కృషితో నాస్తి దుర్భిక్షం ............
దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారు
సినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.
ఒక నిర్మాత ఇన్ని సంవత్సరాలు వరుసగా చిత్రాలు నిర్మించడం మాటలు కాదు.
అందుకే గిన్నిస్ బుక్ లోకి ఆయన పేరు చేరింది.
ఆయన చిత్రాలు నేల విడిచి సాము చేసినవి కావు
వినోదం, వ్యాపారం ప్రధానమైనా బాధ్యత మరచిపోలేదు
సినిమా తియ్యడం పెద్ద గొప్పేమీ కాదు.... పుంఖాను పుంఖాలుగా నేను కూడా తియ్యగలను.... అని అదీ ఇదీ అని చూడకుండా అడ్డమైన చెత్త తీసి ప్రేక్షకుల మొహాన కొట్టలేదు.
ఆయన చిత్రాల విజయానికి, ఆయన జీవిత విజయానికి ముఖ్యమైన కారణం ప్రణాళిక
ఆయన చిత్రం నిర్మించినా, స్టూడియో కట్టినా, సంతానాన్ని చిత్రసీమలో ప్రవేశపెట్టినా అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయి....జరుగుతాయి.
సరైన ప్రణాళిక, నిబద్ధత వుంటే ఏ మనిషైనా ఎంత ఎత్తు ఎదగచ్చో నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది
కేవలం డబ్బు ఆ స్థాయిని కల్పిస్తుందని అనుకుంటే ఆది చాలా పొరబాటు.
ఆయన కంటే డబ్బున్నవాళ్ళు చాలామందే పరిశ్రమలోకి వచ్చారు. గొప్ప నిర్మాతలుగా చాలామంది చెలామణీ అయ్యారు. కానీ అవన్నీ స్వల్పకాలమే ! తరువాత తెరమరుగయిన వాళ్ళే ఎక్కువ .
ఆయన చలన చిత్ర జీవితం కొత్తగా వచ్చే నిర్మాతలకు పెద్దబాలశిక్ష.
వాళ్ళు కొంతకాలం ఆయన నిర్మాణ శైలిని నిశితంగా గమనించిన తర్వాత నిర్మాణంలోకి దిగితే చేతులు కాల్చుకోవాల్సిన అవసరముండదు.
ఆయన చిత్రాల్లో అనవసరపు ఆర్భాటాలుండవు. హింసతో నిండిపోవు. హద్దు మీరిన శృంగారం వుండదు. ఫ్యాక్షన్ లు, బాంబులు వగైరా మసాలాలుండవు. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చిత్రాల్లో అన్నీ సమపాళ్ళల్లో రంగరిస్తారు. ఆయన చిత్రాలు ట్రెండ్ అంటూ గాలివాటుగా పోవు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమే !
కొందరికి తాము చేసిన పనుల కంటే తమకు ఎక్కువ గుర్తింపు రావాలనే కండూతి వుంటుంది. దానికోసం అవసరమైతే బిరుదులూ, సన్మానాలు కొనుక్కుంటారు. ఏదో ఒక సంచలన వార్తతోనో, వ్యాఖ్యతోనో మీడియా ద్వారా ప్రజల నోటిలో తమ పేరు నానేటట్లు చేసుకోవడానికి నానా తంటాలు పడతారు. ఆయనే ఒక చానెల్ గానీ, న్యూస్ పేపర్ గానీ పెట్టగలిగే స్థోమత వుండి కూడా పెట్టుకోలేదు. ఆయనకు ప్రచారం ఆయన చిత్రాలే !
రామానాయుడు గారికి ఆయన చిత్రాలు, ఆయన స్టూడియో తప్ప మరో దృష్టి వున్నట్లు తోచదు . రాజకీయాల్లో కూడా ఆయన ఇమడలేదు. తాను నమ్ముకున్న, తనని నమ్ముకున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన వదలలేదు. ఆ నిబద్ధతే ఆయన్ని ఈనాడు ఉన్నత శిఖరాలు చేర్చింది.
అందుకే ఆయన ఇంతకుముందు మూవీ మొఘల్ అయ్యారు.
ఇప్పుడు తెలుగు సినిమా దాదా అయ్యారు
దాదాసాహెబ్ ఫాల్కే భారతీయులకు సినిమాకళను అందించారు
రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాణ కళను అందించారు
డా. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో...............
Vol. No. 02 Pub. No. 022
3 comments:
my hearty congratulations to Raamaa Naidu garu. 'Ramudu Bheemudu'is one of my favourite movies.
మాధురి గారూ !
ధన్యవాదాలు
ramanaidudigariki dhanyavadalu
Post a Comment