తెలుగు చిత్ర రంగంలో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ టైటిల్స్ కోసం పోటాపోటీ. గతంలో కూడా ఈ పోటీ వున్నా ప్రజలకు అంతగా తెలిసేది కాదు. వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే ప్రజలకు చేరిపోతోంది. చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమవుతోంది. ఇది కూడా ప్రసార మాధ్యమాలు సాధించిన ప్రగతి పుణ్యమే !
అసలు ఈ పోటీ తత్త్వం తెలుగు చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే ఆరంభమైంది. అయితే ఇప్పటి పోటీ పేర్లకోసమైతే అప్పటి పోటీ కథలకోసం !
1933 లోనే ఈ పోటీ తత్వానికి అంకురార్పణ జరిగింది. ' రామదాసు ' పేరుతో రెండు చిత్రాలోచ్చాయి. ఒక చిత్రాన్ని బొంబాయి కి చెందిన ఇంపీరియల్ కంపెనీ నిర్మించగా మరో చిత్రాన్ని కలకత్తాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. రెండవ చిత్రంలో సి. యస్. ఆర్, ఘంటసాల రాధాకృష్ణమూర్తి, రామతిలకం నటించారు. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు.
మరో విశేషమేమిటంటే అదే సంవత్సరం ' సావిత్రి ' పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన చిత్రానికి సి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించగా రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు నటించారు.
రెండో చిత్రం బి. వి. రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఈయన విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి మేనమామ. ఇందులో సురభి కమలాబాయి, మునిపల్లె రాజు నటించారు. ఈ రెండింటిలో మొదటి చిత్రమే విజయం సాధించి ఒకే డేరా హాలులో సంవత్సరంపాటు ఆడిందని చెబుతారు. కథలలోనే కాదు పేర్లలో కూడా మార్పు లేకపోవడం ఈ చిత్రాల విశేషం.
1936 లో మళ్ళీ రెండు సినిమాలు పోటీ పడి రికార్డులలో నిలిచిపోయాయి. రెండింటి ఇతివృత్తం ఒకటే ! మొదటిది ' ద్రౌపదీ మానసంరక్షణ ' . లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. జగన్నాథ్ దర్శకుడు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ దుర్యోధనుడిగా నటించగా సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించారు.
రెండవ చిత్రం ' ద్రౌపదీ వస్త్రాపహరణం '. సరస్వతీ టాకీస్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వి. బాబు దర్శకుడు. ఇందులో కృష్ణుడిగా సి. యస్. ఆర్. ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, దుర్యోధనునిగా యడవిల్లి సూర్యనారాయణ నటించారు. ఈ చిత్రమే విజయం సాధించింది.
మళ్ళీ ఈ పోటీ చిత్రాల సందడి 1950 వ సంవత్సరంలో కనిపించింది. ' శ్రీలక్ష్మమ్మ కథ ' పేరుతో ప్రతిభా పతాకంపైన ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నాగేశ్వరరావు, అంజలీదేవిలతో ఒక చిత్రం నిర్మించారు.
' లక్ష్మమ్మ కథ ' పేరుతో శోభనాచల స్టూడియో వారు గోపీచంద్ దర్శకత్వంలో సి. హెచ్. నారాయణరావు, కృష్ణవేణిలతో మరో చిత్రం నిర్మించారు. ఘంటసాల గారిని సంగీత దర్శకుణ్ణి చేసిన చిత్రం కూడా ఇదే ! రెండు చిత్రాలలోనూ ఈ చిత్రమే విజయం సాధించింది.
ఇవీ తెలుగు చిత్ర రంగ తొలినాళ్లలోని పోటీ చిత్రాల వివరాలు.
Vol. No. 02 Pub. No. 045
2 comments:
Thank God! The then media didn't make a mountain of a mole out of every situation.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment