' కావ్యేషు నాటకం రమ్యం ' అన్నాడు మహాకవి కాళిదాసు. ఆయన సంస్కృతంలో ఎన్నో నాటకాలు రచించాడు. మనిషి జీవిత గమనంలో కళలు కూడా భాగమైపోయాయి. మనిషిని మురిపించేది, కష్టాలను మరిపించేది, వినోదంతో బాటు విజ్ఞానాన్ని అందించేది, మనసుకు ఉల్లాసాన్నిచ్చి తిరిగి కార్యోన్ముఖుడిని చేసేది కళారూపం మాత్రమే !
ప్రాచీన కాలం నుంచే ఈ రంగస్థలం ఉనికి కనబడుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కుల, మత, జాతి, లింగ, స్థాయి బేధాలు లేకుండా తమ తమ పరిస్థితులకు, సంప్రదాయాలకు అనుగుణంగా కళారూపాలను ఏర్పరుచుకున్నాయి.
కళ మనిషి జీవితానికి ప్రతిబింబం. అతని కోరికలు, ఆశలు, ఆశయాలు, భావోద్వేగాలు.... ఇలా అన్నిటినీ ప్రతిఫలిస్తుంది. వీటిని ప్రదర్శించే వేదికే రంగస్థలం. యూరోపియన్ థియేటర్ అయినా, తెలుగు రంగస్థలమైనా... ఏదైనా మౌళికంగా మనిషిలోని ఈ లక్షణాలను ఆయా కళారూపాల్లో ప్రదర్శించేందుకు వేదికలే !
కాళిదాసు, షేక్స్పియర్ లతో ప్రారంభించి ఇప్పటివరకూ ఎంతోమంది రచయితలు నాటకరంగాన్ని సుసంపన్నం చేసారు. అలాగే ప్రపంచం నాలుగు చెరుగులా సంగీతంలో, నృత్యంలో ఎన్నో సంప్రదాయాలు, రీతులు పుట్టుకొచ్చాయి. కళా ప్రపంచం విస్తృతమయింది. ఎంతోమంది కళాకారుల్ని తయారు చేసింది. ప్రజల్ని అలరించింది.
కాలానుగుణంగా కళారూపాలు కొత్త రూపాలను సంతరించుకుంటూనే వున్నాయి. ఎప్పటికప్పుడు తాజాగా వస్తున్న సాంకేతిక అభివృద్ధిని తమలో ఇముడ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను చేసుకుంటూనే వున్నాయి. రంగస్థలం మీద ప్రదర్శించే కళలన్నిటినీ తనలో ఇముడ్చుకుని విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి సూచికగా ఆధునిక కళా సాంకేతిక రూపం సినిమా ఆవిర్భవించింది. దాని తర్వాత దశ టెలివిజన్. అయితే ఈ రంగాల్లో కళాకారులకు నేరుగా ప్రేక్షకులతో సంబంధం వుండదు. కానీ రంగస్థలం అలాకాదు. ప్రేక్షకుల కళ్ళెదుట సజీవ పాత్రలు నటిస్తాయి,... నర్తిస్తాయి.... అలరిస్తాయి. అదొక అనుభూతి.
రంగస్థలమెప్పుడూ రంగస్థలమే ! ఎంత సాంకేతిక అభివృద్ధి జరిగినా, ఎన్ని నూతన ప్రక్రియలు వచ్చినా రంగస్థలం తన ఉనికిని కోల్పోలేదు. పరిణామక్రమంలో ఒక మార్పు జరిగినపుడు పాత ప్రక్రియల విషయంలో కొంత స్తబ్దత సహజం. సినిమాలు ప్రారంభమై శతాబ్దం పూర్తయింది. సినిమాకు పూర్వరూపంగా చెప్పుకునే ' తోలుబొమ్మలాట ' ఇప్పటికీ మన రాష్ట్రంలో నిలిచే వుంది. అప్పుడప్పుడు, అక్కడక్కడ తన ఉనికిని చాటుకుంటూ ఉంటోంది. అలాగే అనేక ప్రాచీన సంగీత, నృత్య సంప్రదాయాలకు ఇంకా ఆదరణ లభిస్తూనే వుంది. వీటిని కాపాడుకోవడం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని వదిలెయ్యడం కంటే ప్రజలు కూడా బాధ్యత తీసుకుని వాటిని ఆదరిస్తుంటే ఈ కళారూపాలు, రంగస్థలాలు సజీవంగా నిత్య వైభవంతో కళకళలాడుతాయి.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో............
గతంలోని టపాలు.............
రంగస్థలం
రంగస్థల దినోత్సవం
Vol. No. 03 Pub. No. 127