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో....


To All blog friends
sirakadambam_SRRao



Vol. No. 01 Pub. No. 147

Wednesday, December 30, 2009

నాన్నగారు 'నాగయ్య'





తెరమీద పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు
తెరవెనుక అందరికీ ఆయన నాన్నగారు
తెలుగు ప్రజలందరూ ఆయన్ని ఆయా మహనీయుల ప్రతిరూపమని తలిస్తే
తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్తూ ఆప్యాయంగా నాన్నగారూ అంది
ఆయనకు అవకాశాలు అయాచితంగా రాలేదు
అవకాశాలు సృష్టించే ' గాడ్ ఫాదర్లు' ఎవరూ లేరు
కృషి, పట్టుదల, ఓర్పు, దీక్ష ఇవే ఆయన ఆయుధాలు
అవే మహానటుడుగా ఎదగడానికి ఆయనకు సోపానాలు
ఆయనే చిత్తూరు వుప్పలదడియం నాగయ్య

గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టి, చిత్తూరు జిల్లాలో బాల్యం గడిపి
ప్రభుత్వోద్యోగం , పత్రికా వ్యాసంగం వృత్తులుగా
గానం, సంగీతం, నటన ప్రవృత్తులుగా
సాగిన ఆయన పయనం ' గృహలక్ష్మి ' ( 1938 )తో
తెలుగు చలన చిత్ర రంగానికి చేరింది
బి. ఎన్. రెడ్డి గారి వాహినీ సంస్థకు తొలి చిత్రం ' వందేమాతరం ' ( 1939 )
నాగయ్య గారికి హీరోగా, సంగీత దర్శకునిగా తొలి చిత్రం ' వందేమాతరం '
హీరోగా విజయం సాధించిన వెంటనే ' సుమంగళి ' ( 1940 )లో
సంఘ సంస్కర్తగా వృద్ధ పాత్ర ఆయన చేసిన సాహసం

ఆయన్ని భక్తుడి రూపానికి ప్రతీకగా నిలిపిన చిత్రం ' భక్త పోతన ' ( 1942 )
ఆ తర్వాత భాగ్యలక్ష్మి, స్వర్గసీమ, త్యాగయ్య, యోగి వేమన..... ఇలా ఎన్నో
చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని అందించాయి
తెలుగు ప్రేక్షకులకు ఆయన నిర్మాతగా ' భాగ్యలక్ష్మి ' ని
నిర్మాత, దర్శకుడిగా త్యాగయ్య, నా ఇల్లు, భక్త రామదాసు అందించారు

'త్యాగయ్య' తిరువాన్కూర్, మైసూరు సంస్థానాలనుంచి
అఖండ గౌరవాలు, అత్యున్నత పురస్కారాలనందిస్తే
' యోగి వేమన ' ఫిల్మిండియా పత్రిక చేత భారత పాల్ మునిగా ప్రశంసలందిస్తే
ఆయన నటన కోనసీమలోని ఒక నిరక్షరాస్య, పేద బాలుడిని యోగి ని చేసింది

1950 కు ముందే లక్ష రూపాయిల భారీ పారితోషికాన్ని తీసుకున్న ఆయన
చివరి రోజుల్లో పొట్టకూటి కోసం ఇచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితినెదుర్కున్నారు
ఆయన రేణుకా ఫిల్మ్స్ ఆఫీసు చిన్న నటీనటుల పాలిట ధర్మసత్రం
ఎప్పుడు, ఏవేళకైనా అక్కడకెళ్ళిన వారందరికీ ఉచితంగా భోజనం సిద్ధం

నటన, సంగీతంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతే
దయాగుణం, పరోపకారాలతో తెలుగు చిత్రసీమకు ఆరాధ్యుడయ్యాడు
జీవితంలో తనకంటూ ఏమీ మిగుల్చుకోని ఆ మహానటుడికి
చివరకు మిగిలింది ఆ కీర్తి, మద్రాసు పానగల్ పార్క్ లో శిలా విగ్రహం మాత్రమే !

మహానటుడు చిత్తూరు వి. నాగయ్య వర్థంతి ( డిసెంబర్ 30 ) సందర్భంగా
నివాళులర్పిస్తూ ఆయన గానవాహిని నుంచి కొన్ని మచ్చు తునకలు........



Vol. No. 01 Pub. No. 146

Monday, December 28, 2009

దేవులపల్లి ' నిజలింగప్ప '

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కవిత్వమే కాదు ఛలోక్తులు విసరడం కూడా వచ్చుననడానికి ఈ సంఘటన ఓ మచ్చు తునక.
ఓ నిర్మాత తన చిత్రానికి పాట రాసివ్వమని దేవులపల్లి వారిని అడిగాడు. చాలా రోజులు గడిచిపోయాయి. పాట మాత్రం రాలేదు. ఓ రోజు ఆయన్ని కలిసి పాట విషయం గుర్తుచేసాడు. వెంటనే ఆయన ఓ కాగితం తీసుకుని ' నిజలింగప్పకు అనారోగ్యం ' అని రాసి చూపించారు. ఆ నిర్మాతకు ఏమీ అర్థం కాలేదు. జాతీయ రాజకీయాల్లో ఉన్న నిజలింగప్పగారి ఆరోగ్యానికి, తనక్కావాల్సిన పాటకు సంబంధమేమిటో ఎంత ఆలోచించినా బోధపడలేదు ఆ నిర్మాతకు. కృష్ణశాస్త్రి గారి మీద గౌరవంతో ఆయన్ని అడగలేకపోయాడు గానీ తర్వాత శ్రీశ్రీ గారు దీనికి అర్థం వివరించి చెప్పడంతో ఆ నిర్మాత సందేహం తీరిపోయింది. ఇంతకీ ఆ వివరణ ఏమిటంటే ' నిజలింగప్ప' అంటే ఆత్మారాముడని అర్థం అని, అంటే అనారోగ్యం దేవులపల్లి వారికేగానీ, కాంగ్రెస్ నాయకుడు నిజలింగప్పకు కాదని వివరించారట శ్రీశ్రీ గారు.

Vol. No. 01 Pub. No. 145

Saturday, December 26, 2009

మహానటికి మరో నీరాజనం

ఆమె కళ్ళు నవ్వుతాయి
ఆమె కళ్ళు ఏడుస్తాయి
ఆమె కళ్ళు ప్రేక్షకుల్ని సమ్మోహన పరుస్తాయి
ఆమె కళ్ళు నవరసాలూ కురిపిస్తాయి

రచయిత వంద పదాల్లో రాసిన భావాల్ని
ఆమె ఒకే ఒక ఎక్స్ప్రెషన్ లో పలికించగలదు
తారలెందరో వచ్చారు, వెళ్ళారు
ఆమె మాత్రం ప్రేక్షకుల మదిలో స్థిరంగా ఉంది

ఆమె నటన ఈనాటి నటీమణులకు ఆదర్శప్రాయం
నటనలో ఆమె జీవించింది
జీవితంలో ఆమె ఓడిపోయింది
ఆమె జీవితం ఈనాటి నారీమణులకు జీవన పాఠం

ఆమె ప్రేమించింది, ఆరాధించింది
ధనం ముందు ఆమె ప్రేమ ఓడిపోయింది
ఆమె వెండితెరపై మకుటం లేని మహారాణి
' ప్రాప్తం ' లేక వంచనకు బలైన నారీమణి

నటి ఎలా ఉండాలో ఆమె నటన నిరూపించింది
మనిషి ఎలా ఉండకూడదో ఆమె జీవితం చూపించింది
ఏరకంగా చూసినా ఆమె అందరికీ ఆదర్శం
అందుకే ఆమె మనందరి మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది

ఆమే..... మహానటి, సహజ నటి ' సావిత్రి '
' ప్రాప్తం ' ( తమిళ మూగమనసులు ) కలిసిరాక,
అయిన వాళ్ళు, తనకు అండగా నిలువవలసిన వాళ్ళూ
దూరమై పోయి, ఒంటరి తనాన్ని భరించలేక మద్యానికి బానిసై,
చివరికి ఆ మద్య ప్రభావంతో ఇరవై నెలలు కోమాలో ఉండి
1981 డిసెంబర్ 26 వ తేదీన నింగితారల్లో కలిసిపోయిన
ఈ వెండితెర తారకు నివాళులర్పిస్తూ........




Vol. No. 01 Pub. No. 144

Friday, December 25, 2009

ఉదాసీనతా నీ విశ్వరూపం !!!

అధికారం, ధనం, పలుకుబడి ముందు
సభ్యత, సంస్కారం తలవంచుకుంటున్నాయా ?
రాజకీయాలకు విలువలు లేవా ?
విశృంఖలత్వమే వాటి చిరునామాగా మారిపోతోందా ?
స్వార్థ రాజకీయాలు ..........
రాజకీయ స్వార్థాలు .........
ఉద్యమాలను బలితీసుకుంటున్నాయి
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి
సామాన్య ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్నాయి
ప్రజలిచ్చిన అధికారంతో అందాలాలెక్కుతున్నాయి
మదమెక్కిన జంబుకాలు ప్రజా భవనాలనే
రాసలీలా మందిరాలుగా మార్చేస్తున్నాయి
వారికా భవనాలేవరిచ్చారు ? అధికారమెవరిచ్చారు ?
హోదా ఎవరిచ్చారు ? ధనమెవరిచ్చారు ?
వారికి ఇలా కళ్ళు నెత్తికెక్కడానికి కారణమేమిటి ?
ఇంకేమిటి ? ప్రజల ఉదాసీనతే !
అదే ఈనాటి రాజకీయాలకు పెట్టుబడి
ఎప్పటికైనా ప్రజల్లో ఈ ఉదాసీనత తొలిగిపోతుందా ?

Vol. No. 01 Pub. No. 143

క్రిస్మస్ శుభాకాంక్షలు

శాంతి, సహనాలకు ప్రతీక ఏసుక్రీస్తు
ఆ మహనీయుని ఆవిర్భావ సూచిక క్రిస్మస్
ఈ సందర్భంగానైనా మన రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ ....
బ్లాగు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు



Vol. No. 01 Pub. No.142

Thursday, December 24, 2009

మొక్కపాటి మాస్టారి కష్టాలు

మొక్కపాటి నరసింహారావు గారు వృత్తీ రీత్యా ఉపాధ్యాయులు. ప్రవృత్తి రీత్యా రచయిత.
ఆయన తన మీదా, తన వృత్తీ మీద వేసుకున్న చలోక్తులెన్నో !
అందులో కొన్ని........

* ఒకసారి ఆయనకు విద్యార్థుల భావనాశక్తి తెలుసుకోవాలనిపించింది. క్లాసులో ఒక కుర్రవాడిని లేపి
" ఒరే అబ్బాయ్ ! ఒక చాకలివాడు తన గాడిదను చావబాదుతుంటే నేను వెళ్లి ఆ గార్దభాన్ని రక్షించాను.అప్పటి నా ప్రవర్తన ఏ రీతిని అనుసరించును ? " అని ప్రశ్న వేశారు.
' బుద్ధ భగవానుని రీతిని ' అని చెప్తాడని ఆయన ఉద్ద్యేశం. కానీ ఆ విద్యార్థి లేచి కొంటెగా
" అప్పటి మీ ప్రవర్తన సోదర భావాన్ని అనుసరించి ఉంది మాస్టారూ ! " అన్నాడు. మొక్కపాటి వారి పరిస్థితి ఊహించుకోండి.

* ఒకరోజున మొక్కపాటి వారు వాళ్ళబ్బాయికి సైన్స్ పాఠం చెబుతున్నారు. అందులో భాగంగా మనుష్యులు కోతులనుంచి వచ్చారని చెప్పారు. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళమ్మగారి దగ్గరకు వెళ్లి
" అమ్మా ! మనం కోతులనుండి వచ్చామటగా ! " అన్నాడు. ఆవిడ ' ఛీ ! ఛీ ! అదేం మాట ' అన్నారు.
ఆ అబ్బాయి వదలకుండా
" ఏమో మరి. మన తాతముత్తాతలు కోతులనుండి వచ్చారని నాన్న చెబుతున్నారు " అన్నాడు.
దానికావిడ పరధ్యానంగా " ఏమో నాయినా ! మా తాత ముత్తాతలు మనలాంటి మనుష్యులని మాత్రం తెలుసు. మీ నాన్న తాతముత్తాతల గురించి నాకు తెలియదు " అన్నారు.

* మరోరోజు ఆయన వాళ్లమ్మాయికి లెక్కలు చెబుతున్నారు. ఆయనిచ్చిన లెక్క ' ఒకడు ఒక పనిని మూడు రోజుల్లో పూర్తిచేస్తే మరొకడు అదే పనిని పూర్తి చెయ్యడానికి అయిదు రోజులు తీసుకుంటాడు. ఇద్దరూ కలిస్తే పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు ? '
అమ్మాయి ఆ లెక్క చెయ్యలేక పోయింది. దాంతో ఆయనకు కోపం వచ్చి ఒక దెబ్బ వేశారు. వెంటనే లోపల్నుంచి కాంతం గారు విసురుగా వచ్చి " ఏమిటండీ వెధవ లెక్కలు. ఒకడు ఒక పనినిమూడురోజుల్లో చక్కగా చెయ్యగలిగి ఉంటే, అయిదు రోజుల దాకా దేకించే మరో వెధవను ఇందులో ఇరికించడం ఏమంత తెలివైన పని ? ఆ ఒక్కడి చేతే పని చేయించుకోకూడదూ ! ఆ ఇద్దర్నీ కలపడమెందుకు ? వాళ్ళిద్దరూ కలిస్తే వప్పందాలు పోతారుగానీ చస్తే ఆ పని పూర్తవుతుందంటారా ? పిచ్చా ఏమన్నానా మీకు ? ఇలాంటి లెక్కలు చెయ్యకపోతే మానె ! పిల్లదాన్ని మాత్రం కొట్టబోకండి " అమాయకంగా అనేసి ఆ అమ్మాయిని లోపలి లాక్కేళ్ళింది.

Vol. No. 01 Pub. No. 141

Wednesday, December 16, 2009

మన 'సు' దర్శకుడు ఆదుర్తి


ఆత్రేయ మనసు కవి అయితే ఆదుర్తి మనసు దర్శకుడు. ఆయన దర్శించినన్ని ( దర్శకత్వం వహించినన్ని ) మనసుల చిత్రాలు మరే దర్శకుడు చెయ్యలేదేమో ! మానవ సంబంధాలు, మనస్తత్వాలు, ఘర్షణలు చిత్రీకరణలో ఆదుర్తి సుబ్బారావు గారిది విలక్షణ శైలి. ఆయన చిత్రాలు ఈ నాటికీ అజరామరాలు. ఆయన చిత్రాలు గుర్తున్నంతగా ఆయన జీవిత విశేషాలు తెలుగు ప్రేక్షకులకు గుర్తున్నట్లు కనిపించదు. ఆయన 97 వ జన్మదినం సందర్భంగా సమగ్రంగా కాకపోయినా నా సేకరణ లోని కొన్ని ముఖ్యమైన విశేషాలను క్లుప్తంగా అందిస్తున్నాను.

1912 లో డిసెంబర్ 16 వ తేదీన రాజమండ్రిలో జన్మించిన ఆదుర్తి సుబ్బారావు గారి తండ్రి శ్రీ సత్తెన్న పంతులు. ఆయన తాహసిల్దార్ గా పనిచేశారు. సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో బొంబాయి చేరి సినిమాటోగ్రఫీ కోర్స్ లో చేరారు. ఆ సమయంలో తనకు డబ్బు అవసరమొస్తే తండ్రికి రాసే ఉత్తరంలో మనియార్డర్ ఫారంతో బాటు ఓ ప్రామిసరీ నోటు కూడా ఉండేది. " బొంబాయిలో కోర్సుకి అయ్యే ఖర్చుకి తర్వాత కాలంలో నీ తమ్ముళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అగత్యం లేకుండా అప్పుగా తీసుకో " అని సత్తెన్న పంతులు గారి సూచన మేరకే ఆదుర్తి గారు అలా పంపేవారట.

ఆ సమయంలోనే ఆ కోర్సుతో బాటు లాబరేటరీ అసిస్టెంటుగా, ఎడిటింగ్ సహాయకుడిగా కూడా పనిచేశారు. ' వనరాణి ' , ' మంగళ సూత్రం ', ' ఒక రోజు రాజు ', సర్కస్ రాజు ' చిత్రాలకు మాటలు, పాటలు రాసారు. అప్పుడే ఈ రంగాల్లో ఆదుర్తి గారి ప్రతిభను గురించి విన్న ప్రముఖ నాట్యాచార్యుడు ఉదయ శంకర్ నాట్యం ప్రధానాశంగా తాను తీస్తున్న ' కల్పన ' చిత్రానికి సహాయ దర్శకుడిగా తీసుకున్నాడు. ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన బొంబాయి నుండి మద్రాసుకి చేరారు. ఆ సమయంలోనే మచిలీపట్నానికి చెందిన కామేశ్వరీ బాల తో ఆయనకు వివాహం జరిగింది.

తన సోదరుడు ప్రారభించిన ' హారతి ' అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అది ఎక్కువకాలం నడవలేదు.
( ఆ పత్రికలో ఆయన రాతలు మరోసారి...... )

కె.ఎస్. ప్రకాశరావు గారు నిర్మించిన ' దీక్ష ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. ' సంక్రాంతి ', ' కన్న తల్లి ' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ప్రకాశరావు గారి ' బాలానందం ' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.

ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ' అమరసందేశం ' అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. 1954 లో విడుదలైన ఆ చిత్రమే ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ఆయన చూపించిన ప్రతిభ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆయన ప్రవేశానికి నాంది అయింది. ఆ సంస్థకు తొమ్మిది తెలుగు చిత్రాలు, మూడు తమిళ చిత్రాలు రూపొందించారు.
తమిళ నిర్మాత సి. సుందరం తో కలిసి బాబూ మూవీస్ సంస్థను స్థాపించి ' మంచి మనసులు ', ' మూగమనసులు ', ' తేనెమనసులు ', ' కన్నె మనసులు ' చిత్రాలు నిర్మించారు.

' తేనె మనసులు ' తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంతే కాదు అందరూ కొత్త నటీనటులతో తీసిన మొదటి చిత్రమని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు హీరో గా మొదటి చిత్రం. మొదట ఆరు రీళ్ళు నలుపు తెలుపు లో తీసి నచ్చక మళ్ళీ రంగుల్లో తీసారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది.

ఆయన హిందీ లో ' మిలన్ ' ( మూగమనసులు ), ' డోలీ ' ( తేనెమనసులు ), ' జ్వార్ భలా ' ( దాగుడు మూతలు ), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. ' దర్పణ్ ', ' జీత్ ' ( పూలరంగడు ) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఆయన అన్నపూర్ణా సంస్థకు నిర్మించిన ' డా. చక్రవర్తి ' చిత్రానికి నంది బహుమతి వచ్చింది. ఆ బహుమతిగా వచ్చిన నగదు పెట్టుబడిగా అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు ' సుడి గుండాలు ', ' మరో ప్రపంచం ' నిర్మించారు. అవి ఆర్థికంగా విజయం సాధించాక పోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాలుగా ఆయన చెప్పేవారు.

ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేసిన రచయితలు - ముళ్ళపూడి వెంకటరమణ ( దాగుడు మూతలు ), ఎన్. ఆర్. నంది ( కన్నె మనసులు ), డా. కొర్రపాటి గంగాధర రావు ( ఇద్దరు మిత్రులు ), మోదుకూరి జాన్సన్ ( మరో ప్రపంచం ), సత్యానంద్ ( మాయదారి మల్లిగాడు )

ఆయన శిష్యరికంలో ఎదిగిన దర్శకులు - శ్రీయుతులు కె. విశ్వనాథ్, వి. మధుసూదన రావు, టి. కృష్ణ ( ఖైదీ బాబాయ్ ఫేం ), పెండ్యాల నాగాంజనేయులు ( బుల్లెమ్మ ఫేం) , టి. మాధవరావు ( తాళి బొట్టు ఫేం ), ఫై. చంద్ర శేఖర రెడ్డి, ఎం. మల్లిఖార్జున రావు ( గూధచారి 116 ఫేం ), ఎం. నందన కుమార్ ( ఇదేనా న్యాయం ఫేం )

తన ఏకైక పుత్రుడు సాయి భాస్కర్ నిర్మాతగా రవి కళా మందిర్ స్థాపించి ' మాయదారి మల్లిగాడు, ' గాజుల కిష్టయ్య ' చిత్రాలు నిర్మించారు. తర్వాత ' మహాకవి క్షేత్రయ్య ' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురయి గాజుల కిష్టయ్య చిత్రం విడుదల కాకుండానే 1975 అక్టోబరు 1 వ తేదీన స్వర్గస్తులయ్యారు.

ఆయన కుమారుడు సాయి భాస్కర్ తర్వాత ' సిరిమల్లె నవ్వింది ' చిత్రం నిర్మించారు. మరోవిశేషం... భాస్కర్ కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దగ్గర ' సప్తపది ' చిత్రానికి సహకార దర్శకుడిగా పని చేశారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలగడం నా అదృష్టం.

మనసు
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి జన్మ దిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....


Vol. No. 01 Pub. No. 140

Tuesday, December 15, 2009

సచిత్ర... చలన చిత్ర కళా ప్రపూర్ణుడు "బాపు "


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె లూయలూపు.....

- ఆరుద్ర గారి జోస్యం ఎంత నిజమో !



బాపు అందమైన మనుష్యులనే - ముఖ్యంగా స్త్రీలను - వేస్తాడేమో అనుకుని
కొన్నాళ్ళు నేను కూడా అపోహపడ్డాను. కానీ, బాపు సృష్టించే అందం
అతని బొమ్మల్లో వుంది - మనుష్యుల్లో కాదు

- కొడవటిగంటి కుటుంబరావు

బాపూ నీ బొమ్మలు-తల
లూపు గులాబి కొ్మ్మలు
బాపూ నీ రేఖలు - ముని
మాపు శకుంత ల లేఖలు




బాపూ నీ లేఖిని - దరి
దాపు సుధారస వాహిని
బాపూ నీ భావము - వగ
బాపు కళకు నవ జీవనము
- కరుణశ్రీ

చిత్రకళలో కుంచెతో విన్యాసాలు చేయించగల ప్రవీణుడు బాపు
చలన చిత్ర కళలో కెమెరాతో అంతే విన్యాసాలు చేయించారు .
కాన్వాస్ మీద ఆయన వేసిన బొమ్మ భాష కందని భావాన్ని పలికిస్తే
సెల్యులాయిడ్ మీద ఆయన తీసిన బొమ్మ భాష అవసరం లేని భావాన్ని పలికించింది.

' సాక్షి ' తో మొదలైన బాపు సినీ ప్రస్థానం ఇప్పటికి ' సుందరాకాండ ' వరకూ సాగింది.

ఆయన సినిమాలో కథ ఏమిటో ప్రేక్షకుడికి అక్కరలేదు.
ఆయన చిత్రీకరించే ఫ్రేములు చాలు. అవే ఎంతో సుందరంగా అలరిస్తాయి.
కేవలం ఆయన ఫ్రేముల కోసమే ఆయన తీసిన చిత్రాలను చూసే వారున్నారు.
ఎన్నో సినిమాలు ఆయనకు కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు...
ఊహూ ! తెలుగు జాతికే గౌరవం తెచ్చి పెట్టాయి.


తెలుగులో బాలల చిత్రాలకు ఇప్పటికీ కరువే ! ఎందుకంటే అవి వ్యాపార పరంగా పనికి రావని. కానీ ఆయన ఎప్పుడో
బాలల చిత్రం ' బాలరాజు కథ ' తీసి మనోరంజకంగా తీస్తే కమర్షియల్ గా విజయం సాధించవచ్చు అని నిరూపించాడు.
అంతే కాదు ఇప్పుడు మామూలు అయిపోయిన ఏనిమేషన్ ఆ చిత్ర టైటిల్స్ లో ఉపయోగించారు. అవి చూసి ఆనందించండి........



తెలుగు చలన చిత్ర పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం " సీతాకళ్యాణం ".
సెల్యులాయిడ్ మీద కవిత్వం రాయడం బహుశా ఇంకెవరికీ సాధ్యం కాదేమో !
ఆ చిత్రంలో ఒక్కోక్క ఫ్రేము ఒక్కొక్క కళా ఖండం
గంగావతరణ దృశ్యం విదేశీ సాంకేతిక నిపుణులను సైతం ఆశ్చర్య పరచింది. కొన్ని విదేశీ ఫిల్మ్
ఇన్ స్టిట్యూట్ లు ఆ దృశ్యాన్ని తమ స్టడీ మెటీరియల్ గా చేసుకున్నారంటేనే ఆ దృశ్య చిత్రీకరణలోని
గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాన్ని ఓ సారి తిలకించండి.





అపురూప చిత్ర కళా తపస్వికి జన్మదిన శుభాకాంక్షలు

Vol. No. 01 Pub. No. 139

అమరజీవి ఆత్మఘోష


అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !

అన్నట్లు
అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

ఏమని
చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !

సరే
... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.

నిజాం
నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.

అయితే
కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.

అప్పుడే... అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 57 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.

Vol. No. 01 Pub. No.138

Monday, December 14, 2009

మనసున మల్లెల మాలలూగెనే !


ఒక కళా ఖండం పుట్టాలంటే ఎంతో ఓర్పు అవసరం. ముఖ్యంగా కవుల నుండి , రచయితల నుండి ఒక రచన అలవోకగా వస్తుంది. మరొక రచనకు వారెంతో మధన పడతారు. ఆ మథనం నుంచి అమృతం లాంటి రచన పుడుతుంది. అందరినీ అలరిస్తుంది. వారి నుండి అలాంటి అద్భుతమైన రచనలని రాబట్టడం కూడా ఒక కళే ! అందులో నిష్ణాతులు వాహినీ అధినేత బి.ఎన్. రెడ్డి గారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత తమ చిత్రాలకు రచన చేయించాలని చాలాకాలం చేసి ప్రయత్నం చివరకు ' మల్లీశ్వరి ' చిత్రంతో సఫలీకృతమయ్యారు బి.ఎన్. అజరామరమైన సాహిత్యాన్ని అందించడంలో కృష్ణశాస్త్రి గారి కృషి ఎంత ఉందో మన మనస్సులో చిరస్థాయిగా నిలవడానికి బి.ఎన్. రెడ్డి గారి ఓర్పు, నైపుణ్యం అంతే స్థాయిలో ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ సంఘటన.

కృష్ణశాస్త్రి గారు " మల్లీశ్వరి " చిత్రంలో పాటలన్నీ రాసేసారు గానీ ఒక పాట మాత్రం వెంటనే రాయడం ఆయనకి సాధ్యం కాలేదు. రోజులు గడుస్తున్నాయిగానీ ఆయనకు తృప్తి కలిగించే సాహిత్యం రావడంలేదు. నిత్యం బి.ఎన్. గారు ఆయన్ని కలవడం, నిరాశగా వెనుదిరగడం జరుగుతోంది. ఫలితం మాత్రం రాలేదు. కృష్ణశాస్త్రి గారు కూడా ఆందోళన చెందుతున్నారు. బాగా ఆలోచించి బి.ఎన్. గారు ఒక నిర్ణయానికి వచ్చారు.

" కృష్ణశాస్త్రి గారూ ! మీరు పాట కోసం చాలా మధన పడుతున్నారని తెలుసు. ఏం చేస్తాం ! మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఈ రోజు సాయింత్రం లోగా పాట పూర్తయితే సరే ! లేకపోతే ఆ సన్నివేశంలో జయదేవుని అష్టపది ' ధీర సమీరే ' పెట్టేదాం ! " అనేసి వెళ్లిపోయారు.

అంతే ! ఆ మాట కృష్ణశాస్త్రి గారిని కలచివేసింది. ఆరోజు సాయింత్రమే రెడ్డి గారిని కలిసారు. పూర్తయిన ఆ పాట అందించారు. బి.ఎన్. రెడ్డి గారి ఆనందానికి అవధి లేదు. తెలుగు శ్రోతల హాయికి అదుపు లేదు. అంతగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో తేలియాడించిన / ఆడిస్తున్న ఆ పాట " మనసున మల్లెల మాలలూగెనే ! " . మీలో హాయిని నింపే ఆ పాటను ఒక్కసారి వీక్షించండి..........




Vol. No. 01 Pub. No. 137

Sunday, December 13, 2009

గ్రాంథిక విసుర్లు

గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషోద్యమాన్ని గురించి తెలియనివారుండరు.
అలాగే జయంతి రామయ్య పంతులు గారు కరుడుగట్టిన గ్రాంథిక భాషా వాది. కనుక ఇద్దరికీ భాషా పరంగా బేదాభిప్రాయాలుండడం సహజమే కదా !
అవకాశం దొరికితే తరచూ పరస్పరం విసుర్లు వేసుకుంటూ ఉండేవారు.
అలాంటి అవకాశం ఒకసారి గిడుగువారికి దొరికింది.
ఎక్కడో ఏదో సందర్భంలో జయంతి వారు పొరబాటున " తలకు నూనె వ్రాసుకుని...... " అని రాసారుట !
అంతే ! గిడుగు రామమూర్తి గారు అది పట్టుకున్నారు.
" అవునవును. రామయ్య పంతులు గారు తలకు నూనె వ్రాస్తారు. పుస్తకాలేమో...... రాస్తారు " అని చురకేసారు.

Vol. No. 01 Pub. No. 136

Saturday, December 12, 2009

కనుక్కోండి చూద్దాం ! - 6

' ఉద్యమ కారులకి నాయకుడి సందేశం ' టపాలో
సందేశమిచ్చిన నాయకుడెవరు( నటుడు కాదు ) ,
ఈ క్లిప్పింగ్ ఏ చిత్రంలోదో కనుక్కోగలరా ?


Vol. No. 01 Pub. No. 135

Friday, December 11, 2009

ఉద్యమకారులకి నాయకుడి సందేశం

ఉద్యమాల్లో సమిధలవుతున్న విద్యార్థులకు, అమాయకులైన ప్రజలకు ఈ నాయకుడు ఇస్తున్న సందేశాన్ని చూడండి.




Vol. No. 01 Pub. No. 134

శ్రీశ్రీ చతురోక్తులు


శ్రీశ్రీ గారి మాటల్లో శ్లేషలకు కొదవలేదు. సందర్భోచితంగా చతురోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా ఆయన్ని ప్రశ్నించడం పాపం ఠక్కున సమాధానం వచ్చేసేది. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని......

*
' బ్రతుకు ' అంటే అర్థం...... - ' చావకు ' అని.

*
బీదవాడికి, సంపన్నుడికి బేధం......... - బీదవాడు ఎప్పటికైనా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. కానీ సంపన్నుడు ఎప్పటికీ బీదవాడు కావాలని కోరుకోడు.

*
జనన మరణాలమీద మీ అభిప్రాయం......... - నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇదివరలో ఇవి సంభవించాయి. ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయి.

*
రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా ? - ఉరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా !

*
దేశంలో లంచాలు తీసుకునే వాళ్ళందర్నీ ఉరి తీసేస్తే....... - లంచాలిచ్చేవాళ్ళు మిగులుతారు.

* భగవంతుడ్ని ప్రార్థించేటపుడు కళ్ళెందుకు మూసుకుంటారు ? - తమది గుడ్డి నమ్మకం అని తెలియజేయ్యడానికి.

* శ్రీనాథుడికీ, శ్రీశ్రీకీ ఉన్న తేడా....... - శ్రీనాథుడి కావ్యాలు చదివి శ్రీశ్రీ ఆనందించాడు. శ్రీనాథుడికి ఆ అవకాశం లేకపోయింది.


Vol. No. 01 Pub. No. 133

Thursday, December 10, 2009

చరిత్ర చెప్పిన ఉద్యమ సత్యాలు

1921 - ఇతర భాషల వారు తెలుగు భాషను చిన్న చూపు చూడటం సహించలేక తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిజాం పాలన క్రింద ఉన్న తెలంగాణా ప్రాంతంలో టేకుమళ్ళ రంగారావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలైన వారు ' ఆంధ్ర జన సంఘం ' ఏర్పాటు చేశారు.
1937 - నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో బాధ్యతాయుతమైన పాలన కావాలని, బ్రిటిష్ ఇండియాలో వలె సంస్కరణలు అమలుచేయ్యాలని మొదటి రాజకీయ తీర్మానం చేశారు.
1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. నిజాం దానిని నిషేధించాడు.
1939_ 40 - సోషలిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది.
1946 - హైదరాబాద్ సంస్థానంలో రాజకీయాలు మితవాద, అతివాద రాజకీయాలుగా విడిపోయాయి.
వీరిని అణచడానికి నిజాం అండదండలతో ' రజాకార్లు ' తయారయ్యారు.
1947 - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నవాబు భారత యూనియన్ చేరకుండా యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలంగాణా ప్రజలపై రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి.
1948 - భారత ప్రభుత్వ సైనిక చర్యతో తెలంగాణా ప్రజలకు నిజాం పీడ వదిలిపోయింది.
1952_56 - హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నపుడు కొందరు తెలంగాణా విడిగానే ఉండాలని పట్టుబట్టగా బూర్గుల రామకృష్ణారావు వారికి మద్దతిచ్చారు. విశాలాంధ్ర ఖాయమని తేలిపోయాక అభిప్రాయం మార్చుకుని దానికి తన మద్దతును ప్రకటించి ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.
1956 - రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదిక ఆధారంగా కుదిరిన పెద్దమనుష్యుల ఒప్పదం ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందిరినీ ఏకం చేస్తూ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసింది.
1969 - ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఋజువు కావడంతో చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చెయ్యకూడాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో తెలంగాణా వారిని ఆంధ్ర వాళ్లు అణగదొక్కుతూన్నారంటూ ఉద్యమం ప్రారంభమయింది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది జీవితాలు బలయ్యాయి. కానీ ఆ ఉద్యమం చెన్నారెడ్డి రాజకీయానికి బలైపోయింది.
1972 - తెలంగాణా ఉద్యమ ఫలితంగా అధిష్టానం బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పి. వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. ఈ చర్యకు ఫలితంగా భూసంస్కరణలు అమలు, ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్ట్ స్టే కారణాలుగా చూపుతూ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అది కూడా రాజకీయ ప్రయోజనాలకి బలయిపోయింది.

ఏ ఉద్యమ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
అమాయకుల బలిదానం
నాయకుల స్వలాభం
ఇది చరిత్ర చెప్పిన సత్యం

సమ్మె ఘెరావు దొమ్మీ
బస్సుల దహనం లూటీ
శాంతీ సహనం సమ ధర్మంపై
విరిగెను గూండా లాటీ
గాంధీ పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా !
.......... ( పాటను చూడండి ! )




Vol. No. 01 Pub. No. 132

Wednesday, December 9, 2009

'రంగుటద్దాల కిటికీ' ఆవిష్కరణ వివరాలు

ముందుమాట :

ఆవిష్కరణకు ముందుగా అనుకోక పోవడం వలన తగిన ఏర్పాట్లు చేసుకోక మిత్రులందరికీ వీడియో రూపంలో అందించలేక పోయాను. దానికి కారణం కొత్తపాళీ గారు తన కార్యక్రమాల బిజీలో ఉండటం వలన రోజు వరకు కలుసుకోలేక పోవడంతో ముందుగా ప్రణాళిక రూపొందించుకోలేకపోయాను. ఆఖరి నిముషంలో అనుకున్నా నా కామ్ సమస్య వలన చిన్న డిజిటల్ కెమెరా తీసుకెళ్ళాను. మొదట ఫోటోలు తీసుకోవడం నా కోసమే అనుకున్నా రాత్రి ఇంటికి వచ్చాక మిత్రులందరికీ కూడా అందించాలని అనిపించింది. వెంటనే షో తయారుచేసి ప్రచురించేసేశాను. తర్వాత గానీ వెలగలేదు. కొత్తపాళీ గారి అనుమతి తీసుకోలేదని ! అసలే బ్లాగు లోకానికి కొత్త. కొత్తగా ఏర్పడిన కొత్తపాళీ గారి పరిచయం చేడిపోతుందేమోననే అనుమానంతో బాటు నా అత్యుత్సాహాన్ని బ్లాగు మిత్రులు కూడా అపార్థం చేసుకుని దూరం పెడతారేమోననిపించింది. సృష్టిలో తీయనిది స్నేహమే కదా ! ఎదుటి వారికి నచ్చని పని చేసి స్నేహం చెడగోట్టుకోవడం కంటే పని చెయ్యకుండా ఉండటమే మేలనిపించింది. వారికి ఫోన్ చేసి అనుమతి కోరదామంటే అప్పటికే అర్థరాత్రి దాటి చాలాసేపయింది. అప్పుడడగడం భావ్యం కాదనిపించింది. సరే ఏమైతే అయిందిలే అని ప్రచురించేసాను. అన్నమంతా పట్టి చూడాలా ! ఒక్క మెతుకు చాలదా ! ఉడికిందో లేదో తెలుసుకోవడానికి !! అలాగే రోజు మొదటి కలయికే ఆయనలోని స్నేహశీలతను, అందులోని గొప్పదనాన్ని తెలిపింది. నా టపాకు ఆయన స్పందన జత కలిసింది. ఆయనే కాదు వారి శ్రీమతి సావిత్రి గారు, మామగారు శ్రీ సుబ్బారావుగారు మమ్మల్ని ఆప్యాయంగా పలుకరించిన తీరు వారి ఉన్నత సంస్కారానికి నిదర్శనం. నా జీవనయానంలో నాకు పరిచయమైన మరొక స్వచ్చ్హమైన స్నేహం కొత్తపాళీ గారిది అనుకుంటున్నాను. ఇక అసలు కథలోకి...

06-12-09 తేదీ సాయింత్రం 04-45 లకే సభాస్థలికి చేరుకున్నాను. బ్లాగుల్లో ఇచ్చుకున్న ఫోటోల సాయంతో ఇద్దరం ఒకరినొకరం సులభంగానే పోల్చుకున్నాం ! సాదరంగా ఆహ్వానించారు. ఇంకొక ఆనందకరమైన విషయం చెన్నై నుండి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చిన మరో బ్లాగ్ మిత్రులు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారిని కలవటం. నిర్ణీత సమయానికి కంటే కేవలం 10 నిముషాలు మాత్రమే ఆలస్యంగా సభ ప్రారంభమయింది.
సభకు
విశ్రాంత అధ్యాపకులు శ్రీ వై. చక్రధరరావు గారు అధ్యక్షత వహించారు.

మరో విశ్రాంత అధ్యాపకులు, శ్రీ ఎం. వి. సుబ్బారావు గారు ' రంగుటద్దాల కిటికీ ' ని తెరిచారు.. అదే... ఆవిష్కరించారు. మనందరికీ పుస్తకాన్ని అందించిన సుబ్బారావుగారు కొత్తపాళీ గారికి మాత్రం సావిత్రి అనే ఆణిముత్యాన్ని అందించిన మామగారు కావటం విశేషం.

రచనైనా పాఠకుల చేత చదివించడానికి సమీక్షలెంతో ఉపయోగపడతాయి. అదీ మంచి సమీక్షకారుడి చేతిలో పడటం నిజంగా రచయిత అదృష్టం. అదృష్టం కొత్తపాళీ గారికి శ్రీ వంశీకృష్ణ గారి రూపంలో వరించింది. స్వతహాగా రచయిత అయిన వంశీకృష్ణ గారు చక్కగా , విపులంగా , ఆసక్తికరంగా పుస్తకంలోని కథల్ని మీక్షించారు. అనవసరమైన విమర్శలు, అక్కర్లేని పొగడ్తలు లేకుండా రచయిత అంతరంగాన్ని, ఆలోచనల్ని స్పృశిస్తూ సాగిందా సమీక్ష. అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు అప్పటికింకా కథల్ని చదవని నాలాంటి వాళ్లకు కూడా అర్థమయ్యేటట్లు వివరించారు వంశీకృష్ణగారు.

నాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అధికార భాషా వాది , స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా లు కంప్యూటర్ వినియోగదారులు సులభమైన రీతిలో ఉపయోగించగలిగే తెలుగు సాఫ్ట్వేర్ లు రూపోందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉద్యోగ రీత్యా ఆయన పరిశీలించి, పరిష్కరించిన పరిపాలనలో ప్రజల భాషా సమస్యలను ఉదాహరిస్తూ రంగంలో ఇంకా కృషి జరగాలన్నారు.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి. సత్యవతి గారు మాట్లాడుతూ కొత్తపాళీ గారి కథల్లో వైవిధ్యాన్ని, అమెరికా సమాజం నేపథ్యాన్ని ఆయన ఉపయోగించుకున్న తీరుని అభినందించారు. ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాలను, విలువలను ఆయన చిత్రీకరించిన పద్ధతిని ఆమె ప్రశంసించారు.

ఆనాటి సభలో ముఖ్య ఆకర్షణ కొత్తపాళీగారి మాతృమూర్తి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మిత్రురాలు, సహాధ్యాయి చేసిన ఉద్వేగ భరితమైన ప్రసంగం. వయోభారం కూడా లెక్క చెయ్యకుండా సభకు హాజరయి తమ స్నేహానుభూతుల్ని తలచుకోవడం, కొత్తపాళీ గారికి ఆయన తల్లిగారి తరఫున ఆశీసులందించడం సభికుల్ని కదిలించింది. ( క్షమించాలి ఆవిడ పేరు గుర్తులేదు )

సభకు మన బ్లాగ్మిత్రులు నవ్వులాట శ్రీకాంత్, తెలుగు కళ పద్మకళ కూడా హాజరయ్యారు.

చివరగా ' రంగుటద్దాల కిటికీ ' ని అందించిన రచయిత, మన బ్లాగ్మిత్రుడు కొత్తపాళీ గారు సమాధానమిస్తూ కథలు రాయడానికి, అవి ప్రచురించడానికి స్పూర్తినిచ్చిన మిత్రుల్ని, పరిస్థితుల్ని తలుచుకున్నారు. కథా సంపుటి ప్రచురణలో సహకరించిన శ్రీశ్రీ ప్రింటర్స్ వారికీ , ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసిన విజయవాడ సాహితీ మిత్రులకు, పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పి సభ ముగించారు.

అట్టహాసాలు, ఆర్భాటాలు ఏమీ లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణంలో జరిగిన సంబరం మరిచిపోలేని తీపి జ్ఞాపకం.

Vol. No. 01 Pub. No. 131
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం